ఈ వచనాలను కూడా అర్థం చేసుకోవడం కష్టమే. దీన్ని గురించి బైబిలు పండితుల మధ్య పెద్ద అభిప్రాయ భేదాలున్నాయి. ఈ వచనాలకు ముఖ్యంగా నాలుగు రకాలైన వివరణలు ఉన్నాయి.
మొదటిది – క్రీస్తులోని నిజ విశ్వాసులను ఈ వచనాలు వర్ణిస్తున్నాయి; వారు క్రీస్తునుంచి పెడదారి పట్టి తమ రక్షణను పోగొట్టుకుని నాశనం అయ్యే అవకాశం ఉంది.
రెండోది – ఇవి విశ్వాసులను వర్ణిస్తున్నాయి గానీ వారు గనుక పెడదారి పడితే తమ రక్షణను పోగొట్టుకోరు; నమ్మకమైన సేవకు లభించవలసిన బహుమానాలను మాత్రమే కోల్పోతారు.
మూడోది – ఈ వచనాలు నిజ విశ్వాసులను వర్ణిస్తున్నాయి. వారు పెడదారి పట్టే ప్రమాదం వాస్తవంగా ఉంది కాబట్టి దాన్ని గురించి ఇది వారికి హెచ్చరిక; కానీ ఆ ప్రమాదం ఉన్నా నిజానికి వారు పెడదారి పట్టరు.
నాలుగోది – ఈ వచనాలు అసలు నిజ విశ్వాసుల గురించి రాసినది కాదు. ఇక్కడ రాసిన విషయాలు విశ్వాసుల విషయంలో వాస్తవాలే కానీ నిజంగా విశ్వాసులు కానివారిలో కూడా ఇవి కనిపించవచ్చు.
ఈ నోట్స్ రచయిత మొదటి రెండు వివరణలను నిరాకరిస్తున్నాడు. క్రీస్తులో నిజ విశ్వాసులు ఎప్పుడూ పెడదారి పట్టరనీ భ్రష్టత్వంతో సంబంధం ఉన్న ఇతర పాపాలు (హెబ్రీయులకు 2:1-4 నోట్) చేయరనీ బైబిలు స్పష్టంగా నేర్పిస్తున్నదని ఈ రచయిత గట్టి నమ్మకం. హెబ్రీయులకు 10:39; యోహాను 10:27; 1 యోహాను 3:9; 1 యోహాను 5:18 చూడండి. యోహాను 5:24; యోహాను 6:37-40; యోహాను 10:27-29; యోహాను 17:11-12; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:28-39; ఫిలిప్పీయులకు 1:6; 1 పేతురు 1:5 కూడా పోల్చి చూడండి. అర్థం స్పష్టంగా లేని కష్టమైన వచనాలను బట్టి (ఇక్కడున్న వచనాల్లాంటివన్నమాట) స్పష్టంగా ఉన్న వేరే వచనాలను ఎప్పుడూ త్రోసిపుచ్చకూడదు. హీబ్రూ లేఖలోని ఈ వచనాలు క్రీస్తులో నిజ విశ్వాసులు పెడదారి పట్టి పాపవిముక్తిని, రక్షణను పోగొట్టుకుంటారని స్పష్టంగా చెప్పడం లేదు. నిజానికి ఈ వచనాల్లో క్రీస్తుపట్ల నమ్మకం అనే మాటలు అసలు కనిపించడం లేదు.
పైన ఇచ్చిన మూడో వివరణ కొత్త ఒడంబడిక ఉపదేశాలతో ఎక్కువగా ఏకీభవిస్తున్నట్టుంది. విశ్వాసులను దారి తప్పించాలని సైతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి ప్రమాదం వారికోసం వాస్తవంగా పొంచి ఉంది. కానీ అలాంటి ప్రమాదం పొంచి ఉండడమంటే నిజంగా అలా దారి తప్పుతారని అర్థం కాదు. దేవుని వాక్కు లేకపోతే, వారిని కాపాడే దేవుని ప్రభావం లేకపోతే, వారికోసం క్రీస్తు ప్రార్థనలు లేకపోతే (లూకా 22:31-32; యోహాను 17:11-12 పోల్చి చూడండి), ఒకవేళ వారు దారి తప్పిపోతారేమో. కానీ ఇవన్నీ ఉన్నాయి గనుక వారు విశ్వాస విషయమైన భ్రష్టత్వంలో పడకుండా ఉంటారు. భ్రష్టత్వం గురించిన హెచ్చరికలే అలాంటి ప్రమాదం దాపురించినప్పుడు విశ్వాసులు జాగ్రత్తగా ఉండేందుకు మరో సహాయం.
అయితే పైన ఇచ్చిన నాలుగో వివరణ బహుశా సత్యమైనది కావచ్చు. వ 4-6 బహుశా సత్యం తెలిసి, దాని ప్రభావానికి లోనై, దేవుని రాజ్యానికి అతి సమీపంగా వచ్చి కూడా అక్షరాలా అందులోకి ప్రవేశించనివారిని వర్ణిస్తూ ఉండవచ్చు. దేవుని సంతానం కాకుండా కేవలం అలా చెప్పుకునేవారు కొంత కాలం నిజంగా దేవుని సంతానంగానే కనిపించవచ్చు (మత్తయి 13:18-23, మత్తయి 13:24-30; మత్తయి 25:1-12; 2 కోరింథీయులకు 11:14-15). వ 4-6లో చెప్పిన విషయాలన్నీ కూడా విశ్వాసుల విషయంలో వాస్తవమే. అయితే విశ్వాసులు కాకుండా అలా కనిపించేవారి విషయంలో కూడా అవి వాస్తవం కావచ్చు.
“మనోనేత్రాలు వెలుగొంది”– సత్యం తెలిసిన వారి వర్ణన ఇది. హెబ్రీయులకు 10:26 పోల్చి చూడండి. క్రీస్తు వెలుగు వారిపై ప్రసరించింది. అంతమాత్రాన వారు ఆయనపై నమ్మకం పెట్టుకొని “వెలుగు సంతానం” (యోహాను 12:35-36) అయ్యారని అనుకోనవసరం లేదు. పశ్చాత్తాపపడకుండా, రక్షణ కోసం క్రీస్తును నమ్మకుండా మనుషులు ఊరికే సత్యాన్ని తెలుసుకొని ఉండడం సాధ్యమే.
“పరలోక వరాన్ని రుచి చూచి”– వారు పరలోక వరాన్ని పొందారు అనే అర్థాన్ని ఈ మాటలు ఇవ్వనవసరం లేదు. వారు దాన్ని తినలేదు అని చెప్పేందుకు రచయిత “రుచి చూచి” అనే మాటలు వాడి ఉండవచ్చు (యోహాను 6:57). సంఖ్యాకాండము 13:23, సంఖ్యాకాండము 13:26 పోల్చి చూడండి. అపనమ్మకం చేత కనానులో ప్రవేశించలేకపోయిన ఇస్రాయేల్వారు కనానులో పండిన పండ్లు కొన్నిటిని రుచి చూడగలిగారు.
“పవిత్రాత్మలో పాల్గొని”– “పవిత్రాత్మ పొంది” అని రాయలేదు రచయిత. పాల్గొని అనే పదానికి పొందడమనే అర్థం రావచ్చు, రాకపోవచ్చు. పవిత్రాత్మలో పాల్గొనే వివిధ విధానాలు ఉన్నాయి. భ్రష్టుడైన బిలాము పాల్గొన్నాడు (సంఖ్యాకాండము 24:2), భ్రష్టుడైన ఇస్కరియోతు యూదా పాల్గొన్నట్టు ఉన్నాడు (మత్తయి 10:1; యోహాను 6:70-71). అపో. కార్యములు 8:9-24 లోని సీమోను దీనికి ఒక ఉదాహరణ కావచ్చు. ఇక్కడ “పాల్గొనడం” అంటే బహుశా పవిత్రాత్మ ప్రభావంతో పనులు జరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో ఉండడం, పవిత్రాత్మ ద్వారా ఒప్పించబడడం (యోహాను 16:8-11), ఆయన మూలంగా పశ్చాత్తాపం దరిదాపులకూ, దేవుని రాజ్య అంచుల వరకూ రావడం అని అర్థం కావచ్చు.