Timothy II - 2 తిమోతికి 1 | View All

1. క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది.

2. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక.

3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,

“రాత్రింబగళ్ళు”– పౌలు ఖైదులో ఉన్నాడు (వ 8) గానీ అతని పరిచర్య మాత్రం ఖైదీగా లేదు. ప్రార్థన చేయడానికి అతనికి ఎక్కువ సమయం ఉంది. ఈ అవకాశాన్ని అతడు అస్తమానం ఉపయోగించుకున్నాడు. “నా పూర్వీకుల”– ఫిలిప్పీయులకు 3:5. “స్వచ్ఛమైన అంతర్వాణితో”– అపో. కార్యములు 23:1; అపో. కార్యములు 24:16; 1 కోరింథీయులకు 4:4; 2 కోరింథీయులకు 1:12. “కృతజ్ఞతలు”– రోమీయులకు 1:8; 1 కోరింథీయులకు 1:4; ఫిలిప్పీయులకు 1:3; కొలొస్సయులకు 1:3; 1 థెస్సలొనీకయులకు 1:2.

4. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను.

“కన్నీళ్ళు”– బహుశా పౌలు తన చివరి వీడ్కోలు గురించి రాస్తున్నాడు. తిమోతి కన్నీళ్ళు అతనికి పౌలు మీదా పౌలు ప్రకటించే సత్యాలమీదా ఉన్న ప్రేమను బయలుపరుస్తున్నాయి. అపో. కార్యములు 20:37-38 పోల్చి చూడండి. “నాకు ఎంతో ఆశ”– రోమీయులకు 1:11; 1 థెస్సలొనీకయులకు 3:6; ఫిలిప్పీయులకు 1:8.

5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.

తిమోతి తండ్రి, తాత గ్రీకులు. వారు విశ్వాసం లేనివారై ఉండవచ్చు. కానీ అతని తల్లి, అమ్మమ్మ ఇద్దరూ యూదులు. అతని తల్లి (ఒకవేళ బ్రతికి ఉంటే అతని అమ్మమ్మ కూడా) క్రీస్తు శుభవార్తను విని నమ్మింది (అపో. కార్యములు 16:1-3). “కపటం లేని నమ్మకం”– 1 తిమోతికి 1:15.

6. ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.

ఈ సామర్థ్యం అంటే పౌలు ఉద్దేశం సహజ సిద్ధమైన సామర్థ్యం కాదు. అది ఒక ప్రత్యేక సమయంలో దేవుడు తిమోతికి ఇచ్చిన ఆధ్యాత్మిక సామర్థ్యం. ఇలాంటి సామర్థ్యాన్ని దేవుని సేవకులు నిర్లక్ష్యం చేయగలరు, లేదా దాన్ని ఆరిపోయే విధంగా చేయగలరు. అందుచేత పౌలు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. సంఘం పెద్దలు అతనిమీద చేతులుంచడం వల్ల తిమోతికి ఒక సామర్థ్యం కలిగింది (1 తిమోతికి 4:14). ఒక వేళ ఆ సందర్భాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడేమో, మనకు తెలియదు. రెండు ప్రత్యేక కారణాల గురించి చేతులుంచడం అనేది కొత్తేమీ కాదు (అపో. కార్యములు 9:17; అపో. కార్యములు 13:3 చూడండి).

7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

“పిరికితనం”– దీన్ని బట్టి చూస్తే తిమోతి తనకున్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని ఉపయోగించే ధైర్యం చాలక దాన్ని అణగారిపోవాలన్న దుష్ట ప్రేరేపణకు గురి అయ్యాడని కనిపిస్తున్నది. దేవుడిచ్చిన ఉచిత కృపవరాలనూ సామర్థ్యాలనూ ఉపయోగించడానికి ధైర్యం కావాలి (అపో. కార్యములు 4:29; ఎఫెసీయులకు 6:19). క్రీస్తు సేవకు అత్యవసరమైన ఇంకో మూడు విషయాల గురించి పౌలు చెప్తున్నాడు. వీటిని మనకు ఇచ్చేది దేవుని ఆత్మ. దేవుడు తన సేవకోసం మనలను పిలిచినప్పుడు తన సేవకు మనలను సమర్థులను కూడా చేస్తాడు (2 కోరింథీయులకు 3:5-6). “బలం”– అపో. కార్యములు 1:8; 1 కోరింథీయులకు 2:4; 1 కోరింథీయులకు 4:20; 2 కోరింథీయులకు 4:7; 2 కోరింథీయులకు 12:9; ఎఫెసీయులకు 1:19; ఎఫెసీయులకు 3:16; కొలొస్సయులకు 1:11. “ప్రేమ భావం”– ప్రేమభావం లేని బలం హాని చేస్తుంది గానీ మేలు చేయదు. అన్నిటికంటే క్రీస్తు సేవకులకు ప్రేమ చాలా అవసరం – 1 కోరింథీయులకు 13:1-13. “నిగ్రహం”– 1 కోరింథీయులకు 9:24-27 పోల్చి చూడండి. నిగ్రహం లేని సేవకుడు తాను చేయగల పనిని కూడా చేయడు. పైగా తాను చేసిన కొద్దిపాటి పనిని కూడా పాడు చేసుకునే ప్రమాదంలో పడతాడు.

8. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.

“ఆయన కోసం ఖైదీనైన”– 2 తిమోతికి 2:9; ఎఫెసీయులకు 3:1. “సిగ్గుపడకు”– మార్కు 8:38; రోమీయులకు 1:16. కొందరు క్రీస్తు శుభవార్తను తెలివి తక్కువతనమని (1 కోరింథీయులకు 1:18, 1 కోరింథీయులకు 1:23) క్రీస్తు సిలువను ప్రకటించడం అభ్యంతర కారణమని (గలతియులకు 5:11) భావిస్తారు. సహజ సిద్ధంగా పిరికి క్రైస్తవుడు వీటి గురించి ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడే పరీక్షకు గురి కావచ్చు. దేవుని ఆత్మ ఇచ్చే బలప్రభావాల ద్వారా మనం ఈ పరీక్షనుంచి బయట పడగలుగుతాం. “శుభవార్తకోసం కడగండ్లు”– 2 తిమోతికి 2:3; 2 తిమోతికి 4:5; రోమీయులకు 5:3; రోమీయులకు 8:17; 2 కోరింథీయులకు 4:17; 1 పేతురు 4:12-16.

9. మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,

10. క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

“వెల్లడి అయింది”– యోహాను 1:17. “చావును రద్దు చేసి”– మత్తయి 28:6; హెబ్రీయులకు 2:14; యోహాను 5:24; యోహాను 11:25-26. చావు చివరి ఓటమికి క్రీస్తు పునాది వేశాడు (1 కోరింథీయులకు 15:26), విశ్వాసుల కోసం శాశ్వత జీవానికి మార్గం తెరిచాడు (యోహాను 3:16; యోహాను 6:47). అంతేగాక ఆయన జీవాన్ని, అక్షయతను గురించిన సత్యాన్ని బయట పెట్టాడు. ఆయన రాకముందు ఆ సత్యం మరుగై ఉంది. అక్షయత గురించి 1 కొరింతు 15వ అధ్యాయం చూడండి.

11. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.

12. ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

పౌలు బాధలకు (2 తిమోతికి 2:9; 2 కోరింథీయులకు 1:8; 2 కోరింథీయులకు 4:8-12; 2 కోరింథీయులకు 6:4-10; 2 కోరింథీయులకు 11:23-27) కారణం ఆయన క్రీస్తు సేవకుడై ఉండడం (యోహాను 15:18-21; యోహాను 16:1-4). పరిచర్యనుంచి వైదొలగి ఈ బాధలనుంచి తప్పించుకోగలిగేవాడే గానీ అలా చేయలేదు. ఎందుకంటే అతడు క్రీస్తు కోసం బాధలు అనుభవించడానికి సిగ్గుపడలేదు (రోమీయులకు 5:3; 2 కోరింథీయులకు 4:17-18; 2 కోరింథీయులకు 12:10; కొలొస్సయులకు 1:24). “నేను నమ్మినవాడు”– తాను ఏది నమ్మాడో అది కూడా తెలుసు గానీ ఇక్కడ క్రీస్తును గురించిన తన వ్యక్తిగత జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. ఇది శాశ్వత జీవం (యోహాను 17:3). ఈ జ్ఞానం దేవుని పిల్లలందరికీ ఉంది (హెబ్రీయులకు 8:11). “అప్పగించిన”– బహుశా తన గురించీ తనకు సంబంధించినదాని నంతటిని గురించీ చెపుతున్నాడు. చాలా కాలం కిందట అతడు క్రీస్తు బలమైన చేతులకు తనను తాను అప్ప చెప్పాడు. క్రీస్తు నుంచి తనను ఎవరూ, ఏదీ వేరు చేయకుండా క్రీస్తు కాపాడతాడనే దృఢ నిశ్చయం పౌలుకుంది. రోమీయులకు 8:35-39; యోహాను 10:28; 1 పేతురు 1:5 పోల్చి చూడండి. “ఆ రోజు”– క్రీస్తు రెండో రాకడ దినం.

13. క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;

పౌలు తిమోతికి నేర్పినది దేవుని సత్యం. ఆ సత్యాన్ని క్రీస్తే పౌలుకు నేర్పాడు – గలతియులకు 1:11-12; ఎఫెసీయులకు 3:2-3. తిమోతి తనకిష్టమైన “మాదిరి”లో సిద్ధాంతాలను మలచుకోకూడదు. మనం కూడా అలా చేయకూడదు. అందరూ కూడా దేవుడు ఒక సారి ఇచ్చిన మాదిరినే అనుసరించాలి. మనం ఎప్పుడూ ఈ మాదిరి వైపే చూస్తూ దాని ప్రకారమే మన పరిచర్య చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే (మనుషుల దృష్టిలో ఎంత సఫలత పొందినప్పటికీ) దేవుని దృష్టిలో మన పరిచర్యను పాడు చేసుకున్న వారమవుతాం. “క్రీస్తు యేసులో”– వ 9. “విశ్వాసంతో, ప్రేమతో”– పౌలు ఉపదేశాలను మనం సజీవమైన విశ్వాసంతో అంటిపెట్టుకుని ఉండాలి. అవి మనకు మృత తుల్యమైన ఆచారాలుగా ఉండకూడదు (యోహాను 5:38-40, యోహాను 5:45-47 పోల్చి చూడండి). అంతేగాక సత్యాన్ని మనం ప్రేమతో అంటిపెట్టుకుని ఉండాలి. సరైన సిద్ధాంతాలను అనుసరిస్తూ “విశ్వాస సత్యాల కోసం పోరాడడం” (యూదా 1:3) సరిపోదు. దానంతటితోపాటు ప్రేమ లేకపోతే మనం ఏమి కానట్టే – 1 కోరింథీయులకు 13:1-3.

14. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.

“ఆ మంచిదానిని”అంటే దేవుడు వెల్లడి చేసిన సత్యం, మంచి ఉపదేశానికి మాదిరి. క్రీస్తు సేవకులు దీన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే దీన్ని సంఘంలో నుంచి తీసివేయాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. “మనలో నివాసమున్న”– రోమీయులకు 8:9; 1 కోరింథీయులకు 6:19. “పవిత్రాత్మ”– యోహాను 14:16-17 నోట్స్. బలహీనమైన మన స్వంత ఆధారాలతో, మన వాదనలతో గానీ మన జ్ఞానంతో, బలంతో గానీ మనం సత్యాన్ని కాపాడాలని దేవుడు అడగడం లేదు. తన సేవకులకు సహజ సిద్ధంగా ఉన్న వాటికంటే ఆయన మరింత గొప్ప శక్తినీ జ్ఞానాన్నీ ఇచ్చాడు. మత్తయి 10:19-20; లూకా 21:15; యోహాను 16:13-15; అపో. కార్యములు 4:13.

15. ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.

పౌలు ఖైదులో, అపాయంలో ఉన్నాడు. ఆ సమయంలో అతనితో ఉండి అతనికి సహాయం చేయవలసిన వారంతా అలా చేయకుండా వెళ్ళిపోవడం విచారకరమైన విషయం (2 తిమోతికి 4:16). మత్తయి 26:56 పోల్చి చూడండి. “ఆసియా”– అపో. కార్యములు 16:6 చూడండి.

16. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.

“ఒనేసిఫోరస్”– వ 15లో పౌలు చెప్పిన వారందరికీ ఇతడు పూర్తిగా భిన్నమైనవాడు. వారేమో పౌలుకు సహాయం చేయకుండా ఉండడానికి దారి వెదికారు. ఇతడేమో సహాయం చేద్దామని పౌలుకోసం వెతికాడు. ప్రపంచంలో ఇప్పటికి కూడా ఇలాంటి రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు. “జాలి”– పౌలు కోరిక లేఖనాలకు అనుగుణంగా ఉంది – మత్తయి 5:7. మనం ఇతరుల విషయంలో జాలి చూపించ కుండా, సహాయం చేయకుండా ఉంటే దేవుడు మన విషయంలో జాలి చూపి సహాయం చేయాలని ఆశించే హక్కు లేదు.

17. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.

18. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.Shortcut Links
2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |