Peter I - 1 పేతురు 1 | View All

1. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమునుబట్టి,

“పొంతు...బితునియ”– ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నాయి. “చెదరిపోయి”– పేతురు గ్రీకు భాషలోని ఒక సూచన పదాన్ని (దయాస్పోరా) వాడాడు. పాలస్తీనా ప్రాంతానికి బయట ఉంటున్న యూదులు అని దీని అర్థం (యోహాను 7:35). వారిలో క్రీస్తును అనుసరించేవారికి పేతురు ఈ లేఖ రాస్తున్నాడు. పేతురు యూదులకు క్రీస్తు రాయబారి (గలతియులకు 2:7-8). తన రెండు లేఖల్లోనూ యూద క్రైస్తవులకు కొన్ని ఆదేశాలూ సలహాలూ రాస్తున్నాడు. పెంతెకొస్తు రోజున వీరిలో కొందరు అతని నోట శుభవార్త విని ఉండవచ్చు (అపో. కార్యములు 2:9). అయితే పేతురు ఇందులో రాస్తున్న సత్యాలు మాత్రం అన్ని కాలాల్లో, అన్నిచోట్లా ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తాయి. “పరాయివారు”– వ 17; 1 పేతురు 2:11; హెబ్రీయులకు 11:9, హెబ్రీయులకు 11:13. ఈ లోకం క్రీస్తు విశ్వాసులకు శాశ్వత నివాసం కాదు. వారి పౌరత్వం పరలోకంలోనే ఉంది (ఫిలిప్పీయులకు 3:20). “ఎన్నుకోబడ్డ”– మత్తయి 24:22, మత్తయి 24:24, మత్తయి 24:31; యోహాను 6:37; యోహాను 17:6; ఎఫెసీయులకు 1:4. “రాయబారి”– మత్తయి 10:2.

2. ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

“భవిష్యత్ జ్ఞానం ప్రకారం”– రోమీయులకు 8:29 నోట్. ఈ వచనంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులనూ గమనించండి (మత్తయి 3:16-17; మొ।। చూడండి). విశ్వాసుల విముక్తికి మూలాధారం, ఆరంభం ఇక్కడ కనిపిస్తున్నాయి – అది దేవుని ఎన్నిక. వారు విశ్వాసులు అయిన విధానం, క్రమం – అది దేవుని ఆత్మ చేసిన పని. వారి నమ్మకానికి ఆధారం, పునాది – అది క్రీస్తు రక్తం. వారు విశ్వాసులు అయిన ఉద్దేశం, ప్రయోజనం – వారు క్రీస్తుకు విధేయులుగా ఉండడం. 2 థెస్సలొనీకయులకు 2:13-14 పోల్చి చూడండి. “పవిత్రపరిచే పని”– పవిత్ర పరచడం గురించి నోట్ యోహాను 17:17-19. లేవీయకాండము 20:7 కూడా చూడండి. దేవుని ఆత్మ విశ్వాసిని లోకం నుంచి వేరుపరుస్తాడు. పాపం గురించి వారిని ఒప్పిస్తాడు. వారిలో పశ్చాత్తాపం కలుగజేసి నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ఇస్తాడు. సత్యాన్ని వారికి బోధిస్తాడు (యోహాను 3:5-8; యోహాను 16:7-15). “విధేయత”– దేవుడు మనలో చూడాలని కోరేది ప్రేమతో కూడిన విధేయత (యోహాను 14:15, యోహాను 14:23; రోమీయులకు 1:7). “ప్రోక్షణ”– పాత ఒడంబడికలో జంతువుల రక్తాన్ని నాలుగు సంగతులను సూచించేందుకు చిలకరించారు: కడగడం (లేవీయకాండము 14:1-7), యాజులను అంకితం చేయడం (నిర్గమకాండము 29:20-22), దేవుని ఒడంబడిక దృవీకరణ (నిర్గమకాండము 24:1-8), ప్రాయశ్చిత్తం (లేవీయకాండము 16:14). క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు పాపక్షమాపణ, శుద్ధి దొరికాయి (ఎఫెసీయులకు 1:7; హెబ్రీయులకు 9:14; 1 యోహాను 1:7), యాజులుగా దేవుని సన్నిధికి సంపూర్ణ ప్రవేశం కలిగింది (హెబ్రీయులకు 10:19-22), క్రొత్త ఒడంబడికలో భాగస్థులయ్యారు (మత్తయి 26:28; హెబ్రీయులకు 12:24).

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.

4. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.

“వాడిపోని”– ఈ వారసత్వం ఈ సృష్టికి సంబంధించినది కాదు, పాడైపోయేది కాదు (1 కోరింథీయులకు 15:50, 1 కోరింథీయులకు 15:53). అది నాశనం కానిది, శాశ్వతమైనది. “వారసత్వం”– మత్తయి 25:34; అపో. కార్యములు 20:32; ఎఫెసీయులకు 1:14; కొలొస్సయులకు 1:12; హెబ్రీయులకు 1:14; హెబ్రీయులకు 6:12; యాకోబు 2:5. కొత్త ఆధ్యాత్మిక జన్మం మూలంగా దేవుని పిల్లలైన వారికే ఈ వారసత్వం ఉంది. క్రీస్తు కోసం ఈ లోకాన్ని త్యజించినవారే పైలోకానికి వారసులౌతారు (మత్తయి 19:27-29). ఈ వారసత్వం ఏమిటి? వారసత్వం అంటే మొదటగా దేవుడే (ఆదికాండము 15:1; కీర్తనల గ్రంథము 16:5; కీర్తనల గ్రంథము 73:25-26; విలాపవాక్యములు 3:24); ఆ తరువాత ఆయన మనకివ్వదలచుకున్నవన్నీ (ప్రకటన గ్రంథం 21:7). “భద్రంగా ఉంచబడేది”– ఎవరైనా కన్నం వేసి దీన్ని దోచుకునే ప్రమాదమేమీ లేదు. దేవుడు తన విశ్వాసుల కోసం దీన్ని భద్రంగా ఉంచాడు. ఆయన దగ్గర భద్రంగా ఉన్నదాన్ని ఎవరూ, ఏదీ తీసేసుకోవడం అసాధ్యం. పరలోకంలో తమకోసం అలాంటి వారసత్వం ఉందని నమ్మేవారు ఇక్కడ ఈ లోకంలో ఏది కనిపిస్తే అది చేజిక్కించుకోవాలని తాపత్రయపడరు.

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

“ముక్తి కోసం”– విశ్వాసులు పాపం చేసే సమయం వరకు, లేదా వారి మనసుల్లో ఏదో ఒక అనుమానం పొడసూపేవరకు వారిని కాపాడడం కాదు; వారి విముక్తి సంపూర్ణం అయ్యే వరకు భద్రంగా ఉంచుతాడు. ఇక్కడ పేతురు విముక్తి భవిష్యత్తు కార్యక్రమం గురించి రాస్తున్నాడు. విశ్వాసులు ఇంతకు ముందే విముక్తి పొందారు (యోహాను 5:24; రోమీయులకు 8:24; ఎఫెసీయులకు 2:5; 2 తిమోతికి 1:9; తీతుకు 3:5). వారు ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నారు (1 కోరింథీయులకు 1:18; 2 కోరింథీయులకు 2:15). వారు తరువాత విముక్తి పొందుతారు (రోమీయులకు 13:11; ఫిలిప్పీయులకు 1:28; హెబ్రీయులకు 1:14; హెబ్రీయులకు 9:28). “నమ్మకం ద్వారా...కాపాడుతూ”– కాపాడడం అని తర్జుమా చేసిన గ్రీకు పదం సైనికులు ఒక దాన్ని కాపలా కాస్తూ ఉండడాన్ని సూచించే పదం. దేవుని ప్రభావమే మన విముక్తికి కావలి. ఆయన సేనల ప్రభువు. పరలోక సైన్యాలన్నీ ఆయన చెప్పుచేతల్లో ఉన్నాయి. విశ్వాసులకు పరిచర్య చేసేందుకు ఆయన తన బలాఢ్యులైన దేవదూతలను పంపిస్తాడు (హెబ్రీయులకు 1:14; కీర్తనల గ్రంథము 91:11-12). ఆయన ఈ లోకంలోను అదృశ్యంగా ఉండే ఆత్మల లోకంలోను కూడా తన విశ్వాసులు చివరి వరకు భద్రంగా ఉండగలిగే ఏర్పాట్లూ పరిస్థితులూ చేయగలడు, చేస్తాడు కూడా (యోహాను 6:39; యోహాను 10:28-29). తన కుమారుని ప్రార్థనకు జవాబుగా ఆయన ఇది చేస్తాడు (యోహాను 17:11-12; హెబ్రీయులకు 7:25). అలాగైతే విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతే ఎలా? తమ విముక్తిని, రక్షణను పోగొట్టుకొంటారా? దేవుడు “నమ్మకం ద్వారా” వారిని కాపాడుతూ ఉంటాడు. నమ్మకం దేవుడు ఉచితంగా ఇచ్చేదే (ఎఫెసీయులకు 2:8; ఫిలిప్పీయులకు 1:29). తనతో మనకు సజీవ సంబంధం ఉండేలా ఆయన ఉపయోగించే పరికరం ఇదే. అది మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెట్టిన శక్తివంతమైన ప్రభావం. అది దేవుని రక్షణ కార్యానికి పరిపూర్ణమైనది. మనలో దేవుడు చేయదలచుకున్న పనికి చక్కగా సరిపోయినది. విశ్వాసులకు ఆ విశ్వాసాన్ని ఇచ్చినవాడు వారి హృదయాల్లో దాన్ని సజీవంగా ఉంచగల సమర్థుడే (లూకా 22:31-32). మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని భద్రంగా ఉంచుతాడనేది నిజం కాదు. మనం నమ్ముతూ ఉండేలా ఆయన చేస్తాడు (ఫిలిప్పీయులకు 1:6; హెబ్రీయులకు 12:2).

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

“ఆనందిస్తున్నారు”– క్రీస్తులో ఆధ్యాత్మిక ఆనందం పొందడం నిజ క్రైస్తవుని లక్షణాల్లో ఒకటి. అది దేవునికి చెందినవారికి ఆయనిచ్చే ఉచిత వరం. ఈ ఆనందం అంటే అంతా బాగున్నప్పుడు మన మనసుల్లో సహజంగా కలిగే సంతోషం కాదు. అది మానవాతీతమైన ఆనందం. మనం దీన్ని ఎన్నడూ అనుభవించలేదంటే మనం క్రీస్తులో నమ్మకం ఉంచలేదనుకోవడానికి ఇది బలమైన ఆధారం (యోహాను 15:11; యోహాను 16:24; యోహాను 17:13; అపో. కార్యములు 5:41; అపో. కార్యములు 8:39; అపో. కార్యములు 16:34; రోమీయులకు 5:2-3, రోమీయులకు 5:11; రోమీయులకు 14:17; 2 కోరింథీయులకు 6:10; 2 కోరింథీయులకు 8:2; గలతియులకు 5:22; 1 థెస్సలొనీకయులకు 1:6). “దీనినిబట్టి” అనే మాటను గమనించండి. ఇది 3వ వచనం నుంచి పేతురు చెప్పిన దానంతటినీ సూచించే మాట. నూతన జన్మ, సజీవమైన ఆశాభావం, పరలోకంలో రానున్న కాలంలో మనకు కలగబోయే వారసత్వం, మనల్ని భద్రంగా ఉంచే దేవుని ప్రభావం గురించిన నిశ్చయత – వీటన్నిటి మూలంగా ఆనందం కలుగుతుంది. “ప్రస్తుతం కొద్ది కాలం”– మన హృదయాల్లో దేవుని ఆనందాన్ని అడ్డుకునే అనుభవాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో పాపం ఒకటి (కీర్తనల గ్రంథము 32:3-5; కీర్తనల గ్రంథము 51:4, కీర్తనల గ్రంథము 51:8, కీర్తనల గ్రంథము 51:12). సందేహం మరొకటి (మత్తయి 14:29-31; లూకా 24:37-38; యాకోబు 1:6). దుర్బోధలను నమ్మడం మరొకటి (గలతియులకు 3:1-3; గలతియులకు 4:15-17). విషమ పరీక్షలు ఆనందాన్ని కూడా అడ్డగించగలవు (యోబు 3:1-26). కానీ అవి మన ఆనందానికి అడ్డుబండలు కానవసరం లేదు. చాలా గడ్డు పరిస్థితుల్లో కూడా బలమైన విశ్వాసం ఉన్నవారు ఆనందించగలరు (అపో. కార్యములు 5:41; అపో. కార్యములు 16:25; 2 కోరింథీయులకు 12:7-10; కొలొస్సయులకు 1:24; యాకోబు 1:2). అందువల్ల విచారం, ఆనందం, ఈ రెండూ ఒకే సమయంలో మనలో చోటు చేసుకోవచ్చు (2 కోరింథీయులకు 6:8-10). విషమ పరీక్షలుండేది “కొద్ది కాలమే” నని గమనించండి (2 కోరింథీయులకు 4:17).

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
యోబు 23:10, కీర్తనల గ్రంథము 66:10, యెషయా 48:10, జెకర్యా 13:9, మలాకీ 3:3

మనుషులు బంగారాన్ని శుద్ధి చేసేందుకు అగ్నిని వాడుతారు. ఇదే కారణంతో దేవుడు మనుషుల్ని విషమ పరీక్షల గుండా వెళ్ళనిస్తాడు. కీర్తనల గ్రంథము 66:10-12 పోల్చి చూడండి. నమ్మకం బంగారం కన్నా మరెంతో విలువైనది. అలాగైతే మనుషులు నమ్మకాన్ని నిర్లక్ష్యం చేసి ఈ లోక సంపదల వెంట పరుగులెత్తడం విచారం కాదా. పరలోకంలో ఉండే శాశ్వత సంపదలను చేపడుతుంది కాబట్టి నమ్మకం అంత విలువైనది. “పరీక్షలకు నిలిచి”– మనం నిజంగా నమ్ముతున్నామో, లేక సరైన ఆధారం లేకుండా నమ్మామనుకుంటూ అలా చెప్పుకొంటున్నామో పరీక్షలే బయట పెడతాయి. ఇలాంటి విషమ పరీక్షలు వచ్చినా నమ్మకంలోనే కొనసాగితే లోకంవైపుకు మళ్ళకుండా ఉంటే మన నమ్మకం వాస్తవమైనదనడానికి ఇది రుజువు. మత్తయి 13:21, మత్తయి 13:23; హెబ్రీయులకు 10:32, హెబ్రీయులకు 10:39 పోల్చి చూడండి.

8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,

“ఆయనను ప్రేమిస్తున్నారు”– యోహాను 14:15; యోహాను 21:16; 1 కోరింథీయులకు 13:7; 1 కోరింథీయులకు 16:22; గలతియులకు 5:6. మన నమ్మకం నిజమైనదే అనడానికి ఇది మరో రుజువు. నిజ విశ్వాసం, క్రీస్తుపట్ల ప్రేమ ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనలో ఒకటి లేకపోతే రెండోది కూడా ఉండదు. “చూడడం లేదు”– మనమెప్పుడూ చూడని వ్యక్తిని ప్రేమించడం, ఆయనలో నమ్మకం పెట్టుకోవడం సాధ్యమేనా? తప్పకుండా. వాక్కు మనకు ఉంది, ఆయన సన్నిధిని అనుభవించేలా చేసే ఆయన ఆత్మ మనతో ఉన్నాడు. “సంతోషం”– వ 6; లేవీయకాండము 9:24; ద్వితీయోపదేశకాండము 16:15; నెహెమ్యా 8:10; కీర్తనల గ్రంథము 4:7; కీర్తనల గ్రంథము 16:11; కీర్తనల గ్రంథము 21:6; కీర్తనల గ్రంథము 28:7; కీర్తనల గ్రంథము 43:4; కీర్తనల గ్రంథము 81:1; యెషయా 12:3; యెషయా 35:6, యెషయా 35:10; లూకా 2:10; యోహాను 16:20-24.

9. అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

“అనుభవిస్తున్నారు”– వ 5. ఇప్పుడు పర్షీలు అనుభవిస్తూనే విశ్వాసులు రక్షణను, విముక్తిని అనుభవిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత సంపూర్ణంగా అనుభవిస్తారు.

10. మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,

“ప్రవక్తలు”– అంటే పాత ఒడంబడిక ప్రవక్తలని పేతురు ఉద్దేశం (ప్రవక్తల గురించి నోట్స్ ఆదికాండము 20:7; మొ।।). ఇప్పుడు విశ్వాసులకు కలిగిన కృపను గురించి వారు చెప్పారు. వారి రచనల్లో భవిష్యద్వాక్కులూ సాదృశ్యాలూ సూచనలూ నీడలూ ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తును, ఆయన తెచ్చిన రక్షణను సూచిస్తున్నాయి (లూకా 4:17-21; లూకా 24:25-27, లూకా 24:45-47; యోహాను 5:39, యోహాను 5:46; హెబ్రీయులకు 8:5; హెబ్రీయులకు 10:1).

11. వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
కీర్తనల గ్రంథము 22:1-31

క్రీస్తు ఆత్మ వారిలో ఉండి, వారికే పూర్తిగా అర్థం కాని విషయాలను వారి చేత రాయించాడు. తాము రాసిన వాటిని మరింత బాగా అర్థం చేసుకోవాలని వారే వాటినింకా క్షుణ్ణంగా చదివారు. క్రీస్తు ఈ లోకానికి రాకముందే క్రీస్తు ఆత్మ ఇక్కడ ఉన్న సంగతి గమనించండి. ఆయన క్రీస్తు బాధలనూ మహిమనూ గురించి ముందుగానే “సాక్ష్యం” చెప్పాడు. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 22:1-21 (బాధలు), 22-31 (మహిమ); యెషయా 53:1-9 (బాధలు), 10-12 (మహిమ). బాధలు, మహిమ రెండూ యెషయా 52:13-15 లో కనిపిస్తాయి. యెషయా 54వ అధ్యాయంలో ఆయన మహిమను గురించి ఉంది. మరెన్నో ఉదాహరణలున్నాయి.

12. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.

ప్రవక్తల పలుకులు తరువాతి కాలంలో నెరవేరుతాయనీ, వారి పరిచర్య రాబోయే తరాల కోసమేనని దేవుడు వారికి తెలియజేశాడు. పాత ఒడంబడిక రాసినది క్రీస్తు విశ్వాసులకు జ్ఞానం కలగాలని (రోమీయులకు 15:4; 1 కోరింథీయులకు 10:11). ఇప్పుడు శుభవార్తికులు లోకానికి ప్రకటిస్తున్న విషయాల గురించి పాత ఒడంబడిక ప్రవక్తలు రాశారు. క్రీస్తు మరణం, సజీవంగా లేవడం, మహిమ పొందడం అనే విషయాలని. శుభవార్త ప్రకటించేవారంతా పరలోకం నుంచి వచ్చిన పవిత్రాత్మ మూలంగా ప్రకటించాలి – యోహాను 14:16-17; లూకా 24:49; అపో. కార్యములు 1:4-5, అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:1-4. “దేవదూతలు”– ఆదికాండము 16:7 నోట్. విశ్వాసుల విముక్తి విషయంలో దేవుడు క్రీస్తు ద్వారా, తన ఆత్మ ద్వారా చేస్తున్నది కొంత వరకు మాత్రమే దేవదూతలకు అర్థం అయినట్టుంది. దేవుడిప్పుడు వారికి నేర్పిస్తున్నాడు (ఎఫెసీయులకు 3:10). ఈ రహస్య సత్యాలు ఎంత గొప్పవంటే వాటి గురించి మరింతగా తెలుసుకోవాలని దేవదూతలు ఆరాటపడుతున్నారు.

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

ఈ గొప్ప రక్షణ శుభవార్తను గురించిన వివరాల కోసం దేవదూతలు తహతహలాడుతున్నారు. ఆ రక్షణను పొందిన మనకు అలాంటి కోరిక మరి ఎక్కువగా ఉండాలి కదా. మనకు కొత్త మనసులు కలగాలి (రోమీయులకు 12:2; ఎఫెసీయులకు 4:23-24). ఆ మనసులను దేవుని వాక్కుతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసినదాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, పఠించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. కీర్తనల గ్రంథము 1:2; కీర్తనల గ్రంథము 119:26-27, కీర్తనల గ్రంథము 119:34, కీర్తనల గ్రంథము 119:73 మొ।।; ఎఫెసీయులకు 1:18; ఎఫెసీయులకు 3:18; ఫిలిప్పీయులకు 1:9-10; కొలొస్సయులకు 1:9. “ప్రత్యక్షమయ్యేటప్పుడు”– వ 7; మత్తయి 24:30; తీతుకు 2:13; హెబ్రీయులకు 9:28. “కృప”– దేవుడు విశ్వాసులకు ఇప్పటికే కృపను ఇచ్చాడు. అయితే వారికి కృప ఇంకా కలగబోతున్నది (వ 4; ఎఫెసీయులకు 2:7). దానిపై మన ఆశలను సంపూర్ణంగా నిలుపుకోవడం మన కష్టాలనూ హింసలనూ ఆనందంతో భరించేందుకు సహాయపడుతుంది.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

లేవీయకాండము 20:7; యెషయా 6:3; యోహాను 17:17-19; రోమీయులకు 6:19, రోమీయులకు 6:22; 2 కోరింథీయులకు 7:1; ఎఫెసీయులకు 4:24; హెబ్రీయులకు 12:10, హెబ్రీయులకు 12:14. విశ్వాసులందరి గురి ఇదే కావాలి. “మీ ప్రవర్తనంతట్లో”– మన జీవితాలను క్రైస్తవ సంబంధం, లోక సంబంధం అని రెండుగా విభజించకూడదు. జీవితం మొత్తం పవిత్రంగానే ఉండాలి.

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
లేవీయకాండము 11:44, లేవీయకాండము 19:2, లేవీయకాండము 20:7

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.
2 దినవృత్తాంతములు 19:7, కీర్తనల గ్రంథము 28:4, కీర్తనల గ్రంథము 62:12, కీర్తనల గ్రంథము 89:26, సామెతలు 17:3, సామెతలు 24:12, యెషయా 59:18, యెషయా 64:8, యిర్మియా 3:19, యిర్మియా 17:10

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
యెషయా 52:3

“విడిపించింది”– కీర్తనల గ్రంథము 78:35; మత్తయి 20:28. మనం క్రీస్తు శుభవార్తను నమ్మక మునుపు మనందరిలోనూ ఉన్నది “వ్యర్థమైన జీవిత విధానమే”. క్రీస్తుకు వేరుగా ఉన్న వారందరిలో ఉన్నది కూడా అదే. ప్రసంగి 1:2; ప్రసంగి 2:11 పోల్చి చూడండి. ఇహలోక విషయాలతో నిండి ఉండడం అంటే ఖాళీగా ఉండడంతో సమానం. మనలో ఎవరికైనా జీవితం ఇలా వ్యర్థం, శూన్యం అనిపించే భావం ఉందా? మన జీవితంలో క్రీస్తు ఒక అర్థాన్ని, ప్రయోజనాన్ని, ఆశాభావాన్ని నింపగలడు.

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

మనల్ని విమోచించి తనవారిగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన వెల ఇది (మత్తయి 20:28; మత్తయి 26:28; అపో. కార్యములు 20:28; రోమీయులకు 3:24-25). ఇది మాటకందనంత ప్రశస్తమైనది. “కళంకము”– 1 పేతురు 2:22; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; నిర్గమకాండము 12:5; లేవీయకాండము 1:3. క్రీస్తు రక్తాన్ని చిందించడం జరగకపోతే ఎవరికీ ఎప్పుడూ పాపవిముక్తి అనేది లేదు (హెబ్రీయులకు 9:22). “గొర్రెపిల్ల”– యోహాను 1:29.

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

దేవుడు లోకాన్ని చేయక మునుపు, మానవాళి పాపంలో పడక మునుపు మానవుడి రక్షణార్థం దేవుడొక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కేంద్రం క్రీస్తే. ఎఫెసీయులకు 1:4; అపో. కార్యములు 2:23.

21. మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,

“ఆయన ద్వారానే”– సజీవ దేవుణ్ణి మనుషులు నమ్ముకోవడమన్నది క్రీస్తు ద్వారా మాత్రమే అని పేతురు చెప్తున్నాడు. క్రీస్తుకు వేరుగా మనుషులు దేవునిపై నమ్మకం ఉంచుతున్నామనుకొంటారు గాని నిజానికి అలా కాదు. “మహిమ ఇచ్చాడు”– అపో. కార్యములు 2:32-33; అపో. కార్యములు 3:13; యోహాను 17:1. దేవుడు యేసును చనిపోయినవారిలోనుండి సజీవంగా లేపాడు గనుకనే మన నమ్మకం, ఆశాభావం దేవునిపై పెట్టుకోవడం సాధ్యం అయింది – వ 3.

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

మనం పవిత్రంగా, శుద్ధంగా ఉండగలిగే ఏకైక మార్గం ఇదే. బైబిల్లో వెల్లడి అయిన సత్యానికి లోబడడమే ఆ మార్గం. రోమీయులకు 6:17-19; యోహాను 8:31-32 పోల్చి చూడండి. ఈ విధంగా శుద్ధం కావడం వల్ల ఫలితం యథార్థమైన ప్రేమ. దేవుని ప్రజలపట్ల మన హృదయాల్లో ప్రేమ లేకపోతే మనం శుద్ధులం కాలేదనీ, రక్షణ, విముక్తి పొందలేదనీ ఖచ్చితంగా నమ్మవచ్చు (1 యోహాను 3:14; యోహాను 13:34).

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
దానియేలు 6:26

“కొత్త జన్మం”– వ 3; యోహాను 1:13. దేవుని వాక్కు వాడిపోని విత్తనం. హృదయంలో ఆ విత్తనం మొలకెత్తడం ద్వారా కొత్త జన్మ కలుగుతుంది (యాకోబు 1:18).

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
యెషయా 40:6-8

యెషయా 40:6-8. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే. అశాశ్వతమే. దేవుని వాక్కు (ఆ వాక్కు ద్వారా కొత్త జన్మ పొందినవారు) శాశ్వతం – మత్తయి 24:35; 1 యోహాను 2:17.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
యెషయా 40:6-8Shortcut Links
1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |