Timothy I - 1 తిమోతికి 6 | View All

1. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.

ఎఫెసీయులకు 6:5-6 నోట్; కొలొస్సయులకు 3:22; తీతుకు 2:9; 1 పేతురు 2:18. “దూషణ పాలు”– క్రైస్తవ బానిసలు తమ యజమానులను గౌరవించకుండా వారికి ఎదురు తిరిగితే ఈ విధంగా జరగవచ్చు. విశ్వాసం లేనివారు క్రైస్తవ బానిసలు ఆరాధించే దేవుణ్ణీ, వారు నమ్మే సత్యాలనూ దూషించవచ్చు. క్రైస్తవ బానిసలు, ఇంకా ఇతర క్రైస్తవులు ఈ విధంగా జరగకుండా జాగ్రత్తగా ఉండాలి.

2. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.

విశ్వాసులైన బానిసలు విశ్వాసులైన తమ యజమానులు దయగలవారంటూ పని సరిగా చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఇది తగదు. “సోదరులు”– క్రీస్తును గురించి విశ్వాసం ఏర్పడినప్పుడు యజమానులూ బానిసలూ కూడా ఆధ్యాత్మిక సోదరులు అవుతారు. “ప్రియమైన”– బానిసలు తమ యజమానులను ఎప్పటికైనా ప్రేమతో చూడగలరా? క్రీస్తులో ఇది సాధ్యమే – గలతియులకు 3:28; కొలొస్సయులకు 3:11. ఒకరినొకరు ప్రేమించాలని విశ్వాసులందరికీ క్రీస్తు ఆజ్ఞ ఇచ్చాడు (యోహాను 13:34).

3. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల

“వేరే ఉపదేశం”– 1 తిమోతికి 1:3, 1 తిమోతికి 1:10-11; 1 తిమోతికి 4:1 పోల్చి చూడండి. ఇక్కడ పౌలు నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. గానీ అతడు చెప్పినది ఇతరులకు కూడా వర్తిస్తుంది. క్రీస్తు తన రాయబారులకు బయలు పరచిన సత్యాల ప్రాముఖ్యతను గురించి పౌలు ఇక్కడ మళ్ళీ నొక్కి చెపుతున్నాడు. ఈ సత్యాలను అంగీకరించలేకపోవడానికి తమ వివేకం, ఇంగితం అడ్డువస్తున్నాయని కొందరు అంటూ ఉంటారు. నిజం ఏమిటంటే మనుషులు దేవుని వాక్కును తిరస్కరించడానికి కారణం వారికి ఎక్కువ తెలిసి ఉండడం కాదు గాని చాలా తక్కువ తెలిసి ఉండడమే. వారు ఎంతో విద్యను గడించి ఉండవచ్చు గానీ ఆధ్యాత్మిక విషయాలలో వారికి అనుభవం, గ్రహింపు ఉండదు. వారు చీకటిలోనూ అజ్ఞానంలోనూ ఉన్నారు – యోహాను 3:1, యోహాను 3:9, యోహాను 3:20; 1 కోరింథీయులకు 1:18-22; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 4:18. అయినా వారు గర్విష్ఠులై, అజ్ఞానంలో ఉంటూ కూడా తాము గొప్ప తెలివిగలవారమని అనుకోవచ్చు.

4. వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,

“వెర్రి పట్టింపు”– ఆత్మ సంబంధమైన విషయాల్లో జబ్బుగా ఉన్నవారి సంగతిని వివరిస్తున్నాడు పౌలు. వీరు తమ జబ్బును నయం చేసే దేవుని సత్యాన్ని స్వీకరించడానికి బదులు దానికి వ్యతిరేకంగా పోరాడడానికి సంసిద్ధత చూపుతున్నారు.

5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.

“భ్రష్ట మనసు”– 2 తిమోతికి 3:8. మనసు దేవుని సత్యాలను వ్యతిరేకిస్తున్నది అంటే అది ఆధ్యాత్మిక విషయాల గురించి సరిగా ఆలోచించడం లేదన్నమాట. మన మనసులు నూతనం కావడం అనేది క్రీస్తు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి (రోమీయులకు 12:2; కొలొస్సయులకు 3:10). “సత్యం కోల్పోయిన”– సత్యం వారి ఎదురుగా ఉంది. వారు దాన్ని విని, నమ్మామని చెప్పారు. కానీ దాన్ని తమ మనసులనుంచి సైతానును దొంగిలనిచ్చారు. మత్తయి 13:18-19 పోల్చి చూడండి. క్రైస్తవులు అనబడ్డవారు కొందరు ఏ విధంగా తమ భ్రష్ట మనసును వెల్లడి చేస్తారో చూశారా – వారికి వారి మతం అంటే డబ్బు సంపాదించే ఒక మార్గం అంతే! అపో. కార్యములు 8:18-23; యోహాను 12:6; 2 పేతురు 2:15; యూదా 1:11 పోల్చి చూడండి. క్రీస్తు కోసం తమకున్నదంతా విడిచిపెట్టడానికి బదులు (లూకా 14:25-27, లూకా 14:33; ఫిలిప్పీయులకు 3:8) క్రీస్తు ప్రజలనుంచి తాము తీసుకోగలిగినంత తీసుకోవాలని అత్యాశ కలిగి తహతహ చెందుతుంటారు. క్రైస్తవ సమాజంలో ఇలాంటి మనస్తత్వం ఉండడం, డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి వంచించడం, మోసం చేసి దొంగిలించడం చాలా భయంకరమైన విషయం. అబద్ధికుడిగా ఉండడం కంటే పేదవాడిగా ఉండడం ఎంతో మేలు (సామెతలు 19:22).

6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.

ఫిలిప్పీయులకు 4:11-12; హెబ్రీయులకు 13:5 చూడండి. క్రీస్తు విశ్వాసులు ఆశించవలసినది వస్తువులు, డబ్బు కాదు గాని ఆధ్యాత్మిక విషయాలలో ధనికులై ఉండాలని. అందులోనే శాశ్వత లాభం ఉంది. (మత్తయి 6:19-21). తృప్తి అంటే దేవునిమీది నమ్మకంవల్ల కలిగే ఫలితం. దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, హోదాలో మనల్ని ఉంచాడనీ, మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్టప్రకారం మనకిచ్చాడనీ నమ్మడమే తృప్తికి దారి. తృప్తి మనలను విసుగుతో ఫిర్యాదు చేయడం నుంచి, దురాశ, అత్యాశల నుంచి (ఇది విగ్రహ పూజ – ఎఫెసీయులకు 5:5; కొలొస్సయులకు 3:5) దూరంగా ఉంచుతుంది. భౌతిక వస్తువులు మనల్ని ఏలకుండా తప్పిస్తుంది. క్రీస్తు సేవకులలో ఉండవలసిన ఒక ముఖ్యమైన గుణం ఇది. తృప్తిగా ఉండడానికి నిరాకరించడం అంటే మనపట్ల దేవుని మార్గాలనూ వ్యవహారాలనూ విమర్శించినట్టే. ఇది దేవునికి వ్యతిరేకంగా సణగడం అనే పాపమే. నిర్గమకాండము 14:11-12; నిర్గమకాండము 15:22-24; నిర్గమకాండము 16:2-3, నిర్గమకాండము 16:8; సంఖ్యాకాండము 14:3 పోల్చి చూడండి.

7. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
యోబు 1:21, ప్రసంగి 5:15

యోబు 1:21; కీర్తనల గ్రంథము 49:16-20; ప్రసంగి 5:15. మనకంటే ముందు మనం పరలోకానికి ఏవైతే పంపిస్తామో అవే మనం ఈ భూమిమీది ఉన్నంత కాలంలో కూడబెట్టుకో గలిగినది.

8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
సామెతలు 30:8

అత్యవసరాలని పౌలు ఉద్దేశం. పౌలు ఇంటి గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తనకంటూ ఒక స్వంత ఇల్లు లేకుండా కూడా తన జీవితమంతా గడపగలగడం సాధ్యమే.

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
సామెతలు 23:4, సామెతలు 28:22

మనుషులు (క్రైస్తవులు కూడా) డబ్బు వెంట వెళ్ళడం అనేది చాలా జ్ఞానమని అనుకోవచ్చు. కానీ వారు ఘోరమైన మాయలో పడి మోసపోతున్నారు. ఆధ్యాత్మికంగా నశించిపోయే మార్గంలో ఉన్నారు. సంపదను ఆశించడం సైతాను వేసే వల, దుష్‌ప్రేరేపణ. ఇది తృప్తిని ఇవ్వదు గానీ ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి చివరికి నాశనం చేస్తుంది (మత్తయి 7:13; 2 థెస్సలొనీకయులకు 2:8-9; కీర్తనల గ్రంథము 49:20; కీర్తనల గ్రంథము 73:18-19). దీని గురించి బైబిలులో ఉదాహరణలు చూడండి – బిలాము (2 పేతురు 2:15); గేహజీ (2 రాజులు 5:20-27); యూదా (మత్తయి 26:14-16; యోహాను 12:4-6). మనం వీరిలాగా కావాలనుకుంటామా?

10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతకూ ఒక మూలం. ఎందుకంటే ఇది మనుషులను దేవుని నుంచీ ఆధ్యాత్మిక విషయాల నుంచీ భౌతిక వస్తువులవైపు మళ్ళిస్తుంది. మత్తయి 6:22-24 చూడండి – డబ్బంటే ప్రీతి దేవుని పట్ల ద్వేషమే. మత్తయి 22:37 లో ఉన్న ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటుండదు. అలా కాక మనకు డబ్బంటే ప్రీతి ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటుండదు. ఇస్కరియోతు యూదాను పిశాచంగా మార్చిన ఒక పాపం డబ్బుమీద వ్యామోహమే (యోహాను 12:6; మత్తయి 26:14-16). మనకు ఏ మాత్రమైనా గ్రహింపు ఉంటే ఆ మార్గం వెంటవెళ్ళడానికి ఇష్టపడతామా? “విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి”– వ 21; 1 తిమోతికి 1:19; 1 తిమోతికి 4:1, 1 తిమోతికి 4:6; 1 తిమోతికి 5:8. క్రీస్తు చూపించిన మార్గంలో నడవడం అనేది డబ్బే తమకు దేవుడైపోయిన వారికి అసలు ఇష్టం ఉండదు. “అగచాట్లు”– సంపదల వెంట వెళ్ళడం నిజంగా అగచాట్ల వెంట వెళ్ళడమే. డబ్బు తన ప్రేమికులకు శోకం, భ్రమ, అసంతృప్తి, శాశ్వతమైన నష్టం అనే బహుమతులు ఇస్తుంది. యాకోబు 5:1-3; మత్తయి 19:22; లూకా 6:24-25; లూకా 12:16-21; లూకా 16:19-31 చూడండి.

11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.

క్రీస్తులో ఉన్న ప్రతి సేవకుడూ ప్రతి విశ్వాసీ డబ్బు వెనుకా ఆస్తుల వెనుకా పరుగెత్తాలని కలిగే ప్రేరేపణల నుంచి పారిపోవాలి. అలా చేయకపోతే సైతాను వలలో పడిపోవచ్చు (వ 9). ఇలా కాకుండా మనమందరం పౌలు ఇక్కడ చెప్పిన నిజమైన ధనం వెంట వెళ్దాం – దేవుని ఆత్మ ఫలాలు (గలతియులకు 5:22-23). మనం ఈ విధంగా చేస్తూ ఉంటే మన అవసరాల గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు (మత్తయి 6:33; ఫిలిప్పీయులకు 4:19).

12. విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

“పోరాటం”– ఎఫెసీయులకు 6:10-18; 1 కోరింథీయులకు 9:26; 2 తిమోతికి 4:7. “శాశ్వత జీవం”– వ 19. యోహాను 3:16 నోట్. “చేపట్టు”– దేవుడు శాశ్వత జీవాన్ని మనకు అందుబాటులో ఉంచాడు, అయితే దాన్ని మనం చేపట్టాలి (ప్రకటన గ్రంథం 22:17). శాశ్వత జీవం ఉన్నవారు దేవుడు దీనిని ఇచ్చినప్పుడు దానితో బాటు ఇచ్చిన వాటిని తీసుకొని ఉపయోగించాలి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే చురుకుగా ఉండడమే. ఊరకే ఉండడం కాదు. క్రీస్తులో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు (ఎఫెసీయులకు 1:3). కానీ వాటిని మన హక్కుగా భావించి స్వీకరించి ఉపయోగించుకోవాలి. “మంచి ఒప్పుకోలు”– మత్తయి 10:32-33; రోమీయులకు 10:9-10; 1 యోహాను 4:15 పోల్చి చూడండి.

13. సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,

1 తిమోతికి 5:21. “జీవం పోసే”– అపో. కార్యములు 17:25. “పిలాతు”– మత్తయి 27:2. యోహాను 18:36-37 లో పిలాతు ముందు క్రీస్తు ఒప్పుకోలును చూడండి.

14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.

“యేసు క్రీస్తు ప్రత్యక్షం”– క్రీస్తు రెండో రాకడ (2 తిమోతికి 4:1, 2 తిమోతికి 4:8; తీతుకు 2:13; హెబ్రీయులకు 9:28; మత్తయి 24:30-31; అపో. కార్యములు 1:11). “ఈ ఆజ్ఞ”– బహుశా ఇది క్రీస్తు తన విశ్వాసుల కోసం నియమించిన జీవిత విధానమంతా కావచ్చు. 11,12 వచనాల్లో దీని విషయం తప్పకుండా ఉంది.

15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
ద్వితీయోపదేశకాండము 10:17, యెహెఙ్కేలు 34:29

ఇక్కడ పౌలు దేవుణ్ణి “ఏకైక దివ్య పరిపాలకుడు”, “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1:5 యేసు భూరాజులను పరిపాలించేవాడని అంటున్నది; ప్రకటన గ్రంథం 19:16 లో యేసు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అని ఉంది. ఇందులో పరస్పర విరుద్ధమైన సంగతి ఉందా? కానే కాదు. యేసు క్రీస్తు దేవుని అవతారమని దీని సరైన అర్థం. యోహాను 1:1, యోహాను 1:14; ఫిలిప్పీయులకు 2:6 మొ।। చూడండి. “సరైన సమయం”– మత్తయి 24:36. గలతియులకు 4:4; యోహాను 7:30 పోల్చి చూడండి. దేవుడు చేసే ప్రతి పనికీ సరైన సమయం ఉంది.

16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
నిర్గమకాండము 33:20, కీర్తనల గ్రంథము 104:2

1 తిమోతికి 1:17 చూడండి. “వెలుగు”– 1 యోహాను 1:5; యోహాను 1:4-5.

17. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
కీర్తనల గ్రంథము 62:10

ధనవంతులు గర్వంతో తమకు దేవుడంటే అవసరం లేదనే దుష్ట తలంపుకు గురి అయ్యే అవకాశం ఉంది. కీర్తనల గ్రంథము 49:6; కీర్తనల గ్రంథము 73:3-12 పోల్చి చూడండి. “అనిశ్చయమైన”– సామెతలు 23:4-5; సామెతలు 28:20. దేవుడు మనుషులను దేన్ని సంపాదించుకోనిచ్చాడో దాన్ని తీసేయగలడు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినవారు ఈ శిక్షకు తగినవారే. “అనుభవించడానికి”– ప్రసంగి 2:24-26; అపో. కార్యములు 14:17. తాను ఇచ్చిన మంచివాటిని తన ప్రజలు అనుభవించాలనీ, ఈ అనుభవం తప్పు అని వారు అనుకోకూడదనీ దేవుని కోరిక. “సమృద్ధిగా దయ చేసేవాడు”– 2 కోరింథీయులకు 9:8; ఫిలిప్పీయులకు 4:19. దేవుడు గుప్పిలి బిగించేవాడు, పిసినారి కాదు. మన ఆశాభావం, నమ్మకం ఆయన మీదే ఉండాలి గానీ ప్రజలమీదా మనకు కనిపించే వస్తువుల మీదా కాదు.

18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,

మత్తయి 19:21; మత్తయి 6:19-20; లూకా 14:33. “మంచి పనులలో...ధనవంతులై”– నిజమైన ఐశ్వర్యాలు ఈ వచనాల్లో కనిపిస్తున్నాయి. లూకా 12:21 పోల్చి చూడండి. తమకోసమే తమ ధనాన్ని ఉపయోగించుకొనే ధనవంతులు (ఇంకెవరైనా గానీ) తెలివితక్కువగా దానిని పారవేసు కుంటున్నారు. “పంచిపెట్టే”– మనమిప్పుడు ఏమి చేస్తున్నాం? ఏమి ఇస్తున్నాం? అన్నది మన భవిష్యత్తుమీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. మత్తయి 25:19; లూకా 19:15 పోల్చి చూడండి. చాలామంది తమ డబ్బుతో ఎంతో మంచి చేయగలిగి ఉండి కూడా స్వార్థంగా తమ కోసం వాడుకుంటూ తామే వృథా చేయడం చాలా విచారకరమైన విషయం. ఇవ్వడం గురించిన రిఫరెన్సులు 2 కోరింథీయులకు 9:15 నోట్‌లో ఉన్నాయి.

19. సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.

“శాశ్వత జీవాన్ని”– వ 12; యోహాను 10:10; కొలొస్సయులకు 3:4.

20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.

“నీకు అప్పగించబడ్డ దానిని కాపాడుకో”– 2 తిమోతికి 2:14. దేవుడు వెల్లడి చేసిన సత్యం, శుభవార్త (1 తిమోతికి 1:11) అని పౌలు భావం. దీన్ని మన గొప్ప సంపదగా భావించి సైతాను గానీ ఇంకెవరైనా గానీ తీసుకోకుండా చూడాలి. “జ్ఞానం అని తప్పుడు పేరు పొందినదాని”– వ 3,4; కొలొస్సయులకు 2:8; 1 కోరింథీయులకు 1:17-25.

21. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.

“తమకు ఉందంటూ”– రోమీయులకు 1:22 పోల్చి చూడండి. కొంతమంది తాము చాలా తెలివిగలవారమనీ క్రీస్తు శుభవార్త తమకు సరిపోదనీ అనుకుంటారు. వీరు నాశనానికి దగ్గరౌతున్నారు. “విశ్వాస సత్యాల నుంచి వైదొలిగారు”– వ 10; 1 తిమోతికి 4:1. “కృప”– కేవలం దేవుని కృపవల్లనే క్రీస్తు సేవకుడు ఎవరైనా సరే ఈ లేఖలో ఉన్న ఆదేశాలను ఆచరణలో పెట్టగలడు.Shortcut Links
1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |