“బాప్తిసం”– మత్తయి 3:6, మత్తయి 3:13-16; మత్తయి 28:19; మార్కు 16:16; అపో. కార్యములు 2:38. జల ప్రళయం నీటి బాప్తిసానికి సూచన. నోవహు, అతని కుటుంబం ప్రాణాలు దక్కించుకున్నది నీటిలో ఉండడం ద్వారా కాదు, ఓడలో ఉండడం ద్వారానే. ఓడ క్రీస్తును సూచిస్తున్నది (ఆదికాండము 7:24). బాప్తిసం రక్షణకు సూచన. అది క్రీస్తు మరణ పునర్జీవనాలకూ, ఆయనతో మన ఐక్యతకూ గుర్తు (రోమీయులకు 6:3-10). కేవలం బాప్తిసం ఆచారం మనుషుల్ని రక్షిస్తుందని చెప్పడం తన ఉద్దేశం కాదని తెలిపేందుకు పేతురు మూడు సంగతులు చెప్తున్నాడు. బాప్తిసం అంటే శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు (“శరీర స్వభాపం”– రోమీయులకు 7:5, రోమీయులకు 7:18). బాప్తిసం “దేవునిపట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు” (హెబ్రీయులకు 9:14 పోల్చి చూడండి). అది విశ్వాసాన్నీ, నూతన జీవాన్నీ సూచించే గుర్తు. బాప్తిసం పొందుతున్నవారు తాము దేవుని ఇష్టానికి అనుగుణంగా జీవిస్తామనీ, తమ అంతర్వాణిని మరెన్నడూ అశుద్ధం చేసుకోమనీ, దాని నోరు మూయించమనీ బహిరంగంగా ప్రకటించడమే అందులోని ఒక ఉద్దేశం. మనల్ని దేవుని దగ్గరికి తెచ్చేది క్రీస్తు పడిన బాధలే (వ 18). మనలను రక్షించేది క్రీస్తు పునర్జీవనమే. రోమ్ 4:25 చూడండి. బాప్తిసం దాన్నే తెలియజేస్తున్నది. బాప్తిసమంటే జలప్రళయం నీళ్ళకు “అనుగుణమైన చిహ్నం” కాబట్టి మనమిలా చెప్పుకోవచ్చు – నోవహును రక్షించినది నీరు కానట్టే మనల్ని రక్షించేది బాప్తిసం కాదు (వ 20).