Timothy I - 1 తిమోతికి 4 | View All

1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును

“ఆత్మ”– దేవుని ఆత్మ భవిష్యత్తును వెల్లడి చేశాడు. యెషయా 46:10 పోల్చి చూడండి. అబద్ధ ఉపదేశకులూ అబద్ధ ప్రవక్తలూ వస్తారని దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి తన ప్రజలకు చాలా చోట్ల హెచ్చరికలు ఇచ్చాడు – మత్తయి 7:15; మత్తయి 24:4-5, మత్తయి 24:24; అపో. కార్యములు 20:29-30; రోమీయులకు 16:17-18; 2 కోరింథీయులకు 11:13-15; 2 తిమోతికి 3:1; 2 తిమోతికి 4:3; 2 పేతురు 2:1. “విశ్వాస సత్యాలు”– ఇక్కడ దీని అర్థం దేవుడు వెల్లడి చేసిన సత్యాలు, నిజ విశ్వాసులు స్వీకరించే సత్యాలు. “మోసపుచ్చే ఆత్మలు”– మత్తయి 4:24. మనకు కనబడని ఆత్మల లోకంలోని కొన్ని చెడ్డ ఆత్మలు క్రైస్తవులకు తప్పుడు సిద్ధాంతాలను నేర్పడానికి ప్రయత్నిస్తాయని మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు 6:11-12 పోల్చి చూడండి.

2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

సంఘంలో అబద్ధ బోధలను పరిచయం చేయడానికి దయ్యాలు ఉపయోగించే మనుషుల గురించి పౌలు వివరిస్తున్నాడు. “కపటులై”– వారు ఉపదేశించే వాటిలో వారికే నమ్మకం లేదు. పైగా అబద్ధం ఆడడం వారికి పెద్ద సమస్య కాదు. ఈ విధంగా వారు ఎవరి సంతానమో వారే నిరూపించుకుంటున్నారు – యోహాను 8:44. “వాతవేయబడ్డ” అంతర్వాణి అంటే చనిపోయినదీ మౌనంగా ఉన్నదీ అని అర్థం. ఎఫెసీయులకు 4:19 పోల్చి చూడండి.

3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.
ఆదికాండము 9:3

ఈ కపటంతో నిండిన అబద్ధికులు ఉపదేశించేవాటిలో ఈ రెండు విషయాలే కాదు, ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీరి ఉపదేశాలకు ఆధారం దేవుని వాక్కు కాదని ఇవి తేటతెల్లంగా తెలియజేస్తున్నాయి. వారు తమ ఉపదేశాలను బైబిలు కంటే గొప్ప చేస్తారు. అన్ని రకాల అబద్ధ బోధలలో ప్రమాదకరమైనది ఇదే. పెండ్లి గురించి ఆదికాండము 1:27-28; ఆదికాండము 2:22-24; మత్తయి 19:4-6; హెబ్రీయులకు 13:4 చూడండి. భోజన పదార్థాల గురించి ఆదికాండము 1:29; ఆదికాండము 9:3; మార్కు 7:19; అపో. కార్యములు 10:9-16; రోమీయులకు 14:14, రోమీయులకు 14:20. కొన్ని భోజన పదార్థాలను తినకుండా పెండ్లి చేసుకోకుండా ఉండేవారు దాని మూలంగా ఇతరులకంటే మరింత పవిత్రులూ ఆధ్యాత్మిక వ్యక్తులూ అయి ఉంటారని దాదాపుగా అన్ని మతాల్లోనూ కొందరు బోధిస్తున్నారు. ఇది దేవుని ఉపదేశం కాదు. సన్యాసంలో, తపస్సుల్లో ఎక్కువ విలువ ఉన్నదని వారు పొరపాటు పడుతున్నారు. కొలొస్సయులకు 2:16, కొలొస్సయులకు 2:20-23 పోల్చి చూడండి. “కృతజ్ఞతతో”– మత్తయి 14:19; మత్తయి 26:26; రోమీయులకు 14:6; కొలొస్సయులకు 2:6-7; 1 థెస్సలొనీకయులకు 5:18.

4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
ఆదికాండము 1:31

“మంచిదే”– ఆదికాండము 1:1, ఆదికాండము 1:31. దేవుడే అన్నిటికీ సృష్టికర్త అని పౌలు నొక్కి చెపుతున్నాడు. ఆయన చేసినదానిలో చెడ్డది ఏదీ లేదు. ఆయన ఏర్పాటు చేసిన నియమాల్లో (వివాహం లాంటిది) ఏదీ కూడా పవిత్రతకూ ఆధ్యాత్మికతకూ వ్యతిరేకం కాదు.

5. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచ బడుచున్నది.

మనుషుల ఉపయోగం కోసం ప్రతి భోజన పదార్థాన్నీ దేవుని వాక్కు ప్రతిష్ఠించింది. 3వ వచనంలో రిఫరెన్సులు చూడండి. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన భోజన పదార్థాలను కృతజ్ఞతలు చెల్లించినవారి కోసం పవిత్రపరుస్తుంది.

6. ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.

“మంచి సేవకుడు”– సంఘంలోని ప్రతి బోధకుడూ ప్రతి సంఘ కాపరీ, ఉపదేశకుడు ప్రతి శుభవార్తికుడు ఈ విధంగా ఉండడానికి తన పూర్ణ హృదయంతోనూ మనసుతోనూ ఆత్మతోనూ బలంతోనూ కృషి చేయాలి. ఈ విధంగా ఉండాలంటే వారు దేవుడు వెల్లడి చేసిన సత్యాలను అంటిపెట్టుకుని నమ్మకంతోనూ ధైర్యంతోనూ ఇతరులకు ప్రకటించాలి. అంతేగాక అబద్ధ ఉపదేశకుల తప్పులను ఎత్తి చూపించాలి.

7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.

“ముసలమ్మ ముచ్చట్లు”– అంటే యథార్థం కాని మత సంబంధమైన కథలు, వాస్తవికతలో చరిత్రలో ఆధారమేమీ లేని పుక్కిటి పురాణాలు అని పౌలు ఉద్దేశం. “కల్పిత కథలు”– 1 తిమోతికి 1:4. “దైవభక్తి”– ఆచరణ యోగ్యమైన క్రైస్తవ జీవితం అని పౌలు ఉద్దేశం. ఇది క్రైస్తవులు నేర్చుకోవలసినది. విశ్వాసులు తమకు తామే ఇందులో సాధన చేసుకోవాలి. హెబ్రీయులకు 5:14; 1 కోరింథీయులకు 9:24-27 పోల్చి చూడండి. నిపుణుడైన క్రీడాకారుడు తన శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకున్నట్టు ప్రత్యేకంగా క్రీస్తు సేవకులు ఆధ్యాత్మిక విషయాలలోనూ మానసిక విషయాలలోనూ క్రమశిక్షణగా ఉండాలి.

8. శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.

“వాగ్దానం”– దేవుని వాగ్దానాలు దైవభక్తి గలవారికే, క్రీస్తులో నిజ విశ్వాసులకే గాని ఇంకెవరికీ కాదు. ఈ వాగ్దానాల్లో కొన్ని ఈ జీవితానికీ, మరి కొన్ని రాబోయే జీవితానికీ సంబంధించినవి.

9. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మునైయున్నది.

10. మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

“ప్రయాసపడుతూ”– ఫిలిప్పీయులకు 3:12-14; కొలొస్సయులకు 1:29; 1 కోరింథీయులకు 15:10; గలతియులకు 4:11; 1 థెస్సలొనీకయులకు 5:12. “జీవంగల దేవుడు”– 1 తిమోతికి 3:15. “ఆశాభావం”– రోమీయులకు 5:2; రోమీయులకు 8:24-25. క్రీస్తులోని విశ్వాసికి “జీవంగల దేవుని”లో “సజీవమైన ఆశాభావం” ఉంది (1 పేతురు 1:3). “రక్షకుడు”– మనుషులందరికీ పాపవిముక్తి, రక్షణ లభిస్తుందని కాదు దీని అర్థం. దేవుడు రక్షకుడు అని ఎందుకన్నాడు అంటే దేవుడు ఈ భూమి అంతటి మీద ఉన్న మనుషులను కాపాడుతూ వారికి ఉన్న అవసరతలను దయ చేస్తున్నాడు కాబట్టి (అపో. కార్యములు 14:17; అపో. కార్యములు 17:25-27). అంతేగాక ఆధ్యాత్మిక రక్షణకోసం ఆయనవైపు తిరిగిన వారందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు (యెషయా 45:22). క్రీస్తులోని విశ్వాసులు ఆయనవైపు తిరిగారు గనుక అన్ని విధాల ఆయన వారికి రక్షకుడు (1 తిమోతికి 1:1).

11. ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము.

“ఆదేశించి”– క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు అధికారంతో మాట్లాడవచ్చు. మాట్లాడాలి కూడా. వారు భూమిమీద క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల గురించిన మూల సత్యాలు వారిదగ్గర ఉన్నాయి. ఉన్నాయని వారికి తెలుసు. వారు అనుమానాస్సదమైన సంగతులను గానీ కల్పిత కథలను గానీ ముసలమ్మ ముచ్చటలను గానీ ఉపదేశించడం లేదు. అలా చేస్తున్నారు అనే భావనను కూడా వారు ఇవ్వకూడదు. 1 పేతురు 4:11 చూడండి.

12. నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.

“యువప్రాయం”– ఎఫెసు సంఘానికి నాయకుడైన తిమోతి అక్కడ చాలామంది క్రైస్తవుల కంటే చిన్నవాడై ఉండి ఉంటాడు. కొంతమందికి అతణ్ణి చిన్న చూపు చూచే మనసు ఉండవచ్చు. కానీ దేవుడు అతణ్ణి ఆ పదవిలో నియమించాడు కాబట్టి అధికారంతో దేవుని వాక్కు మాట్లాడుతూ ఉండడం వల్ల తనను ఎవరూ చిన్నచూపు చూడకుండా చూసుకోవాలి. “పవిత్రత”– సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మలిచే అయిదు సంగతుల గురించి పౌలు ఇక్కడ చెప్పాడు. ఇందులో ఏ ఒక్కటీ తీసివేయడానికి వీలులేదు. విచారకరమైన విషయం ఏమిటంటే కొందరు బోధకులు ఏదో ఒకదానిలోనే ఆసక్తి చూపిస్తూ మిగతా వాటిని పట్టించుకోరు. “మాదిరి”– ప్రతి క్రైస్తవ సేవకుడు ఈ విధంగా ఉండాలి (1 పేతురు 5:3; 1 కోరింథీయులకు 11:1; ఫిలిప్పీయులకు 3:17; 2 థెస్సలొనీకయులకు 3:7).

13. నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.

“చదివి వినిపించడం”– యూదులు ఆరాధనకు సమకూడినప్పుడు ఈ విధంగా చేయడం వారి అలవాటు. లూకా 4:16-17; ఎజ్రా 8:1-3; అపో. కార్యములు 13:15 పోల్చి చూడండి. తరువాత క్రైస్తవులు తమ సభలలో దీన్ని అలవర్చుకున్నారు (కొలొస్సయులకు 4:16; 1 థెస్సలొనీకయులకు 5:27). ఆ రోజుల్లో ఈ అలవాటు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిలు ప్రతులు ప్రతి విశ్వాసికీ ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా చాలమంది వాటిని చదవలేకపోయేవారు. చదువురాని వారి మధ్య ఈ అలవాటు ఇప్పటికీ ఎంతో ఉపయోగపడుతుంది. సంఘ కాపరి ప్రోత్సాహపరచడం, ఉపదేశించడం రెండూ చేయాలనే సంగతిని గమనించండి. ప్రోత్సాహపరచడం దేవుని వాక్కు మనిషి సంకల్ప శక్తి మీదా అంతర్వాణిమీదా పని చేస్తుంది. ఉపదేశించడం అంటే క్రైస్తవ విశ్వాస సిద్ధాంతాలను నేర్పించడం. ఇది విశ్వాసి మనసు మీద ఎక్కువగా పని చేస్తుంది. ఇవి రెండూ చాలా అవసరం.

14. పెద్దలు హస్తనిక్షేపణముచేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.

“చేతులుంచినప్పుడు”– ఎఫెసు సంఘంలో సేవకోసం సంఘం పెద్దలందరూ కలిసి తిమోతిని నియమించినప్పుడు జరిగిన సంఘటన ఇది. అపో. కార్యములు 13:3 పోల్చి చూడండి. పెద్దలెవ్వరూ చేతులుంచకపోయినా దేవుడు తన సేవకులకు ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఇవ్వగలడు. కానీ ఈ విధంగా చేతులుంచడంవల్ల దేవునికీ దేవుని విశ్వాసులకూ మధ్య ప్రత్యేకమైన పనికోసం ఐక్యత, ఏకీభావం ఉన్నాయని చూపించింది. “దేవుని మూలంగా పలికిన మాట”– 1 తిమోతికి 1:18. దేవుని మూలంగా పలకడం అనేది దేవుని పవిత్రాత్మ ఇచ్చే సామర్థ్యాల్లో ఒకటి – 1 కోరింథీయులకు 14:29-31. “ఆధ్యాత్మికవరం”– 2 తిమోతికి 1:6. ఆధ్యాత్మిక సామర్థ్యం అని పౌలు ఉద్దేశం. రోమీయులకు 12:6-8; 1 కోరింథీయులకు 1:7; 1 కోరింథీయులకు 12:4-11, 1 కోరింథీయులకు 12:28; 1 కోరింథీయులకు 14:1 చూడండి. “నిర్లక్ష్యం”– దేవుడిచ్చిన ఏ సామర్థ్యాన్ని అయినా నిర్లక్ష్యం చేయడం సాధ్యమే. మత్తయి 25:24-27 పోల్చి చూడండి.

15. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.

మనస్ఫూర్తిగా చేయని సేవ దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపరచదు. క్రీస్తు సేవకులందరికీ పౌలుకున్న శక్తివంతమైన కోరికలే ఉండాలి (అపో. కార్యములు 20:24; కొలొస్సయులకు 1:29).

16. నిన్నుగూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.

క్రీస్తు సేవకులు తమ జీవితాల గురించీ ఉపదేశాల గురించీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఉపదేశాలు తప్పుగా ఉంటే పవిత్రమైన జీవితాన్ని గడపడం చాలదు, మన జీవిత విధానం అపవిత్రమైతే సరైన బోధలు చేయడం చాలదు. “నిన్ను రక్షించుకొంటావు”– యెహెఙ్కేలు 33:6, యెహెఙ్కేలు 33:9; ఫిలిప్పీయులకు 2:12 పోల్చి చూడండి. దేవుడు రక్షకుడు (1 తిమోతికి 1:1). బోధకులు తాము జీవిస్తూ బోధిస్తూ ఉండే విధానాన్ని బట్టి రక్షణను సంపాదించుకోలేరు (ఎఫెసీయులకు 2:8-9). దేవుని కృపవల్ల మాత్రమే విశ్వాసంలో కొనసాగగలరు. ఇది చాలా అవసరం (కొలొస్సయులకు 1:23; హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 6:12). “నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు”– యాకోబు 5:19-20. నమ్మకమైన బోధకుడు తన రక్షకుడైన దేవుని చేతిలో సాధనంలాగా ఉన్నాడనీ, దేవుడు అతనిచేత ప్రజలకు రక్షణను తీసుకువచ్చి, వారిని విశ్వాసంలో కొనసాగిస్తాడనీ దీని అర్థం. ఇంతకంటే మంచి ఆశీర్వాదకరమైన పని ఏముంటుంది మనిషికి?Shortcut Links
1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |