ఎవరిని తీసుకున్నప్పటికీ పాపంలో గానీ క్రీస్తులో గానీ ఉన్నారు. పాపంలో ఉన్నవారు పాపాన్ని తమ జీవితాల్లో అభ్యసిస్తారు. వారి బ్రతుకు తీరే పాపం. క్రీస్తులో ఉన్నవారు ఇలా చెయ్యలేరు. వారు ఆధ్యాత్మికంగా జన్మించారు (1 యోహాను 2:29); వారు న్యాయవంతుడైన దేవుని సంతానం కాబట్టి న్యాయవంతమైన స్వభావం వారికి ఉంది (1 యోహాను 3:1). దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు (1 యోహాను 4:13). అంతకుముందు ఉన్నట్టుగా వారు కొనసాగడం అసాధ్యం (ఎఫెసీయులకు 2:1-3). విశ్వాసులు కొన్నిసార్లు పాపంలో పడిపోతారు (1 యోహాను 1:7; 1 యోహాను 2:1; 1 యోహాను 5:16). అయితే ఉద్దేశ పూర్వకంగా అదొక జీవిత విధానంగా పాపంలో కొనసాగరు, కొనసాగలేరు (సామెతలు 24:16). వారు పాపం చేస్తే వారిలోని నూతన స్వభావం ఆ పాపానికి వ్యతిరేకంగా తిరగబడి, వారు దాన్ని అసహ్యించుకుని దానినుంచి బయట పడేందుకు ప్రయత్నించేలా చేస్తుంది. వారు అందులోనుంచి బయట పడాలని క్రీస్తు ప్రార్థిస్తున్నాడు (లూకా 22:31-32; యోహాను 17:17; హెబ్రీయులకు 7:25). వారిలో ఉన్న పవిత్రాత్మ వారు అందులోనుంచి బయట పడాలని వారిని ఒప్పిస్తూ, బలవంతపెడుతూ ఉంటాడు. వారు పాపంలో నిలిచి ఉంటే వారు క్రీస్తుకు చెందిన గొర్రెలు కారనీ, దేవుని మూలంగా పుట్టినవారు కారనీ అది తెలియజేస్తుంది. 2 పేతురు 2:22. దేవుని పిల్లలు, సైతాను పిల్లలకు పూర్తిగా వేరైనవారు. ఈ సత్యం వారి ప్రవర్తనలో కనబడుతూ ఉంటుంది.
“నిలిచి ఉండేవ్యక్తి”– మనమెంత సంపూర్ణంగా ఆయనలో నిలిచి ఉంటే అంత న్యాయవంతులుగా ఉంటాం. పాపం నుంచి అంతగా విడుదల అవుతూ ఉంటే, దేవుని తలంపులూ కోరికలూ అంత పరిపూర్ణంగా మనలో ఉంటాయి, అంత పూర్తిగా ఆయన సంకల్పం ప్రకారం నడుచుకుంటాం.