John I - 1 యోహాను 3 | View All

1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

“పిల్లలమని”– యోహాను 1:12-13; రోమీయులకు 8:16-17; ఫిలిప్పీయులకు 2:15; హెబ్రీయులకు 2:13; 1 పేతురు 1:4. ప్రతి ఒక్కరూ దేవుని సంతానం కాదు. యేసుప్రభువును స్వీకరించి దేవుని ఆత్మమూలంగా తిరిగి పుట్టినవారే దేవుని సంతానం. “తండ్రి”– మత్తయి 5:16 నోట్. “ప్రేమ ఎలాంటిదో”– 1 యోహాను 4:8-10; యోహాను 3:16; రోమీయులకు 5:8; ఎఫెసీయులకు 1:4; ఎఫెసీయులకు 2:4. మనం నరకానికి తప్ప మరి దేనికీ అర్హులం కాము. దేవుడు మనలాంటి పాపులను తన పిల్లలుగా మార్చడం ఆయన అమిత ప్రేమ కారణంగానే. “మనలను ఎరగదు...ఆయనను ఎరగలేదు”– యోహాను 15:21; యోహాను 16:3. విశ్వాసులు ఆధ్మాత్మికంగా జన్మించి, క్రీస్తులో ఉన్న కొత్త మనుషులు కాబట్టి లోకానికి యేసు ఎలా తెలియదో, అలానే వారు కూడా తెలియదు (యోహాను 17:14, యోహాను 17:16). వారి స్వభావాన్ని, వారి ఆశయాలను, నమ్మకాన్ని, దేవుడు వారి హృదయాల్లో ఉంచిన దేన్నీ లోకం అర్థం చేసుకోవడం అసాధ్యం.

2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
యోబు 19:25

“మనమిక ఏమవుతామో”– దేవుని పిల్లలుగా ఉండడమంటే శాశ్వత కాలంలో ఎలా ఉంటుందో దేవుడింకా సంపూర్ణంగా వెల్లడించలేదు. “వెల్లడి అయ్యేటప్పుడు”– 1 యోహాను 2:28. “చూస్తాం”– మత్తయి 5:8; 1 కోరింథీయులకు 13:12; ప్రకటన గ్రంథం 22:4. “ఆయనలాగా”– రోమీయులకు 8:29. ఏ మనిషికైనా సాధించడానికి ఉన్న గమ్యాలన్నిటిలోకీ ఇది ఉన్నతమైనది. విశ్వాసులు క్రీస్తును ముఖాముఖిగా చూచినప్పుడు శాశ్వతంగా ఆయన పోలికలోకి మారుతారు (1 కోరింథీయులకు 15:48-54). వారు ఎన్నుకొని తహతహలాడుతూ ఎదురుచూస్తున్న స్థితి వారికి కలుగుతుంది. అంటే వారు ఏ మచ్చా ఎలాంటి కళంకమూ లేకుండా పూర్తిగా శుద్ధులుగా, దోషరహితులుగా, న్యాయవంతులుగా, పవిత్రులుగా ఉండే స్థితి.

3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.

క్రీస్తు వచ్చినప్పుడు ఆయనలాగే ఉండాలని ఆశించినవారు ఇప్పుడు ఆయనలాగా ఉండాలని ఆశిస్తారు. ఆయన పోలికలోకి మారే క్రియ ఇప్పటికే ఆరంభం అయింది (2 కోరింథీయులకు 3:18; కొలొస్సయులకు 3:9-10). నిజ విశ్వాసులు ఈ పవిత్రపరచే క్రియలో దేవునికి సహకరిస్తారు (హెబ్రీయులకు 12:14 పోల్చి చూడండి). “పవిత్రం చేసుకుంటారు”– 1 యోహాను 1:7, 1 యోహాను 1:9; 2 కోరింథీయులకు 7:1. ఆయన వెలుగులో నడుచుకోవడం ద్వారా మాత్రమే మనల్ని మనం పవిత్రం చేసుకోగలం.

4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

పాపం అంటే దేవుణ్ణీ, మంచిచెడుల విషయంలో దేవుడు తెలియజేసినదాన్నీ మనసులో ఎదిరించడం, దేవుని చట్టం అంటే ఏమీ లేనట్టూ, లోకంలో న్యాయ సూత్రమేదీ లేనట్టూ ప్రవర్తించడం, తన స్వార్థపరమైన కోరికలనే ఎప్పుడూ చూచుకొంటూ ఉండడం.

5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.
యెషయా 53:9

“అపరాధాలు తీసివేయడానికే”– యోహాను 1:29; రోమీయులకు 11:27; హెబ్రీయులకు 9:28; హెబ్రీయులకు 10:11-14, హెబ్రీయులకు 10:17. “అపరాధమేమీ లేదు”– హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26. ఇది యేసుప్రభు విషయంలో మాత్రమే చెప్పగలం. విశ్వాసులు తమ విషయంలో ఇలా చెప్పుకోరాదని యోహాను ఇంతకు ముందే చెప్పాడు – 1 యోహాను 1:8.

6. ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.

ఎవరిని తీసుకున్నప్పటికీ పాపంలో గానీ క్రీస్తులో గానీ ఉన్నారు. పాపంలో ఉన్నవారు పాపాన్ని తమ జీవితాల్లో అభ్యసిస్తారు. వారి బ్రతుకు తీరే పాపం. క్రీస్తులో ఉన్నవారు ఇలా చెయ్యలేరు. వారు ఆధ్యాత్మికంగా జన్మించారు (1 యోహాను 2:29); వారు న్యాయవంతుడైన దేవుని సంతానం కాబట్టి న్యాయవంతమైన స్వభావం వారికి ఉంది (1 యోహాను 3:1). దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు (1 యోహాను 4:13). అంతకుముందు ఉన్నట్టుగా వారు కొనసాగడం అసాధ్యం (ఎఫెసీయులకు 2:1-3). విశ్వాసులు కొన్నిసార్లు పాపంలో పడిపోతారు (1 యోహాను 1:7; 1 యోహాను 2:1; 1 యోహాను 5:16). అయితే ఉద్దేశ పూర్వకంగా అదొక జీవిత విధానంగా పాపంలో కొనసాగరు, కొనసాగలేరు (సామెతలు 24:16). వారు పాపం చేస్తే వారిలోని నూతన స్వభావం ఆ పాపానికి వ్యతిరేకంగా తిరగబడి, వారు దాన్ని అసహ్యించుకుని దానినుంచి బయట పడేందుకు ప్రయత్నించేలా చేస్తుంది. వారు అందులోనుంచి బయట పడాలని క్రీస్తు ప్రార్థిస్తున్నాడు (లూకా 22:31-32; యోహాను 17:17; హెబ్రీయులకు 7:25). వారిలో ఉన్న పవిత్రాత్మ వారు అందులోనుంచి బయట పడాలని వారిని ఒప్పిస్తూ, బలవంతపెడుతూ ఉంటాడు. వారు పాపంలో నిలిచి ఉంటే వారు క్రీస్తుకు చెందిన గొర్రెలు కారనీ, దేవుని మూలంగా పుట్టినవారు కారనీ అది తెలియజేస్తుంది. 2 పేతురు 2:22. దేవుని పిల్లలు, సైతాను పిల్లలకు పూర్తిగా వేరైనవారు. ఈ సత్యం వారి ప్రవర్తనలో కనబడుతూ ఉంటుంది. “నిలిచి ఉండేవ్యక్తి”– మనమెంత సంపూర్ణంగా ఆయనలో నిలిచి ఉంటే అంత న్యాయవంతులుగా ఉంటాం. పాపం నుంచి అంతగా విడుదల అవుతూ ఉంటే, దేవుని తలంపులూ కోరికలూ అంత పరిపూర్ణంగా మనలో ఉంటాయి, అంత పూర్తిగా ఆయన సంకల్పం ప్రకారం నడుచుకుంటాం.

7. చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.

“తప్పు దారి”– 1 యోహాను 2:26; 1 కోరింథీయులకు 6:9; గలతియులకు 6:7; ఎఫెసీయులకు 5:6. మనుషుల ఎదుట రెండు రకాల జీవితాలు మాత్రమే ఉన్నాయి – పాపమార్గం, న్యాయ మార్గం. ప్రతి ఒక్కరూ ఈ దారిలో గానీ ఆ దారిలో గానీ ఉన్నారు (మత్తయి 7:13-14; రోమీయులకు 2:6-10 చూడండి). అలాగని న్యాయవంతుడు అసలు ఎన్నడూ పాపం చెయ్యడని కాదు (వ 20; 1 యోహాను 1:7; 1 యోహాను 2:1; యాకోబు 3:2). లేక పాపి ఒక్క న్యాయ క్రియ అయినా ఎన్నడూ చెయ్యడని కాదు (అపో. కార్యములు 10:2). యోహాను ఒక వ్యక్తి జీవన యాత్ర అంతటినీ మొత్తంగా దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాడు. న్యాయవంతుడి జీవితంలో న్యాయంగా ప్రవర్తించడం ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. పాపి జీవితంలో అపరాధాలు చేయడం ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. “న్యాయవంతుడే”– 1 యోహాను 2:29.

8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

“అపనింద పిశాచం”– మత్తయి 4:1; ఎఫెసీయులకు 2:2. ప్రతి వ్యక్తీ దేవునికి గానీ సైతానుకు గానీ చెందినవాడు (వ 10). యోహాను 8:44 చూడండి. మన జీవితాలను దేవుడు ఏలుతూ ఉండకపోతే సైతాను ఏలుతూ ఉంటాడు. “మొదటినుంచి”– మొదటి పాపి సైతాను. “నాశనం చేయడానికే”– సైతాను పనులు పాపం, మరణం. క్రీస్తు తన ప్రజల్లో వీటిని నాశనం చేయడానికి వచ్చాడు. వారి పాపాలకోసం చనిపోయి, సజీవంగా లేవడం ద్వారా, అలాంటి నాశనానికీ, సైతాన్ను నాశనం చేయడానికీ కూడా పునాది వేశాడు.

9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.

“దేవుని వల్ల జన్మించిన”– 1 యోహాను 2:29. “చేస్తూ”– వ 6. “దేవుని విత్తనం”– ఆధ్యాత్మిక జీవాన్నిచ్చే ఆధ్యాత్మికమైన బీజం (1 కోరింథీయులకు 9:11). అంటే దేవునినుంచి కలిగే జీవం. అది దేవుని వాక్కుమూలంగా వస్తుంది (యాకోబు 1:18; 1 పేతురు 1:23; మత్తయి 13:3, మత్తయి 13:23; లూకా 8:15). లేదా, విశ్వాసుల హృదయాల్లో మొలకెత్తే కొత్త ఆధ్యాత్మిక జీవం, కొత్త స్వభావాన్ని కలిగించిన దేవుని వాక్కు అనే విత్తనం అని అర్థం చేసుకోవచ్చు. “నిలిచి ఉంటుంది”– తమలోని దేవుని విత్తనం ఎండిపోతుందనీ సైతాను దాన్ని ఎత్తుకుపోతాడనీ విశ్వాసులు భయపడనవసరం లేదు. అది అక్కడే ఉంటుంది. దేవుడు మొదలు పెట్టిన పనిని ఆయనే కొనసాగిస్తూ ఉంటాడు (ఫిలిప్పీయులకు 1:6; ఫిలిప్పీయులకు 2:13). “అపరాధం చేస్తూ ఉండలేడు”– పాపంలో కొనసాగడం విశ్వాసి దేవుని నుంచి పొందిన కొత్త స్వభావానికి విరుద్ధం. ఈ కొత్త స్వభావానికి పాపం చెయ్యడం సాధ్యం కాదు (ఎఫెసీయులకు 4:24). ఈ కొత్త స్వభావం పాపానికీ, విశ్వాసుల్లోని భ్రష్ట స్వభావానికీ వ్యతిరేకంగా దేవుని ఆత్మ జరిపే పోరాటంలో ఆయనకు సహకరిస్తుంది (గలతియులకు 5:17-18, గలతియులకు 5:24).

10. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

ప్రతి వ్యక్తీ దేవుని సంతానమన్నా అయి ఉంటాడు, లేదా సైతాను సంతానమన్నా అయి ఉంటాడు అని యోహాను చెప్తున్నాడు (యోహాను 8:44; మత్తయి 13:38). ఆ వ్యక్తి చేసే పనులూ చెయ్యని పనులూ చూస్తే అతడెవరి సంతానమో తెలుసుకోవచ్చు (మత్తయి 7:15-20). “న్యాయంగా”– న్యాయంగా ప్రవర్తించడమంటే బైబిలు ఉపదేశం ప్రకారం ప్రవర్తించడమే గాని మంచిది అని మనుషులు భావించేదాన్ని చెయ్యడం కాదు (యోహాను 16:2 పోల్చి చూడండి). న్యాయంగా ప్రవర్తించనివారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారన్నమాట. ఇది వారు గ్రహించకపోవచ్చు. న్యాయంగా ప్రవర్తించడం అభ్యసించకపోతే వారు సైతాను పిల్లలు, దేవుని పిల్లలు కారు. “సోదరుడు”– అనే పదానికి ఒకటికంటే ఎక్కువ అర్థాలున్నాయి – సాటి విశ్వాసి, లేదా తోడబుట్టినవాడు కావచ్చు (వ 12లో లాగా). “తన సోదరుణ్ణి ప్రేమతో”– యేసు ఆజ్ఞాపించిన న్యాయ క్రియల్లో ఇదొకటి.

11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా

12. మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
ఆదికాండము 4:8

“కయీను”– ఆదికాండము 4:1-8; హెబ్రీయులకు 11:4; యూదా 1:11. కయీను “దుర్మార్గుడికి చెందినవాడు”. అంటే సైతానుకు చెందినవాడు (వ 10). హేబెలు దేవుడు చెప్పినట్టు చేసిన దేవుని సంతానం.

13. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి.

యోహాను 15:18-21. దేవుని ప్రజలను ద్వేషించే లోకులకు కయీను ఒక ఉదాహరణ.

14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

“మరణంలోనుంచి”– యోహాను 15:24. దీన్ని అనుభవించినవారిలో కనిపించే గొప్ప రుజువు ఏమిటి? సాటి విశ్వాసుల పట్ల ప్రేమ. వ 19; 1 యోహాను 2:3 పోల్చి చూడండి. “మరణం”– అంటే ఆత్మసంబంధమైన మరణం (ఎఫెసీయులకు 2:1). ప్రేమ లేకపోవడం ఈ స్థితికి గొప్ప రుజువు. ప్రేమ మూర్తి అయిన దేవుడు విశ్వాసులందరి హృదయాల్లో ఉంటాడు. వారు ప్రేమించగలిగేలా చేస్తాడు.

15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

ద్వేషం హత్య వంటిది. ఎందుకంటే అది ద్వేషించే వ్యక్తిని వీలైతే నాశనం చెయ్యాలని చూస్తుంది. దేవుడు ఒక వ్యక్తి చర్యలు మాత్రమే కాదు, అతని హృదయ స్థితిని కూడా చూస్తాడు. మత్తయి 5:27-30 పోల్చి చూడండి. “హంతకుడే”– పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం ఉంచితే హంతకుడికి శాశ్వత జీవం కలుగుతుంది. అప్పుడతడు ద్వేషించడం మానివేస్తాడు. హంతకుడుగా ఉండడు.

16. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.

“తెలుసు”– ప్రేమ ఏమిటో మన మనోభావాల ద్వారా తెలుసుకోలేమా? అయితే ఈ విషయంలో కేవలం మనోభావాల మీదే ఆధారపడితే కుదరదు. కాబట్టి ప్రేమే అవతారం దాల్చిన వ్యక్తిని యోహాను మనకు చూపుతూ, ప్రేమ ఆయనచేత ఏమి చేయించినదో చూపించడం ద్వారా ప్రేమంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. రోమీయులకు 5:8; గలతియులకు 2:20; యోహాను 3:16; యోహాను 10:11, యోహాను 10:15. విశ్వాసులు తమ సాటి విశ్వాసుల కోసం మరణించేందుకైనా సిద్ధంగా ఉండాలన్నదే దేవుని ప్రేమ మనముందు ఉంచిన ఆదర్శం, పాఠం.

17. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
ద్వితీయోపదేశకాండము 15:7-8

యాకోబు 2:14-17 పోల్చి చూడండి. క్రియలు లేకపోతే నమ్మకం ప్రాణం లేనిదే. ప్రేమ విషయంలో కూడా ఇలాగే చెప్పవచ్చు. మంచి పనులు చెయ్యని ప్రేమ ప్రేమే కాదు. ఇతరులకు సహాయం చెయ్యని ప్రేమ నామ మాత్రమే. అది ప్రేమ కాదు, మోసం, నిరుపయోగమైనది. క్రీస్తు ప్రజలందరికీ తీర్పు తీర్చేందుకు వచ్చినప్పుడు వారు ఏమి చేశారు, ఏమి చెయ్యలేదు అనే దానిపై ఆధారపడి తీర్పు చేస్తాడు గానీ ఎంత మంచి మాటలు వారు మాట్లాడారు అన్నదానిపై కాదు. మత్తయి 25:31-46 చూడండి (ఇక్కడ యోహాను మాట్లాడుతున్న సందర్భాన్నిబట్టి వ 41-46 చాలా అర్థవంతమైనవి). నిజమైన ప్రేమ ఉన్నవారు తమకేదో లాభం కలగాలన్న ఉద్దేశంతో ఇతరులకు సహాయం చెయ్యరు (అలాంటి సహాయం కేవలం ముసుగు తొడుక్కున్న స్వార్థం మాత్రమే). అవసరతలో ఉన్నవారికి సహాయం అవసరం కాబట్టి చెస్తారంతే. ఇవ్వడం గురించి నోట్స్ రిఫరెన్సులు 2 కోరింథీయులకు 9:15.

18. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

19. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.

మన సాటి విశ్వాసులకు సహాయం చేయడం ద్వారా మన ప్రేమను రుజువు చేసుకొన్నాం గనుక మనం వారిని ప్రేమిస్తున్నాం అని మనకు తెలిసి ఉంటే, మనం దేవుని సత్యంతో సరైన సంబంధం కలిగి ఉన్నామని ఎరిగి ఉండగలం. అప్పుడు దేవుని సన్నిధిలో మనకు నెమ్మది ఉంటుంది. కొందరు క్రైస్తవులకు పాపవిముక్తి, రక్షణ తమకు ఉందన్న నిశ్చయత లేకపోవడానికి ఒక కారణం బహుశా ఇదే అయి ఉండవచ్చు – వారు తమ ప్రేమను క్రియల్లో, ఇతరులకు సహాయం చెయ్యడంలో నిరూపించుకోలేదు.

20. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.

“నింద మోపుతూ”– కొన్ని సార్లు విశ్వాసుల హృదయాలే వారిపై నింద మోపుతాయి. అందుకు కారణం బహుశా వారు పాపం చేసి ఉండవచ్చు (1 యోహాను 1:9; 1 యోహాను 2:1), లేక తమ ప్రేమ ఎంత స్వల్పంగా ఉందో, తమ జీవితాల్లో ఆధ్యాత్మిక ఫలం ఎంత తక్కువగా ఉందో వారు గుర్తు చేసుకుని ఉండవచ్చు, లేక తాము చెయ్యవలసినదాన్ని చెయ్యక పోయామని వారికి అనిపించి ఉండవచ్చు. కానీ మనలో ప్రేమ ఉండి, దాన్ని క్రియల్లో చూపిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మనకు నెమ్మది దొరుకుతుంది. “ఆయనకు తెలుసు”– ఆయన గొప్పవాడు. మన బలహీనతలు, తప్పులు, పాపం అంతా ఆయనకు తెలుసు. అయినా మనల్ని తన ప్రియమైన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 103:8-14 పోల్చి చూడండి.

21. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.

“నింద మోపకపోతే”– మనలో ప్రేమ, మంచి పనులు నిండి ఉంటే, పాపంపై మనకు విజయం ఉంటే మన అంతర్వాణి మనపై నింద మోపదు. “ధైర్యం”– ఇది స్వనీతికి చెందిన నిబ్బరం కాదు. దేవుడు మనలో ఉండి పని చేస్తున్నాడన్న నిబ్బరం.

22. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే.

యోహాను 14:13-15; యోహాను 15:7. “ఆయనకిష్టమైన వాటిని”– దేవునికి మనం లోబడకుండా, ఆయనకు ఇష్టమైనవి చేసే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆయన మన ప్రార్థనలకు జవాబియ్యాలని చూచే హక్కు మనకు లేదు. మన అవిధేయతలకూ స్వార్థానికీ బదులుగా మన ప్రార్థనలు విని దీవెనలను ప్రతిఫలంగా ఇవ్వడు. దేవుణ్ణి సంతోషపెట్టేవి నమ్మకం, ప్రేమ. లేక ప్రేమ ద్వారా వెల్లడి అయ్యే నమ్మకం (గలతియులకు 5:6; హెబ్రీయులకు 11:6).

23. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని

“పేరు”– యోహాను 1:12.

24. ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.

యోహాను 14:20-23; యోహాను 17:21-23. “మనకిచ్చిన”– 1 కోరింథీయులకు 6:19; గలతియులకు 4:6; ఎఫెసీయులకు 1:13-14. “ఆత్మద్వారా”– అంటే దేవుని పవిత్రాత్మ (యోహాను 14:16-17). విశ్వాసులు దేవుని పిల్లలనే జ్ఞానాన్ని ఆత్మ వారికి ఇస్తాడు – రోమీయులకు 8:15-16. “తెలుసు”– వ 14,19; 1 యోహాను 2:5; 1 యోహాను 4:13.Shortcut Links
1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |