Philemon - ఫిలేమోనుకు 1 | View All

1. క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును

“ఫిలేమోనుకు”– బైబిలు మొత్తంలో ఫిలేమోను కనబడేది ఇక్కడే.

2. మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.

“అప్ఫియ”– బహుశా ఫిలేమోను భార్య కావచ్చు. “యోధుడైన”– 2 తిమోతికి 2:2; 2 తిమోతికి 4:7. “అర్కిప్పస్”– కొలొస్సయులకు 4:17. “ఇంట్లో”– రోమీయులకు 16:5; 1 కోరింథీయులకు 16:19; కొలొస్సయులకు 4:15. “ఖైదీ”– ఎఫెసీయులకు 3:1; ఎఫెసీయులకు 4:1; 2 తిమోతికి 1:8. “తిమోతి”– ఫిలిప్పీయులకు 1:1; అపో. కార్యములు 16:1-3.

3. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

4. నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని

5. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,

6. క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.

“సహవాసం”– 2 కోరింథీయులకు 8:4; 2 కోరింథీయులకు 9:13; ఫిలిప్పీయులకు 1:5. “క్రీస్తు యేసు ద్వారా”– రోమీయులకు 6:3-8; ఎఫెసీయులకు 1:1; మొ।।. “తెలుసుకోవాలని”– ఇతరులతో సహవాసం చేసి మనకున్న దాన్ని వారితో పంచుకుంటేనే క్రీస్తులో మనకు ఏమి ఉందో పూర్తిగా తెలుస్తుంది. దేవుని చిత్తమని మనకు తెలిసినదానికి శిరసావహించడం ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి మార్గం అవుతుంది. “ప్రార్థన”– ఎఫెసీయులకు 1:17-20; ఎఫెసీయులకు 3:16-19; ఫిలిప్పీయులకు 1:9-11; కొలొస్సయులకు 1:9.

7. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.

“పవిత్రులు”– రోమీయులకు 1:1. “సేద తీర్చావు”– వ 20; రోమీయులకు 15:32; 1 కోరింథీయులకు 16:18; 2 కోరింథీయులకు 7:13; 2 తిమోతికి 1:16. ప్రేమతో కూడిన సహవాసం, ఔదార్యం, దయాగుణం సేదతీరుస్తాయి.

8. కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను,

క్రీస్తు సేవకుడిగా పౌలు లేఖనాల్లోని ఆజ్ఞలనూ, విశ్వాసిగా ఫిలేమోనుకు ఉన్న బాధ్యతలనూ అతనిముందు పెట్టగలిగేవాడే. కానీ ఫిలేమోను తన హృదయంలో ప్రేమ ఉందని ఇంతకుముందే నిరూపించుకున్నాడు (వ 7) కాబట్టి పౌలు ఆ ప్రేమను బట్టే అతణ్ణి వేడుకుంటున్నాడు.

9. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని,

“ముసలివాణ్ణయి”– బహుశా పౌలుకప్పుడు దాదాపు 60 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. అపో. కార్యములు 7:58 పోల్చి చూడండి. “ఒనేసిమస్” అంటే “ప్రయోజనకరమైన”, లేదా “ఉపయోగకరమైన” అని అర్థం. ఇతడు ఫిలేమోనుకు బానిస (వ 16). అతడు అక్కడి నుంచి పారిపోయి ఫిలేమోనుకు ప్రయోజనం లేనివాడుగా అయ్యాడు. కానీ దేవుని బిడ్డగా మారి మరింత ఉన్నతమైన రీతిలో ప్రయోజనకారి అయ్యాడు.

10. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.

“కుమారుడు”– ఆధ్యాత్మిక కుమారుడని పౌలు అర్థం, 1 తిమోతికి 1:2 పోల్చి చూడండి. పౌలు ఉపదేశంవల్ల ఒనేసిమస్ క్రీస్తులో నూతన జన్మాన్ని పొందాడు (యోహాను 1:12-13). ఖైదులో ఉన్నప్పటికీ పౌలు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పడం మానలేదు.

11. అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

12. నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను.

“ప్రాణ సమమైన”– సమాజంలో అతి తక్కువ స్థాయికి చెందినవాడు అని మనుషులు తలంచినవాడి పట్ల ఈ గొప్ప రాయబారికున్న ప్రేమభావం చూశారా. క్రీస్తు ప్రేమను పొందినవారందరిలో ఆయన ప్రేమ చేయగలిగినది ఇదే.

13. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని

ఒకవేళ పౌలు ఉన్న చోటే ఫిలేమోను ఉంటే అతడు సంతోషంగా తనకు సాయపడతాడని పౌలు నమ్మకం. కానీ మరొకరి సేవకుణ్ణి అతడి అనుమతి లేకుండా ఉపయోగించు కోవడానికి పౌలు ప్రయత్నించడు. మనస్ఫూర్తిగా కాకుండా బలవంతంగా ఉపకారం చేయడం అనేది ఉపకారమే కాదు. దేవునికీ గానీ దేవుని ప్రజలకు గానీ ఇచ్చే దేని విషయంలోనైనా ఇది నిజం. 2 కోరింథీయులకు 9:7.

14. నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.

15. అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు

16. గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహో దరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.

“బానిస”– ఎఫెసీయులకు 6:5; నిర్గమకాండము 21:2 నోట్స్. “ప్రియ సోదరుడుగా”– కొలొస్సయులకు 4:9. క్రీస్తులో యజమానులూ బానిసలూ, ధనవంతులూ పేదవారూ, చదువుకున్నవారూ చదువులేనివారూ మనుషుల దృష్టిలో పెద్ద కులాలూ చిన్న కులాలూ లేదా అంటరానివారని ఎంచినవారూ అందరూ సహోదరులు, ఒక్క జనంగా, ఒక్క శరీరంగా ఉన్నారు – కొలొస్సయులకు 3:11; గలతియులకు 3:28; 1 కోరింథీయులకు 12:12-13. ఏ క్రైస్తవుడైనా దీన్ని ఒప్పుకోవడం లేదు అంటే దేవుడు తానే బయలు పరచిన ఒక ముఖ్యమైన సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడన్నమాట. ఒకరు మరొకరిని తక్కువవానిగా భావించి తనను తాను గొప్పగా చేసుకోవడం దేవునికి వ్యతిరేకంగా అపరాధం.

17. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము.

ఈ విషయాన్ని పౌలు క్రీస్తునుంచి నేర్చుకున్నాడు. తన స్వంత కుమారుణ్ణి స్వీకరించినట్టు దేవుడు తన విశ్వాసులను స్వీకరిస్తాడని పౌలుకు తెలుసు – అపో. కార్యములు 15:8; రోమీయులకు 5:2; రోమీయులకు 14:3; ఎఫెసీయులకు 2:18. క్రీస్తు మనలను స్వీకరించినట్టు మనం ఒకరినొకరు స్వీకరించాలని పౌలుకు తెలుసు – రోమీయులకు 15:7. ఒకరు పంపగా వచ్చిన మనిషిని స్వీకరించడం అంటే ఆ పంపినవాణ్ణి స్వీకరించడమే అన్న విషయం అతనికి తెలుసు – యోహాను 13:20. విశ్వాసుల తప్పులు, పాపాలు, ఆత్మసంబంధమైన రుణాలు అన్నీ క్రీస్తు లెక్కలోకి వచ్చాయనీ క్రీస్తు వాటిని పూర్తిగా తీర్చాడనీ అతనికి తెలుసు – యెషయా 53:5-6; రోమీయులకు 8:33-34; 2 కోరింథీయులకు 5:19-21. ప్రేమంటే ఏమిటో, ఈ దైవిక సూత్రాల అర్థం ఏమిటో నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టడానికి పౌలు సంతోషించాడు. మనం కూడా ఇలాగే చేయాలి. క్రీస్తు మన బాకీలు తీర్చినట్టుగా మనం కూడా ఇతర విశ్వాసుల బాకీలను సంతోషంతో తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాక మనం దేవునిపట్ల అపరాధం చేసినా దేవుడు మనలను ఏవిధంగా క్షమించి స్వీకరించాడో అదేవిధంగా మనపట్ల అపరాధం చేసిన విశ్వాసులను క్షమించి స్వీకరించాలి.

18. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము;

19. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?

“నీ ఆత్మ విషయంలో”– తన పరిచర్య ద్వారా ఫిలేమోను క్రీస్తును తెలుసుకొని రక్షణ పొందాడని పౌలు ఉద్దేశం కావచ్చు. ఫిలేమోనుకు ఈ గొప్ప అనుభవం పౌలు ద్వారా లభించింది కాబట్టి పౌలుకు ప్రియమైన మరో సహోదరుడి తప్పులను చూచి చూడనట్టు ఉండడానికి ఫిలేమోను సిద్ధంగా ఉండాలి.

20. అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.

ఈ ప్రయోజనం తన కోసం కాదు, తనకు ప్రియమైనవాడి కోసం. “సేద తీర్చు”– వ 7.

21. నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.

“వింటావని”– ఆజ్ఞకు లోబడాలని కాదు. ఎందుకంటే పౌలు ఆజ్ఞ ఏదీ ఇవ్వలేదు (వ 8,9), కానీ ప్రేమను గురించిన గొప్ప నియమాలకు విధేయత చూపాలని, విధేయతలన్నింటిలో ఇదే ఉత్తమమైనది. మనం క్రీస్తును ప్రేమిస్తున్నాం. కాబట్టే ఆయనకిష్టమైన పనులే చేయాలి.

22. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.

ఫిలేమోను, ఇంకా ఇతరుల ప్రార్థనలవల్ల తాను ఖైదునుంచి విడుదల పొందగలడని పౌలు అనుకుంటున్నాడు. అపో. కార్యములు 12:5-11 పోల్చి చూడండి.

23. క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,

24. నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.

“మార్కు”– 2 తిమోతికి 4:11. “అరిస్తార్కస్”– కొలొస్సయులకు 4:10. “దేమాస్, లూకా”– కొలొస్సయులకు 4:14.

25. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్‌.Shortcut Links
ఫిలేమోనుకు - Philemon : 1 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |