Revelation - ప్రకటన గ్రంథము 19 | View All

1. అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;
కీర్తనల గ్రంథము 104:35

“హల్లెలూయా”– ఈ మాట క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ అధ్యాయంలోని మొదటి ఆరు వచనాల్లో మాత్రమే కనిపిస్తున్నది. ఈ మాట రెండూ హీబ్రూ మాటల నుంచి వచ్చింది – హల్లెల్ (అంటే స్తుతి), యా (యెహోవాను సుచించే పేరు). ఈ మాటను “ప్రభువుకు స్తుతి!” అని అనువదించవచ్చు. “దేవునివే”– ప్రకటన గ్రంథం 4:11; ప్రకటన గ్రంథం 5:12; ప్రకటన గ్రంథం 7:10, ప్రకటన గ్రంథం 7:12.

2. ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి.
ద్వితీయోపదేశకాండము 32:43, 2 రాజులు 9:7, కీర్తనల గ్రంథము 19:9, కీర్తనల గ్రంథము 79:10, కీర్తనల గ్రంథము 119:137

“సత్యమైనది, న్యాయమైనవి”– ప్రకటన గ్రంథం 15:3; ప్రకటన గ్రంథం 16:5, ప్రకటన గ్రంథం 16:7. “వ్యభిచారం”– ప్రకటన గ్రంథం 17:2, ప్రకటన గ్రంథం 17:5. “ప్రతిక్రియ”– ప్రకటన గ్రంథం 6:10; ప్రకటన గ్రంథం 17:6; ప్రకటన గ్రంథం 18:20. ప్రతీకారం చేయడం మన పని కాదు గాని దేవుడు అలా చేస్తే పరలోకంలో మహానందం కలుగుతుంది. ప్రతిక్రియ చేయడం అంటే జగత్తు మేలు కోసం దేవుడు పరిపూర్ణ న్యాయంతో వ్యవహరించడమని పరలోక నివాసులంతా గుర్తిస్తారు.

3. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
యెషయా 34:10

“యుగయుగాలకు”– ప్రకటన గ్రంథం 14:11. మహా బబులోను లేచి మళ్ళీ లోకాన్ని చెడగొట్టి నిజ విశ్వాసులను హింసించడం మరెన్నటికీ జరగదని వారు దేవుణ్ణి స్తుతిస్తారు.

4. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్‌, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
1 రాజులు 22:19, 2 దినవృత్తాంతములు 18:18, కీర్తనల గ్రంథము 47:8, యెషయా 6:1, యెహెఙ్కేలు 1:26-27

“పెద్దలూ...ప్రాణులు”– ప్రకటన గ్రంథం 4:4, ప్రకటన గ్రంథం 4:6-8. “తథాస్తు”– ప్రకటన గ్రంథం 1:6.

5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.
కీర్తనల గ్రంథము 22:23, కీర్తనల గ్రంథము 115:13, కీర్తనల గ్రంథము 134:1, కీర్తనల గ్రంథము 135:1

“సింహాసనం నుంచి”– ప్రకటన గ్రంథం 16:17; ప్రకటన గ్రంథం 21:3. “భయభక్తులు”– ప్రకటన గ్రంథం 14:7; ప్రకటన గ్రంథం 15:4; ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; మొ।। నోట్స్. “దేవుణ్ణి స్తుతించండి”– కీర్తనల గ్రంథము 33:1-3 నోట్స్.

6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
జెకర్యా 14:9, నిర్గమకాండము 15:18, కీర్తనల గ్రంథము 22:28, కీర్తనల గ్రంథము 93:1, కీర్తనల గ్రంథము 99:1, యెహెఙ్కేలు 1:24, యెహెఙ్కేలు 43:2, దానియేలు 7:14, దానియేలు 10:6

“రాజ్య పరిపాలన”– ప్రకటన గ్రంథం 11:15. గొప్ప సంస్తుతికి, మహానందానికి ఇందులో మంచి కారణం కనిపిస్తున్నది. దేవుడు లోకమంతటి మీదా మహా రాజు. లోకంలోని అన్ని రకాల భ్రష్టమైన, దుర్మార్గమైన శక్తులను, అవి లౌకికమైనవి గానీ మత సంబంధమైనవి గానీ వాటిన్నటినీ నాశనం చేయడం మూలాన తానే మహా రాజునని బయలు పరుచుకుంటాడు.

7. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
కీర్తనల గ్రంథము 97:1

“మహా వేశ్య” తీర్పుకూ నాశనానికీ గురి అయింది. ఇప్పుడు గొర్రెపిల్ల పవిత్ర వధువు కనిపిస్తున్నది. “వివాహోత్సవం”– ఈ యుగమంతట్లో విశ్వాసులందరి విషయంలో ఏది నిజమో అది ఆ రాబోయే రోజున బహిరంగంగా ప్రత్యక్షంగా అందరికీ కనబడుతుంది. ఇప్పుడు ప్రతి నిజ విశ్వాసికీ క్రీస్తుతో ఐక్యత ఉంది. క్రీస్తు “భార్య”ను రోమీయులకు 12:4-5; 1 కోరింథీయులకు 12:12; ఎఫెసీయులకు 1:23; ఎఫెసీయులకు 5:23; కొలొస్సయులకు 1:18 లో క్రీస్తు “శరీరం” అన్నాడు పౌలు. ఈ అంశం గురించి మత్తయి 22:2-14; యోహాను 3:29; యోహాను 17:20-23; రోమీయులకు 6:3; రోమీయులకు 7:4; 2 కోరింథీయులకు 11:2; ఎఫెసీయులకు 5:22-32 చూడండి. పాత ఒడంబడిక గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజను యెహోవా భార్య అనడం జరిగింది (యెషయా 54:5-7; యిర్మియా 3:14, యిర్మియా 3:20; యిర్మియా 31:32; హోషేయ 2:16, హోషేయ 2:19-20). పరమ గీతంపై, కీర్తనల గ్రంథము 45:8-17 పై రాసిన నోట్స్ కూడా చూడండి. “తనను సిద్ధంగా చేసుకొంది”– ఎఫెసీయులకు 5:26-27 పోల్చి చూడండి. అక్కడ తన భార్యను సిద్ధం చేసేది క్రీస్తే అని రాసివుంది. అలాగైతే తనను తాను సిద్ధంగా చేసుకొంది అన్నమాట అర్థమేమిటి? ఆమె ఆయనతో పని చేస్తూ ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా అలా చేసుకొంటున్నది.

8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
యెషయా 61:10

“న్యాయ క్రియలు”– విశ్వాసులకు క్రీస్తు నీతిన్యాయాలు ఉన్నాయి (రోమీయులకు 3:21-26; 1 కోరింథీయులకు 1:30; 2 కోరింథీయులకు 5:21; ఫిలిప్పీయులకు 3:9). ఇది నిజమని వారు వారి న్యాయక్రియల మూలంగా ప్రదర్శిస్తారు. ఈ అంశం గురించి మత్తయి 5:6; మత్తయి 25:34-40; రోమీయులకు 2:6-10; యాకోబు 2:14-26 చూడండి. న్యాయ క్రియలు లేకపోతే అసలైన నమ్మకం లేదన్నమాట. అలాంటివారు ప్రభువును కలుసుకోవడానికి సిద్ధంగా ఉండరు.

9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.

“పిలుపు అందినవారు”– ఈ పిలుపు లోకంలో అంతటా ఉన్న మనుషుల కోసమైన ఆహ్వానం కాదు. ఆ ఆహ్వానాన్ని చాలామంది తృణీకరిస్తారు (మత్తయి 22:2-7; లూకా 14:16-24 పోల్చి చూడండి). ఈ పిలుపు పరలోకంలోని ప్రత్యేకమైన ఆహ్వానం. ఇహలోకంలో వచ్చిన ఆహ్వానాన్ని అంతకుముందు అంగీకరించినవారి కోసమే ఇది. ఈ పిలుపు అందిన ప్రతి వ్యక్తీ ఆ పెళ్ళి విందులో తప్పక హాజరవుతారు. ఈ పిలుపు అందినవారు ఎవరు? వారు గొర్రెపిల్ల భార్య కాదని అనుకోవడానికి మంచి కారణం ఉందా? “భార్య” అనే చిహ్నం క్రీస్తు విశ్వాసులను ఏకంగా ఒక గుంపుగా సూచిస్తుంది. “పిలుపు అందినవారు” అనే మాట వారిని వ్యక్తులుగా సూచిస్తుంది. మత్తయి 22:2-14 లో రాజు ఇచ్చిన ఆహ్వానం అంగీకరించి వచ్చి, రాజు ఇచ్చే పెళ్ళి వస్త్రం ధరించినవారంతా ఒక గుంపుగా రాకుమారునికి భార్యగా ఉన్నారు. పిలుపుకు లోబడి వచ్చినవారూ భార్యా ఒకటే అన్నమాట. వారు పిలుపుకు లోబడడం ద్వారా తాము “భార్య”లో విభాగాలు అని ప్రదర్శిస్తున్నారు (రోమీయులకు 12:5; 1 కోరింథీయులకు 12:13 పోల్చి చూడండి). “ధన్యులు”– ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1; మత్తయి 5:3 నోట్స్. “దేవుని సత్య వాక్కులు”– దేవదూత కల్పించినవి కావన్నమాట. బైబిలంతట్లోనూ దేవుడు మాట్లాడాడు (హెబ్రీయులకు 1:1-2). ఆయన వాక్కుమీద విశ్వాసులు ఆధారపడి ఆనందించగలరు.

10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.

ఈ దేవదూత ప్రకటన గ్రంథం 18:1 లో కనిపించిన దేవదూత అయితే బహుశా అతని వైభవం, అధికారంతో వచ్చిన మాటల కారణంగా అతడు క్రీస్తని తప్పుగా భావించాడేమో యోహాను. “వద్దు సుమా”– ఇతరులు తనను పూజించాలని సైతానుకున్న కోరిక ఏ మంచి దేవదూతకూ ఏ మంచి మనిషికీ లేదు (మత్తయి 4:9 చూడండి). మంచివారంతా, న్యాయవంతులంతా తమను కాదు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలంటారు. పూజను అందుకొనే ఏ మనిషి అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే తన దుర్మార్గత బయట పెడుతున్నాడు. “ప్రవక్తల సందేశ సారం”– క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పేవారెవరైనా దేవుని గొప్ప ప్రవక్తల పరిచర్యలో పాల్గొంటున్నారు.

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
కీర్తనల గ్రంథము 96:13, యెషయా 2:4, యెషయా 11:4, యెషయా 59:16, యెహెఙ్కేలు 1:1, జెకర్యా 1:8, జెకర్యా 6:2-3, జెకర్యా 6:6

మహా వేశ్య తీర్పుకు గురి అయింది. ఇప్పుడు లోకాన్ని దుర్మార్గత దాస్యం నుంచి విడిపించడానికి దుష్ట త్రిత్వమైన మహా సర్పాన్నీ మృగాన్నీ అబద్ధ ప్రవక్తనూ శిక్షించే సమయం వచ్చింది. క్రీస్తు రెండో రాకడ సమయంలో ఇలా చేస్తాడు (వ 20; ప్రకటన గ్రంథం 20:1-3). ఈ వచనంలో క్రీస్తు హఠాత్తుగా లోకానికి రావడం కనిపిస్తున్నది. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటివరకూ క్రీస్తు విశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్న సంఘటన ఇది. ప్రకటన గ్రంథం 1:7 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. “తెల్లని గుర్రం”– ప్రకటన గ్రంథం 6:2 లో తెల్లని గుర్రం మీద కనబడ్డవాడికీ ఈ తెల్లని గుర్రం మీద కూచుని ఉన్నవ్యక్తికీ ఎంతో వ్యత్యాసం ఉంది. “సత్యవంతుడు”– ప్రకటన గ్రంథం 1:5; ప్రకటన గ్రంథం 3:14 – ఎవరో కాదు, యేసు క్రీస్తే. మహా వేశ్య, మృగం, కపట ప్రవక్తలాగా ఆయన విశ్వసనీయత లేనివాడుగా కపటిగా ఉండడు. “యుద్ధం చేస్తూ”– ప్రకటన గ్రంథం 17:14; నిర్గమకాండము 15:3; యెహోషువ 10:42; యెహోషువ 23:3; కీర్తనల గ్రంథము 45:3-7; యెషయా 11:4. క్రీస్తు తన లోకంకోసం, తన ప్రజలకోసం యుద్ధం చేస్తాడు. ఆయన గెలుస్తాడు కూడా. ఈ రెండో రాకడను ఆయన మొదటి రాకడతో, గాడిద పిల్లమీద జెరుసలంలోకి ఆయన ప్రవేశంతో పోల్చి చూడండి (లూకా 2:7; మత్తయి 2:1-5).

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
దానియేలు 10:6

“మంటలలాంటివి”– ప్రకటన గ్రంథం 1:14. “అనేక కిరీటాలు”– రాజులు ధరించే కిరీటం యేసుప్రభువు ధరించిన సంతతి క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కనిపిస్తున్నది ఈ ఒక్క వచనంలోనే. ఇది ఆయన లోకాన్ని పరిపాలించేందుకు రాబోయే సందర్భంలో కనిపిస్తున్నది. “మరెవ్వరికీ...తెలియదు”– క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా పూర్తిగా తెలుసుకోగలవాడు దేవుడు ఒక్కడే (మత్తయి 11:27).

13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
యెషయా 63:1-3

“రక్తంలో ముంచినది”– ఇది బహుశా పాపులకోసం తన రక్తాన్ని కార్చిన యేసును విమోచకుడుగా సూచించవచ్చు (మత్తయి 26:28; రోమీయులకు 3:24-25; ఎఫెసీయులకు 1:7). కొందరు పండితులు ఇది క్రీస్తును యోధుడుగా, ఆయన శత్రువుల ఓటమిని సూచిస్తున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయం వ 15లో కనిపిస్తుంది. “దేవుని వాక్కు”– యోహాను 1:1, యోహాను 1:14.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

“సైన్యాలు”– అంటే నిస్సందేహంగా ఆయన దేవదూతలే (మత్తయి 16:27; మత్తయి 25:31; 2 థెస్సలొనీకయులకు 1:7). బహుశా ఆయన విశ్వాసులు కూడా (ప్రకటన గ్రంథం 17:14; 1 థెస్సలొనీకయులకు 3:13 నోట్ చూడండి). ఈ గ్రంథంలో ఇలాంటి శుభ్రమైన దుస్తులు దేవదూతలు, విశ్వాసులు కూడా ధరించేవి (వ 8; ప్రకటన గ్రంథం 15:6).

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
యెషయా 11:4, కీర్తనల గ్రంథము 2:8-9, యెషయా 49:2, యెషయా 63:3, విలాపవాక్యములు 1:15, యోవేలు 3:13, ఆమోసు 4:13

ప్రకటన గ్రంథం 1:16 నోట్. “కొట్టడానికి”– 2 థెస్సలొనీకయులకు 2:8; యెషయా 11:4. “ఇనుప దండం”– ప్రకటన గ్రంథం 2:27; కీర్తనల గ్రంథము 2:9. లోక జాతులపై ఆయన పరిపాలన ఆయన రెండో సారి వచ్చిన తరువాత జరుగుతుందని స్పష్టంగా ఉంది. “ఉగ్రత...తొట్టి”– ప్రకటన గ్రంథం 14:19; యెషయా 63:1-4.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
ద్వితీయోపదేశకాండము 10:17, దానియేలు 2:47, ఆమోసు 4:13

“ఆయన తొడమీద ఈ పేరు రాసివుంది”– క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు (ప్రకటన గ్రంథం 17:14). మరొకరికి చెందిన పేరు ఆయన ధరించడు. ఆయన ఇలా రావడం విశ్వాసుల దివ్యమైన ఆశాభావం నెరవేర్పు, గొప్ప దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు మహిమా ప్రత్యక్షత (తీతుకు 2:13). క్రీస్తు దేవత్వాన్ని గురించిన ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6 నోట్‌లో ఉన్నాయి. “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు”– రాజులు, ప్రభువులు అనబడ్డ వారందరికంటే మించినవాడన్నమాట. దేవుని స్వభావంలో భాగస్వామి కాని వ్యక్తి విషయం బైబిలులో ఇలా చెప్పడం సాధ్యమా? ద్వితీయోపదేశకాండము 10:17; కీర్తనల గ్రంథము 136:2-3 పోల్చి చూడండి. 1 తిమోతికి 6:15 లో దేవునికే ఈ పేరు ఇవ్వబడింది. పాత ఒడంబడిక గ్రంథంలో మహా రాజు యెహోవాదేవుడు (కీర్తనల గ్రంథము 47:2). ప్రకటన గ్రంథంలో మహారాజు యేసు క్రీస్తే. యేసు యెహోవాదేవుని అవతారమన్నమాటే (నోట్, రిఫరెన్సులు లూకా 2:11 దగ్గర చూడండి).

17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని.
యెహెఙ్కేలు 39:19-20

పక్షులు, మాంసం, గుర్రాలు, మనుషులు అన్న మాటలు ఇది అక్షరాల ఒక యుద్ధమనీ చాలామంది హతమవుతారనీ సూచిస్తున్నాయి. ఈ “గొప్ప విందు”కూ “గొర్రెపిల్ల పెండ్లి విందు”కూ ఎంత తేడా! అది క్రీస్తు విశ్వాసుల కోసం. ఇది క్రీస్తు శత్రువుల ఓటమిని సూచించేది. శవాలను తినే రాబందుల కోసం దేవుడు ఈ విందు సిద్ధం చేస్తాడు. యెహెఙ్కేలు 39:17-20 పోల్చి చూడండి.

18. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

“అందరి మాంసం”– అన్ని దేశాలలో మృగం ముద్ర పొంది, వ 19లో కనిపిస్తున్న సైన్యాల్లో చేరినవారన్నమాట.

19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
కీర్తనల గ్రంథము 2:2

“మృగమూ”– ప్రకటన గ్రంథం 13:4. ఆయనతో యుద్ధం చేయగలవాడొకడు కనబడుతాడు. “భూరాజులూ”– ప్రకటన గ్రంథం 6:15; ప్రకటన గ్రంథం 16:12, ప్రకటన గ్రంథం 16:14, ప్రకటన గ్రంథం 16:16; ప్రకటన గ్రంథం 17:2, ప్రకటన గ్రంథం 17:18; ప్రకటన గ్రంథం 18:3; ప్రకటన గ్రంథం 21:24. “పోగై ఉండడం”– సైనిక సంబంధంగా ఇది బుద్ధికి అనుగుణంగా ఉందని వారు అనుకొన్నా అనుకోకపోయినా ఈ విధంగా సమకూడుతారు (యెహెఙ్కేలు 38:4; యెహెఙ్కేలు 39:2 పోల్చి చూడండి). క్రీస్తు భూరాజులందరిపై పరిపాలించేవాడు – ప్రకటన గ్రంథం 1:5. ఫరో సైన్యాలను ఎర్ర సముద్రానికీ అక్కడ వాటి నాశనానికీ తెచ్చిన ఆయన (నిర్గమకాండము 14:4, నిర్గమకాండము 14:23-28) లోక సైన్యాలను ఈ చివరి యుద్ధానికీ తేగలడు. ఆయన అలా చేస్తాడు కూడా. మృగం, భూరాజుల మనసుల్లో ఎలాంటి తలంపులు ఉంటాయో, తాము పరలోకంలోనుంచి వచ్చిన ప్రభువుతో పోరాడుతున్నామని వారు గుర్తిస్తారో లేదో చెప్పబడలేదు. దూర అంతరిక్షంలో ఎక్కడనుంచో ఏదో గ్రహం నుంచో దాడి జరగుతుందనుకొంటారేమో తెలియదు. కానీ పరలోకంలోనుంచి వచ్చిన దేవుని కుమారునితో తాము తెలిసి యుద్ధం చేస్తున్నామని వారు గుర్తించడం కూడా సాధ్యమే. సైతాను మూలంగా శక్తి పొందిన మనుషుల బుద్ధిపూర్వకమైన మొండి భ్రష్టత్వానికి అంతు లేదు. సైతాను, వాడి దూతలు పరలోకంలో యుద్ధం జరిగిస్తారని జ్ఞాపకం ఉంచుకోండి (ప్రకటన గ్రంథం 12:7). మనుషుల రాబోయే దేవుని భయంకరమైన తీర్పు గురించి తెలిసి కూడా ఆయనకు విరోధంగా తమ తిరుగుబాటు కొనసాగిస్తూ ఉంటారు (రోమీయులకు 1:32; మొ।।).

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
ఆదికాండము 19:24, యెషయా 30:30, యెషయా 30:33

“అద్భుతాలు”– ప్రకటన గ్రంథం 13:13-15. “కపట ప్రవక్త”– ప్రకటన గ్రంథం 16:13; ప్రకటన గ్రంథం 20:10. “అగ్ని సరస్సు”– ప్రకటన గ్రంథం 20:10, ప్రకటన గ్రంథం 20:14-15; ప్రకటన గ్రంథం 21:8. వారిని ప్రాణం తోనే అగ్ని సరస్సులో పడవేయడం అనేది మృగం, కపట ప్రవక్త ఇద్దరు వ్యక్తులనడానికి కొంత ఆధారం ఇస్తుంది. రాజ్యాలను, సామ్రాజ్యాలను అందులో పడవేయడం గురించి బైబిలు ఏమీ చెప్పలేదు.

21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
యెహెఙ్కేలు 39:20

“నోటనుంచి...ఖడ్గం”– క్రీస్తు మాట్లాడుతాడు, అంతే చాలు – ఆ దుర్మార్గులకు నాశనం సంభవిస్తుంది.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |