Revelation - ప్రకటన గ్రంథము 3 | View All

1. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే

“సార్దీస్”– తుయతైరకు దక్షిణాన దాదాపు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం. అది ధనం, ప్రఖ్యాతి గలది. “దూత”– ప్రకటన గ్రంథం 1:20. “ఏడు ఆత్మలు”– ప్రకటన గ్రంథం 1:4. “ఏడు నక్షత్రాలు”– ప్రకటన గ్రంథం 1:16, ప్రకటన గ్రంథం 1:20. “తెలుసు”– ప్రకటన గ్రంథం 2:2. “చచ్చినవాడివే”– ఆత్మ సంబంధంగా చచ్చినవాడన్నమాట. అది జీవం గల సంఘమని పేరు పొందినది బహుశా అంతకు క్రితం తరానికి చెందిన విశ్వాసుల మూలానేమో. లేదా, ఆ సంఘంలో మత సంబంధమైన చర్యలు చాలా జరుగుతున్నందువల్ల దానికి ఆ పేరు వచ్చిందేమో. సంఘ కార్యకలాపాలను ఆధ్యాత్మిక జీవంగా ఎంచి భ్రమపడడం అసాధ్యమేమీ కాదు.

2. నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

“మేలుకో”– ఎఫెసీయులకు 5:14 పోల్చి చూడండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో వారు నిద్రపోతున్నారు. తమ నిజ స్థితి తెలియని స్థితిలో ఉన్నారు. “మిగిలినవాటిని”– ఆ సంఘం ఆశాభావానికి బొత్తిగా ఆస్పదం లేని స్థితిలో లేదు. కొంత వెలుగు, సత్యం వారికి ఉన్నాయి గానీ అవి కూడా వారి మధ్య ఉండకుండా పోనున్నాయి.

3. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

“అంగీకరించినది”– దేవుని వాక్కు. “జ్ఞాపకం చేసుకో”– ప్రకటన గ్రంథం 2:5. “గట్టిగా చేపట్టుకొని”– సత్యం గురించిన ఉపదేశం విన్నంత మాత్రాన ఒక సంఘానికి ఆధ్యాత్మిక జీవం కలగదు. అది సత్యానికి విధేయత చూపాలి (యాకోబు 1:22-25). “పశ్చాత్తాపపడు”– ప్రకటన గ్రంథం 2:5, ప్రకటన గ్రంథం 2:16, ప్రకటన గ్రంథం 2:21. “దొంగ వచ్చినట్టు”– మత్తయి 24:43-44; 1 థెస్సలొనీకయులకు 5:2-4 పోల్చి చూడండి.

4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

“కొందరు”– తరచుగా మృతి చెందిన స్థితిలో ఉన్న సంఘాల్లో సహా క్రైస్తవులు కొందరు జీవం గలవారై ఉండి పవిత్రతను అనుసరిస్తారు (హెబ్రీయులకు 12:14; 1 యోహాను 3:3). “అర్హులు”– 2 థెస్సలొనీకయులకు 1:5. “తెల్లని వస్త్రాలు”– వ 18; ప్రకటన గ్రంథం 4:4; ప్రకటన గ్రంథం 6:11; ప్రకటన గ్రంథం 7:9, ప్రకటన గ్రంథం 7:13; ప్రకటన గ్రంథం 19:14. ఇవి పవిత్రతనూ శుద్ధమైన జీవనాన్నీ సూచిస్తాయి.

5. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 69:28, దానియేలు 12:1

“జయించే వ్యక్తి”– ప్రకటన గ్రంథం 2:7 నోట్. “జీవగ్రంథం”– ప్రకటన గ్రంథం 13:8; ప్రకటన గ్రంథం 17:8; ప్రకటన గ్రంథం 20:12, ప్రకటన గ్రంథం 20:15; ప్రకటన గ్రంథం 21:27; ఫిలిప్పీయులకు 4:3. నిర్గమకాండము 32:32-33; కీర్తనల గ్రంథము 69:28; దానియేలు 12:1 పోల్చి చూడండి. కొందరి పేర్లు ఆ గ్రంథంలోనుంచి తుడుపు పెడతానని యేసు హెచ్చరించడం లేదు గానీ నిజ విశ్వాసుల పేర్లు దానిలో నుంచి ఎన్నడూ తుడుపు పెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. “ఒప్పుకొంటాను”– మత్తయి 10:32.

6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

7. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా
యోబు 12:14, యెషయా 22:22

“ఫిలదెల్ఫియ”– సార్తీస్‌కు ఆగ్నేయ దిక్కున దాదాపు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణం. దీని పేరుకు అర్థం “సోదర ప్రేమ”. “పవిత్రుడూ, సత్యస్వరూపి”– ప్రకటన గ్రంథం 6:10; ప్రకటన గ్రంథం 15:4; యెషయా 1:4; కీర్తనల గ్రంథము 31:5; యోహాను 14:6. “దావీదు తాళం చెవి”– యెషయా 22:22. క్రీస్తు దేవుని ఇంటికీ దేవుని రాజ్యానికీ నిర్వాహకుడు. జ్ఞానం, కృప, ఆధ్యాత్మిక సామర్థ్యాలు, బలప్రభావాలు, రక్షణ ఇవన్నీ ఉన్న స్థలానికి తాళం చెవి గల కోశాధికారి ఆయన. “తెరిచాడూ...మూశాడూ”– సంఘాలు, దేశాల విషయాల్లో క్రీస్తుకు సర్వాధికారం ఉంది (మత్తయి 28:18; యోహాను 17:2).

8. నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయ నేరడు.

“తెలుసు”– ప్రకటన గ్రంథం 2:2. “ఎరగననలేదు”– ప్రకటన గ్రంథం 2:13 దీన్నిబట్టి చూస్తే క్రీస్తును ఎరగననకుండా ఆయన వాక్కు ఆచరణలో పెట్టేందుకు కొద్దిపాటి బలమే చాలు. ఏ విశ్వాసి అయినా అలా చేయకపోతే ఆ విశ్వాసి ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఎవరికైనా వాస్తవమైన ఆధ్యాత్మిక జీవం కొంచెమైనా ఉంటే కొద్దిపాటి బలం కూడా ఉంటుంది. “తలుపు తెరచి ఉంచాను”– అపో. కార్యములు 14:27; 1 కోరింథీయులకు 16:9.

9. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
యెషయా 43:4, యెషయా 45:14, యెషయా 49:23, యెషయా 60:14

“అబద్ధమాడుతున్న”– శరీర సంబంధంగా వారు యూదులే గానీ యూదులు ఏమై ఉండాలని దేవుడు ఆశించాడో దానంతటికీ వారి జీవితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. “సైతాను సమాజం”– ప్రకటన గ్రంథం 2:9. “నీ పాదాల దగ్గర”– యెషయా 45:14; యెషయా 49:23; యెషయా 60:14 పోల్చి చూడండి. “ప్రేమ”– ఆయన దృష్టిలో ప్రత్యేకమైన సంఘంపట్ల ప్రత్యేకమైన ప్రేమ. యోహాను 14:21, యోహాను 14:23 పోల్చి చూడండి.

10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.

“ఓర్పు”– రోమీయులకు 12:12; 2 థెస్సలొనీకయులకు 3:5; హెబ్రీయులకు 10:36; 1 పేతురు 2:20-21. “పరీక్ష ఘడియ”– ఇది ఈ యుగాంతానికి వర్తిస్తుందేమో. ఈ “ఘడియ”, మహా బాధ కాలం (ప్రకటన గ్రంథం 7:14; మత్తయి 24:21; దానియేలు 12:1) ఒకటే అని కొందరు విశ్వాసుల అభిప్రాయం, గానీ ఒకటే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. పరీక్ష ఘడియ ఇంతకుముందు చరిత్రలో జరిగిందని కొందరి అభిప్రాయం. మరికొందరు ఇది మహా బాధ కాలం అయిన తరువాత జరగబోయే సంఘటనలకు వర్తిస్తుందని అంటారు – అంటే 15,16 అధ్యాయాల్లోని సంఘటనలకు. “ఆ ఘడియ నుంచి నిన్ను కాపాడుతాను”– గ్రీకులో దీనికి రెండు అర్థాలు సాధ్యం. ఒకటి, ఆ పరీక్షకు దూరంగా వారిని ఉంచడం, రెండోది వారి చుట్టూరా పరీక్ష జరుగుతున్న సమయంలో వారిని సురక్షితంగా ఉంచడం. చరిత్రలో లోకమంతటి మీదికీ ఒక పరీక్ష ఘడియ వచ్చిన పక్షంలో ఈ వాగ్దానం నెరవేర్చేందుకు ప్రభువు ఫిలదెల్ఫియ సంఘాన్ని లోకంనుంచి తీసుకువెళ్లలేదని స్పష్టమే.

11. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
యెషయా 62:2, యెషయా 65:15, యెహెఙ్కేలు 48:35

“జయించే వ్యక్తి”– ప్రకటన గ్రంథం 2:7. “స్తంభంగా”– దేవుడు ఇప్పుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక ఆలయంలో ప్రతి నిజ విశ్వాసీ ఒక భాగంగా ఉన్నాడు (ఎఫెసీయులకు 2:19-22; 1 కోరింథీయులకు 3:17; 1 కోరింథీయులకు 6:19). దానిలో స్తంభంగా ఉండడం ఈ ఆలయంలో స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది. “పేరు”– జయించేవారి మీద మూడు పేర్లు రాసి ఉంటాయి. బైబిల్లో పేర్లు లక్షణాలను సూచిస్తాయి. పేరు రాయడం యజమాని హక్కును కూడా సూచించవచ్చు. “దేవుని పేరు”– దేవుని పవిత్ర లక్షణాల ముద్ర వారి మీద పడుతుంది. వారు దేవుని స్వంత వారని ఇది సూచిస్తుంది. వారి లక్షణాలు దేవుని లక్షణాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి. “నగరం పేరు”– ప్రకటన గ్రంథం 21:2-27. జయించేవారు ఆ ప్రకాశమానమైన, మహిమాన్వితమైన బంగారు నగరంలో నివసించడానికి పరిపూర్ణ యోగ్యులుగా తయారవుతారు. వారు దానికి చెందుతారు. “నా కొత్త పేరు”– ప్రకటన గ్రంథం 19:12 పోల్చి చూడండి. ఈ కొత్త పేరు ఏమై ఉంటుందో, ఇప్పుడు తెలియని ఆశ్చర్యకరమైన ఏ లక్షణాలు అప్పుడు ఆయనలో కనిపిస్తాయో మనకు తెలియదు. అయితే జయించేవారు శాశ్వతంగా ఆయనకు చెందుతారని తెలుసు. వారు ఆయనలాగా ఉంటారని తెలుసు (1 యోహాను 3:2; రోమీయులకు 8:29).

13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

14. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
కీర్తనల గ్రంథము 89:37, సామెతలు 8:22

“లవొదికయ”– ఫిలదెల్ఫియకు అగ్నేయ దిక్కున దాదాపు 80 కిలోమీటర్ల దూరాన, ఎఫెసుకు తూర్పున దాదాపు 150 కిలోమీటర్లు దూరాన ఉన్న పట్టణం. “దూత”– ప్రకటన గ్రంథం 1:20. “ఆమేన్”– తథాస్తు – ప్రకటన గ్రంథం 1:7. ఇక్కడ ఈ పదానికి అర్థం సత్యం, విశ్వసనీయత, నమ్మకత్వం. యెషయా 65:16 లో ఈ పదం దేవుని గురించి వాడారు (తెలుగులో “నమ్మతగిన దేవుని” అని తర్జుమా. హీబ్రూలో అక్షరాలా “ఆమేన్ అయి ఉన్న దేవుని”– అంటే దేవుడు తాను చెప్పినట్టే చేసేవాడు అని అర్థం). “సాక్షి”– ప్రకటన గ్రంథం 1:5. “మూలమూ”– యోహాను 1:3; కొలొస్సయులకు 1:16-17 పోల్చి చూడండి.

15. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.

“తెలుసు”– ప్రకటన గ్రంథం 2:2. “చల్లగా”– ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. చల్లగా ఉండడం క్రీస్తునూ ఆయన శుభవార్తనూ పూర్తిగా నిరాకరించడం, లేక బహిరంగంగా శుభవార్తను వ్యతిరేకించడం. “వేడిగా”– ఇది శుభవార్త పట్ల ప్రేమనూ క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తినీ సూచిస్తుంది.

16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.

“నులివెచ్చగా”– అది కాదు, ఇదీ కాదన్నమాట. శుభవార్త అంటే అంగీకరించే మనసు అంతగా లేదు, విరుద్ధ భావం అంతగా లేదు. ఈ స్థితి 2 తిమోతికి 3:5 లో వర్ణించబడింది. నులివెచ్చనగా ఉన్నవారికి క్రీస్తంటే ప్రేమ లేదు గాని క్రైస్తవాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఈ స్థితి రోమీయులకు 12:11; 1 కోరింథీయులకు 15:58; మత్తయి 22:37-38 లకు వ్యతిరేకం. ఈ స్థితి క్రీస్తుకు వెగటు పుట్టిస్తుంది. దేవుని ఇంటి గురించిన ఆసక్తి ఆయనను తినివేస్తుంది గదా (యోహాను 2:17). “ఉమ్మివేయబోతున్నాను”– వారు పశ్చాత్తాపపడకపోతే (వ 19) ఇక వారితో ఏమీ సాంగత్యం చేయడన్నమాట. వారు ఇంకా సభలు పెట్టినా, ఆచారాలు జరిగించినా, క్రీస్తు దృష్టిలో వారు ఒక నిజ సంఘంగా ఉండరు. క్రీస్తు లేని క్రైస్తవ సంఘం అవుతారు.

17. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
హోషేయ 12:8

క్రీస్తుకు వారి గురించి తెలిసినదానికీ తమ గురించి వారికున్న అభిప్రాయానికీ ఎంత వ్యత్యాసం! వారి స్థితి వారికి తృప్తినీ గర్వాన్నీ కలిగించింది. ఆయనకైతే అసహ్యం పుట్టించింది. “కొదువ అంటూ ఏమీ లేదు”– హోషేయ 12:8; లూకా 18:11-12; 1 కోరింథీయులకు 4:8 పోల్చి చూడండి. “నీకు తెలియదు”– మనల్ని మనం మోసగించుకోవడం, మన నిజ స్థితి గురించి తెలుసుకోకపోవడం ఎంత అపాయకరం! ఇవి లోకంలోను క్రైస్తవ సంఘాలలోను ఎంత సామాన్యమైన సంగతులు! వీటికి కారణాలు యిర్మియా 17:9; 2 కోరింథీయులకు 4:4 లో కనిపిస్తున్నాయి.

18. నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

“బంగారం”– ఇది అమూల్యమైన ఆధ్యాత్మికతకూ, నిజమైన దైవిక ధనానికీ సూచన (2 కోరింథీయులకు 8:9). “కొనుక్కో”– యెషయా 55:1; మత్తయి 13:44-46 పోల్చి చూడండి. “తెల్లని దుస్తులు”– నీతిన్యాయాలకు సూచన (యెషయా 61:10). “మందు”– ఆత్మ సంబంధమైన గుడ్డితనానికి క్రీస్తు ఇచ్చే నివారణ, ఆధ్యాత్మిక జ్ఞానప్రకాశాలు.

19. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
సామెతలు 3:12

“నేను ప్రేమించేవారందరినీ”– వారి నులివెచ్చని స్థితి ఆయనకు వెగటు పుట్టించింది గానీ దానివల్ల ఆయన ప్రేమ గల హృదయంలో మార్పు కలగలేదు. “శిక్షిస్తాను”– హెబ్రీయులకు 12:5-11; 1 కోరింథీయులకు 11:32; సామెతలు 3:11-12. “పశ్చాత్తాపపడు”– ఈ ఏడు సంఘాలలో అయిదు సంఘాలు పశ్చాత్తాపపడాలని ఆయన ఆదేశించాడు (ప్రకటన గ్రంథం 2:5, ప్రకటన గ్రంథం 2:16, ప్రకటన గ్రంథం 2:21-22; ప్రకటన గ్రంథం 3:3).

20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

మొత్తానికి అక్కడి సంఘం క్రీస్తును బయట ఉంచి తలుపు మూసేశారు. దాని సభ్యులలో ఎవరి హృదయంలో అయినా ప్రవేశించేలా ఆయన తలుపు తట్టవలసి వచ్చింది. ఇది సూచించేదేమంటే, సంఘ సభ్యులంతా అవిశ్వాస స్థితిలో ఉన్నారు (2 కోరింథీయులకు 13:5 పోల్చి చూడండి). “లోపలికి వస్తాను”– ఇది అబద్ధమాడని మహిమ స్వరూపియైన ప్రభువు ఇచ్చిన మాట. మనమంతా ఈ మాట నమ్మి, ఆయనను స్వీకరించి వాస్తవంగా దేవుని పిల్లలం అవుదాం (యోహాను 1:12-13).

21. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

“నేను జయించి”– ప్రకటన గ్రంథం 5:5; హెబ్రీయులకు 2:17; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 12:2-3; మత్తయి 4:1-10. “ఆయన సింహాసనం”– దేవుని శాశ్వతమైన సింహాసనం. ఇప్పుడు అది యేసు సింహాసనానికి భిన్నంగా ఉంది. “జయించే వ్యక్తి”– ప్రకటన గ్రంథం 2:7. “నా సింహాసనం”– ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 20:4, ప్రకటన గ్రంథం 20:6; 2 తిమోతికి 2:12; లూకా 1:32-33. యేసు ఇంకా ఈ సింహాసనం ఎక్కలేదు. ప్రకటన గ్రంథం 2:27; మత్తయి 19:28; మత్తయి 25:31.

22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |