5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును,సద్గుణమునందు జ్ఞానమును,
మనకు అవసరమైనవాటన్నిటినీ క్రీస్తు ఇచ్చాడు గనుక ఆయన ఇచ్చినదాన్ని చేపట్టి క్రైస్తవ జీవితం తాలూకు అన్ని మంచి లక్షణాల్లోనూ ఎదగడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి.
“విశ్వాసం”– మనందరం మొదలు పెట్టవలసింది ఇక్కడే. ఇది లేకుండా మనం నిజక్రైస్తవులం కాము. ఇతర సుగుణాలను మనం అలవరచుకోగలిగినప్పటికీ అవి మనకు శాశ్వత మేలును కలిగించవు – హెబ్రీయులకు 11:6; యోహాను 3:36.
“సుగుణం”– వ 3. ఇక్కడి గ్రీకు పదం శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని, నైతిక విలువలను, యథార్థతను, మంచితనాన్ని సూచిస్తున్నది.
“సమకూర్చుకోండి”– అంటే ఒక సుగుణం మనకు కలిగే వరకూ మరొకదాని గురించి ప్రయత్నించవద్దని కాదు. మనం ఆధ్యాత్మిక జీవనంలో ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నిటినీ ఒకే సారి అలవరచుకోవాలి. వాటిని సమకూర్చుకోవడం ఎలా? నమ్మకం మూలంగా దేవుని వాగ్దానాలను చేపట్టి, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రార్థిస్తూ, దేవుని వాక్కును ధ్యానిస్తూ ఉండడం ద్వారా. అంతేగాక ఏమేం చెయ్యాలో మనకు తెలిసిన వాటన్నిటినీ నేరుగా, ఆచరణలో పెడుతూ వెళ్ళడం ద్వారా, క్రీస్తునూ నూతన స్వభావాన్నీ “ధరించుకోవడం” ద్వారా అలా చెయ్యవచ్చు (కీర్తనల గ్రంథము 1:1-3; లూకా 11:28; రోమీయులకు 13:14; 2 కోరింథీయులకు 5:7; ఎఫెసీయులకు 4:22-24; మొ।।).
“జ్ఞానం”– వ 2. దీన్ని ఒక సారి మనం అలవరచుకుని ఇక మరచిపోవడం కుదరదు. దీనిలో విశ్వాసులు అస్తమానం ఎదుగుతూ ఉండాలి – ఫిలిప్పీయులకు 3:10.