Revelation - ప్రకటన గ్రంథము 1 | View All

1. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
దానియేలు 2:28, దానియేలు 2:45

“ప్రత్యక్షం”– ఈ గ్రంథం మనుషులు కల్పించినది కాదు. ఇది దేవుడు పరలోకంనుంచి ఇచ్చినది – అంటే, దేవుడు దీన్ని రాయించాడు. దీనికి మూలాధారం దేవుడే గాని ఏ మనిషి మేధస్సూ కాదన్నమాట. యోహాను ఈ గ్రంథంలోని చిహ్నాలు, సూచనలు, సంకేతాలు, మాటలు వేటినీ మరే ఇతర సాహిత్యంలోనుంచి తీసుకోలేదు. యేసుప్రభువు దీనంతటినీ అతనికి వెల్లడి చేశాడు. “త్వరగా”– ఈ మాటను బట్టి ఈ గ్రంథం యోహాను కాలంలో, లేక ఆ తరువాత కొద్ది కాలానికి నెరవేరిందని అనుకోనవసరం లేదు. అప్పుడు అది నెరవేరడం ఆరంభమైందని కూడా అనుకోనవసరం లేదు. ప్రకటన గ్రంథం 22:7, ప్రకటన గ్రంథం 22:12, ప్రకటన గ్రంథం 22:20 పోల్చి చూడండి – మూడు సార్లు యేసు తాను “త్వరగా” రాబోతున్నానని చెప్పాడు గానీ ఆయన యోహాను రోజుల్లో, లేక ఆ తరువాత కొద్ది కాలానికి రాలేదు. ఇలా అయితే ఇక్కడ “త్వరగా”అంటే అర్థం ఏమిటి? వ్యాఖ్యాన కర్తలు వేరువేరు విధాలుగా దీన్ని వివరించి రాస్తారు. ఉదాహరణగా, త్వరగా అంటే దేవుని దృష్టిలో త్వరగా అని అర్థం (2 పేతురు 3:8 చూడండి. దేవుని లెక్క ప్రకారం యోహాను కాలంనుంచి మన కాలం వరకు రెండు దినాలు మాత్రమే గడిచాయి). లేక త్వరగా అనే మాటకు హఠాత్తుగా అని అర్థం అంటున్నారు కొందరు. అంటే, ఈ విషయాలు జరగడం ఆరంభమయ్యేటప్పుడు హఠాత్తుగా నెరవేరుతాయి (1 థెస్సలొనీకయులకు 5:2 పోల్చి చూడండి). లేక, పవిత్రాత్మ యోహానును దర్శనంలో ఈ యుగాంతానికి తీసుకుపోయాడు – ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగాయి. లేక, ఈ గ్రంథంలోని విషయాలు నెరవేరడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలో అయినా వీటి నెరవేర్పు ఆరంభం కావచ్చుననీ విశ్వాసులు సిద్ధంగా ఉంటూ మెళకువగా ప్రభువు రాకడకోసం చూస్తూ ఉండాలనీ సూచించేందుకు “త్వరగా” అనే మాటను దేవుడు ఇక్కడ ఉంచాడు (మత్తయి 24:36, మత్తయి 24:42-44 పోల్చి చూడండి). ఈ నోట్స్ రచయిత 4–22 అధ్యాయాల్లో వివరించబడిన సంఘటనలు ఈ యుగాంతంలోనే జరగ బోతున్నాయని నమ్ముతున్నాడు. “తన దాసులకు”– రోమీయులకు 6:17-22 లో క్రీస్తు విశ్వాసులందరూ దేవుని దాసులని పౌలు చెప్పాడు. ఈ గ్రంథం వారందరి కోసం రాసి ఉంది. “చూపించడానికి”– దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చింది భవిష్యత్తును వెల్లడి చేయడం కోసమే గాని దాన్ని మరుగు చేయడం కోసం కాదు. మనం దీన్ని గ్రహించాలనే గానీ దీన్ని చదివి కలవరపడాలని కాదు. “దూతను”– దూత, దూతలు, దేవదూత, దేవదూతలు అనే పదాలు ఈ గ్రంథంలో దాదాపు 80 సార్లు కనిపిస్తున్నాయి. బైబిలంతటిలో సుమారు 300సార్లు కనిపిస్తున్నాయి. దేవదూతలు ఆత్మ రూపులైన ప్రాణులు. సాధారణంగా మనుషులు వారిని చూడరు గాని అప్పుడప్పుడూ వారు మానవ రూపంతో కనబడుతారు. దేవదూతలు మనం లెక్క పెట్టలేనంతమంది (ప్రకటన గ్రంథం 5:11)

2. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.

ఇక్కడ “దేవుని వాక్కు”, “యేసు క్రీస్తు సాక్ష్యం” అంటే ఈ ప్రకటన గ్రంథమని అర్థం. యేసు క్రీస్తు దేవుని ఆఖరు గొప్ప ప్రవక్త – ద్వితీయోపదేశకాండము 18:18-19; మత్తయి 1:1; యోహాను 7:16; హెబ్రీయులకు 1:2 నోట్స్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆరంభించిన ఈ సేవను (భవిష్యత్తును, దేవుని సత్యాన్ని తెలియజేసే సేవ) ఈ గ్రంథంలో ఇంకా చేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం ఆయన సంపూర్ణ అధికారంతో వచ్చింది.

3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

“దేవుని మూలంగా కలిగిన ఈ వాక్కులు”– ప్రకటన గ్రంథం 22:7, ప్రకటన గ్రంథం 22:10, ప్రకటన గ్రంథం 22:18-19. బైబిలు లోని ప్రతి గ్రంథమూ దైవావేశంవల్ల కలిగినా (2 తిమోతికి 3:16), క్రొత్త ఒడంబడికలో ఈ ఒక్క గ్రంథమే దేవుని మూలంగా కలిగిన వాక్కని చెప్పబడింది. “ధన్య జీవి”– ఈ గ్రంథాన్ని చదివి ఇందులో ఉన్న సత్యానికి విధేయులై ఉండేవారికే ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. దేవుడు వెల్లడించిన రహస్య సత్యాలను అర్థం చేసుకొందామనే ఉద్దేశం మాత్రమే మనకుంటే దీన్ని చదవడంవల్ల దీవెన రాదు. ధన్యత, దీవెన గురించి ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1-3; మత్తయి 5:3-10; లూకా 11:28 నోట్స్ చూడండి. దేవుడు ఈ గ్రంథం గురించి ప్రత్యేక ఆశీర్వాదం పలికినందుచేత మనమంతా దీన్ని చదివి దీనిలోని సత్యాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహం పొందాలి. “సమయం సమీపంగా ఉంది”– వ 1లో “త్వరగా” అనే మాటలాగానే ఈ మాటలు కూడా ఈ గ్రంథంలోని విషయాలను యోహాను రాసినప్పుడు నెరవేరడం ఆరంభం కాలేదని సూచిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 22:10; రోమీయులకు 13:12; మత్తయి 24:33; 1 పేతురు 4:7; యోవేలు 1:15 పోల్చి చూడండి.

4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
నిర్గమకాండము 3:14, యెషయా 41:4

“ఆసియా”– అపో. కార్యములు 1:4 నోట్. “ఏడు సంఘాలకు”– వ 11. ఆసియా రాష్ట్రంలో ఏడుకంటే ఎక్కువ సంఘాలున్నాయి (ఉదా।। కొలస్సయిలోని సంఘం). అయినా ఈ ఏడు సంఘాలను ఆసియాలోని సంఘాలన్నిటికీ (ఆ మాటకొస్తే లోకంమంతటా ఉన్న సంఘాలన్నిటికీ – వ 20 నోట్ చూడండి) ప్రతినిధులుగా దేవుడు ఎన్నుకొన్నాడు. సంఘం గురించి నోట్స్ మత్తయి 16:18. “యోహాను”– పీఠికను చూడండి. “పూర్వముండి...వచ్చేవానినుంచి”– తండ్రి అయిన దేవునినుంచి అని అర్థం. “ఏడు ఆత్మలనుంచి”– ప్రకటన గ్రంథం 3:1; ప్రకటన గ్రంథం 4:5; ప్రకటన గ్రంథం 5:6. ఈ ఆశీర్వాదం ఇవ్వడంలో ఈ ఏడు ఆత్మలు తండ్రి అయిన దేవునితో, యేసుప్రభువుతో పాటు కనబడడంవల్ల, వారిలాగే అనుగ్రహానికీ శాంతికీ మూలాధారమై ఉండడంవల్ల ఇవి దేవుని ఏకైక పవిత్రాత్మకు సూచనగా ఉన్నాయని నిస్సందేహంగా నమ్మవచ్చు. ఇక్కడ యోహాను త్రిత్వాన్ని గురించి రాస్తున్నాడు (మత్తయి 3:16-17 నోట్స్ చూడండి). ఈ గ్రంథంలో “ఏడు” అనే సంఖ్య పరిపూర్ణతను, సంపూర్ణతను సూచించే చిహ్నంగా తరచుగా వాడబడింది (ప్రకటన గ్రంథం 1:11-12, ప్రకటన గ్రంథం 1:16, ప్రకటన గ్రంథం 1:20; ప్రకటన గ్రంథం 4:5; ప్రకటన గ్రంథం 5:1, ప్రకటన గ్రంథం 5:6; ప్రకటన గ్రంథం 8:2; ప్రకటన గ్రంథం 10:3; ప్రకటన గ్రంథం 12:3; ప్రకటన గ్రంథం 13:1; ప్రకటన గ్రంథం 15:1, ప్రకటన గ్రంథం 15:7). “యేసు క్రీస్తునుంచి”– శాశ్వతుడైన దేవుని కుమారుడు, తండ్రితో పవిత్రాత్మతో ఏక దేవుడుగా ఉన్న త్రిత్వంలో ఒకడు. “అనుగ్రహం, శాంతి”– రోమీయులకు 1:2; మొ।।.

5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
కీర్తనల గ్రంథము 89:27, కీర్తనల గ్రంథము 89:37, కీర్తనల గ్రంథము 130:8, యెషయా 40:2

“నమ్మకమైన సాక్షి”– సాక్షి అంటే నిజం తెలిసి చెప్పేవాడు. నమ్మకమైన సాక్షి అంటే దేన్నీ దాచక నిజమంతా పూర్తిగా చెప్పేవాడు. మనం తెలుసుకోవలసిన సత్యం, మన మేలుకోసం ఉండగలిగేదేదీ దాచకుండా, పూర్తిగా చెపుతాడు యేసుప్రభువు. “లేచినవాడు”– మత్తయి 28:6; 1 కోరింథీయులకు 15:1-8; ఫిలిప్పీయులకు 2:9-11. “పరిపాలించేవాడు”– ప్రకటన గ్రంథం 19:16; సామెతలు 21:1; దానియేలు 4:34-35; దానియేలు 5:21. ఈ గ్రంథంలోని సంఘటనల్లో ఏవి తమ అదుపులో ఉన్నాయని భూరాజులు అనుకొంటారో అవి వారి పరిపాలకుడైన యేసు క్రీస్తు అదుపులోనే ఉంటాయి. “ప్రేమిస్తూ ఉన్నాడు”– రోమీయులకు 5:8; రోమీయులకు 8:37; గలతియులకు 2:20; ఎఫెసీయులకు 3:18-19; ఎఫెసీయులకు 5:2. “రక్తం”– మత్తయి 26:28; రోమీయులకు 3:25; హెబ్రీయులకు 9:12; హెబ్రీయులకు 10:19. “విడిపించాడు”– మత్తయి 20:28; లూకా 4:18; యోహాను 8:34-36; రోమీయులకు 6:18; గలతియులకు 1:4.

6. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
నిర్గమకాండము 19:6, యెషయా 61:6

“రాజులుగా”– ప్రకటన గ్రంథం 2:26-27; ప్రకటన గ్రంథం 3:21; ప్రకటన గ్రంథం 20:4; 2 తిమోతికి 2:12; మత్తయి 19:28-30. “యాజులు”– ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 7:15; 1 పేతురు 2:5, 1 పేతురు 2:9. “మహిమ, అధికారం”– ప్రకటన గ్రంథం 4:11; ప్రకటన గ్రంథం 5:12-13; రోమీయులకు 11:36; రోమీయులకు 16:27. “తథాస్తు”– గ్రీకులో “ఆమేన్”. ఆమేన్ సత్యమనే అర్థమిచ్చే హీబ్రూ పదంనుంచి వచ్చింది. దాని అర్థం “అలా అవుతుంది గాక”, “అలా జరగాలి”.

7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.
యెషయా 19:1, దానియేలు 7:13, జెకర్యా 12:10, జెకర్యా 12:12

8. అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ఆమోసు 4:13, నిర్గమకాండము 3:14, యెషయా 41:4

“అల్ఫా, ఓమెగ”– ఇక్కడ ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 22:13 లో యేసు తన గురించి ఇదే మాటలు పలికాడు. అంటే తాను ప్రభువైన దేవుడని ఆయనకు తెలుసునన్నమాట. గ్రీకు అక్షరమాలలో అల్ఫా మొదటి అక్షరం, ఓమెగ చివరి అక్షరం. దేవుడు సమస్తానికి ఆది, అంతం. రోమీయులకు 11:36; యెషయా 44:6. క్రీస్తు దేవత్వాన్ని గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్ చూడండి.

9. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

ఈ లోకంలో యేసు రాజ్యంతో కలిసి ఉన్న రెండు విషయాలను గమనించండి. “బాధలలో”– ప్రకటన గ్రంథం 2:9-10; ప్రకటన గ్రంథం 7:14; మత్తయి 5:10; యోహాను 16:33; అపో. కార్యములు 14:22; రోమీయులకు 8:17; 1 పేతురు 4:1, 1 పేతురు 4:12. “ఓర్పులో”– ప్రకటన గ్రంథం 2:2-3, ప్రకటన గ్రంథం 2:19; ప్రకటన గ్రంథం 3:10; ప్రకటన గ్రంథం 13:10; ప్రకటన గ్రంథం 14:12; రోమీయులకు 5:3-4; రోమీయులకు 8:25; 2 కోరింథీయులకు 1:6; 2 తిమోతికి 2:12; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 10:36; యాకోబు 1:3. “పత్మాసు”– ప్రస్తుతం టర్కీ అనబడిన భూభాగం సముద్ర తీరంనుంచి ఎఫెసు నగరానికి నైరుతి దిక్కున దాదాపు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న లంక. యోహాను దేవుని వాక్కును, క్రీస్తు శుభవార్తను ప్రకటించినందుచేత రోమ్ అధికారులు అతణ్ణి దానిలో ఉంచడంద్వారా శిక్షించారు.

10. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము

“ప్రభు దినాన”– ఇక్కడ వారానికి మొదటి దినమైన ఆదివారం నాడు, యేసు మరణంనుంచి లేచిన దినం అని అర్థం – మత్తయి 28:1-6. “ఆత్మ వశుణ్ణయ్యాను”– ప్రకటన గ్రంథం 4:2; ప్రకటన గ్రంథం 17:3; ప్రకటన గ్రంథం 21:10. దేవుని ఆత్మ యోహానుకు అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని, కనబడనివాటి గురించిన దర్శనాన్ని ఇచ్చాడు. యెహెఙ్కేలు 1:1; దానియేలు 8:1; అపో. కార్యములు 10:10-11 పోల్చి చూడండి.

11. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.

వ 4 నోట్ చూడండి.

12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

“ఏడు”– వ 4 నోట్. “బంగారు దీపస్తంభాలు”– ఈ ఏడు సంఘాలకు ఇవి తగిన చిహ్నాలుగా ఉన్నాయి (వ 20; మత్తయి 5:14). నిర్గమకాండము 25:31-40 పోల్చి చూడండి.

13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
కీర్తనల గ్రంథము 45:2, యెహెఙ్కేలు 1:26, యెహెఙ్కేలు 8:2, యెహెఙ్కేలు 9:2, యెహెఙ్కేలు 9:11, దానియేలు 10:5, దానియేలు 7:13

“మానవ పుత్రుడి”– దానియేలు 7:13; మత్తయి 8:20 (నోట్‌). “నిలువుటంగీ...బంగారు దట్టి”– బహుశా ఈ వివరణ క్రీస్తును తన ప్రజల ప్రముఖ యాజిగా సూచించవచ్చు. నిర్గమకాండము 28:4 పోల్చి చూడండి.

14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
దానియేలు 7:9, దానియేలు 10:6

“ఉన్ని”– దానియేలు 7:9 పోల్చి చూడండి. “మంటల్లాంటివి”– ప్రకటన గ్రంథం 2:18; ప్రకటన గ్రంథం 19:12; దానియేలు 10:6. ఒక వ్యక్తి కళ్ళు ఆ వ్యక్తి గుణం గురించి కొంత తెలియజేస్తాయి. ఇక్కడ క్రీస్తు కళ్ళు ఆయన స్వభావానికున్న మంటల్లాంటి పవిత్రతనూ, మనుషుల రహస్య విషయాలన్నిటినీ తెలుసుకోగల ఆయన సామర్థ్యాన్నీ తెలియజేస్తున్నాయి.

15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
యెహెఙ్కేలు 1:24, యెహెఙ్కేలు 43:2

“కంచు”– దానియేలు 10:6. సంఘాల మధ్యలో నడుస్తున్నవాని పాదాలు ఎర్రగా మండుతున్న లోహమంత శుద్ధి గలవి. “జల ప్రవాహాల ధ్వని”– యెహెఙ్కేలు 43:2. క్రీస్తు స్వరం ఇస్రాయేల్ ప్రజల దేవుని స్వరాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది అధిక బలం గలది, తిరుగులేనిది (కీర్తనల గ్రంథము 29:3-10 పోల్చి చూడండి).

16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
న్యాయాధిపతులు 5:31, యెషయా 49:2

“ఏడు నక్షత్రాలు”– వ 20 నోట్. “ఖడ్గం”– ప్రకటన గ్రంథం 2:12, ప్రకటన గ్రంథం 2:16; ప్రకటన గ్రంథం 19:15, ప్రకటన గ్రంథం 19:21 – దేవుని వాక్కుకు చిహ్నంగా ఉంది (హెబ్రీయులకు 4:12; ఎఫెసీయులకు 6:17). అది యుద్ధాన్ని సూచిస్తుంది. ఇక్కడ దుర్మార్గతతో దేవుని పోరాటానికి గుర్తుగా ఉంది. క్రీస్తు మాట్లాడితే చాలు – దేవుని తీర్పు జరుగుతుంది. “సూర్య మండలం”– మత్తయి 17:2. ఇది క్రీస్తు మహిమా ప్రకాశాన్నీ వైభవాన్నీ సూచిస్తుంది. ఆయన దేవుని మహిమా తేజస్సు (హెబ్రీయులకు 1:3; 2 కోరింథీయులకు 4:4). ఈ వెలుగువల్ల సౌలు దమస్కు దారిలో గుడ్డివాడయ్యాడు (అపో. కార్యములు 9:3-8; అపో. కార్యములు 22:11).

17. నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
యెషయా 44:6, యెషయా 48:12, దానియేలు 10:19

“ఆయన పాదాల దగ్గర”– మనమంతా ఉండవలసినది అక్కడే. యోహాను ఆయనను చూచిన విధంగా మనం చూస్తే అక్కడే ఉంటాం. యెహెఙ్కేలు 1:28 పోల్చి చూడండి. “భయపడకు”– మత్తయి 17:7; మత్తయి 14:27. “మొదటివాణ్ణి, చివరివాణ్ణి”– ఈ మాటలు నిజంగా చెప్పగలవాడు దేవుడొక్కడే. వ 8; యెషయా 44:6; యెషయా 48:12-13; ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 చూడండి.

18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

“సజీవుణ్ణి”– ఇది సజీవుడైన దేవుని గురించిన మాట (కీర్తనల గ్రంథము 42:2; యిర్మియా 10:10; మత్తయి 16:16; 2 కోరింథీయులకు 6:16; 1 థెస్సలొనీకయులకు 1:9). ఇక్కడ తానే ఆ దేవుణ్ణని యేసు చెపుతున్నాడు. “చనిపోయాను”– మత్తయి 27:50; మార్కు 15:44-45; 1 కోరింథీయులకు 15:3. “జీవిస్తూ ఉన్నాను”– ప్రకటన గ్రంథం 4:9; మత్తయి 28:6; రోమీయులకు 6:9-10. “మరణ...తాళం చెవులు”– చనిపోయినవారి అదృశ్య లోకంపై క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఉంది. మరెవరికీ ఏ అధికారమూ లేదు.

19. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
యెషయా 48:6, దానియేలు 2:29, దానియేలు 2:45

యోహాను రాసిన ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు: “చూచినవీ” – ఈ అధ్యాయంలోని క్రీస్తును గురించిన దర్శనం. “ఉండబోయేవీ” – సంఘాల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా వికసించిన తరువాత జరగబోయేవి (ప్రకటన గ్రంథం 4:1-11). “ఉన్నవీ” – ఏడు సంఘాలలో ఉన్న పరిస్థితులు (2,3 అధ్యాయాలు). ఇవి ఈ యుగమంతట్లో కనబడే పరిస్థితులు.

20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.

“రహస్య సత్యం”– దేవుడు వెల్లడించిన సత్యం, ఆయన వెల్లడించని పక్షంలో మనుషులు తెలుసుకోలేని సత్యం. “దూతలు”– ప్రభువు ఎవరిద్వారా మాట్లాడుతాడో వారు, ఆయన ఎవరిని సంఘాలకు ప్రతినిధులుగా బాధ్యులని ఎంచుతాడో వారు. “ఏడు సంఘాలు”– వ 4,11. ఈ సంఘాలు చరిత్రలో యోహాను కాలంలో ఉన్న సంఘాలు. 2,3 అధ్యాయాల్లోని సందేశాలు వాటికి అవసరం. అయితే వేరే విధంగా ఈ సంఘాలను చూడవచ్చు – అవి ఆ కాలంలో క్రీస్తుకు చెందిన అన్ని సంఘాలకూ, ఈ యుగమంతట్లో ఉన్న అలాంటి అన్ని సంఘాలకూ ప్రతినిధులుగా ఉన్నాయి. ఏడు అనే సంఖ్య అర్థవంతమైనది. అది సంపూర్ణతను, పూర్తి సంఖ్యను సూచిస్తుంది. ఏడు ఆత్మలు ఏ విధంగా ఒకే ఒక పవిత్రాత్మకు చిహ్నంగా ఉన్నాయో (4 వ), అదే విధంగా ఈ ఏడు సంఘాలు లోకంలో కనిపిస్తున్న క్రైస్తవ సంఘమంతటికీ చిహ్నంగా ఉండవచ్చు. క్రీస్తు ఏడు నక్షత్రాలు చేతపట్టుకొని ఆ ఏడు దీప స్తంభాల మధ్య నిలబడి ఉండడం అన్నది కూడా దీన్ని సూచిస్తుంది. క్రీస్తు సంరక్షణలో ఉన్నవి అక్షరాలా ఆ ఏడు సంఘాలు మాత్రమేనా? ఇప్పుడు కూడా ఏమీ లేవా? ఉన్నాయి గదా. ఈ ఏడు దీపస్తంభాలు (సంఘాలు) క్రీస్తు సంఘాలన్నిటికీ ప్రతినిధులని తేటతెల్లం కాదా? మన రోజుల్లో కూడా మనం ఈ ఏడు రకాల సంఘాలను చూడగలమని అనుకోవడం తప్పు కాదు. కొందరు వ్యాఖ్యానకర్తలు ఈ ఏడు సంఘాలకు మరింకొక అర్థం ఉందని నేర్పారు. ఇవి లోకంలో కంటికి కనిపించే మొత్తం సంఘం మొదటి నుంచి చివరి వరకు ఎలా ఉంటుందో చూపడానికి వాటిని గురించి రాసివున్న విషయాలు భవిష్యద్వాక్కులని వారి అభిప్రాయం. అంటే వారి దృష్టిలో సంఘం ఒకదాని తరువాత ఒకటి ఏడు దశల్లో సాగిపోవాలి; ఆ ఏడు కాలాలను సూచించేందుకు ప్రభువు ఎఫెసు సంఘంతో ఆరంభించి లవొదికయ సంఘంతో ముగిస్తూ పరిపూర్ణమైన క్రమంగా ఈ ఏడు సంఘాలను ఎన్నుకొన్నాడు. మొదటి కాలంలో మొత్తానికి సంఘమంతా ఎఫెసు సంఘంలాగా ఉంది, చివరి కాలంలో మొత్తానికి సంఘమంతా లవొదికయ సంఘంలాగా ఉంటుందన్నమాట. ఈ ఏడు సంఘాలకు ఇలాంటి అర్థం ఉందా? ఉండవచ్చు. అది అసాధ్యమని చెప్పకూడదు. సంఘచరిత్రకూ తరువాతి రెండు అధ్యాయాల్లోని ఏడు సంఘాల గురించి రాసి ఉన్న విషయాలకూ కొంతవరకు పొందిక ఉన్నట్టుంది. అయితే అది ఎలా ఉన్నా, ముఖ్యంగా మనం గమనించవలసినది ఏడు సంఘాలకు యేసు రాయించి పంపిన లేఖలు వ్యక్తిగతంగా మనతో, ఇప్పుడున్న మన సంఘాలతో ఏమేమి చెపుతున్నాయో అది.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |