“ధైర్యం”– ఇస్రాయేల్ ప్రజలు కనానును వశపరచుకొన్న వైనంలో నేటి విశ్వాసులు నేర్చుకోవలసిన పాఠాలనేకం ఉన్నాయి. ఆ సమయంలోని సంభవాలు నేటి మన ఆధ్యాత్మిక జీవనానికి పోరాటాలకు సాదృశ్యాలు. ఈ క్రింది వాటిని గమనించండి –
(1) కనాను వాగ్దత్త దేశం. దేవుడు దాన్ని ఇస్రాయేల్ వారికి ఇచ్చాడు. ఇచ్చానని పదేపదే వారికి చెప్తూవున్నాడు. అది వారి వారసత్వం. దానిపై హక్కు వారిదే. ఇప్పుడు క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి దేవుడు ఒక అమూల్యమైన దానిని ఇచ్చాడు – క్రీస్తులో జీవం, దానికి చెందిన అనేక వాగ్దానాలు (2 పేతురు 1:4). క్రీస్తులో వారికి ఆధ్మాత్మిక వారసత్వం ఉంది (ఎఫెసీయులకు 1:3). దాన్ని స్వాధీనం చేసుకొని అనుభవించే హక్కు వారికి ఉంది. జీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆత్మ సంబంధమైన శత్రువులపై విజయం (రోమీయులకు 8:37), దేవుని ఆత్మ సంపూర్ణత (ఎఫెసీయులకు 5:18) తదితర దీవెనలు ఇచ్చాడు. కనానును ఇస్రాయేల్కు ఇవ్వడం దేవుని కృప అయినట్టే మనకు క్రీస్తులో జీవితాన్ని ఇవ్వడం కూడా కృపే (ఎఫెసీయులకు 2:8-10).
(2) ఇస్రాయేల్కు వాగ్దత్తం చేసిన దాన్ని వారు వెళ్ళి స్వంతం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో జయం చాలా మట్టుకు విశ్వాసంతో దేవుని వాగ్దానాలను స్వంతం చేసుకోవడం పైననే ఆధారపడి ఉంది. దేవుడిచ్చే దానిని మనుషులు స్వీకరించాలి. దేవుని నుంచి అనేక విషయాలను విశ్వాసులు తీసుకొని వాటికోసం పోరాడి, స్వంతం చేసుకొని అనుభవించగలరు. యెహోషువ గ్రంథంలో విశ్వాసం, నమ్మడం అనే మాటలు కనిపించకపోయినప్పటికి ఇస్రాయేల్వారు చేసిన సాహసాలన్నిటికీ పునాది నమ్మకమే. ఆ దేశాన్ని దేవుడు తమకు ఇచ్చాడని వారు నమ్మి ఉండకపోతే దాన్ని స్వాధీనపరచు కొనేందుకు వెళ్ళివుండేవారే కాదు. దేవుడు యెహోషువను నాయకుడుగా నియమించాడని నమ్మివుండకపోతే అతన్ని అనుసరించేవారే కాదు. దేవుని ఆదేశాల్లో వారికి నమ్మకం లేకపోతే యెరికోను పట్టుకోగలిగి ఉండేవారు కాదు (హెబ్రీయులకు 11:30 చూడండి) నమ్మికకూ, విజయానికి సంబంధం ఇప్పుడు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో స్పష్టం అయింది – ఎఫెసీయులకు 6:16 1 తిమోతికి 6:12 2 తిమోతికి 4:7 హెబ్రీయులకు 6:12 హెబ్రీయులకు 10:35-36 1 పేతురు 5:9 1 యోహాను 5:4-5. నమ్మకం ద్వారానే మనం మనకు బల ప్రభావాలు ఇచ్చే పవిత్రాత్మను పొందుతాం (గలతియులకు 3:2 గలతియులకు 3:14); నమ్మకం వల్లే ముందుకు సాగిపోతాం (2 కోరింథీయులకు 5:7 గలతియులకు 3:11); నమ్మకం మూలానే పోరాడుతాం (ఎఫెసీయులకు 6:16 1 తిమోతికి 6:12).
(3) ఇస్రాయేల్కు ఎదురు నిలిచిన శత్రువులు మహా బలమైనవారు. ఇస్రాయేల్వారు దేశాన్ని స్వాధీన పరచుకో నివ్వకుండా చూడాలని కృత నిశ్చయులై ఉన్నారు (ఉదాహరణగా యెహోషువ 11:1-5 చూడండి). క్రీస్తు విశ్వాసుల శత్రువులు కనానువారి కంటే బలవంతులు, మరింత పట్టుదల గలవారు (ఎఫెసీయులకు 6:10-12). ఈ శత్రువులు తమకు చేతనైతే మనం పరమ స్థలాలలో మనకు చెందిన వాటిని పొందనీయకుండా అడ్డుపడతారు.
(4) శత్రువులున్నారు గనుక ఇస్రాయేల్వారు యుద్ధం చెయ్యవలసి వచ్చింది. తమకు పట్టనట్లు కూర్చుంటే చాలా నష్టం కలిగివుండేది. ఇప్పటి విశ్వాసులు కూడా యుద్ధ రంగంలో ఉన్నారు. ఇది వారికి ఇష్టమున్నా లేకపోయినా తప్పదు. ఈ యుద్ధం ఆత్మ సంబంధమైనది (2 కోరింథీయులకు 10:4 ఎఫెసీయులకు 6:12 1 పేతురు 5:8-9). మందకొడిగా ఉండడమంటే ఓడిపోవడమే.
(5) తమ వారసత్వాన్ని పొందాలంటే ఇస్రాయేల్వారు దేవుడు తమ కోసం నియమించిన నాయకుణ్ణి అనుసరించాలి. ఆ నాయకుడు యెహోషువ. ఇప్పటి విశ్వాసులు కూడా దేవుడు వారికి నియమించిన నాయకుణ్ణి అనుసరించాలి. లేదా ఓటమి తప్పదు. ఈ నాయకుడు యేసు. యెహోషువ అంటే “యెహోవా రక్షిస్తాడు” అని అర్థం. కొత్త ఒడంబడిక గ్రంథంలోని గ్రీకు భాషలో ఈ పేరు యేసు అయింది. అర్థం అదే. మహిమలోకి మనలను నడిపించే మన నాయకుడు యేసే. జీవిత యుద్ధంలో మన సైన్యాధిపతి ఆయనే (హెబ్రీయులకు 2:10 హెబ్రీయులకు 12:1-3).
(6) కనానులో విజయ సాధనకు ఇస్రాయేల్వారికి కొన్ని లక్షణాలు చాలా అవసరం – ధైర్యం, బలం, లోబడే హృదయం, దేవుని వాక్కును ధ్యానిస్తూ ఉండే మనసు. విశ్వాసుల ఆధ్యాత్మికమైన పోరాటంలో కూడా ఈ లక్షణాల ప్రాముఖ్యత ఏమీ తక్కువ కాదు.
(7) దేవుడు ఇస్రాయేల్వారికి విజయాన్నిస్తానని మాట ఇచ్చాడు (యెహోషువ 1:5). నేటి విశ్వాసుల విషయం కూడా ఇంతే (యోహాను 8:31-36 యోహాను 16:33 రోమీయులకు 8:37 1 కోరింథీయులకు 15:57).
(8) దేవుడు ఇస్రాయేల్వారిని విడిచిపెట్టక ఎప్పుడూ వారితో ఉంటానని చెప్పాడు. వారి విజయ రహస్యం ఇదే (యెహోషువ 1:5). ఇప్పుడూ అంతే (మత్తయి 28:20 మొ।।).
(9) శత్రువులను జయించడం ద్వారా ఇస్రాయేల్వారు ఆ దేశాన్ని స్వంతం చేసుకొని అందులో నివసించారు. ప్రకటన గ్రంథం 21:7 పోల్చిచూడండి.
(10) దేశాన్ని వశపరచుకోవడం క్రమంగా జరిగింది. ఒక్క రోజులో అయిపోలేదు (యెహోషువ 11:18). నేటి విశ్వాసులు కూడా క్రీస్తులో వారికోసం ఉన్న వాటన్నిటినీ ఇప్పుడే ఒకేసారి అర్థం చేసుకొని స్వంతం చేసుకుని అనుభవించడం కుదరదు. ఎఫెసీయులకు 1:15-19 ఎఫెసీయులకు 3:14-19 లో పౌలు ప్రార్థనలు చూడండి.
(11) యెహోషువ వృద్ధుడై పోయిన తరువాత కూడా కనానులో చాలా భాగం ఇస్రాయేల్వారి పరం కాకుండా మిగిలి ఉంది (యెహోషువ 13:1 యెహోషువ 23:4-5). క్రీస్తులోని భాగ్యాల్లో చాలా కొద్ది భాగాన్ని మాత్రమే చాలామంది విశ్వాసులు తమ జీవితాల్లో స్వంతం చేసుకుని అనుభవిస్తారు. అది గాక ఇంకెంతో ఉంది (మత్తయి 25:31-34 1 పేతురు 1:4).