“దేవుడు”– భూమిపై మానవుడుగా జన్మనెత్తాక యేసు తండ్రియైన దేవుణ్ణి తన దేవుడుగా పిలిచాడు – మత్తయి 27:46; యోహాను 20:17. అలా చెయ్యడంలో తాను దేవుణ్ణి కానని ఆయన సూచించడం లేదు. యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 20:28-29; మత్తయి 11:27 పోల్చి చూడండి. ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ ఎఫెసీయులకు 2:6; లూకా 2:11 దగ్గర చూడండి.
“స్తుతులు”– కీర్తనల గ్రంథము 33:1 నోట్.
“పరమ స్థలాలలో”– ఈ మాట ఈ లేఖలోని మరో మూల పదం – ఎఫెసీయులకు 1:20; ఎఫెసీయులకు 2:6; ఎఫెసీయులకు 3:10; ఎఫెసీయులకు 6:12. ఇది పరలోకంలో దేవుడు నివసించే స్థలం అన్నది స్పష్టమే (ఎఫెసీయులకు 1:20), కానీ దీనికింకా అర్థం ఉంది (ఎఫెసీయులకు 6:12). దేవుడు పరిపాలించే అదృశ్యమైన ఆత్మల లోకం, సైతాను ఆయన పాలనను వ్యతిరేకిస్తూ ఉన్న లోకం అని కూడా దీనికి అర్థం. అక్కడ దేవుడు అత్యున్నతమైన పరలోకంలో ఉన్నాడు; ఆ ఆత్మల లోకంలో సైతాను, పిశాచాలు అట్టడుగున ఉంటూ విశ్వాసులతో పోరాడుతున్నారు. దేవుని దృష్టిలో భూమి మీద ఉన్న విశ్వాసులు ఇప్పుడే పరమ స్థలాల్లో కూడా ఉన్నారు (ఎఫెసీయులకు 2:6), ఎందుకంటే వారి నాయకుడు, ప్రతినిధి అక్కడ ఉన్నాడు (ఎఫెసీయులకు 1:22), వారు “ఆయనలో” ఉన్నారు. అదే సమయంలో శరీరంలోనైతే ఇంకా భూమి మీదే ఉండి అదృశ్య లోకంలో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నారు.
“ఆధ్యాత్మిక ఆశీస్సులతో”– ఇవి ఆధ్యాత్మిక లోకం దీవెనలు. అంటే మనకు పాపవిముక్తి ఇచ్చి, మనల్ని సంరక్షిస్తూ, ఆధ్యాత్మికమైనవారుగా చేస్తూ, క్రీస్తుకోసం జీవించేలా సామర్థ్యం ఇస్తూ, చివరికి ఆయనతో శాశ్వతంగా ఉండేలా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని కృప సంబంధమైన దీవెనలు. దేవుడు విశ్వాసులను ఇతర విధాలుగా – అంటే శారీరికంగా, మానసికంగా, ఆర్థికంగా – దీవించడని పౌలు ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఇక్కడ అతడు నొక్కి చెప్పేది ఆ సంగతుల గురించి కాదు.
ఈ ఉత్తరంలో దేవుడు విశ్వాసులకు ఇచ్చే కొన్ని ఆధ్యాత్మికమైన దీవెనల గురించి చెప్పాడు – ఎఫెసీయులకు 2:5-6, ఎఫెసీయులకు 2:10, ఎఫెసీయులకు 2:13-19, ఎఫెసీయులకు 2:22; ఎఫెసీయులకు 3:16-17, ఎఫెసీయులకు 3:20; ఎఫెసీయులకు 4:7, ఎఫెసీయులకు 4:13, ఎఫెసీయులకు 4:24; ఎఫెసీయులకు 5:8, ఎఫెసీయులకు 5:18, ఎఫెసీయులకు 5:25-27; ఎఫెసీయులకు 6:10-13. “మనలను” అంటే ఎవరో కొద్దిమంది మహనీయుల్ని అని కాదు, విశ్వాసులందరినీ అని అర్థం.
“దీవించాడు”– ఈ మాట భూతకాలంలో ఉంది. దేవుడు ఇంతకుముందే విశ్వాసులకు ఆధ్యాత్మిక దీవెనలన్నీ ఇచ్చాడు. ఇవి క్రీస్తులో ఉన్నాయి. ఇవెక్కడ ఉన్నాయో ఆ క్రీస్తులోనే విశ్వాసులు కూడా ఉన్నారు. దీవెనల గురించి నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:9, గలతియులకు 3:14.