Revelation - ప్రకటన గ్రంథము 22 | View All

1. మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి
యెహెఙ్కేలు 47:1, యోవేలు 3:18, జెకర్యా 14:8

“జీవ జల నది”– ప్రకటన గ్రంథం 21:6 లో “ఊట” ఇక్కడ నదిగా మారింది. కీర్తనల గ్రంథము 46:4; యెహెఙ్కేలు 46:4 పోల్చి చూడండి. శాశ్వత జీవం అనే ఈ ప్రవాహాన్ని విశ్వాసులు శాశ్వతంగా ఆనందంతో అనుభవిస్తూ ఉంటారు. “సింహాసనం”– తండ్రియైన దేవునితో కూడా యేసు క్రీస్తుకు అధికారం ఉంటుంది. ఈ సింహాసనం కొత్త భూమి మీద ఉంటుంది. దానిమీద ఉంటూ దేవుడు విశ్వాన్ని పరిపాలిస్తాడు.

2. ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.
ఆదికాండము 2:9-10, ఆదికాండము 3:22, యెహెఙ్కేలు 47:7, యెహెఙ్కేలు 47:12

“జీవ వృక్షం”– ప్రకటన గ్రంథం 2:7. మానవ చరిత్ర ఆరంభ దశలో జీవ వృక్షం గురించి చెప్పబడింది (ఆదికాండము 2:9), పాపం చేసినందువల్ల మనిషి దాన్ని సమీపించలేకపోయిన సంగతి కనిపిస్తున్నది (ఆదికాండము 3:22-24). బైబిల్లో ఈ చివరి అధ్యాయంలో విముక్తులైన మనుషులకు ఈ జీవ వృక్షాన్ని మళ్ళీ సమీపించడానికి హక్కు ఉండడం కనిపిస్తున్నది. ఈ గొప్ప తేడా కలగడానికి కారణం యేసుప్రభువు సిలువ మీద బలిగా చనిపోయి తిరిగి సజీవంగా లేవడం. “పన్నెండు కాపులు”– ఆ ఫలాన్ని ఒక్క సారి రుచి చూస్తే చాలు – ఈ పాపిష్ఠి లోకంలో యుగాల తరబడి దేవుని ప్రజలను పీడించిన బాధలన్నీ అంతరిస్తాయి.

3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
జెకర్యా 14:11

“శాపం”– ఆదికాండము 3:17; యెషయా 24:6; గలతియులకు 3:10. పాత ఒడంబడిక గ్రంథం శాపం గురించిన హెచ్చరికతో ముగిసింది (మలాకీ 4:6). క్రొత్త ఒడంబడిక గ్రంథం (బైబిలు మొత్తం కూడా) శాపం ఎప్పటికీ తొలగిపోయింది అన్న వాగ్దానంతో ముగిసింది. ఈ తేడా ఎందుకు? గలతియులకు 3:13 లో జవాబు ఉంది. “సేవ చేస్తారు”– ప్రకటన గ్రంథం 7:15 చూడండి. శాశ్వత యుగాలలో విశ్వాసులు ప్రవేశించడంతో వారి సేవ ముగియదు. యుగయుగాలకు అనంతంగా వారికి దేవుణ్ణి సేవించే ఆనందం, ఆధిక్యత ఉంటాయి. ఈ సేవ ఏ పాపమూ లోపమూ ఇతరుల వల్ల కలిగే ఏ ఎదిరింపూ ఏ అలసటా లేనిదై ఉంటుంది.

4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
కీర్తనల గ్రంథము 17:15, కీర్తనల గ్రంథము 42:2

“ముఖాన్ని చూస్తారు”– మత్తయి 5:8; 1 కోరింథీయులకు 13:12; హెబ్రీయులకు 12:14; యెషయా 33:17. “నొసళ్ళమీద”– ప్రకటన గ్రంథం 14:1. వారు ఆయనకు చెందినవారై ఆయనను పోలినవారై ఉంటారు – రోమీయులకు 8:29; 1 యోహాను 3:1-2.

5. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
యెషయా 60:19, దానియేలు 7:18, దానియేలు 7:27, జెకర్యా 14:7

“రాత్రి...ఉండదు”– ప్రకటన గ్రంథం 21:25. “కాంతి”– ప్రకటన గ్రంథం 21:23. “శాశ్వతంగా రాజ్య పరిపాలన చేస్తారు”– ఇది వారి సేవలో ఒక భాగం. క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన ముగింపుతో వారి పరిపాలన ముగియదు. క్రీస్తు పరిపాలనలాగే వారి పరిపాలన రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది (ప్రకటన గ్రంథం 20:4). ఇక్కడ (ప్రకటన గ్రంథం 20:6 లో లాగా కాక) వారు యాజులై ఉంటారని రాసి లేదు.

6. మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.
దానియేలు 2:28, దానియేలు 2:45

“సత్యమైనవి”– ప్రకటన గ్రంథం 19:9; ప్రకటన గ్రంథం 21:5. “ప్రవక్తల ఆత్మలకు దేవుడు”– బైబిలు ప్రవక్తల మూలంగా తన వాక్కును వెల్లడి చేసిన దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా వెల్లడి చేశాడు (2 పేతురు 1:21 పోల్చి చూడండి). “త్వరగా జరగవలసినవాటిని”– త్వరగా గానీ త్వరలో కాదు – ప్రకటన గ్రంథం 1:1, దాని నోట్ చూడండి.

7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.
యెషయా 40:10

ఇవి యేసుప్రభువు పలికిన మాటలు – వ 12,20; ప్రకటన గ్రంథం 3:11. ఒకవేళ ఇక్కడ దేవదూత యేసు మాటల్ని ఎత్తి పలుకుతున్నాడేమో, లేక యేసు స్వయంగా పలుకుతున్నాడేమో. “దేవుని మూలంగా...ధన్యజీవి”– ప్రకటన గ్రంథం 1:3. ఈ ధన్యత ఎవరికి కలుగుతుందో చూడండి. ఈ గ్రంథం గురించి వ్యాఖ్యానాలు రాసినవారు గానీ దీనిని నేర్పించేవారు గానీ దీనిలోని చిహ్నాల గురించి ఊహించేవారు గానీ కాదు, ఇందులో వెల్లడి అయిన సత్యానికి విధేయత చూపేవారే ధన్యులు.

8. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,

“నేను – యోహానును”– ప్రకటన గ్రంథం 1:9. “దేవదూత పాదాల దగ్గర ఆరాధన”– ప్రకటన గ్రంథం 19:10 చూడండి.

9. అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

“అలా చేయకూడదు”– దేవదూతల స్వభావం ఎలాంటిదో దయ్యాల స్వభావం ఎలాంటిదో బైబిలు తెలియజేస్తుంది. దేవుని దూతలు తమను ఆరాధించాలనుకొన్న వారితో “వద్దు” అంటారు. పిశాచాలు తమను పూజించేవారితో “కావాలి” అంటారు (మత్తయి 4:9). కాబట్టి ఏ దేవదూతనయినా, ఏ దయ్యాన్నయినా, ఏ మనిషినయినా, ఏ వస్తువునయినా పూజించవచ్చునని నేర్పే ఏ వ్యక్తి దగ్గర నుంచైనా మీ ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోండి. అలా నేర్పడం సైతాను సంబంధమైనది.

10. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
దానియేలు 12:4

“ముద్ర వేయకు”– ప్రకటన గ్రంథం 10:4 పోల్చి చూడండి. ఈ గ్రంథంలోని వాటిని దేన్నీ దాచక అందరూ చూచి చదివేందుకు రాయాలన్నమాట. దానియేలు 12:4 పోల్చి చూడండి. దానియేలు గ్రంథంలోని భవిష్యత్వాక్కులను అప్పటివారు గ్రహించలేక అంతిమ కాలంలోనివారే అర్థం చేసుకోగలిగే రూపంలో దేవుడు వాటిని ఇచ్చాడు. అయితే యోహాను ద్వారా వచ్చిన ఈ ప్రకటన గ్రంథం అప్పటినుంచి ఇప్పటివరకూ దేవుని సేవకులంతా గ్రహించేలా దాన్ని దేవుడు ఇచ్చాడు (ప్రకటన గ్రంథం 1:1-3). “సన్నిహితం (దగ్గర పడింది)”– (ప్రకటన గ్రంథం 1:3).

11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.

దీని అర్థం ఇది కావచ్చు: గొప్ప మహిమను గురించిన వివరణలూ వాగ్దానాలూ, భయంకరమైన శిక్షను గురించిన హెచ్చరికలూ ఉన్న ఈ గ్రంథం, ముద్ర వేయని ఈ గ్రంథం ఉండగా ఎవరైనా అన్యాయాన్ని జరిగించడానికి, నీచంగా ప్రవర్తించడానికి ఎన్నుకొంటే అలా కానియ్యి. అలాంటి వ్యక్తిని తాను బుద్ధిపూర్వకంగా కోరుకొన్న జీవిత విధానంనుంచి తొలగించడానికి బలవంతం చేయడం తగదు. అతణ్ణి అతడి అన్యాయానికీ నీచత్వానికీ విడిచిపెట్టడం అతడి మీద పడ్డ శిక్షలో భాగమే. దీనికి వ్యతిరేకమైన విషయం కూడా నిజం. ఈ గ్రంథం వెలుగులో న్యాయవంతులూ పవిత్రులూ అలానే ముందుకు సాగిపోవాలి.

12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
కీర్తనల గ్రంథము 28:4, కీర్తనల గ్రంథము 62:12, సామెతలు 24:12, యెషయా 59:18, యెషయా 62:11, యిర్మియా 17:10, యెషయా 40:10

“త్వరగా”– ఇలా అనువదించిన గ్రీకు మాటకు హఠాత్తుగా లేక శీఘ్రంగా అని అర్థం ఉందని అనుకోవాలి. “నా బహుమానం”– మత్తయి 16:27; 1 కోరింథీయులకు 3:12-15; కొలొస్సయులకు 3:24.

13. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
యెషయా 44:6, యెషయా 48:12

“అల్ఫాను, ఓమెగను”– ప్రకటన గ్రంథం 1:8; ప్రకటన గ్రంథం 21:6 పోల్చి చూడండి. యేసుప్రభువు తాను దేవుణ్ణని ఇంతకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పడం సాధ్యమా? ఆయన దేవునికి చెందిన ఒక పేరు తనకు కూడా చెందని పక్షంలో దాన్ని తీసుకొని తనకు వర్తింపచేసేవాడు కాదు. ఆయన దేవుడని ఈ గ్రంథంలో చూపించే ఇతర రిఫరెన్సులు ప్రకటన గ్రంథం 1:18; ప్రకటన గ్రంథం 3:14; ప్రకటన గ్రంథం 5:8, ప్రకటన గ్రంథం 5:12-14; ప్రకటన గ్రంథం 19:16. ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లోని రిఫరెన్సులు కూడా చూడండి. “ఆదిని, అంతాన్ని”– ప్రకటన గ్రంథం 21:6. “మొదటివాణ్ణి, చివరివాణ్ణి”– ప్రకటన గ్రంథం 1:17.

14. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
ఆదికాండము 2:9, ఆదికాండము 49:11, ఆదికాండము 49:11, ఆదికాండము 3:22, యెహెఙ్కేలు 47:12

“హక్కుగలవారై”– ప్రకటన గ్రంథం 7:14; 1 యోహాను 1:7. జీవ వృక్షానికీ దేవుని నగరానికీ ఎవరికైనా హక్కు కలిగేది క్రీస్తు రక్తం ద్వారానే, ఆ రక్తం మూలమైన విముక్తి, పాపక్షమాపణల ద్వారానే. “ధన్యజీవులు”– ఈ మాట ఈ గ్రంథంలో 8 సార్లు కనిపిస్తున్నది – ఇక్కడ, వ 7; ప్రకటన గ్రంథం 1:3(రెండు సార్లు); ప్రకటన గ్రంథం 14:3; ప్రకటన గ్రంథం 16:15; ప్రకటన గ్రంథం 19:9; ప్రకటన గ్రంథం 20:6.

15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

“బయట”– అంటే ఇలాంటివారు నగర ప్రాకారం బయట దాని దగ్గరే లోపలికి దొంగతనంగా జారుకునే అవకాశం కోసం చూస్తూ ఉంటారని అర్థం కాదు. ఇలాంటివారు ఎక్కడ ఉంటారో ఇంతకు ముందు వెల్లడి అయింది (ప్రకటన గ్రంథం 21:8). “కుక్కలు”– కీర్తనల గ్రంథము 22:16, కీర్తనల గ్రంథము 22:20; కీర్తనల గ్రంథము 59:6; మత్తయి 7:6; ఫిలిప్పీయులకు 3:2; 2 పేతురు 2:22.

16. సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
సంఖ్యాకాండము 24:17, యెషయా 11:1, యెషయా 11:10

“నా దూతను”– ప్రకటన గ్రంథం 1:1. “వేరునూ సంతానాన్నీ”– ప్రకటన గ్రంథం 5:5; మత్తయి 1:1; రోమీయులకు 1:3; యెషయా 11:10; కీర్తనల గ్రంథము 110:1. “వేకువ చుక్కనూ”– ప్రకటన గ్రంథం 2:28; సంఖ్యాకాండము 24:17 పోల్చి చూడండి.

17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
జెకర్యా 14:8, యెషయా 55:1

బైబిలు లోని ఈ చివరి ఆహ్వానం గొప్పది. బైబిలు అంతట్లో దేవుడు చేసిన అనేక వాగ్దానాలను జ్ఞాపకం చేసేది. దేవుని ఆత్మ మనుషులను దేవుని దగ్గరకు పిలుస్తున్నాడు. పెళ్ళి కుమార్తె అయిన క్రీస్తుసంఘం కూడా పిలుస్తున్నది. ఈ ఆహ్వానం విన్న ప్రతి వ్యక్తీ ఇతరులకు చెప్పాలి. “దప్పి”– యెషయా 55:1; మత్తయి 5:6. “ఎవరైనా”– యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 7:37; 1 తిమోతికి 2:4; 2 పేతురు 3:9; యెషయా 55:7; యెహెఙ్కేలు 18:32. “జీవ జలం”– వ 1; ప్రకటన గ్రంథం 21:26; యోహాను 4:14. “ఉచితంగా”– రోమీయులకు 5:16-17; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9; యెషయా 55:1.

18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
ద్వితీయోపదేశకాండము 4:2, ద్వితీయోపదేశకాండము 12:32, ద్వితీయోపదేశకాండము 29:20

బైబిలులో ఈ చివర హెచ్చరిక చాలా కఠినమైనది. ఈ గ్రంథం ఎంత ప్రధానమైనదో చూడండి. ఇక్కడ ఈ గ్రంథంలోని మాటల గురించి నొక్కి చెప్తున్నాడు. వాటిలో నుంచి కొన్ని తీసివేయడం, లేక వాటితో కొన్ని కలపడం దేవుడు తెలియజేసిన సత్యాన్ని తారుమారు చేయజూడడం లాంటిది. ద్వితీయోపదేశకాండము 12:32; సామెతలు 30:6 పోల్చి చూడండి. ఇది బుద్ధిపూర్వకంగా అలా చేయడం అని అర్థం, గానీ ప్రతులు రాయడంలో లేక అచ్చు వేయడంలో తెలియకుండా చేసిన తప్పులు కాదు. దేవుడు మనుషులకు తన సత్యాన్ని మాటల ద్వారా ఇచ్చాడు. ఈ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ద్వితీయోపదేశకాండము 4:2; ద్వితీయోపదేశకాండము 12:32; కీర్తనల గ్రంథము 12:6; కీర్తనల గ్రంథము 119:160; సామెతలు 30:6; యిర్మియా 1:9; యిర్మియా 15:16. ఒక భాష మారిపోతూ ఉంటే ఆ భాషలో దేవుని వాక్కును కొత్తగా అనువదించవచ్చు, అనువదించాలి. అయితే మనకు వచ్చిన హీబ్రూ, గ్రీకు ప్రతులలోని మాటలనుంచి ఏ ఒక్క మాటా ఎవరూ తీసివేయకూడదు, వాటితో ఒక్క మాట కలపకూడదు.

19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
ఆదికాండము 3:22, యెహెఙ్కేలు 47:12, యెహెఙ్కేలు 47:12, ఆదికాండము 2:9

20. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

ఇది బైబిలు లోని చివరి సిద్ధాంతం. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో 25 వచనాలకు ఒక సారి లెక్కన యేసు రాకడను గురించిన మాటలున్నాయి. యేసు తానే ప్రత్యక్షంగా, విజయవంతంగా, హఠాత్తుగా వస్తాడు. ఆయన త్వరగా అకస్మాత్తుగా వస్తాడని ఈ ఒక్క అధ్యాయంలో ముమ్మారు చెప్పబడింది. “యేసుప్రభూ! వచ్చేయ్యి!”– బైబిలులో ఈ చివరి ప్రార్థన మొదటి నుంచి ఇంతవరకూ క్రీస్తు సంఘం కోరికను వెల్లడి చేసేది. మన ఆశాభావమంతా ఆయనను గురించే. మనం చూడగోరేది ఆయన మహిమనే.

21. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.

బైబిలులో ఈ చివరి ఆశీర్వాద వాక్యం బైబిలు ఉపదేశించే దానంతటికీ తగిన ముగింపు. పాపాన్ని, మరణాన్ని జయించి మనుషుల్ని దేవుని ప్రజలుగా చేసి, దేవుడు వాగ్దానం చేసినదానంతటికి వారసులుగా చేయగలిగేది యేసుప్రభు కృప మాత్రమే. “తథాస్తు”– ప్రకటన గ్రంథం 1:6. ఈ మాటతో బైబిలు ముగిసింది. బైబిలు అంతటికీ, అందులోని ప్రతి పుస్తకానికీ, ప్రతి మాటకూ తథాస్తు, ఆమేన్ అని మనమంతా చెప్పాలి. దేవుడు చెప్పిన దానంతటి గురించి తథాస్తు అనగలిగే వారంతా ధన్యులు.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |