James - యాకోబు 1 | View All

1. దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.

“చెదిరి...గోత్రాలకు”– ఇస్రాయేల్ జాతిలో పన్నెండు గోత్రాలున్నాయి. యూద ప్రజలకు “పన్నెండు గోత్రాలు” అనేది మరొక పేరు అయింది. కానీ యాకోబు ఈ లేఖ రాసినది క్రైస్తవులకు (యాకోబు 2:1). కాబట్టి ఇస్రాయేల్ బయట ఉన్న దేశాల్లో ప్రాంతాల్లో క్రైస్తవులుగా మారిన యూదులకు యాకోబు ఈ లేఖ రాశాడని చెప్పవచ్చు. “యాకోబు”– క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ పేరుతో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు (మత్తయి 10:2-3; మార్కు 15:40; లూకా 6:16; మత్తయి 13:58). ముందునుంచీ అందరూ అంగీకరించినదాని ప్రకారం యేసు క్రీస్తు సవతి తమ్ముడైన యాకోబు ఈ లేఖ రాశాడు. క్రీస్తు జీవిత కాలంలో యాకోబు గానీ అతని అన్నదమ్ములెవరూ గానీ యేసు అభిషిక్తుడనీ దేవుని కుమారుడనీ నమ్మలేదు. కానీ క్రీస్తు మరణం, పునర్జీవితం తరువాత వారు విశ్వాసులయ్యారు (అపో. కార్యములు 1:14). తరువాతి కాలంలో యాకోబు జెరుసలం క్రైస్తవ సంఘానికి నాయకుడయ్యాడు (అపో. కార్యములు 12:17; అపో. కార్యములు 15:13; గలతియులకు 1:9). “ప్రభువైన”– లూకా 2:11; 1 కోరింథీయులకు 8:6; ఫిలిప్పీయులకు 2:10-11 చూడండి.

2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

విషమ పరీక్షలు ఉన్నవి ఉన్నట్టు చూస్తే ఆనందంగా ఉండవు. కానీ అవి తీసుకువచ్చే మంచి ఫలితాల మూలంగా విశ్వాసులు ఆనందించవచ్చు – యోహాను 16:33; రోమీయులకు 5:3-5; 2 కోరింథీయులకు 8:2. 1 పేతురు 1:6-7 పోల్చి చూడండి. విషమ పరీక్షలు దుఃఖం కలిగిస్తాయి గానీ మనల్ని మరింత మంచివారుగా, మరింత ఆధ్యాత్మికంగా, నమ్మకంలో మరింత బలవంతులుగా చేసేందుకు దేవుడు అవలంబించే విధానం అదే. కీర్తనల గ్రంథము 66:10-12 చూడండి. విశ్వాసులు సంపూర్ణ వృద్ధికి రావాలనీ, సంపూర్ణ స్థాయి అందుకోవాలనీ దేవుని కోరిక – ఎఫెసీయులకు 4:13-15. అలా చేయడానికి ఆయన ఉపయోగించే మార్గాల్లో విషమ పరీక్షలను పంపించడం ఒకటి.

3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

“సహనం”– కొలొస్సయులకు 1:9-12; 2 థెస్సలొనీకయులకు 1:4; 2 తిమోతికి 2:12; 2 తిమోతికి 3:10; హెబ్రీయులకు 12:10; 1 పేతురు 2:20. సహనం అంటే యాకోబు ఉద్దేశం ఏది వచ్చినా భరించడం, ఓపికతో క్రీస్తుపై నమ్మకం పెట్టుకుని దేవుణ్ణే సేవిస్తూ ఉండడం. ఈ గుణం లేకుండా మనకు వచ్చే విషమ పరీక్షలు అవి చేయగలిగినంత మేలు చేయలేవు. ఆత్మ సంబంధమైన పసితనం నుంచి మనల్ని బయటకు తెచ్చి, దేవునికోసం జీవించడానికి మనల్ని మరింత సమర్థవంతులుగా చేసే దేని గురించైనా మనం ఆనందించాలి గదా.

4. మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
సామెతలు 2:3-6

మనం ఎదుర్కొనే విషమ పరీక్షలు, మన నమ్మకానికి శోధనలు కొన్ని సార్లు మనల్ని తికమకపెట్టి అయోమయ స్థితిలో పడవేస్తుంటాయి. మన స్వంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో, వాటిని మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేము. పరీక్షలనూ జీవితంలోని వివిధ పరిస్థితులనూ ఎలా ఎదుర్కోవాలో తెలిసేందుకు దేవునినుంచి జ్ఞానం మనకు అవసరం. దానికోసం దేవుణ్ణి అడుగుదాం. దాన్ని మనకు, ఇతరులకు కూడా ఇమ్మని వేడుకుందాం. దాన్ని ఇవ్వడం ఆయనకెంతో ఆనందం – కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:3; ఎఫెసీయులకు 1:17; 1 కోరింథీయులకు 1:31; 1 కోరింథీయులకు 2:6-10; దానియేలు 2:20-21; సామెతలు 1:20; సామెతలు 2:6; సామెతలు 8:1; కీర్తనల గ్రంథము 51:6; కీర్తనల గ్రంథము 111:10. ఈ జ్ఞానాన్ని యాకోబు 3:17 లో వర్ణిస్తున్నాడు. “ఇవ్వబడుతుంది”– అబద్ధమాడలేని దేవునినుంచి వచ్చిన వాగ్దానమిది (తీతుకు 1:2). “నిందించకుండా”– మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని విమర్శించడు. మనం అయోగ్యులమనీ లోపం లేని పద్ధతిలో ప్రార్థించలేమనీ మనల్ని తిరస్కరించడు. ఆయన ప్రేమ, కృపలపై ఆధారపడి ధైర్యంగా ఆయన సన్నిధికి రావచ్చు – హెబ్రీయులకు 4:15-16. “ధారాళంగా”– మత్తయి 7:9-11; 2 కోరింథీయులకు 9:8; ఫిలిప్పీయులకు 4:19; 1 తిమోతికి 6:17.

6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

“అనుమానమేమీ లేకుండా”– మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది ఇదే. హెబ్రీయులకు 11:6 చూడండి. నమ్మిక గల ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది (మార్కు 9:23; మార్కు 11:23-24). అపనమ్మకం దేవుణ్ణి అబద్ధికుడు అనడం వంటిదే (1 యోహాను 5:9-10). సందేహించడమంటే దేవుని గుణశీలాల్లో, వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య కొట్టుమిట్టాడడమే. సందేహించేవాడు దేవుని గురించీ ఆయన వాక్కు గురించీ తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు. అతనెప్పుడూ రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు. అతని ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరంగా ఉండవు. దేవుని సంకల్పం పట్ల అతనికున్న అంకిత భావం స్థిరంగా ఉండదు. అతనికి చపల హృదయం ఉండడమే అతనికున్న సందేహాలకు కారణం. కీర్తనల గ్రంథము 86:11 లో దావీదు ప్రార్థన చూడండి. యెహెఙ్కేలు 11:19 లో తన ప్రజలకు దేవుని వాగ్దానం చూడండి. విశ్వాసులంతా ఎప్పుడో ఒక సారి సందేహించే పరిస్థితికి గురి అవుతారు. ఈ దుష్‌ప్రేరణను మనం ఎదిరించాలి. దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండాలి – ఇందులో అబ్రాహాము మనకు గొప్ప ఆదర్శం – రోమీయులకు 4:18-21. మరి సందేహానికి మందేమిటి? దేవుని వాక్కే (రోమీయులకు 10:17), దేవుని వాగ్దానాలనూ ఆయన గుణశీలాలనూ ధ్యానిస్తూ ఉండడమే (కీర్తనల గ్రంథము 1:2-3), ఆయనకూ ఆయన సంకల్పానికీ పూర్తిగా కట్టుబడి ఉండడమే (రోమీయులకు 12:1-2).

7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.

9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.

“ఉన్నత స్థాయి”– దేవుడు క్రీస్తులో నమ్మకముంచిన పేదలనూ విద్యలేనివారినీ గొప్ప స్థితికి హెచ్చించాడు. వారిని ఆయన తన స్వంత పిల్లలుగా చేసుకుని వారిని ఒక దివ్యమైన భవిష్యత్తుకోసం ఎన్నుకొన్నాడు (యోహాను 1:12-13; రోమీయులకు 8:29-30; ఎఫెసీయులకు 2:6-7). క్రీస్తులో ధనికుడని పేదవాడని గానీ దాసుడని యజమాని అని గానీ విద్యావంతుడని విద్యలేనివాడని గానీ తేడా లేదు (1 కోరింథీయులకు 12:13; గలతియులకు 3:28; కొలొస్సయులకు 3:11). పేదవాడు దీన్ని గుర్తించి క్రీస్తులో తనకున్న ఉన్నత స్థితి గురించి గొప్ప ఆనందం, సంతృప్తి అనుభవించాలి.

10. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
కీర్తనల గ్రంథము 102:4, కీర్తనల గ్రంథము 102:11, యెషయా 40:6-7

“అగౌరవాన్ని”– విశ్వాసి అయిన ఒక ధనికుడికి క్రీస్తులో ఒక పేదవాడికున్న స్థితి ఉంది. కానీ క్రీస్తు మూలంగా అతడు (ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిగా) తన అల్పత్వం, మర్త్యత, బలహీనత గురించి అర్థం చేసుకోగలడు. ఉన్నత స్థితికి రావడానికి స్వార్థత్యాగమే దారి అని అతడు తెలుసుకోగలడు (మత్తయి 18:4; మత్తయి 23:12). తన భ్రష్టస్వభావాన్ని గురించి అతడు నేర్చుకున్నాడు. దేవుని కృప లేనిదే ఇప్పుడు గానీ రాబోయే కాలంలో గానీ తనకు మేలుకరమైనదేదీ కలగదనే గొప్ప సత్యం నేర్చుకున్నాడు. దీనంతటిలోనూ అతడు ఆనందం, సంతృప్తి అనుభవించాలి. దేవుని ఎదుట మనల్ని వినయంగల స్థితికి తెచ్చే దేన్ని బట్టి అయినా మనం ఆనందించాలి.

11. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
కీర్తనల గ్రంథము 102:4, కీర్తనల గ్రంథము 102:11, యెషయా 40:6-7

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

“ధన్యజీవి”– కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12. ఇప్పుడు, ఇకపైనా విశ్వాసుల మేలుకే విషమ పరీక్షలు పని చేస్తాయి – వ 2–4; 2 కోరింథీయులకు 4:17. “కిరీటం”– 1 కోరింథీయులకు 9:25; ఫిలిప్పీయులకు 4:1; ప్రకటన గ్రంథం 3:11; ప్రకటన గ్రంథం 4:10. జీవ కిరీటం గురించి ప్రకటన గ్రంథం 2:10 లో మళ్ళీ కనిపిస్తున్నది. అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచినవారికి జీవ కిరీటాన్నిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది. అదేమిటో ఆయన వర్ణించలేదు. “ప్రేమించేవారికి”– విషమ పరీక్షల్లో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి ఇదే (1 కోరింథీయులకు 13:6). ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మెరుగు పెడతాడు గానీ దుష్ట ప్రేరణ కలిగించడు (ఆదికాండము 22:1; కీర్తనల గ్రంథము 66:10-12). మత్తయి 6:13 లో జవాబివ్వడానికి దేవునికి బహు ఇష్టమైన ప్రార్థన ఉంది. “దుష్ట ప్రేరేపణ”– ఏ చెడుతనమూ, ఏ పాపమూ కూడా దేవునికి లేశమాత్రమైనా ఇష్టం లేదు. చెడుతనాన్నంతటినీ పూర్తిగా, శాశ్వతంగా ఆయన అసహ్యించుకుంటాడు – లేవీయకాండము 20:7; ద్వితీయోపదేశకాండము 12:31; కీర్తనల గ్రంథము 11:5; సామెతలు 6:16-19.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

దేవునిలాగా మనం స్వభావ సిద్ధంగా పవిత్రులం కాము. మన పాత స్వభావం భ్రష్టమైనది, చెడిపోయింది. అందుకే పాపమంటే మనకు ఆకర్షణీయంగా ఉండగలదు (గలతియులకు 5:16-17; రోమీయులకు 7:15-20; ఎఫెసీయులకు 4:22-24). సైతానుకు ఇది బాగా తెలుసు, కాబట్టి చెవులూరించే, ఆకర్షించే వాటిని మన ముందు ఉంచుతుంటాడు (1 థెస్సలొనీకయులకు 3:5). కానీ మనం ఆ ప్రేరణకు లొంగిపోతే పొరపాటు మనలోనే ఉంది.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

పాపానికి అంతిమ ఫలితం ఆత్మ మరణం. ఆదికాండము 2:17; రోమీయులకు 5:12; రోమీయులకు 8:6. పాప కార్యాలు కోరికల్లో నుంచే బయలుదేరుతాయి (ఆదికాండము 3:6; 2 పేతురు 1:4; 1 యోహాను 2:16). దేవుడిచ్చిన బలంతో విశ్వాసులు ఈ యుద్ధంలో పోరాడి, తమలోని కోరికలు తమను పాపంలోకి లాగకముందే విజయం సాధించాలి.

16. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.

17. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

దేవుడు ఇచ్చేవన్నీ కేవలం మంచివి, లోపం లేనివి. వాటిలో పాపం రంగు లేదు. అవి పాపానికి ప్రోత్సహించవు. మనుషులు దేవుడు ఇచ్చేవాటిని దుర్వినియోగం చేసి, వాటి సహాయంలో పాపానికి అవకాశాలు ఏర్పరచుకుంటే ఆ తప్పు మనుషులదే గాని దేవుని వరాల్లోది కాదు. “జ్యోతులకు కర్త”– ప్రతి విధమైన వెలుగునూ – అది భౌతికమైన వెలుగు గానీ ఆత్మ సంబంధమైన వెలుగు గానీ – సృష్టించినదీ, ఇచ్చేదీ దేవుడు (ఆదికాండము 1:3, ఆదికాండము 1:14-16; లూకా 1:78-79; యోహాను 1:4-5; యోహాను 3:19; 2 కోరింథీయులకు 4:6). “మార్పు”– సంఖ్యాకాండము 23:19; 1 సమూయేలు 15:29; మలాకీ 3:6; హెబ్రీయులకు 1:10-12; హెబ్రీయులకు 13:8. దేవుడు శాశ్వతంగా లోప రహితుడు. ఆయన అభివృద్ధి చెందవలసినదీ ఎదగవలసినదీ ఏమీ లేదు. ఆయన గుణశీలాలకు కలపవలసినదీ తీసివేయవలసినదీ ఏమీ లేదు.

18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

“తొలి పంట”– రోమీయులకు 11:16; 1 కోరింథీయులకు 15:20, 1 కోరింథీయులకు 15:23; ప్రకటన గ్రంథం 14:4. ఇంకా రావలసి ఉన్న గొప్ప పంట కూర్పుకు ఇప్పటి విశ్వాసులు తొలి పంట. “తన సత్యవాక్కు”– అంటే క్రీస్తు శుభవార్త. “జన్మం”– యోహాను 1:12-13; యోహాను 3:3-8; 1 పేతురు 1:23. ఇది పాపంనుండి మరణంనుండి మనలను తప్పించేందుకు దేవుడు అనుసరించిన పద్ధతి (వ 15).

19. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
ప్రసంగి 7:9

నూతన జన్మను గురించిన తలంపులనుంచి రచయిత ఆ అనుభవం మన జీవితాల్లో చూపవలసిన విషయాలకు వస్తున్నాడు. “వినడానికీ”– అంటే దేవుని వాక్కు వినడానికి. “మాట్లాడడానికీ”– యాకోబు 3:1-8; సామెతలు 10:19; సామెతలు 13:3; సామెతలు 17:28; సామెతలు 29:20; మత్తయి 12:36-37. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తప్పకుండా అనవసరమైన మాటలు, తప్పు మాటలు, లేక హాని చేసే మాటలు మాట్లాడతారు. వారు వినవలసినది వినలేకపోతారు. “కోపగించడానికి”– మత్తయి 5:22; ఎఫెసీయులకు 4:26; సామెతలు 16:32. మనిషి కోపం, ఆ మాటకొస్తే న్యాయమైన కోపం కూడా దేవుని నీతిన్యాయాలను సాధించదు. 2 తిమోతికి 2:24-25 పోల్చి చూడండి. నెమ్మది, సాధుగుణం ఎలాంటి కోపం కన్నా కూడా మరెంతో ప్రయోజనకరమైనది.

20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.

21. అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.

“విసర్జించి”– ఎఫెసీయులకు 4:22-32; ఎఫెసీయులకు 5:3-4; కొలొస్సయులకు 3:5-10. “నాటుకొన్న వాక్కును”– మత్తయి 13:3-9, మత్తయి 13:18-22. మన హృదయాల్లో చల్లిన దేవుని వాక్కు పంటకు రావాలంటే అణుకువతో నమ్మకంతో దాన్ని అంగీకరించాలి. దానికి లోబడి దాన్ని మనలో పని చేయనివ్వాలి. హృదయంలో దేవుని వాక్కుకు మనల్ని మార్చి రక్షించే శక్తి ఉంది.

22. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.

బైబిలు మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ప్రయోజనం లేదు. ఊరికే వినడంవల్ల మన దోషం ఎక్కువవుతుంది. విత్తనాలు చల్లేవాని ఉదాహరణలో నాలుగు రకాల మనుషులు వాక్కు విన్నారు (మత్తయి 13:19-20, మత్తయి 13:22-23). కానీ ఒక రకం మనుషులే ఫలించారు. యూదులు వాక్కును చదవడంలో వినడంలో కంఠస్థం చేయడంలో దిట్టలే గానీ తాము విన్నదాని ప్రకారం ప్రవర్తించడంలో అంత గట్టివారు కాదు (మత్తయి 23:3; అపో. కార్యములు 7:53; రోమీయులకు 2:17-24). మత్తయి 7:21-27 లో యేసుప్రభువు తన ఉపదేశానికి లోబడవలసిన అవసరతను నొక్కి చెప్పిన విషయం గమనించండి. క్రైస్తవులనబడిన వారనేకమంది వారి పాపవిముక్తి కోసం దేవుని వాక్కు చెప్పినదాన్ని చెయ్యలేదు కాబట్టి శాశ్వతంగా నశించిపోతారు. ఇంకా అనేకమంది దేవుని వాక్కు వారికి చెప్పినదాన్ని చెయ్యలేదు కాబట్టి తమ బహుమానాన్ని పోగొట్టుకుంటారు.

23. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.

“అద్దం”– బైబిలు అద్దం వంటింది. దానిలోకి తదేకంగా తరచి చూస్తే మనం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ దాని ప్రకారం మనం సరిదిద్దుకోకపోతే అది మనకేమీ మేలు చెయ్యదు. త్వరలోనే దాన్ని మర్చిపోతాం.

24. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా

25. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

మోషే ధర్మశాస్త్రం దాస్యాన్ని తెచ్చింది – అపో. కార్యములు 15:10; గలతియులకు 5:1. విశ్వాసులు ధర్మశాస్త్రం దాస్యం కింద లేరు – రోమీయులకు 6:14; రోమీయులకు 7:4. వారు క్రీస్తు నియమం కింద ఉన్నారు – 1 కోరింథీయులకు 9:21. అది కృప, ప్రేమల నియమం. ఈ నియమానికి లోబడితే అది స్వేచ్ఛ ఇస్తుంది – పాపం చేసేందుకు స్వేచ్ఛ కాదు, పాపం చేయకపోవడానికి స్వేచ్ఛ.

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
కీర్తనల గ్రంథము 34:13, కీర్తనల గ్రంథము 39:1, కీర్తనల గ్రంథము 141:3

వ 19; యాకోబు 3:2-12. ఏవైపు చూచినా తమ నాలుకలను అదుపు చేసుకోనివారు చాలామంది కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చాలామంది ఆత్మవంచన చేసుకొంటూ నిష్ప్రయోజనమైన ఆరాధన ఆచారాన్ని పాటిస్తున్నారన్నమాట.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

దేవుడు అన్ని రకాల ఆరాధనలనూ అంగీకరించడని మనం అర్థం చేసుకోవాలి – మత్తయి 15:8-9; కీర్తనల గ్రంథము 50:7-21; యెషయా 1:11-17. దేవుడు చూడగోరేది ప్రేమ, పవిత్రత మాటల్లో గాక, చర్యల రూపంలో కనిపించేది. దేవునికి బలహీనుల, నిస్సహాయుల, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది – నిర్గమకాండము 22:22; లేవీయకాండము 23:22; ద్వితీయోపదేశకాండము 10:18; ద్వితీయోపదేశకాండము 24:19; కీర్తనల గ్రంథము 146:9; యెషయా 1:17; ఇతర రిఫరెన్సులకు గలతియులకు 2:10 చూడండి. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనకు కూడా అలాంటి శ్రద్ధ ఉండాలి. ఇహలోక కల్మషాలను దేవుడు అసహ్యించుకుంటాడు. మన ఆరాధన ఆయనకు పూర్తిగా అంగీకారం కావాలంటే మనం కూడా అలా అసహ్యించుకోవాలి (రోమీయులకు 1:18; 2 కోరింథీయులకు 6:17; 2 కోరింథీయులకు 7:1; 1 పేతురు 1:15-16; యూదా 1:23).Shortcut Links
యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |