Samuel I- 1 సమూయేలు 26 | View All

1. అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చిదావీదు యెషీమోను ఎదుట హకీలామన్య ములో దాగి యున్నాడని తెలియజేయగా

1. జీఫు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు.

2. సౌలు లేచి ఇశ్రాయేలీ యులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్య మునకు పోయెను.

2. జీఫు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీఫు అరణ్యంలోకి వెళ్లారు.

3. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలామన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని

3. సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది. దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు.

4. వేగులవారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను.

4. దావీదు తన వేగుల వారిని పంపి సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు.

5. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారు డైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండుక్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.

5. సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.

6. అప్పుడు దావీదుపాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగానీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.

6. హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు. (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.

7. దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్ర బోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి.

7. చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగివేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, పక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు.

8. అప్పుడు అబీషై దావీదుతోదేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా

8. “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.

9. దావీదునీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?

9. కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు,”సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి.

10. యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;

10. యెహోవా జీవీస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు.

11. యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

11. కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయుమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.”

12. సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారి కందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు.

12. కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు.

13. తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయుల మధ్యను చాలా యెడముండగా

13. దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి.

14. జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసిరాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను.

14. నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ నాకు జవాబు చెప్పు” అన్నాడు. “రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు.

15. అందుకు దావీదునీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;

15. అందుకు దావీదు, “నీవు మగావాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు!

16. నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.

16. నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్దవుంచబడిన ఈటె, నీళ్లకూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు.

17. సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.

17. సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో. “అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు.

18. నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?

18. దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని?

19. రాజా నా యేలిన వాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారునీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.

19. రాజా, నా యజమామీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యుల చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలువమని

20. నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి.

20. పరదేశీయులతో ఉండుమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”

21. అందుకు సౌలునేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితిననగా

21. అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు.

22. దావీదురాజా, యిదిగో నీ యీటె నాయొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాని తీసికొనవచ్చును.

22. “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు.

23. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును.

23. మంచిచేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభీషేకించబడిన రాజుకు నేను హాని చేయను.

24. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.

24. నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు.

25. అందుకు సౌలుదావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.

25. సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలుచేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు. దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు.Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |