Thessalonians II - 2 థెస్సలొనీకయులకు 2 | View All

1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

“రాకడ”– 2 థెస్సలొనీకయులకు 1:7; అపో. కార్యములు 1:11. “ఆయన దగ్గరకు...సమకూడడం”– 1 థెస్సలొనీకయులకు 4:17; యోహాను 14:3; మత్తయి 24:31. అంటే క్రైస్తవులు ఎత్తబడడం అన్నమాట.

2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

“క్రీస్తు దినం”– ఈ దినంలో సంఘం ఎత్తబడుతుందని పౌలు వారికి నేర్పాడని కనిపిస్తున్నది. ఆ రోజు అప్పటికే వచ్చిందనీ ఎత్తబడడం విషయంలో తన ఉపదేశం పొరపాటు అనీ తెస్సలొనీకవారు అనుకోవడం పౌలుకు ఇష్టం లేదు. పౌలు ఈ విషయంలో చెప్పినది పొరపాటు అని గనుక వారు అనుకుంటే అతడు ప్రకటించిన శుభవార్త, వారికిచ్చిన ఇతర ఉపదేశాలు కూడా పొరపాటే అని వారు అనుకోవచ్చు. ఇది చాలా విపరీత ఫలితాలకు దారి తీస్తుంది. “మా దగ్గరనుంచి...ఉత్తరం”– ఈ విశ్వాసులను కంగారు పెట్టజూస్తున్నదెవరో మనకు తెలియదు. కొందరు అబద్ధ బోధకులు దొంగ ఉత్తరం రాసి అది పౌలు రాశాడని వారికి చెప్పడానికి, లేక వారిని కంగారు పెట్టేందుకు ఏదన్నా ఎత్తుగడ పన్నడానికి వెనుకతీయరని అతనికి తెలుసు. అక్కడ అలాంటివారి గురించి పౌలు ఈ మాటలు రాసి వుండవచ్చు. ఇతర లేఖల్లో వారిని గురించి పౌలు వర్ణించిన దాన్నిబట్టి అలాంటివారి ప్రవర్తన ఎలాంటిదో కొంతవరకు మనకు తెలుసు – రోమీయులకు 16:17-18; 2 కోరింథీయులకు 11:13-15; మొ।।.

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
1 రాజులు 14:16, కీర్తనల గ్రంథము 109:7

“మోసగించకుండా చూచుకోండి”– ఏదో ఒక బైబిలు సత్యం నుంచి విశ్వాసులను దారి మళ్ళించడానికి చూచే మోసగాళ్ళు ఉండక మానరు. మత్తయి 24:4; రోమీయులకు 16:18; ఎఫెసీయులకు 5:6; కొలొస్సయులకు 2:4 పోల్చి చూడండి. మనకు దేవుని వాక్కు తెలిసి ఉండి ఎప్పుడూ ఇలాంటి దుర్బోధల విషయం అప్రమత్తంగా మెళకువగా ఉండడం అవసరం. “అయ్యేవరకూ”– ప్రభు దినం రాకమునుపు జరగవలసిన ఒక సంఘటన గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ సంఘటన “సంఘం ఎత్తబడడం” అని పౌలు రాయడం లేదని గమనించండి. ప్రభు దినానికి ముందే సంఘం ఎత్తబడుతుందని పౌలు నమ్మి ఉన్నట్టయితే అలాగని చెప్పడానికి తప్పకుండా ఇది తగిన చోటు. కానీ పౌలు అలా చెప్పలేదు. దానికి బదులు “తిరుగుబాటు” గురించి రాస్తున్నాడు. మొదటి మనిషి పాపంలో పడిపోయిన నాటినుంచి (ఆది 3 అధ్యాయం) మొత్తం మీద మానవజాతి దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలోనే ఉన్నది. ఈ విషయంలో దేవుని స్వంత ప్రజలైన ఇస్రాయేల్‌వారు మనుషులందరికీ ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 9:7, ద్వితీయోపదేశకాండము 9:24; కీర్తనల గ్రంథము 106:43; యెషయా 1:2; యిర్మియా 6:2 చూడండి. పాపమంతా తిరుగుబాటుకు సూచనే (1 యోహాను 3:4 చూడండి). కానీ ఇక్కడ పౌలు ఈ యుగాంతంలో రాబోయే గొప్ప అంతిమ తిరుగుబాటు గురించి తెస్సలొనీకవారికి రాస్తున్నాడు. అది అసాధారణంగా ఉంటుంది. ప్రపంచంలోని మతాలన్నిటి మీదా దీని ప్రభావం పడుతుంది (భ్రష్టమైపోయిన క్రైస్తవ మతంపై కూడా) – వ 4; మత్తయి 24:10-25; 2 తిమోతికి 3:1-5; ప్రకటన గ్రంథం 13:4, ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 13:13-15. ఈ తిరుగుబాటుకు “న్యాయవిరోధి” లేక “పాపపురుషుడు” అనేవాడు నాయకత్వం వహిస్తాడు. అతడు తిరుగుబాటూ దుర్మార్గతా రూపుదాల్చిన మనిషి. ఇతడే రాబోయే క్రీస్తువిరోధి – 1 యోహాను 2:18. “నాశనపుత్రుడు”– యోహాను 17:12; ప్రకటన గ్రంథం 19:20 పోల్చి చూడండి.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
యెహెఙ్కేలు 28:2, దానియేలు 11:36-37

పైన చెప్పిన “న్యాయ విరోధి” అసామాన్య ప్రతిభ గల రాజకీయవేత్త, సైనిక వ్యూహ విషయాల్లో ఆరితేరినవాడు. కానీ తానే దేవుణ్ణని చెప్పుకుని అందరూ తనను పూజించాలని శాసిస్తాడు – ప్రకటన గ్రంథం 13:1-8, ప్రకటన గ్రంథం 13:15. దేవుని చట్టాలను గానీ మనుషుల చట్టాలను గానీ అతడు లెక్క చేయడు. స్వభావంలోనూ గుణశీలాల్లోనూ అతడు క్రీస్తుకు సరిగ్గా వ్యతిరేకం (హెబ్రీయులకు 10:7; కీర్తనల గ్రంథము 40:8). లోకం క్రీస్తును కోరడం లేదు. అందువల్ల దానికి క్రీస్తువిరోధి దాపురిస్తాడు. దేవుని న్యాయ నియమాలంటే లోకానికి ఇష్టం లేదు. అందువల్ల న్యాయ విరోధి దాన్ని పరిపాలిస్తాడు. “హెచ్చించుకొంటాడు”– దానియేలు 7:8, దానియేలు 7:11, దానియేలు 7:20, దానియేలు 7:25; ప్రకటన గ్రంథం 13:5-6. “దేవుడుగా తనను ప్రదర్శించుకొంటూ”– అన్ని పాపాల్లో ఇది అతి ఘోరమైనది. బైబిలు ప్రకారం ఏ మనిషైనా తాను దేవుణ్ణని చెప్పుకోవడం దేవునికి వ్యతిరేకంగా చేసే దూషణలన్నిటిలోకీ అతి నీచమైనది. యోహాను 5:18; యోహాను 10:31-33; మత్తయి 26:64-65 నోట్స్ చూడండి. తిరుగుబాటు, దుర్మార్గత రూపుదాల్చినవాడు ఇలా చెప్పుకోవడం దుర్మార్గానికి అంతిమ ఆకారం. దేవుడు అమిత శక్తిగల సృష్టికర్త. మనుషులంతా ఆయన సృష్టించినవారే. దేవుడు అమోఘమైన పవిత్రత గలవాడు. మనుషులంతా పాపులు (ఆదికాండము 8:21; లేవీయకాండము 20:7; యెషయా 6:3; రోమీయులకు 3:9-23; 1 పేతురు 1:15-16). “దేవుని ఆలయం”– నిజ దేవుని ఆరాధన కోసం ప్రతిష్ఠించబడిన కట్టడం. మత్తయి 24:15; మార్కు 13:14 పోల్చి చూడండి.

5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా?

“మీ దగ్గర”– పౌలు వారితో ఉన్నది కొద్ది కాలమే (అపో. కార్యములు 17:1-10). అయితే రాబోయే క్రీస్తు విరోధిని గురించిన ఈ ఉపదేశాన్ని వారికిచ్చిన ప్రాథమిక ఉపదేశాలలో కలిపి చెప్పవలసినంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు.

6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.

ఏదో శక్తి (వ 6), ఎవరో వ్యక్తి (వ 7) అడ్డుపడుతూ ఉండడం మూలాన దేవుడు నియమించిన సమయం వచ్చేవరకు క్రీస్తువిరోధి ప్రత్యక్షం కాలేకపోతాడు. దీనికి అర్థమేమిటో పౌలు తెస్సలొనీకవారికి చెప్పాడు గానీ ఇక్కడ రాయలేదు. అందువల్ల దీని అర్థమేమిటో అనేక ఊహాగానాలు బయలుదేరాయి. పౌలు పవిత్రాత్మను ఉద్దేశించి రాశాడని కొందరు విశ్వాసులు అభిప్రాయపడ్డారు. అడ్డగించేవాడు తొలగిపోవడం అంటే క్రీస్తు సంఘం ఎత్తబడడమని వారి అభిప్రాయం. ఎందుకంటే పవిత్రాత్మ విశ్వాసుల్లో ఉంటాడు. వారు భూమిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతాడు అని వారన్నారు. ఇది కూడా ఊహాగానమే. ఇక్కడ పవిత్రాత్మను గురించి గానీ సంఘం ఎత్తబడడం గురించి గానీ ఒక్క మాటా లేదు. ఒకవేళ అడ్డగించేవాడు పవిత్రాత్మేనని పౌలు ఉద్దేశం అయినప్పటికీ “తొలగిపోయే వరకు” అంటే సంఘం ఎత్తబడేవరకు అని అర్థం కానవసరం లేదు. మరి కొందరు విశ్వాసులు ఇక్కడ పౌలు రాసినది ఎవరో ఒక ప్రత్యేకమైన దేవదూతను గురించి అన్నారు. ఈ యుగాంతంలో జరిగే సంభవాల సమయంలో కొందరు దేవదూతలు చాలా పనులు చేస్తారన్నది నిజమే – ప్రకటన గ్రంథం 7:1; ప్రకటన గ్రంథం 9:14-15; మొ।। (దేవదూత, లేక దేవదూతలు అనే పదాలు ప్రకటన గ్రంథంలో సుమారు 80 సార్లు కనిపిస్తాయి). దేవుడు సరైన సమయం వరకు క్రీస్తువిరోధిని అడ్డగించడానికి ఎవరైనా దేవదూతను ఒకవేళ నియమించి ఉండవచ్చు. కాదనలేము. కానీ ఇక్కడ వ 7లో పౌలు ఒక దేవదూత గురించి మాట్లాడుతున్నాడో లేదో ఖచ్చితంగా చెప్పలేము.

7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.

“న్యాయ విరోధం రహస్య శక్తి”– మత్తయి 13:11; రోమీయులకు 11:25; రోమీయులకు 16:25; 1 కోరింథీయులకు 15:51; మొ।। చూడండి. దేవుడు మనకు వెల్లడి చేయనిదే ఈ లోకంలో న్యాయ విరోధం, పాపం ఎంతవరకు పెరుగుతాయో మనం గ్రహించలేము. పౌలు కాలంలోనే న్యాయవిరోధ శక్తి పని చేస్తూ ఉంది. అది ఇప్పుడూ పని చేస్తూనే ఉంది. “న్యాయ విరోధి” ప్రత్యక్షం అయ్యేంతవరకు పని చేస్తూనే ఉంటుంది. న్యాయవిరోధిలో అది విశ్వరూపానికి చేరుకుంటుంది. న్యాయ నియమం అనేది భూమిపై లేకుండా పోతుంది. ఒక్క దుర్మార్గుడి సంకల్పమే లోకమంతటా చాలా మట్టుకు నెరవేరుతుంది.

8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
యోబు 4:9, యెషయా 11:4

న్యాయవిరోధి ఎంత శక్తిమంతుడైనప్పటికీ అతడు క్రీస్తును ఎదిరించి నిలవలేడు. ప్రకటన గ్రంథం 19:19-20 చూడండి. “తన నోటి ఊపిరితో”– యెషయా 11:4. అంటే తన సర్వశక్తిగల వాక్కు చేత అని అర్థం కావచ్చు (హెబ్రీయులకు 1:3; హెబ్రీయులకు 4:12 పోల్చి చూడండి). క్రీస్తు మాట జారీ చేస్తే చాలు అది తప్పక నెరవేరుతుంది (ఆదికాండము 1:3 మొ।।; యెషయా 55:11 పోల్చి చూడండి). “తన రాకడ దర్శన కాంతితో”– మత్తయి 24:30; మత్తయి 25:31; తీతుకు 2:13; ప్రకటన గ్రంథం 19:11-12.

9. నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను

క్రీస్తు మొదటి రాకడ దేవుని పనికి అనుగుణంగా ఉంది. క్రీస్తువిరోధి రాకడ సైతాను పని (ప్రకటన గ్రంథం 13:2). క్రీస్తు ఎప్పుడూ పొందనంత ప్రజాదరణ క్రీస్తువిరోధి పొందుతాడు – ప్రకటన గ్రంథం 13:3-4, ప్రకటన గ్రంథం 13:8. యోహాను 1:10-11; యోహాను 5:43 పోల్చి చూడండి. దీన్నిబట్టి మొత్తంగా మానవజాతి నిజ స్థితిని మనం అంచనా వెయ్యవచ్చు. “మోసకరమైన”– ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం “అబద్ధమైనవి”, “వాస్తవం కానివి” అని కూడా అర్థమిస్తుంది. కానీ ఇక్కడ బహుశా “‘మోసకరమైనవి” అనే అర్థం వస్తుంది. క్రీస్తువిరోధి చేసే అద్భుతాలు చూచినవారిని అవి అబద్ధాలను నమ్మేలా చేస్తాయి. “సూచకమైన క్రియలతో...అద్భుతాలతో”– మత్తయి 24:24; ప్రకటన గ్రంథం 13:13, ప్రకటన గ్రంథం 13:15. ఈ అద్భుతాలు బహుశా క్రీస్తు చేసిన వాటిని పోలి ఉంటాయి (అపో. కార్యములు 2:22 చూడండి. అక్కడ ఇదే మాటలు కనిపిస్తాయి).

10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును

దుర్మార్గత మోసకరమైనది – హెబ్రీయులకు 3:13 పోల్చి చూడండి. ఇది లోకంలోని మోసపరిచే మూడు శక్తుల్లో ఒకటి (యిర్మియా 17:9; ప్రకటన గ్రంథం 12:9). ఈ యుగాంతం నాటికి ఈ మూడూ భయంకరంగా పెరిగిపోయి ఉంటాయి. “నశిస్తున్న” – 1 కోరింథీయులకు 1:18; 2 కోరింథీయులకు 2:15; 2 కోరింథీయులకు 4:3; యోహాను 3:16. దేవుని సత్యం కంటే పాపాన్నే ఎక్కువ కోరేవారే నశిస్తున్నవారు. వారికి సత్యమంటే ఇష్టం లేదు. తమ భ్రష్ట స్వభావానికి నచ్చిన దాన్ని వారు కోరుకుంటారు కాబట్టి ఉద్దేశ పూర్వకంగా సత్యాన్ని త్రోసిపుచ్చుతారు. యోహాను 3:19-20; రోమీయులకు 1:18 పోల్చి చూడండి. సత్యమంటే ప్రీతికీ పాపవిముక్తికీ పౌలు ఎలా లంకె పెడుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఒకటి లేకుండా రెండోది మనకు కలగదు.

11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,

“ఆ అబద్ధం”– తానే దేవుణ్ణని క్రీస్తువిరోధి చెప్పే అబద్ధం (వ 4). ఈ అబద్ధాన్ని నమ్మేంతగా వారు మోసపోతారు. ఇది దేవుని నుంచి శిక్షగా వస్తుంది (రోమీయులకు 1:28; రోమీయులకు 11:8; యెషయా 29:10; యెషయా 6:10; 1 రాజులు 22:19-23 పోల్చి చూడండి). వారు సత్యాన్ని తిరస్కరించినందువల్ల ఈ శిక్ష వస్తుంది. ఇది పూర్తిగా న్యాయసమ్మతమైన శిక్ష. ఇది పాపులకు వారికి తగినదాన్నే దేవుడు ఇవ్వడం. కీర్తనల గ్రంథము 18:25-26 దాని నోట్ చూడండి.

12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

ఎవరైనా చేయగలిగిన అతి అపాయకరమైన వాటన్నిటిలోకీ సత్యాన్ని త్రోసిపుచ్చడం అత్యంత అపాయకరమైనది. అది అబద్ధాన్ని నమ్మే స్థితికి దారి తీయడమే గాక శాశ్వత శిక్షను కూడా తెచ్చి పెడుతుంది. “దుర్మార్గం”– దుర్మార్గంలో సంతోషించడం, సత్యాన్ని నమ్మడం ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధం అని గమనించండి. మనం ఒకటి చేస్తే రెండోదాన్ని చెయ్యలేము. “శిక్షావిధి కలగాలని”– మత్తయి 23:33; మార్కు 16:16; యోహాను 3:18; యోహాను 5:29; గలతియులకు 1:8.

13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
ద్వితీయోపదేశకాండము 33:12, సంఖ్యాకాండము 23:19

“ప్రభువు ప్రేమిస్తున్న సోదరులారా”– కొలొస్సయులకు 3:12; 1 థెస్సలొనీకయులకు 1:4; 1 యోహాను 3:1. “ఆత్మ పవిత్రపరచే పని ద్వారా”– 1 పేతురు 1:2. అంటే దేవుని ఆత్మ దేవుడు ఎన్నుకున్నవారిని ప్రత్యేకించి వారిని దేవుని పవిత్ర ప్రజగా చేయడానికి వారిలో పని చేస్తాడు. ఇది ఏదో కొద్దిమంది ప్రత్యేక విశ్వాసుల్లో మాత్రమే గాక విశ్వాసులందరి విషయంలోనూ నిజమే. “సత్యం నమ్మడం ద్వారా”– దేవుడు మనుషులను రక్షించే పద్ధతి ఇదే. ఇక్కడ సత్యానికి ఉన్న ప్రాధాన్యత మళ్ళీ గమనించండి. ఇక్కడ పౌలు చెప్తున్న సత్యం క్రీస్తు శుభవార్త. తరువాతి వచనంలో అతడు దీన్ని స్పష్టం చేస్తున్నాడు. “మొదటినుంచి ఎన్నుకొన్నాడు”– ఎఫెసీయులకు 1:4.

14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

“మహిమలో పాల్గొనేలా”– 1 థెస్సలొనీకయులకు 2:12; రోమీయులకు 5:2; రోమీయులకు 8:17; యోహాను 17:22. సత్యాన్ని నమ్మేవారికీ నమ్మనివారికీ తేడా ఇదే – ఒక గుంపుకు శాశ్వత మహిమకు వారసత్వంగా కలుగుతుంది. మరొకటి శాశ్వత శిక్షపాలౌతారు. (వ 12). రోమీయులకు 9:22-24 పోల్చి చూడండి. “మా శుభవార్త”– అంటే వారు ప్రకటించిన శుభవార్త. క్రీస్తు వారికి అప్పగించిన శుభవార్త (గలతియులకు 1:11-12; 1 కోరింథీయులకు 15:1-8). “పిలిచాడు”– రోమీయులకు 1:7; రోమీయులకు 8:30.

15. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.

“అందుచేత”– ఇక్కడ నేర్పించిన సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌలు వారిని (మనల్ని కూడా) ఆ సత్యంలో స్థిరంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. రోమీయులకు 12:1; ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 3:1 పోల్చి చూడండి. “నిలకడగా ఉండండి”– 1 కోరింథీయులకు 15:58; ఎఫెసీయులకు 6:11, ఎఫెసీయులకు 6:13-14.

16. మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,

యేసుప్రభువునూ తండ్రినీ పౌలు వేరుచేసి చెప్తున్న తీరును గమనించండి. మత్తయి 3:16-17; మత్తయి 28:19; యోహాను 17:1; 2 యోహాను 1:3. “మనలను ప్రేమించి”– వ 13; యిర్మియా 31:3. “ఆశాభావం”– 1 పేతురు 1:3; రోమీయులకు 5:2; రోమీయులకు 8:24-25.

17. మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.

“ఓదార్పు”– రోమీయులకు 15:5. మనుషులు ఒకరినొకరు ఆదరించుకోవచ్చు కానీ అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆదరణ దేవునినుంచే కలుగుతుంది. “సుస్థిరంగా”– ఎఫెసీయులకు 3:16; ఎఫెసీయులకు 6:10; కొలొస్సయులకు 1:11.Shortcut Links
2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |