Philippians - ఫిలిప్పీయులకు 1 | View All

1. ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

“ఫిలిప్పీ”– ఫిలిప్పీయులకు 16:12-40. “పవిత్రులు”– రోమీయులకు 1:1. “సంఘ నాయకులు”– అపో. కార్యములు 20:28; 1 తిమోతికి 3:3; 1 పేతురు 5:2. “పరిచారకులూ”– రోమీయులకు 1:3. “తిమోతి”– అపో. కార్యములు 16:1. పౌలుతో కలిపి తిమోతి కూడా ఈ ఉత్తరం రాయలేదు. బహుశా పౌలు చెప్తూవుంటే రాసి ఉండవచ్చు. రోమీయులకు 16:22 పోల్చి చూడండి.

2. మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

3. ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,

4. మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండడానికి కారణం ఏమిటంటే ఫిలిప్పీ సంఘంతో పౌలు సహవాసం, పరస్పర సహాయం ఎడతెగకుండా కొనసాగుతూ ఉంది – ఫిలిప్పీయులకు 4:14-16. క్రీస్తు శుభవార్త వారి మనసులనూ హృదయాలనూ చర్యలనూ ఏకం చేసింది. “శుభవార్త”– 1 కోరింథీయులకు 15:1-8 లో శుభవార్త అంటే ఏమిటో చెప్పాడు పౌలు. రోమ్‌వారికి రాసిన లేఖంతా దీన్ని వివరిస్తూ ఉంది.

5. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు,

“ప్రార్థన”– రోమీయులకు 1:10. “ఆనందం”– అప్పుడప్పుడూ కొన్ని సంఘాలు పౌలుకు దుఃఖాన్ని కలిగించాయి. పౌలు 1 కొరింతు, గలతీ లేఖల్లో తన ఆనందం గురించి ఏమీ చెప్పలేదు. ఆ సంఘాల వంటిది కాదు ఫిలిప్పీ సంఘం. ఈ ఉత్తరం అంతటా ప్రత్యక్షమయ్యే భావం ఆనందం – ఫిలిప్పీయులకు 1:18, ఫిలిప్పీయులకు 1.25-26; ఫిలిప్పీయులకు 2:2, ఫిలిప్పీయులకు 2:17-18, ఫిలిప్పీయులకు 2:28; ఫిలిప్పీయులకు 3:1; ఫిలిప్పీయులకు 4:1, ఫిలిప్పీయులకు 4:4, ఫిలిప్పీయులకు 4:10. పౌలు రాసిన ఏ ఇతర లేఖలో కంటే కూడా ఈ చిన్న లేఖలో ఆ మాట ఎక్కువగా కనిపిస్తున్నది.

6. నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

“ఆరంభించినవాడు”– దేవుడు. ఈ వచనం నుంచి మనమీ క్రింది విషయాలను నేర్చుకుందాం. నిజ క్రైస్తవులు దేవుని చేతిపని – ఎఫెసీయులకు 2:10; 2 కోరింథీయులకు 5:17. వారిలో పాపవిముక్తి, రక్షణ పనిని మొదలు పెట్టినవాడు ఆయనే (యాకోబు 1:18; యోహాను 3:5-8; యోహాను 6:37, యోహాను 6:44), దాన్ని కొనసాగించేదీ ఆయనే – ఫిలిప్పీయులకు 2:13; 1 కోరింథీయులకు 12:6; కొలొస్సయులకు 1:29; హెబ్రీయులకు 13:21. ఇది “మంచి” పని. ఇది లోపల జరిగే పని (“మీలో”), అంటే హృదయంలో, మనసులో, అంతరంగంలో – గలతియులకు 2:20; ఎఫెసీయులకు 3:16, ఎఫెసీయులకు 3:20. దేవుడే ముగించే పని అది – రోమీయులకు 8:29-30. మనుషులు ఒక పని మొదలుపెట్టి నిరుత్సాహం వల్ల గానీ డబ్బు లేక గానీ అనారోగ్యం వల్ల గానీ మధ్యలోనే ఆపెయ్యవచ్చు. దేవుడలా కాదు. ఎవరిలోనైనా ఆయన విముక్తి కార్యం మొదలుపెడితే దాన్ని పూర్తి చెయ్యడమే ఆయన ఉద్దేశం, అలా చేస్తాడు కూడా. పౌలుకు ఈ విషయంలో గట్టి నమ్మకం ఉంది. మనక్కూడా ఉండాలి. “క్రీస్తు యేసు దినం”– అంటే క్రీస్తు రెండో రాకడ. “గట్టి నమ్మకం”– 2 కోరింథీయులకు 1:14-15; గలతియులకు 5:10; 1 థెస్సలొనీకయులకు 1:4-5; హెబ్రీయులకు 6:9-10.

7. నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.

“నా హృదయంలో”– 2 కోరింథీయులకు 3:2; 2 కోరింథీయులకు 6:11; 2 కోరింథీయులకు 7:3. “ఖైదులో”– వ 13; ఎఫెసీయులకు 4:1; ఎఫెసీయులకు 6:20. “శుభవార్త పక్షంగా వాదిస్తూ”– శుభవార్త పక్షంగా వాదించడం దేవుని సేవకులకు తెలిసి ఉండాలి. దాన్ని ప్రకటించడం, దానిపైకి వచ్చే దాడులు, అభ్యంతరాలు, అపనిందలు, అపార్థాలు మొదలైన వాటినుండి కాపాడుకోవడం తెలిసి ఉండాలి.

8. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.

“వాత్సల్యం”– క్రీస్తు పౌలులో ఉన్నాడు. పౌలు చూపే వాత్సల్యం, అతనిద్వారా క్రీస్తు చూపుతున్న వాత్సల్యమే – గలతియులకు 2:20. పౌలు క్రీస్తును నేర్చుకున్న విధంగా మనం నేర్చుకోకపోతే అతడు ప్రేమించిన విధంగా మనం ప్రేమించడం నేర్చుకోలేము – ఎఫెసీయులకు 3:17-19. క్రీస్తుకు లోబడి జీవించే విశ్వాసుల్లో దేవుని ఆత్మఫలమే ప్రేమ – గలతియులకు 5:22. “ఎంతో ఆశిస్తూ ఉన్నాను”– ప్రతి క్రైస్తవ సేవకుడూ కలిగి ఉండవలసిన హృదయాన్ని పౌలు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. ఫిలిప్పీయులకు 4:1; రోమీయులకు 1:11; 2 కోరింథీయులకు 2:4; గలతియులకు 4:19-20; 1 థెస్సలొనీకయులకు 2:17; 2 తిమోతికి 1:4 చూడండి.

9. మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు,

పౌలు ఎఫెసువారి కోసం చేసిన ప్రార్థనలు – ఫిలిప్పీయులకు 1:17-19; ఫిలిప్పీయులకు 3:16-19, కొలస్సయివారి కోసం చేసిన ప్రార్థనలు – ఫిలిప్పీయులకు 1:9-12 పోల్చి చూడండి. దేవుని ఆత్మ ఈ ప్రార్థనలు చేయించాడు గనుక, మనకు జ్ఞానం కలిగేందుకు రాయించాడు గనుక దేవుడు మనకు మనలో ఏమి చెయ్యగోరుతున్నాడో మనం నేర్చుకోవచ్చు. “మహిమ”– ఎఫెసీయులకు 1:6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14. “క్రీస్తు యేసువల్ల”– ఆయన ద్వారా మాత్రమే దేవునికి అంగీకారమైన ఫలాలేమైనా కలుగుతాయి (యోహాను 15:4-5). “నీతిన్యాయాల”– హెబ్రీయులకు 12:11; యాకోబు 3:18. అంటే దేవునితో సరైన సంబంధం ఉండడం మూలంగా కలిగే ఫలాలు. “ఫలాలతో”– మత్తయి 7:17; రోమీయులకు 6:22; రోమీయులకు 7:4; గలతియులకు 5:22; ఎఫెసీయులకు 5:9.

10. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన

“నిష్కపటులై...కలిగించనివారై”– దేవుని ప్రజలు ఎవరికీ అభ్యంతరం కలిగించకుండా, స్పష్టంగా, మనసు విప్పి ప్రవర్తించాలి అనే అర్థాన్ని ఈ గ్రీకు పదాలు ఇస్తున్నాయి.

11. వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.

“ఏవి శ్రేష్ఠమో”– విశ్వాసులుగా ఒకే సంఘంలో ఉంటున్నవారి జీవితాల గురించి పౌలు రాస్తున్నాడు. శ్రేష్ఠమైనవి కొన్నింటిని ఫిలిప్పీయులకు 2:1-5, ఫిలిప్పీయులకు 2:14-15; ఫిలిప్పీయులకు 4:8-9 లో చెప్పాడు. “మీ ప్రేమ”– అంటే దేవుని పట్ల, సాటి విశ్వాసుల పట్ల, మానవాళి అంతటి పట్ల వారికున్న ప్రేమ. సరైన పద్ధతుల్లో వారి ప్రేమ అభివృద్ధి చెందాలని అతని కోరిక. నిజమైన ప్రేమ ఏమిటో, దాన్ని ఇతరులకు క్రియారూపంలో ఎలా చూపించాలో మరింతగా వారు తెలుసుకుంటూ ఉండాలి. ఈ ప్రేమ గుడ్డిదిగా ఉండకూడదు. క్రీస్తును, ఆయన ప్రేమను గురించిన ఎరుకతో నిండి ఉండాలి – ఎఫెసీయులకు 3:17-19.

12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.

పౌలుకు సంభవించిన పరిస్థితులేవంటే అతణ్ణి బంధించి ఖైదులో వెయ్యడం. ఇది అతనికి నిరుత్సాహం కలిగించలేదు, సణుక్కునేలా చేయలేదు. ఆదికాండము 50:20 పోల్చి చూడండి. తాను రోమ్ 8:28లో రాసిన మాటల్లో అతనికి నమ్మకం ఉంది. “ఎక్కువగా వ్యాపించడానికే”– శుభవార్త వ్యాప్తికి ఆటంకమని కొందరు భావించినది నిజానికి దానికి ఎక్కువగా సహాయం చేయవచ్చు. విపత్తులుగా అనిపించినవి నిజంగా దీవెనలుగా మారవచ్చు. దేవుని చేతుల్లో సంఘటనలన్నీ మంచి ఉద్దేశాలనే నెరవేరుస్తాయి.

13. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను.

“క్రీస్తుకోసమే ఖైదీనని”– పౌలు నేరస్థుడు కాదనీ, ఏ చట్టాన్నీ అతడు అతిక్రమించలేదనీ, క్రీస్తు శుభవార్త ప్రకటించి నందుకు మాత్రమే అతణ్ణి ఖైదులో పెట్టారనీ అందరికీ తెలిసింది. తనకు కావలి ఉన్న సైనికులకు పౌలు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పాడు.

14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.

తనను బందీగా ఉంచిన అధికారులకూ సైనికులకూ శుభవార్త ప్రకటించడం చాలా ధైర్యాన్ని ప్రదర్శించే విషయమని విశ్వాసులకు తెలుసు. అతని ఆదర్శాన్ని బట్టి వారికి కూడా ధైర్యం కలిగింది. ఇది కూడా శుభవార్త వ్యాప్తికే తోడ్పడింది.

15. కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.

ఆ కాలంలో శుభవార్త ప్రకటించినవారంతా మంచి ఉద్దేశంతోనే ప్రకటించినవారు కారు. కొందరికి పౌలు గొప్పతనం, సఫలత అంటే అసూయ, తమను అతనికి పోటీదారులుగా భావించుకున్నారు. వారి మనస్తత్వం, దృక్పథం, పరిచర్య నిండా స్వార్థమే ఉంది. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది. కొందరు ప్రసంగీకులు ప్రఖ్యాతిని ఆర్జించాలనుకుంటారు. తమ పేరు కోసమే తమకు గొప్ప సఫలత కలగాలనుకుంటారు. ఇతర ప్రసంగీకులను తక్కువ చేసి మాట్లాడుతూ, చేతనైతే వారికి కష్టం కలిగించాలని కూడా చూస్తారు. కొందరు మాత్రం ఆ కాలంలో లాగానే యథార్థమైన మనసుతో, క్రీస్తు పట్ల, మనుషుల ఆత్మల పట్ల ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.

16. వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;

17. వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.

18. అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.

పౌలు తానెవరికీ పోటీ అనుకోవడం లేదు. క్రీస్తు, ఆయన శుభవార్త అన్ని చోట్లా తెలియడమే అతని కోరిక. తనంటే ఇష్టం లేనివారు, తనకు కష్టాలు కలిగించినవారు, వారి ఉద్దేశాలు చెడ్డవైనా సరే, వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే పౌలు ఆనందించగలిగాడు. తనకు కాదు క్రీస్తుకే ఘనత కలగాలని అతని ఆశయం. ప్రసంగీకులందరికీ ఇదొక గొప్ప పాఠం. క్రీస్తును గురించి, ఆయన శుభవార్త గురించి సత్యాన్ని ప్రకటిస్తున్నవారి విషయం మాత్రమే పౌలు రాస్తున్నాడు. ఇతర లేఖల్లో విశ్వాసులను జాగ్రత్తగా ఉండాలని ఎవరి గురించి హెచ్చరించాడో వారి విషయం కాదు (2 కోరింథీయులకు 11:13-15; గలతియులకు 1:7-8; మొ।।).

19. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
యోబు 13:16

బహుశా ఆ సమయంలో తనపై మోపిన నేరాలనుండి, తద్వారా మరణ శిక్షనుంచి విడుదల కలగాలని ఇక్కడ పౌలు చెప్తున్నట్టుంది – వ 25,26. “మీ ప్రార్థనలు”– ఫిలేమోనుకు 1:22; రోమీయులకు 15:30-32. “యేసు క్రీస్తు ఆత్మ”– రోమీయులకు 8:9 ను అక్కడి నోట్ చూడండి.

20. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును.

“ధైర్యంతో”– ఈ మాటను “సిగ్గుపాలు” అనే మాటకు వ్యతిరేకంగా వాడుతున్నాడు. ఏ స్థితిలోనైనా, ఏ సమయం లోనైనా క్రీస్తును గురించి మాట్లాడే ధైర్యాన్ని తాను కోల్పోనని అతడు ఆశాభావంతో నిండి ఉన్నాడు. ఎఫెసీయులకు 6:19-20 పోల్చి చూడండి. “నా శరీరంలో”– పౌలు చర్యల వల్ల, అనుదినం అతని ప్రవర్తన వల్ల, అతని నోటి మాటల వల్ల క్రీస్తుకు ఘనత కలిగింది, కేవలం అతని తలంపులు, కోరికల వల్ల మాత్రమే కాదు. “క్రీస్తుకు ఘనత కలుగుతుందని”– గలతియులకు 1:16 లో చెప్పిన సమయంనుంచి పౌలు జీవితంలో, పరిచర్యలో కనిపిస్తూ వచ్చిన ఫలితం ఇదే. అతని గురి, ఉద్దేశం కూడా ఇదే. జీవితంలో గానీ మరణంలో గానీ ఇంతకన్నా గొప్ప ఉద్దేశమేదీ ఉండబోదు.

21. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

“క్రీస్తే”– గలతియులకు 2:20. తన జీవం ద్వారా గాక తనలోని క్రీస్తు జీవం మూలంగానే పౌలు జీవిస్తున్నాడు. తన శక్తివల్ల గాక క్రీస్తు శక్తి మూలంగానే ఆయన్ను సేవిస్తున్నాడు. అతని గురి క్రీస్తుకే గానీ తనకు ఘనత కలగాలని కాదు. “లాభమే”– పౌలుకు చావు భయం లేదు (హెబ్రీయులకు 2:15 పోల్చి చూడండి). కీర్తనల గ్రంథము 116:15 లోని సత్యం పౌలుకు తెలుసు. తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి నిస్సందేహంగా తెలుసు (వ 20). కానీ వ 23 లో చెప్పినట్టు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆనందం కొంతవరకైనా ఆ లాభంలో భాగమే. చావడం అందరికీ లాభకరమేనా? కాదు. క్రీస్తుకోసం జీవించేవారికి మాత్రమే అది లాభకరం. స్వార్థం కోసమే జీవించేవారెవరికీ చావు లాభకరం కాదు. క్రీస్తు నెరుగని వారందరికీ మరణం శత్రువు.

22. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.

“ఫలవంతమైన పని”– రోమీయులకు 1:13; రోమీయులకు 7:4. క్రీస్తు కోసం తాను పడుతున్న కష్టం ఫలవంతం అవుతుందనే అతని నిబ్బరాన్ని గమనించండి. క్రీస్తు తనలో ఉండి పని చేస్తున్నాడని అతనికి తెలుసు. దానివల్ల ఈ నిబ్బరం అతనికి కలిగింది – కొలొస్సయులకు 1:29. “కోరుకోవాలో”– జీవించడం, మరణించడం రెండూ అతనికి సమ్మతమే. తనకు ఏది కావాలో తేల్చుకోలేక పోతున్నాడు.

23. ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.

“క్రీస్తుతోనే ఉండిపోవాలని”– 2 కోరింథీయులకు 5:8; లూకా 23:43. విశ్వాసి చనిపోయినప్పుడు యేసుప్రభువు సన్నిధిలోకి వెళ్ళిపోతాడు.

24. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.

25. మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.

“విశ్వాసంలో అభివృద్ధి”– ఎఫెసీయులకు 4:12-13. ఇలాంటి అభివృద్ధికి ఆనందం తోడు అవుతుంది. ప్రతి విశ్వాసికీ బయటి విషయాల్లో కంటే క్రైస్తవ విశ్వాసంలో అభివృద్ధి చెందడం గురించి ఎక్కువ ఆసక్తి ఉండాలి. “ఉండిపోతానని”– వ్యక్తిగతంగానైతే చనిపోయి క్రీస్తు దగ్గరికి వెళ్ళడం అతనికి ఎక్కువ ఇష్టం. ఈ భూమిపై ఉండిపోవడం కన్నా అదే ఎంతో మంచిది. అయితే మామూలుగా ఉన్నట్టే తనకు ఏది ఇష్టమో అది అతనికి ప్రాముఖ్యం కాదు. ఇతరుల అవసరతే అతని దృష్టిలో ఎక్కువ ప్రాముఖ్యమైన సంగతి. ఏమి చేయాలో, ఎలా ప్రార్థించాలో నిశ్చయించు కోవడంలో ఇదే అతనిమీద ఎక్కువ ప్రభావం చూపింది. 1 కోరింథీయులకు 9:19-23; 1 కోరింథీయులకు 10:24, 1 కోరింథీయులకు 10:33 పోల్చి చూడండి. ఆ సమయంలో తాను చనిపోబోవడం లేదని పౌలుకు ఎలా తెలుసు? అతని విడుదల కోసం చేస్తున్న ప్రార్థనలు తాను అంగీకరించానని దేవుడు అతనికి నిశ్చయత ఇచ్చాడు – వ 19; ఫిలిప్పీయులకు 2:24.

26. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.

27. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావమఇుతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

“తగిన విధంగా”– ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:12. “ఏకాత్మతో”– ఫిలిప్పీయులకు 2:2; ఎఫెసీయులకు 4:2; 1 కోరింథీయులకు 1:10; రోమీయులకు 12:6. “సుస్థిరంగా నిలుస్తూ”– ఎఫెసీయులకు 6:11, ఎఫెసీయులకు 6:14. “విరోధులకు”– వ 30. “భయపడకుండా”– వ 14,20; మత్తయి 10:28; హెబ్రీయులకు 13:6. “పెనుగులాడుతున్నారని”– వ 7; యూదా 1:3. శుభవార్తపై దాడి జరిగితే విశ్వాసులు ఎప్పుడూ నీరసంగా లొంగిపోయి ఊరుకోకూడదు, అబద్ధమైన ఉపదేశాలతో, తప్పుడు సిద్ధాంతాలతో ఎప్పుడూ రాజీపడకూడదు. శుభవార్త సత్యాలకోసం మనం పోరాడేందుకు అవి తగినవి. దేవుడిచ్చే జ్ఞానం, ఆధ్యాత్మిక బలం, సామర్థ్యం అంతటితో (ప్రేమతో కూడా) అలా పోరాడాలి.

28. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.

“రుజువు”– క్రీస్తు కోసం వారు కనపరచే ధైర్యం దేవుడు వారితో ఉన్నాడనేందుకు రుజువుగా ఉంది. అపో. కార్యములు 4:13; 2 థెస్సలొనీకయులకు 1:4-7 పోల్చి చూడండి.

29. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున

ఫిలిప్పీలో పౌలుకు కలిగిన కష్టాలు కొన్నిటిని అపో. కార్యములు 16:19-40 లో చూడవచ్చు. అక్కడ ఇంకా శుభవార్తకు విరోధులు కొందరు ఉన్నారు. అక్కడి విశ్వాసులు వారి చేతుల్లో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు.

30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

“నమ్మకం ఉంచడం...అనుగ్రహించబడింది”– విశ్వాసం దేవుడు ఇచ్చినది, దేవుని ఉచిత కృపావరం – ఎఫెసీయులకు 2:8. క్రీస్తుకోసం బాధలు అనుభవించగలగడం కూడా అంతే. మనకు ఈ లోకంలో కలిగే గొప్ప ఆధిక్యతల్లో హక్కుల్లో విశేషావకాశాల్లో అదొకటి. ఇది తెలిసినవారు ధన్యులు. ఫిలిప్పీయులకు 3:10; అపో. కార్యములు 5:41; రోమీయులకు 5:3; 2 కోరింథీయులకు 1:5; 1 పేతురు 3:13-14, 1 పేతురు 3:16 చూడండి. మనకోసం బాధలు అనుభవించి చనిపోయిన యేసుప్రభువు కోసం మనం బాధలు పడడం మనం గౌరవంగా ఎంచకూడదా? క్రీస్తును ప్రేమించేవారు దీనికి ఔను అని జవాబు చెప్తారు. క్రీస్తు కోసం అసౌకర్యం, కష్టం, హింస, బాధలనుంచి ఏ విధం చేతనైనా తప్పించుకునేందుకు ప్రయత్నించరు. నిజానికి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.Shortcut Links
ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |