Hebrews - హెబ్రీయులకు 2 | View All

1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.

ఈ లేఖలో బహు కఠినమైన ఐదు హెచ్చరికలు ఉన్నాయి. ఇది మొదటిది. మిగతావి హెబ్రీయులకు 3:7-19; హెబ్రీయులకు 6:1-8; హెబ్రీయులకు 10:26-31; హెబ్రీయులకు 12:25-29. ఈ హెచ్చరికలు వేటి గురించి అంటే, శుభవార్తను తేలికగా తీసుకోవడం (హెబ్రీయులకు 2:3), అపనమ్మకం (హెబ్రీయులకు 3:12, హెబ్రీయులకు 3:19), దారి తొలగిపోవడం (హెబ్రీయులకు 6:6), తెలిసి తెలిసి పాపంలోనే కొనసాగడం (హెబ్రీయులకు 10:26), దేవుణ్ణీ ఆయన వెల్లడించిన సత్యాన్నీ నిరాకరించడం (హెబ్రీయులకు 12:25). ఈ అయిదింటినీ ఒక్క మాటలో చెప్పవచ్చు – భ్రష్టత్వం, విశ్వాస విషయంలో భ్రష్టత్వం, నమ్మకద్రోహం. ఈ సందర్భంలో భ్రష్టత్వమంటే దేవుడు వెల్లడి చేసిన సత్యానికి లోబడుతున్నామని చెప్పినతరువాత దాన్ని పూర్తిగా నిరాకరించి దానికి వీపు చూపి దూరం తొలగిపోవడం.

2. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా

“దేవదూతల చేత...పలికించిన వాక్కు”– ఇది మోషే ద్వారా సీనాయి కొండ దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం (నిర్గమ 19 అధ్యాయం; మొ।।). ఆ సమయంలో దేవదూతల గురించి చెప్పినది ఏమీ లేదు గానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చేందుకు దేవుడు దేవదూతలను వాడుకున్నాడని యూదులు నమ్మారు. గలతియులకు 3:9 ఈ నమ్మకాన్ని స్థిరపరుస్తున్నది. అపో. కార్యములు 7:53 కూడా చూడండి. “స్థిరంగా ఉండడం”– దేవదూతలు పలికినది దేవుని ధర్మశాస్త్రం. దానికి లోబడాలని దేవుడు శాసించాడు (నిర్గమకాండము 19:5; లేవీయకాండము 18:1-5; ద్వితీయోపదేశకాండము 6:1-3; ద్వితీయోపదేశకాండము 32:45-47). అవిధేయతను ఆయన శిక్షించాడు (లేవీయకాండము 26:14-39; ద్వితీయోపదేశకాండము 28:15-68; 2 రాజులు 17:7-20).

3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

“ఇంత గొప్ప”– దేవుని పాపవిముక్తి, రక్షణ అన్నది దాని కర్త విషయంలో, అందులోని నిశ్చయత విషయంలో, రక్షించగలిగిన బలప్రభావాల విషయంలో, అందులో వెల్లడైన ప్రేమ, కృప విషయంలో, దాని ఫలితాల విషయంలో ఎంతో గొప్పది. “ముక్తి”– అంటే దేవుడు క్రీస్తుద్వారా సిద్ధం చేసిన రక్షణ, పాపవిముక్తి (రోమీయులకు 1:16). రచయిత ఇక్కడ చెపుతున్నది ఇది – తన కుమారుని ద్వారా దేవుడు వెల్లడించినది (అంటే శుభవార్త, క్రొత్త ఒడంబడిక) ఆయన తన దేవదూతలద్వారా వెల్లడించిన దానికన్నా (ధర్మశాస్త్రం) గొప్పది. దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినవారు తప్పించుకోలేకపోయారు. క్రీస్తు శుభవార్తను నిర్లక్ష్యం చేసేవారి గతి కూడా ఇంతే. శుభవార్తలో దేవుని ప్రేమ, కృప వెల్లడి అయ్యాయి. అది మనుషులకు రక్షణ మార్గం. కానీ శుభవార్త విని కూడా దాన్ని తేలికగా తీసుకునేవారు శిక్షనుంచి తప్పించుకోగలరని కాదు. నిజానికి వారికి వచ్చే శిక్ష మరింత ఖాయం, మరింత భయంకరం. ఎందుకంటే వారు తేలికగా తీసుకున్నది అంతకు ముందు వెల్లడైన ఏ సందేశం కంటే కూడా గొప్పది. దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కోవాలంటే మనిషి తీవ్రంగా ఎదురు తిరిగి శుభవార్తను వ్యతిరేకించనవసరం లేదు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకుండా ఊరుకుంటే చాలు. “ప్రభువు తానే”– ఈ శుభవార్తను మొదట ప్రకటించినది స్వయంగా యేసుప్రభువే (మార్కు 1:14-15; లూకా 4:18-21). దాని గొప్ప ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకు రచయిత ఇలా చెప్తున్నాడు. “మనకు”– ఈ మాటవల్ల ఈ లేఖ రాసినది పౌలు అనుకోవడానికి వీలు లేకుండా పోయినట్టుంది. (గలతియులకు 1:11-12, గలతియులకు 1:15-17; గలతియులకు 2:6). “రూఢి చేశారు”– క్రీస్తు రాయబారులు ఆయన నేర్పించిన దానంతటినీ రూఢి చేశారు.

4. దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

“దేవుడు కూడా”– మహా అద్భుతాల మూలంగా తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని శుభవార్తను రూఢి చేశాడు – మత్తయి 28:6 (రోమీయులకు 1:4); మార్కు 16:20; అపో. కార్యములు 2:43; అపో. కార్యములు 5:12-16; మొ।।. “పవిత్రాత్మ ఉచిత వరాలు”– పవిత్రాత్మ విశ్వాసులకు ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇవ్వడం కూడా దేవుడు శుభవార్త పక్షంగా చెప్తున్న సాక్ష్యంలో ఒక భాగమే (1 కోరింథీయులకు 12:7-11). మనుషులకు శుభవార్తను తయారు చేసి అందించడానికీ, అది సత్యమని తిరుగులేని సాక్ష్యాధారాలూ రుజువులూ చూపించడానికీ త్రిత్వమంతా పని చేశారు (త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16-17; మొ।।).

5. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.

1వ అధ్యాయంలోని సంగతి గురించి రచయిత తిరిగి చెపుతున్నాడు – క్రీస్తు దేవదూతలకన్న పైవాడు (వ 5,7,9). సత్యం గురించి పూర్తి జ్ఞానం లేనివారు ఇందుకు అభ్యంతరం చెప్పవచ్చునని అతనికి తెలుసు. వారనవచ్చు “క్రీస్తు దేవదూతలకన్న పైవాడైతే ఆయన దేవదూతలకన్న తక్కువైన మనిషి కావడమెలా? దేవదూతలకన్న పైవాడెవరైనా విషమ పరీక్షలకూ బాధలకూ మరణానికీ గురి అయిన మాట ఏమిటి.” సిలువపై క్రీస్తు మరణం అనేకమంది యూదులకు అభ్యంతర కారణం అయింది – 1 కోరింథీయులకు 1:23. అంతేగాక ఆయన దేవుని అవతారమన్న సత్యాన్ని చాలామంది ఒప్పుకోలేదు – యోహాను 5:17-18; యోహాను 10:31-33. ఈ వచనాల్లో రెండు ముఖ్యమైన అంశాలను చెప్పడం ద్వారా రచయిత ఇలాంటి అభ్యంతరాలకు జవాబిస్తున్నాడు. క్రీస్తు దేవదూతలకంటే తక్కువవాడుగా చేయబడినది కొద్ది కాలానికి మాత్రమే (వ 9). క్రీస్తు మనిషిగా, దేవదూతలకంటే తక్కువవాడుగా కావడం ఆయన మనుషులకు రక్షకుడు అయ్యేందుకు అవసరం, తగినది (వ 10,14,17). “రాబోయే లోకాన్ని”– మత్తయి 25:31, మత్తయి 25:34; అపో. కార్యములు 3:21; రోమీయులకు 8:18-23; యెషయా 11 అధ్యాయం; ప్రకటన 20—22 అధ్యాయాలు

6. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?
కీర్తనల గ్రంథము 8:4-6

“రాబోయే లోకానికి పరిపాలకులుగా దేవుడు విశ్వాసులను చేస్తాడనీ దేవదూతలను కాదనీ చూపించేందుకు రచయిత కీర్తనల గ్రంథము 8:4-6 లోని వచనాలను ఉదహరిస్తున్నాడు. మత్తయి 19:28; మత్తయి 24:46-47; మత్తయి 25:21; లూకా 19:17; 2 తిమోతికి 2:12; ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 20:6; ప్రకటన గ్రంథం 22:5 కూడా చూడండి.

7. నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.

“కొంత కాలం పాటు”– వ 8 – ఇదింకా పూర్తిగా నెరవేరలేదు. మానవాళికోసం దేవుడు నిర్ణయించిన ఉద్దేశమంతా ఆదికాండము 1:26 లో ఉన్నది మాత్రమే కాదు.

8. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికిలోపరచబడుట ఇంకను చూడ లేదుగాని

9. దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు,దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము

రాబోయే లోకంపై మనిషి అధికారం యేసుప్రభువు ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఆయన మానవాళికి ప్రతినిధి, “చివరి ఆదాము” (1 కోరింథీయులకు 15:45-47), రాబోయే లోకాన్ని ఏలే విముక్తులైన మనుషుల నాయకుడు. మనుషులను దేవదూతలకంటే ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించగోరాడు. అందుకనే ఆయన దేవదూతలను సృష్టించినవాడు అయినప్పటికీ వారికన్నా తక్కువవాడుగా అయ్యాడు – అంటే మానవుడయ్యాడు (యోహాను 1:14; ఫిలిప్పీయులకు 2:5-8). ఆయన అవతారంలో ఉద్దేశం మరణించడం. మరణ బాధలు అనుభవించడమంటే చనిపోవడమే. రాబోయే లోకాన్ని మనుషులు ఏలాలని దేవుని ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశం నెరవేరడానికి గొప్ప ఆటంకం ఒకటుంది. మనుషులంతా పాపులు. వారి పాపానికి శిక్షగా మరణానికి లోనైనవారు (ఆదికాండము 2:17; రోమీయులకు 5:12; రోమీయులకు 6:23). “ప్రతి ఒక్కరి కోసమూ” యేసు ప్రభువు చనిపోయాడు – 2 కోరింథీయులకు 5:14-15; 1 తిమోతికి 2:6; 1 యోహాను 2:2. ఇది “దేవుని అనుగ్రహం వల్ల”. మానవాళికి ఇది దేవుడు ఉచితంగా ఇచ్చేది – యోహాను 3:16; రోమీయులకు 5:8. యేసు మనసారా తనను మరణానికి అప్పగించుకొన్నాడు (యోహాను 10:17-18), కాబట్టి దేవుడాయన్ను ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించాడు – హెబ్రీయులకు 1:3; ఫిలిప్పీయులకు 2:9-11.

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

“అనేకమంది కుమారులను...తేవడం”– దేవుడు మనుషుల మధ్య చేసిన, చేస్తున్న దానంతటిలో ఆయన ఉద్దేశం ఇదే. యోహాను 17:22, యోహాను 17:24; రోమీయులకు 5:2; రోమీయులకు 8:18, రోమీయులకు 8:28-30; రోమీయులకు 9:23; 2 కోరింథీయులకు 4:17; ఎఫెసీయులకు 1:18. “విముక్తికర్త”– యేసుప్రభువు – హెబ్రీయులకు 12:2. దేవుడు వారికోసం సిద్ధం చేసిన మహిమను పొందేందుకు వారు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన స్థిరం చేశాడు. దేవుడు క్రీస్తును “పరిపూర్ణుణ్ణి” చేశాడు అనడంలో ఆయన బాధలు అనుభవించకముందు ఆయన స్వభావంలో, గుణాల్లో ఏదో లోపం ఉన్నదని కాదు. మనుషులకు తగినట్టు పరిపూర్ణ విముక్తిదాతగా రక్షకుడుగా ఉండేలా దేవుడు ఆయన్ను బాధల మూలంగా తయారు చేశాడు అని అర్థం – హెబ్రీయులకు 5:7-9; హెబ్రీయులకు 7:28. ఆయన బాధలు వారి పాపాన్ని, దోషాన్ని తీసివేయడం మాత్రమే కాదు (హెబ్రీయులకు 7:27; హెబ్రీయులకు 9:28; హెబ్రీయులకు 13:12; 1 పేతురు 3:18), తన ప్రజల బాధల్లో, విషమ పరీక్షల్లో వారిపట్ల సంపూర్ణమైన సానుభూతి చూపగలిగేందుకు ఆయనకు అవి సహాయపడ్డాయి (వ 18; హెబ్రీయులకు 4:15-16).

11. పరిశుద్ధ పరచువారి కిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
కీర్తనల గ్రంథము 22:22

దేవుడు మహిమలోకి తీసుకు వస్తున్న వారితో యేసుప్రభువు కలిసిపోయి వారిలో ఒకడైనట్టు మెలిగాడు. “పవిత్రపరిచేవాడు”– క్రీస్తు – హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14; హెబ్రీయులకు 13:12. పవిత్రత గురించి నోట్స్ లేవీయకాండము 20:7;యోహాను 17:17-19. పవిత్రపరచబడ్డవారు అంటే ఆయనలో నమ్మకం ఉంచి, పాపంనుంచి రక్షించేవాడుగా, మహిమకు నడిపించేవాడుగా ఆయన్ను స్వీకరించినవారన్నమాట. ఆయన, వారు ఒక కుటుంబానికే చెందినవారు, ఒకే దేవునికి చెందినవారు. ఆయన మనిషిగా జన్మించిన దేవకుమారుడు. వారేమో కొత్త ఆధ్యాత్మిక జన్మద్వారా దేవుని సంతానం అయినవారు – యోహాను 1:12-13; యోహాను 3:3-8. దేవుడు క్రీస్తుకు తండ్రి, క్రీస్తులో నమ్మకం ఉంచే వారందరికీ తండ్రి – యోహాను 20:17. మహిమగల ప్రభువూ, అన్నిటికీ వారసుడూ అయిన క్రీస్తు విశ్వాసులను తన “సోదరులు” అని పిలవడానికి సిగ్గుపడడు. వారు పేదలు, బలహీనులు, తెలివితక్కువవారు అయినప్పటికీ ఆయన వారిని ప్రియ సోదరులని పిలుస్తాడు.

12. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.
కీర్తనల గ్రంథము 22:22

యేసుప్రభువు, ఆయన విశ్వాసులు కూడా మానవ స్వభావంలోను, దేవునితో వారికి గల సంబంధంలోనూ భాగస్వాములని నిరూపించేందుకు రచయిత కీర్తనల గ్రంథము 22:22; యెషయా 8:17-18 ఉదహరిస్తున్నాడు.

13. మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
2 సమూయేలు 22:3, యెషయా 8:17, యెషయా 8:18, యెషయా 12:2

14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
ఆదికాండము 3:15

“పిల్లలకు”– అంటే వ 10లో ఉన్న “అనేకమంది కుమారులు”. వారంతా మనుషులే. అందువల్ల క్రీస్తు కూడా రక్త మాంసాలు గల మానవుడయ్యాడు – మత్తయి 1:20-21; లూకా 2:5-7; లూకా 24:49; యోహాను 1:14; యోహాను 6:53-58. ఇందులో ఆయన ఉద్దేశం మూడు విధాలుగా ఉంది. మరణించడం (మత్తయి 16:21; మత్తయి 20:28; యోహాను 10:17-18). మరణించడం ద్వారా సైతానును నాశనం చేయడం, తన ప్రజలను విడిపించడం. అపనింద పిశాచం గురించి మత్తయి 4:1-10 నోట్స్ చూడండి. సైతాను మరణశక్తి గలవాడు. ఆదామునూ హవనూ పాపంలో పడవేయడం ద్వారా మరణాన్ని ఈ లోకంలోకి తెచ్చాడు – ఆది 3వ అధ్యాయం. వాడు పాప మరణ రాజ్యాన్ని ఏలుతూ మనుషులను చెరపట్టుతూ ఉన్నాడు (2 తిమోతికి 2:26), వారున్న ఆత్మసంబంధమైన మరణ స్థితినుంచి వారు తప్పించుకోకుండా అడ్డగిస్తున్నాడు. అంతేగాక చంపేందుకు కూడా వాడికి అధికారం ఉన్నట్టుంది – యోబు 2:6. క్రీస్తు మనిషి స్థానంలో చనిపోవడంద్వారా వారికి పాపక్షమాపణ, ఆధ్యాత్మిక జీవం కలిగేందుకూ, వారు మరణంనుంచి పూర్తిగా తప్పించేందుకూ మార్గం సిద్ధం చేశాడు – యోహాను 5:24; యోహాను 11:25-26; 1 కోరింథీయులకు 15:54, 1 కోరింథీయులకు 15:57; 2 తిమోతికి 1:10. ఇందులో సైతానును కూలద్రోసి తగిన సమయంలో వాణ్ణీ, వాడి రాజ్యాన్నీ నాశనం చెయ్యడం అనేవి ఉన్నాయి – యోహాను 12:31; ప్రకటన గ్రంథం 20:10, ప్రకటన గ్రంథం 20:14-15. సైతాను మనుషులను దాస్యంలో ఉంచుకొనేందుకు ఉపయోగించే ఒక విధానం “మరణ భయం” అని గమనించండి. ఈ భయం మూలంగా మనుషులు మామూలు పరిస్థితుల్లో చేయదలచని నానా రకాలైన పనులను సైతాను చెప్పగా చేస్తుంటారు. మరణ భయం అంటే కేవలం చనిపోవడానికి భయపడడం మాత్రమే కాదు. మరణం తరువాత ఏం జరగుతుందోనన్న భయం కూడా ఇందులో ఉంది. ఇది మనుషులను అబద్ధ మతానికి బానిసలుగా చేస్తుంది. సైతాను చెప్పినట్టు చేయడం వల్ల మరణం తరువాత తమ స్థితి బాగుంటుందనుకుంటే మనుషులు ఏ పనైనా చేయవచ్చు. క్రీస్తు తన విశ్వాసులను మరణ భయం నుంచీ ఇతర దాస్యాలన్నిటినుంచీ విడుదల చేస్తాడు – యోహాను 8:32, యోహాను 8:36; రోమీయులకు 6:18; రోమీయులకు 8:2, రోమీయులకు 8:15, రోమీయులకు 8:21; 2 కోరింథీయులకు 5:6-8; ఫిలిప్పీయులకు 1:21-23.

15. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

16. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
యెషయా 41:8-9

“సంతానాన్నే”– క్రీస్తు మనుషులకు సహాయం చేసేందుకు మానవుడయ్యాడు, దేవదూత కాలేదు. అబ్రాహాము సంతానం అంటే క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులూ (అక్షరాలా అతని సంతానం), అబ్రాహాము దేవుణ్ణి నమ్మిన రీతిగానే ఆయన్ను నమ్మినవారు (అతని ఆధ్యాత్మిక సంతానం) – రోమీయులకు 4:11-12, రోమీయులకు 4:16-17; గలతియులకు 3:7-9.

17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

“తన సోదరుల లాంటివాణ్ణిగా”– అంటే యేసు పాపి అని గానీ వారిలాగా భ్రష్ట స్వభావం ఉన్నవాడని గానీ అర్థం కాదు. హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; లూకా 1:35; యోహాను 8:46; 2 కోరింథీయులకు 5:21; 1 పేతురు 2:22 చూడండి. అంతేగాక మనిషిగా ఉన్న స్థితిలో ఆయన దేవుడు కాకుండా పోయాడని కాదు – హెబ్రీయులకు 1:6, హెబ్రీయులకు 1:8. దీని అర్థం ఆయనకు నిజమైన రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం ఉన్నాయి (వ 14); నిజమైన బాధలు, విషమ పరీక్షలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది (వ 18). ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. విమోచన కార్యం నెరవేర్చడం, తన ప్రజలకు ప్రముఖ యాజి కావడం. విమోచన, లేక ప్రాయశ్చిత్తం గురించి నిర్గమకాండము 29:33; నిర్గమకాండము 25:17; రోమీయులకు 3:25-26s చూడండి. “ప్రముఖయాజి”– రచయిత ఈ లేఖలోని గొప్ప అంశాలలో ఒకదాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు (హెబ్రీయులకు 3:1; హెబ్రీయులకు 4:14; హెబ్రీయులకు 5:10; హెబ్రీయులకు 6:20; హెబ్రీయులకు 7:26; హెబ్రీయులకు 8:1; హెబ్రీయులకు 9:11; హెబ్రీయులకు 10:21). బైబిల్లో యాజి అంటే తన ప్రజలకోసం దేవునికి బలులు అర్పించేవాడు, దేవుని సన్నిధి గుడారం, లేదా దేవాలయం పనులు చూచుకొనేవాడు, దేవుని ఎదుట తన ప్రజలకు ప్రతినిధిగా ఉండేవాడు. నిర్గమకాండము 28:1 నోట్. ప్రముఖయాజి అంటే యాజులందరికీ నాయకుడు. అతడొక్కడు మాత్రమే చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయి – హెబ్రీయులకు 5:1-3; హెబ్రీయులకు 9:7. నిర్గమ 16వ అధ్యాయం చూడండి. దేవుడిప్పుడు పాత ఒడంబడిక యాజి ధర్మాన్ని రద్దు చేశాడు (మరి ఏ ఇతర మత వ్యవస్థలోనూ ఎలాంటి యాజి ధర్మాన్నీ దేవుడు నియమించలేదు). పరలోకంలో ఉన్న క్రీస్తే ఏకైక ప్రముఖ యాజి. ఆయన విశ్వాసులు మాత్రమే భూమిపై దేవునికి అంగీకారం అయిన యాజులు – 1 పేతురు 2:5, 1 పేతురు 2:8; ప్రకటన గ్రంథం 1:6. క్రీస్తు కరుణ గల, నమ్మకస్థుడైన ప్రముఖయాజి – మనుషులపట్ల కరుణ చూపుతాడు, తన సేవంతటిలో దేవునికి నమ్మకమైనవాడు.

18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.

హెబ్రీయులకు 4:15; మత్తయి 4:1-10. యేసుకు విషమ పరీక్షల వాడిగల బాణాలు గుచ్చుకున్నాయి. తన స్వార్థాన్నే చూచుకోవాలనీ సిలువ మరణంనుంచి తప్పించుకోవాలనీ తప్పులు చేయాలనీ సైతాను ఇచ్చిన సలహాల మూలంగా బాధ అనుభవించాడు. అదంతా ఆయన అనుభవించాడు కాబట్టి సైతాను విధానాలు ఆయనకు తెలుసు. మానవ హృదయం పైకి అవి ఎలా దూసుకు వస్తాయో తెలుసు. వాటిని ఎదుర్కొంటున్న తన ప్రజలపట్ల ఆయన సానుభూతి చూపగలడు. విషమ పరీక్ష, లేక దుష్ట ప్రేరేపణ గురించి మత్తయి 6:13; 1 కోరింథీయులకు 10:13 కూడా చూడండి.Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |