Samuel I- 1 సమూయేలు 30 | View All

1. దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

1. దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు.

2. ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.

2. సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.

3. దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి

3. దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు.

4. ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.

4. దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు.

5. యజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

5. దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.

6. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువి్వ దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.

6. సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమారైలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు.

7. పమ్మట దావీదుఏఫోదు తెమ్మని యాజ కుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.

7. యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.

8. నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవాతరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెల విచ్చెను.

8. అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.

9. కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందల మంది యును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.

9. [This verse may not be a part of this translation]

10. దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవు చుండగా

10. [This verse may not be a part of this translation]

11. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.

11. ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు.

12. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

12. అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.

13. దావీదు నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడునేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.

13. “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు.

14. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.

14. కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టుడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.

15. ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుగగా వాడునేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.

15. అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు. “నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.

16. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశము లోనుండియు యూదా దేశములోనుండియు తాముదోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.

16. ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపు కుంటున్నారు.

17. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కిపారి పోయిన నాలుగువందల మంది ¸యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

17. దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.

18. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.

18. దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు.

19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.

19. ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్న దంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు.

20. మరియదావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

20. గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.

21. అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

21. అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు.

22. దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరువీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు స ొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.

22. అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.

23. అందుకు దావీదు వారితో ఇట్లనెనునా సహోదరు లారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయ కూడదు.

23. అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు.

24. మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా

24. మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందకూ సమంగానే పంచుకోవాలి” అన్నాడు.

25. కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను.

25. దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.

26. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచియెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.

26. దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.

27. బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను

27. అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు,

28. అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను

28. అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో,

29. రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను

29. రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు

30. హోర్మాలోను కోరాషానులోను అతాకులోను

30. కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు

31. హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

31. మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |