Peter II - 2 పేతురు 2 | View All

1. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

“కపట ప్రవక్తలు”– ద్వితీయోపదేశకాండము 13:1-5; ద్వితీయోపదేశకాండము 18:20-22; 1 రాజులు 18:19-40; 1 రాజులు 22:6-7; యెషయా 9:15; యిర్మియా 2:8; యిర్మియా 5:31; యిర్మియా 14:14; యిర్మియా 28:1-9; యెహెఙ్కేలు 13:2-7. “మీలో”– మత్తయి 7:15; మత్తయి 24:11; అపో. కార్యములు 20:29-30; రోమీయులకు 16:17-18; గలతియులకు 1:7; ఫిలిప్పీయులకు 3:18; 1 తిమోతికి 4:1-2; 2 తిమోతికి 4:3; యాకోబు 4:1. అనేక శతాబ్దాలుగా అంత విజయవంతమైన పద్ధతిని సైతాను అంత తేలికగా వదులుకోడు. భూమిపై మొట్టమొదటి కపట ప్రవక్త సాక్షాత్తు సైతానే. ఆదికాండము 3:4; యోహాను 8:44 చూడండి. “వినాశనకరమైన”– కపట ప్రవక్తలు వ్యక్తుల ఆత్మలనూ మొత్తంగా సంఘాలనూ నాశనం చేస్తారు. మత సంబంధమైన అబద్ధాలు చాలా ప్రమాదకరమైనవి. సైతాను చెప్పిన మొదటి అబద్ధం (ఆదికాండము 3:4) మానవాళి అంతటినీ పతనం చేసేసింది. అతడి అనుచరులు అనేకమంది అబద్ధాలు చెపుతూ మనుషులను ఆ పతన స్థితిలోనే ఉంచుతారు. “దొడ్డి దారిన”– 2 కోరింథీయులకు 11:13-15; గలతియులకు 2:4; యూదా 1:4. కపట ప్రవక్తలు తమ కపట ఉపదేశాలను క్రైస్తవుల్లోకి చొప్పించకముందు బహు కుయుక్తిగా వారికి చేరువ అవుతారు. అసత్యానికి కొంత సత్యాన్ని కూడా కలిపి అది చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. వారిలో అనేకమంది సంఘాల్లో, డినామినేషన్లలో అందరి ఆమోదం పొందిన కాపరులు, ఉపదేశకులునూ. “తమను కొన్న”– మత్తయి 20:28; 1 కోరింథీయులకు 7:23; గలతియులకు 3:13; ప్రకటన గ్రంథం 5:9. క్రీస్తు “అందరికోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకున్నాడు” (2 తిమోతికి 2:6). ఆ కపట బోధకుల విషయంలో కూడా ఇది నిజం. ఎవరైనా సరే పశ్చాత్తాపపడి శుభవార్తలో నమ్మకం ఉంచితే, ఎవరినైనా సరే రక్షించేందుకు అందరికీ సరిపోయినంత వెల చెల్లించాడు యేసుప్రభువు. కపట బోధకులు క్రీస్తును తిరస్కరిస్తారు. అంటే ఆయన దేవుడు కాదనవచ్చు, లేదా ఆయన చేసిన బలి అర్పణ అవసరం లేదనవచ్చు. అయితే వారు తమను క్రైస్తవులని చెప్పుకుంటారు. క్రీస్తును వారు తిరస్కరించడం చాలా కుయుక్తిగా చాటుమాటు వ్యవహారంగా ఉంటుంది (రోమీయులకు 16:18 పోల్చి చూడండి). “తమమీదికి”– ఫిలిప్పీయులకు 3:19. కపట ఉపదేశకులు తమపైకి తామే అరిష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. తమను నాశనం చేసేందుకు దేవుణ్ణి పురిగొల్పుతున్నారు. వారి ప్రవర్తన తీర్పు కోసం కేకలు పెడతున్నది. వారికి సంభవించబోయే దానికి పూర్తి బాధ్యత వారిదే.

2. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
యెషయా 52:5

“చాలామంది”– మత్తయి 24:11; ఫిలిప్పీయులకు 3:18. “దూషణకు”– క్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నామని చెప్పుకొంటూ అలా చేయనివారు క్రీస్తు మార్గం మంచిది కాదని మనుషులు అనుకునేలా చేస్తారు. తాము నమ్ముతున్నామని వారు చెప్పుకునే శుభవార్తను వారు అపకీర్తికి గురి చేస్తున్నారు.

3. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.

“అత్యాశ పరులై”– వ 15; రోమీయులకు 16:18; ఫిలిప్పీయులకు 3:19; 1 తిమోతికి 6:5, 1 తిమోతికి 6:10. వారి మత సంబంధమైన కార్యకలాపాలు దేవుని కోసం కాదు, ఇతరులకోసం కాదు, వారి స్వలాభం కోసమే. “కల్లబొల్లి మాటలు”– 2 పేతురు 1:16; 1 తిమోతికి 4:7; 1 తిమోతికి 6:20-21. “తీర్పు”– దేవుడు వారికి ఇంతకుముందే తీర్పు తీర్చాడు. తగిన సమయంలో వారిపై చర్య తీసుకుంటాడు.

4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

తన సత్యం ప్రకారం నడుచుకోనివారికి శిక్ష విధించగల సామర్థ్యం దేవునికి ఉన్నదని చెప్పేందుకు పేతురు ఇస్తున్న మూడు ఉదాహరణల్లో ఇది మొదటిది. “దేవదూతలు”– యూదా 1:6. ఆదికాండము 6:1-5; ఆదికాండము 16:7; మొ।। నోట్స్. ప్రకటన గ్రంథం 12:4, ప్రకటన గ్రంథం 12:7-8 పోల్చి చూడండి. గతంలో ఒక సారి పరలోకంలోని దేవదూతలు కొందరు దేవునిపై తిరగబడ్డారు. దేవుడు వారిని వెళ్ళగొట్టివేశాడు. దేవుడు వారి విషయంలో అంత కఠినంగా ఉన్నాడు గనుక కపట ఉపదేశకులను కూడా ఆయన ఊరికే వదిలిపెట్టడని మనం రూఢిగా గ్రహించాలి. “తీర్పు”– 1 కోరింథీయులకు 6:2-3.

5. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
ఆదికాండము 8:18

ఆదికాండము 6:5-8, ఆదికాండము 6:11-13, ఆదికాండము 6:18; ఆదికాండము 7:11-12, ఆదికాండము 7:23. “ప్రకటించిన”– నోవహును “నీతిన్యాయాలు ప్రకటించిన” వాడని చెప్పిన మాట బైబిల్లో ఇక్కడొక్క చోటనే. అతడు న్యాయవంతుడు (ఆదికాండము 6:9). తన కాలంలోని ప్రజలకు నీతిన్యాయాలను ప్రకటించాడు గాని వారు వినలేదు. ఆ పరిచర్య చాలా సంవత్సరాలు కొనసాగింది గాని ఒక్కడూ మారలేదు. ఎనిమిదిమంది మినహా మానవకోటినంతటినీ దేవుడు శిక్షించాడు. కాబట్టి కపట ఉపదేశకుల్ని కూడా ఆయన ఊరికే వదిలిపెట్టడని మనం రూఢిగా గ్రహించాలి.

6. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
ఆదికాండము 19:24

ఆదికాండము 19:1-29. అలాగైతే కపట ఉపదేశకులు శిక్ష తప్పించుకునే మార్గం లేదని గ్రహించాలి. “ఉదాహరణగా”– యూదా 1:7; మలాకీ 4:1; మత్తయి 3:10, మత్తయి 3:12; మత్తయి 25:41.

7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
ఆదికాండము 19:1-16

“న్యాయవంతుడైన”– ఆదికాండము 18:23. లోత్ దేవుణ్ణి నమ్మాడనీ, దేవుడు అతణ్ణి న్యాయవంతుడుగా ఎంచాడనీ దీన్ని బట్టి అనుకోవచ్చు (ఆదికాండము 15:6 పోల్చి చూడండి) గాని ఈ సంగతి బైబిల్లో ఈ మాటల్లో రాసిలేదు. లోత్ సొదొమలో నివసిస్తూ ఉండగా అతనిలోని మానసిక స్థితి గురించి పేతురు మరి కొంత సమాచారం ఇచ్చాడు. లోకంలోని పాపాన్ని చూస్తే ఒక న్యాయవంతుని హృదయంలో ఏమి జరుగుతుందో ఈ మాటలు తెలియజేస్తున్నాయి.

8. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

9. భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,

గతంలోని యుగాలన్నిటిలో లాగానే ఇప్పుడు కూడా మనుషులను రెండు వర్గాలుగా విభజించవచ్చు – “దేవభక్తి గలవారు”, “న్యాయం తప్పినవారు”. బైబిలు ప్రకారం భక్తి గలవారంటే సజీవుడుగా ఉన్న ఏకైక నిజ దేవుని పట్ల నమ్మకం, నిజమైన భయభక్తులు కలిగి బతికేవారు. యేసుప్రభువు ఆ దేవుని ఏకైక అవతారం. అందువల్ల దేవుని పట్ల భయభక్తులు గలవారు యేసును నమ్మి అనుసరిస్తారు. న్యాయం తప్పినవారు ఆయన్ను తిరస్కరిస్తారు (అయితే ఆయన్ను నమ్ముతున్నామని వారిలో కొంతమంది చెప్పుకున్నప్పటికీ అది నిజం కాదు, వారు ఆయన్ను తిరస్కరిస్తున్నారని వారి బ్రతుకులే చెప్తుంటాయి). “పరీక్షలలో...తప్పించాలో”– యాకోబు 1:2-4; 1 పేతురు 1:6-7; రోమీయులకు 8:35-39. “దండిస్తూ”– అంతిమ తీర్పు దినం ఇంకా రాకపోయినప్పటికీ ఇప్పుడు చనిపోయిన పాపాత్ములు శిక్షలోనే ఉన్నారు (లూకా 16:22-25). తీర్పు దినం వరకూ ఇది కొనసాగుతుంది. “తీర్పు”– అపో. కార్యములు 17:31.

10. శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.

“భ్రష్టమైన...శరీర స్వభావాన్ని”– 2 పేతురు 1:4; మత్తయి 15:19; రోమీయులకు 1:24; ఎఫెసీయులకు 4:19, ఎఫెసీయులకు 4:22. “ప్రభుత్వాన్ని”– అత్యాశ, అవినీతి సాధారణంగా ప్రభుత్వాన్ని తృణీకరించడంతోబాటే కలసి ఉంటాయి. వీటి ప్రభావం కింద మనుషులు తమ దుర్మార్గాన్ని అరికట్టజూచే అధికారమంతటినీ ఎదిరిస్తారు; అది దేవుని అధికారం కానివ్యండి, మనుషుల అధికారం కానివ్వండి వారు లెక్క చెయ్యరు. క్రీస్తు ప్రభుత్వాన్ని త్రోసిపుచ్చుతారు. తమ భ్రష్ట కోరికను వారెంతగా అనుసరిస్తే అంత తెగువగా, అహంభావులుగా తయారౌతారు. “మహనీయులను”– గ్రీకులో ఈ మాట అదృశ్య లోకంలోని గొప్పవారిని సూచించవచ్చు. దాన్నీ దాని నివాసులనూ కూడా అలాంటి భ్రష్టులు అసలు లెక్క చెయ్యరు. వారికి ఈ లోకం తప్ప వేరే దృష్టి లేదు.

11. దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.

యూదా 1:9 పోల్చి చూడండి.

12. వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,

ఎఫెసీయులకు 4:18; యూదా 1:10. ఏ విషయంలో కూడా తమకు ఏమి తెలియదని ఒప్పుకునే అణకువ వారిలో ఉండదు. తమ గర్వంలో కన్నూ మిన్నూ గానక తమకు అందని దివ్యమైన సత్యాల గురించి నోటికొచ్చినట్టెల్లా వాగుతుంటారు. “మృగాలలాగా”– కీర్తనల గ్రంథము 49:12, కీర్తనల గ్రంథము 49:20; కీర్తనల గ్రంథము 57:4; కీర్తనల గ్రంథము 74:19. అలాంటివారికి మృగాల లాగానే ఆధ్యాత్మిక వివేచన ఏదీ లేదు. వారికి శరీర వాంఛలు తీరితే చాలు. తర్కబద్ధంగా వాదించగల తమ సామర్థ్యం గురించి వారు గర్వించవచ్చు గానీ అలాంటి వివేకం ఏమీ లేనట్టుగా ప్రవర్తిస్తుంటారు.

13. ఒకనాటి సుఖాను భవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగ ములయందు సుఖించుదురు.

గలతియులకు 6:7-8; 2 థెస్సలొనీకయులకు 1:6. “పట్టపగలు”– తమ భ్రష్టమైన కోరికలను తీర్చుకోవడానికి వారికి రాత్రివేళ సరిపోదు. వారికి సిగ్గు ఉండదు. తమ పాపాలను చీకటి మాటున దాచే ప్రయత్నమేదీ చెయ్యరు. “విందులలో”– అపో. కార్యములు 2:42; యూదా 1:12; 1 కోరింథీయులకు 11:20-22 నోట్.

14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి,

ఆడవాళ్ళందరి వైపూ మోహంతో చూస్తూ వారినెలా వశపరచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనల్లో, కోరికల్లో, చర్యల్లో అస్తమానం పాపం చేస్తూ ఉంటారు. మత్తయి 5:28-30. “అత్యాశ”– వ 3. “శాపానికి”– 1 కోరింథీయులకు 16:22; గలతియులకు 1:8-9; హెబ్రీయులకు 6:8; ఆదికాండము 4:11; ద్వితీయోపదేశకాండము 16:22; సామెతలు 3:33; యెషయా 24:6.

15. తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.
సంఖ్యాకాండము 22:7

“బిలాము”– యూదా 1:11. ఇతని సంగతి సంఖ్యా 22-25 అధ్యాయాల్లో ఉంది. సంఖ్యాకాండము 22:1-7, సంఖ్యాకాండము 22:14 నోట్. కపట ఉపదేశకులను, కపట ప్రవక్తలను డబ్బు చెల్లించి అద్దెకు తెచ్చుకోవచ్చు. డబ్బు, లేక లోక సంబంధమైన ఇతర లాభాలే వారికి కావాలి. “విడిచి”– 1 యోహాను 2:19.

16. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
సంఖ్యాకాండము 22:28

సంఖ్యాకాండము 22:28-31. “వెర్రితనాన్ని”– ఎవరైనా తన ఉద్దేశాలనూ అభిప్రాయాలనూ దేవునికి తెలియకుండా దాచిపెట్టాలనుకోవడం పిచ్చితనం. దేవుని మార్గం కాక తన స్వంత మార్గంలో వెళ్ళాలనుకోవడం వెర్రితనం.

17. వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

“నీళ్ళు”– యోహాను 4:12, యోహాను 4:14; యోహాను 7:38-39. వారు దేవునికి చెందినవారమని చెప్పుకుంటారు గానీ దేవుని ఆత్మ లేనివారు. “మబ్బులు”– యూదా 1:12 పోల్చి చూడండి. వారిలో ఏదో ఉందన్నట్టుగా కనబడుతారు గానీ నిజానికి వారిలో ఉన్నదంతా శూన్యమే. తమ పేరాశ, చెడు కోరికలు అనే గాలికి వారు కొట్టుకుపోతారు. “కటిక చీకటి”– ఈ భూమిపై వారు చీకటిని కోరుకొంటారు (యోహాను 3:19-20). వారికి శాశ్వతంగా ఉండేది చీకటే (మత్తయి 8:12; మత్తయి 22:13; యూదా 1:13).

18. వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

“కోతలు...మాటలు”– కీర్తనల గ్రంథము 10:3; కీర్తనల గ్రంథము 12:3; కీర్తనల గ్రంథము 75:4; కీర్తనల గ్రంథము 94:4; రోమీయులకు 1:30; గలతియులకు 6:13; 2 తిమోతికి 3:2; యాకోబు 3:5. తరచుగా గొప్పలు చెప్పుకోవడానికి తక్కువ కారణాలు ఉన్నవారే ఎక్కువ గొప్పలు చెప్పుకొంటారు. “తప్పించుకొన్నవారిని”– ఈ కపట ఉపదేశకులు శుభవార్తపట్ల ఆసక్తి చూపుతున్నవారిని, లేక కొత్తగా క్రైస్తవులైన వారిని తమ అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తారు. వారిని చెడగొట్టాలని ప్రయత్నిస్తారు.

19. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

“బానిసలై”– యోహాను 8:34-35; రోమీయులకు 6:16. డబ్బుకూ కామ వికారానికీ బానిసలుగా ఉన్నవారు కొన్ని సార్లు నిలబడి ఇతరులకు స్వేచ్ఛను ప్రకటిస్తూ ప్రసంగాలు చేస్తుంటారు. తమలాగా బానిసత్వానికి నడిపే స్వేచ్ఛ అది. “స్వేచ్ఛ”– వారు ఇస్తామంటున్న స్వేచ్ఛ వారి పాత స్వభావాల కోరికలకు సంబంధించిన స్వేచ్ఛ. దేవుని కృపను వారు వక్రం చేసి క్రైస్తవులు యథావిధిగా పాపాల్లో కొనసాగినా వారికి రక్షణ ఉంటుందని చెప్తుంటారు (యూదా 1:4; గలతియులకు 5:13). దీనిపై దేవుని వాక్కు చెప్తున్నదాన్ని వారు పట్టించుకోరు (1 కోరింథీయులకు 6:9-10; గలతియులకు 5:21, గలతియులకు 5:24).

20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

“వశమైతే”అనే పదాన్ని గమనించండి. హెబ్రీయులకు 6:4-6; హెబ్రీయులకు 10:26-27 పోల్చి చూడండి. కొందరు క్రీస్తును గురించిన చాలా సమాచారం తెలుసుకొని లోకంలోని భ్రష్టత్వం నుంచి తొలగి కొత్త జీవితం ఆరంభించాలని నిర్ణయించుకోవచ్చు. అంత మాత్రాన వారికి దేవుని ఆత్మ ద్వారా నూతన ఆధ్యాత్మిక జీవం, కొత్త స్వభావం కలిగినట్టు కాదు. “మరీ చెడ్డదౌతుంది”– మత్తయి 12:43-45 పోల్చి చూడండి.

21. వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

క్రీస్తు మార్గం న్యాయ మార్గం. తిన్నగా ఉండే ఇరుకు మార్గం (2 పేతురు 2:2, 2 పేతురు 2:15; మత్తయి 5:20; మత్తయి 7:13-14; యెషయా 35:8; కీర్తనల గ్రంథము 15:1-5). ఈ మార్గాన్ని తెలుసుకుని కూడా దానినుండి తొలగిపోవడం సాధ్యమే. “పవిత్ర ఆజ్ఞ”– మత్తయి 4:17, మత్తయి 4:19; మార్కు 1:15; లూకా 24:47; అపో. కార్యములు 17:30. శుభవార్త సందేశం మనిషికి దేవుడిచ్చే పవిత్రమైన ఆజ్ఞలాంటిది.

22. కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
సామెతలు 26:11

ఈ వచనంలోని మొదటి సామెత సామెతలు గ్రంథం సామెతలు 26:11 లో ఉంది. రెండోది ఎక్కడిదో మనకు తెలియదు. నిజ విశ్వాసులు “గొర్రెలు” (యోహాను 10:27). కుక్కలు కాదు, పందులు కాదు. గొర్రెలు కక్కినదాన్ని మళ్ళీ తినవు, బురదలో పొర్లవు. క్రీస్తు ప్రజలు పాపంలో పడవచ్చు (యాకోబు 3:2; 1 యోహాను 2:1; గలతియులకు 2:11-13; గలతియులకు 5:17), గానీ అందులోనే పొర్లుతూ ఉండరు (సామెతలు 24:16; 1 యోహాను 3:9). ఏదో కారణం వల్ల మత భక్తి గలవారుగా మారి గతంలోని తమ భ్రష్టమైన అలవాట్లను వదిలేసినవారి గురించి పేతురు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. త్వరలోనే వారి నిజ స్వభావం బయటపడుతుంది, తిరిగి ఆ మురికి పనుల వైపుకు మళ్ళుతారు. కడిగిన పంది పందిగానే ఉంటుంది గానీ వేరే జంతువైపోదు.Shortcut Links
2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |