Jeremiah - యిర్మియా 31 | View All

1. యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.

2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.

3. చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

4. ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు,సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.

5. నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.

6. ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.

7. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.

8. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు

9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును,వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
1 కోరింథీయులకు 6:18

10. జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.

11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

12. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.

15. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
మత్తయి 2:18

16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియసఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.
ప్రకటన గ్రంథం 21:4

17. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

19. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడచరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.

20. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.

21. ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.

22. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా,యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

23. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు-చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశము లోను దాని పట్టణములలోను జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.

24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును,కృశించిన వారినందరిని నింపుదును.

25. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.
మత్తయి 11:28, లూకా 6:21

26. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.

27. యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.

28. వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.

29. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.

30. ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 26:28, లూకా 22:20, 1 కోరింథీయులకు 11:25, 2 కోరింథీయులకు 3:6, హెబ్రీయులకు 8:8-13

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
2 కోరింథీయులకు 3:3, రోమీయులకు 11:26-27, 1 థెస్సలొనీకయులకు 4:9, హెబ్రీయులకు 8:8-13

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
అపో. కార్యములు 10:43, హెబ్రీయులకు 10:17, 1 Joh 2:27, రోమీయులకు 11:26-27, 1 థెస్సలొనీకయులకు 4:9

35. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

36. ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

37. యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.

38. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.

39. కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.

40. శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.బైబిల్ అధ్యయనం - Study Bible
31:1-6 ఈ వచనాల్లో ఇశ్రాయేలు వంశస్థులందరినీ మళ్లీ ఏకం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆయన ఆదరణ పలుకులు ఇశ్రాయేలు వంశస్థులకందరికి చెందుతాయి. 

31:2 ఖడ్గమును తప్పించుకొనినవారై... అరణ్యములో అనే మాటలు నిర్గమాన్ని అరణ్య ప్రయాణాల్లోని అనుభవాల్ని, బబులోను చెరనుండి తిరిగి వచ్చేవారి అనుభవాలకు జోడిస్తున్నాయి. ఈ రెండు సందర్భాల్లోను సజీవులైన ప్రజలు దేవుని అనుగ్రహాన్ని ఆయన కృపను పొందడం జరిగింది. 

31:3 ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది (ద్వితీ 7:8; 10:15; హో షేయ 11:1). దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఇశ్రాయేలును ప్రేమించుచున్నాడు.

31:4-5 మరల అనే పదం పదే పదే రావడం ఇశ్రాయేలు భవిష్యత్తు వారి గతంలాగా ఉండబోతున్నదని తెలియజేస్తుంది. దేవుడు ఇశ్రాయేలును కన్యకా అని పిలిచి, గతంలోని అరణ్యప్రయాణాల్లోని తొలిరోజుల్ని గుర్తు చేస్తూ, దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను సాదృశ్యరీతిలో వెల్లడి చేస్తున్నాడు (2:1-3; హోషేయ 2:14-23).

31:6 యెరూషలేములో దేవాలయం మళ్లీ కట్టబడుతుందని సూచనప్రా యంగా తెలుస్తుంది. ఉత్తరరాజ్య మైన పది గోత్రాలకు ప్రతీకగా నిలిచే ఎఫ్రాయిము దేవుణ్ణి ఆరాధించడానికి సీయోనునకు వెళ్లడం జరుగుతుంది. 

31:7 ఇశ్రాయేలు దేవుడెన్నుకున్న జనం కాబట్టి ఆయన వారిని రాజ్యములకు శిరస్సగు జనము అని పిలుస్తున్నాడు. (ద్వితీ 26:19; ఆమోసు 6:1తో పోల్చండి). ఇశ్రాయేలులో శేషించిన ప్రజలకు దేవుడు ఇచ్చిన గొప్ప విడు దలను బట్టి వారు తప్పక చేయవలసిన అయిదు విధులు: పాడుడి... ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతిచేయుడి... బతిమాలుడి.

31:8 దేవుడు. భవిష్యత్తులో జరిగించే పునరుద్దరణ ఉత్తరదేశములోనుండి (అష్నూరు, బబులోను) మాత్రమే కాదు గానీ, భూదిగంతముల నుండి కూడా జరుగుతుంది. ఎవరూ తప్పిపోకుండా ప్రపంచం నలుమూలల నుండి ఆయన తన ప్రజల్ని సమకూర్చడాన్ని ఇది సూచిస్తుంది. 

31:9 ఎఫ్రాయిము నా జ్యేష్ఠకుమారుడు అనే పదజాలం లెక్కకు ముందు పుట్టినవాడిని కాక (ఎఫ్రాయిము యోసేపు రెండవ కుమారుడు), స్థాయిలోను ప్రాధాన్యతలోను తొలి స్థానంలో ఉన్నవాడిని సూచిస్తుంది - ఇశ్రాయేలు దేవునికి “జ్యేషపుత్రుడు” అయినట్లుగా (నిర్గమ 4:22), యాకోబు (ఇశ్రాయేలు) ఇస్సాకుకు రెండవ కుమారుడైనప్పటికీ దేవునికి “జ్యేష్ఠపుత్రుడు"గా ఉన్నాడు. యెషయి కుమారుల్లో దావీదు ఎనిమిదవ కుమారుడైనప్పటికీ “జ్యేష్ఠకుమారునిగా” చేయబడ్డాడు. (కీర్తన 89:27). యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై" ఉన్నాడు (కొలస్సీ 1:15; ప్రక 1:5). ఈ రెండు సందర్భాలు వరుస క్రమాన్ని కాక స్థాయిని, ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. 

31:10 జనులారా అనే పదం అన్యజనులందరినీ సూచిస్తుంది. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి కాపాడతాడని అన్యజనులందరికీ ప్రకటించాలి. 

31:11 క్రయధనం చెల్లించి విడిపించినట్టుగా, యెహోవా యాకోబు వంశస్టు లను విమోచించుచున్నాడు (హెబ్రీ. "పదా", నిర్గమ 13:13,15; 34:20). వారిని విడిపించుచున్నాడు అనే పదజాలం కుటుంబంలో విమోచకుడు ఉండే ఆనవాయితీని గుర్తుకు తెస్తుంది (హెబ్రీ. గోయల్; లేవీ 25:25,48; సంఖ్యా 35:12,19; రూతు 2:20; 3:8-9,14), కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అపాయంలో లేదా కష్టంలో చిక్కుకున్నప్పుడు విమోచకునికి విడిపించే బాధ్యత ఉంటుంది.

31:12-14 పంటలు పండుతాయి, ఫలితంగా యాజకుల భాగం సమృద్ధిగా ఉంటుంది (క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను).

31:15 యోసేపు. తల్లియైన రాహేలు రామాలో అంగలార్పు చేస్తున్నట్టుగా వర్ణన కనబడుతున్నది. రామా యెరూషలేముకు ఉత్తరంలో అయిదు మైళ్ల దూరంలో ఉన్న పట్టణం. ప్రజలు బబులోను చెరలోకి వెళ్లేటప్పుడు రామా ఓ ప్రదర్శన వేదికగా ఉంది (40:1-4). రాహేలు యాకోబుకు ప్రియమైనభార్య. ఆమె బెన్యామీనుకు జన్మనిస్తూ మరణించింది. (ఆది 35:18). ఎఫ్రాయిము, మనషేల సంతతివారు ఆ ప్రాంతంలోని రెండు ప్రముఖ గోత్రాలకు నాయకులుగా ఉన్నారు కాబట్టి, రాహేలును ఇశ్రాయేలులోని పది ఉత్తర గోత్రాలవారందరికీ తల్లిగా పేర్కొనడం పరిపాటి. క్రూరుడైన హేరోదు చిన్నపిల్లల్ని చంపించిన సందర్భంలో రాహేలు గురించి ప్రస్తావన రావడం ఆమె అంగలార్పు హతులైన తమ శిశువుల కోసం విలపించే ఇశ్రాయేలు తల్లులందరి అంగలార్పుల్ని ప్రతిబింబిస్తుందనే భావనను తెలియజేస్తుంది (మత్తయి 2:17-18). 

31:16-17 నీ (రాహేలు) పిల్లలు తిరిగి... వచ్చెదరు కాబట్టి ఆమె కన్నీళ్లు కార్చడం మానుకోవాలని ఆమెకు రెండుసార్లు చెప్పబడింది. 

31:16 యాకోబు, రాహేలు లాబానును సేవించిన తర్వాత వృద్ధి పొంది, తమ “పిల్లలతో” తిరిగి వచ్చినట్టుగా, రాహేలు క్రియ సఫలమై, ప్రపంచం నలుమూలల నుండి ఆమె పిల్లలు (ఇశ్రాయేలీయులు) స్వదేశానికి తిరిగి వస్తారు.

31:18-20 పది ఉత్తరగోత్రాలకు ప్రతీకగా ఉన్న ఎఫ్రాయిము చివరికి తాను కాడికి అలవాటుకాని కోడె లాగా (దండనకు లొంగని) ప్రవర్తించాననీ (హోషేయ 10:11 తో పోల్చండి), దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశానని గ్రహించింది. అయితే ఇప్పుడు శిక్షపొంది పశ్చాత్తాపపడిన తర్వాత, తన తొడ చరుచుకొని... నిందను భరించుచు అవమానమునొంది సిగ్గుపడుతున్నది. తప్పిపోయిన కుమారుడికి క్షమాపణ లభించినట్టుగా ఎఫ్రాయిముకు క్షమాపణ లభిస్తుంది, ఎఫ్రాయిము తన స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇశ్రాయేలు తిరుగుబాటు మీద దేవుని ప్రేమ విజయం సాధిస్తుంది (హో షేయ 11:1-11) 

31:21 సరిహద్దు రాళ్లను... దోవచూపు స్తంభములను నిలబెట్టడం బబులోను నుండి స్వదేశానికి తిరిగి వచ్చే ఇశ్రాయేలీయులకు మార్గాన్ని చూపిస్తూ, గతంలో వారు దేవునితో నడిచిన “పురాతన మార్గాల్ని” గుర్తుచేసే ఫలకాలుగా ఉంటాయి (6:16). 

31:22 ఇశ్రాయేలు కన్యకను విశ్వాసఘాతకురాలా అనడం ఇశ్రాయేలు మతభ్రష్టతను, అవిశ్వాసాన్ని సూచిస్తుంది. స్త్రీ పురుషుని ఆవరించును అనే పదజాలం యిర్మీయా గ్రంథమంతటిలో స్పష్టంగా అర్థం కాని విషయంగా కనబడుతుంది. కొందరు దీనిని కన్య గర్భాన క్రీస్తు ఉద్భవించడాన్ని సూచిస్తుందని చెబుతారు. అయితే ఇక్కడ “స్త్రీ” అనే పదం జాతినామంగా కనబడుతున్నది గానీ కన్యకను సూచించడంలేదు. పైగా, “ఆవరించును" అనే పదం గర్భవతి కావడమనే అర్థాన్ని సూచించదు. అలాగే ఈ మాటలు ఏ విధంగాను క్రీస్తు శరీరధారిగా జన్మించిన సందర్భానికి సరిపోయేవి కావు. “ఆవరించును" అనే పదానికి అర్థం అస్పష్టంగా ఉండడం వలన ఏ వివరణా ఈ పదానికి నిర్దిష్టమైన భావాన్ని సూచించలేదు. “స్త్రీ” అనే పదం ఇశ్రాయేలును, “పురుషుని” అనే పదం యెహోవాను సూచిస్తున్నట్లయితే, నూతనమైన కార్యము అనే పదజాలం అంత్యకాలంలో ఇశ్రాయేలుకు దేవునికి మధ్య నూతనమైన సంబంధం ఉంటుందనే అర్థాన్ని సూచిస్తుండవచ్చు.

31:23-25 ప్రతిష్టిత పర్వతమా అనే పదజాలం సీయోనును సూచిస్తుంది. ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలులో ఈ పదజాలం ఇరవై మూడు సార్లు కనబడు తుంది. సమాజంలో అల్పులు సైతం క్షేమాన్ననుభవిస్తారనే వాగ్దానం ఇక్కడ ఉంది. 

31:26 కొందరు ఈ వచనం, యిర్మీయా కలల్ని వ్యతిరేకించిన 23:25 వచనాన్ని ఖండిస్తున్నదని చెబుతారు. అయితే యిర్మీయా అక్కడ అబద్ద ప్రవక్తల కలల గురించి మాత్రమే చెప్పాడు (23:25-29 నోట్సు చూడండి). 

31:27-28 దినములు వచ్చుచున్నవి అనే పదజాలం యిర్మీయా గ్రంథంలో పద్నాలుగు సార్లు, పాత నిబంధనలో ఇతరచోట్ల ఏడుసార్లు కనబడుతుంది. ఇక్కడ ఈ మాటలు 30:3 లోని ఈ పద వినియోగాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి (30:2-3 నోట్సు చూడండి). 1:10,12 వచనాల్లో దేవుడు యిర్మీయా కప్పగించిన పనిని వ. 28 గుర్తుచేస్తుంది. 

31:29-30 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను సామెత వెనుకటి తరం చేసిన పాపాలకు ఇప్పటి తరం అన్యాయంగా శిక్ష ననుభవిస్తున్నదనే సుపరిచితమైన అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, ఇది నిజం కాదని మోషే బోధించాడు (ద్వితీ 24:16), యెహెజ్కేలు కూడా ఈ సామెతను ఖండించాడు (యెహె 18:2-4). 

31:31-34 కొత్త నిబంధన గురించి తెలియజేయడానికి ఈ వాక్యభాగం కొత్త నిబంధనలో చాలాచోట్ల ప్రస్తావించబడింది. - (లూకా 22:20; 1కొరింథీ 11:25; 2 కొరింథీ 3:5-14; హెబ్రీ 8:8-12; కొత్త నిబంధనలో పాత నిబంధన నుండి ఉదహరించబడిన వాక్యభాగాల్లో ఇదే పెద్దది). క్రైస్తవ వేదాంత సిద్ధాంతాన్ని రూపుదిద్దిన అతిముఖ్యమైన వాక్యభాగం ఇదే. 

31:31 కొత్త నిబంధన నేపథ్యం మెస్సీయ కాలంగాను, మానవచరిత్ర లక్ష్యసిద్ధిని పొందే కాలంగాను (“దినములు వచ్చుచున్నవి”) కనబడుతున్నది. కొత్త నిబంధన అనే పేరు ఇది గతంలోని పాత నిబంధనలన్నిటికంటే విప్లవాత్మకంగా కొత్తదని సూచిస్తుంది. అయితే హెబ్రీలో “కొత్త” అనే అర్థాన్నిచ్చే పదం “పునరుద్ధరించబడిన నిబంధన” అనే అర్థాన్ని సైతం ఇస్తుంది, ఎందుకంటే ఈ నిబంధనలోని విషయాల్లో సగానికి పైగా అబ్రాహాము నిబంధనను, దావీదు . నిబంధనను గుర్తుకు తెస్తున్నాయి. నిబంధనలోని ప్రధాన పక్షాలు ఇశ్రాయేలువారి... యూదావారి ప్రజలని తెలుస్తుంది. గతంలో పది ఉత్తరగోత్రాలు ఒకటిగా, రెండు. దక్షిణ గోత్రాలు ఒకటిగా వేరైపోయాయి కాబట్టి, ఇప్పుడు ఈ రెండింటి ప్రస్తావన మళ్లీ వీరందరూ ఏకమవుతారని సూచిస్తుంది. కొత్త నిబంధన అనే ఈ పదం క్రైస్తవ సంఘానికి కూడా వర్తిస్తుంది, దేవుడు అబ్రాహాముతో, దావీదుతో చేసిన నిబంధనల కొనసాగింపులో అన్యజనులు సైతం ఈ నిబంధనలో భాగమవుతారు, దేవుడు అబ్రాహాము సంతానం ద్వారా లోకంలోని సర్వజాతుల ప్రజల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. పాత నిబంధనలో ఈ “కొత్త నిబంధన"కు ఉన్న మరొక పేరు “నిత్యమైన నిబంధన" (32:40; హెబ్రీ 13:20, 21 తో పోల్చండి), ఈ పేరు నిబంధన కాలపరిమితిని తెలియజేస్తుంది.

31:32 గతంలోని నిబంధనతో వచ్చిన సమస్య నిబంధన చేసిన దేవుని వలన గానీ, ఆ నిబంధనలోని నియమాల వలన గానీ వచ్చింది కాదు, నిబంధనను భంగము చేసిన ప్రజలతోనే సమస్య (11:10 తో పోల్చండి). అయితే, ఈ కొత్త నిబంధన, నిర్గమ సమయంలో సీనాయి పర్వతం దగ్గర వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అనీ, ఇది “ఈ దినములైన తరువాత” (వ.33) అంటే వారు స్వదేశానికి తిరిగి చేరుకున్న తర్వాత చేయబోయే నిబంధన అని దేవుడు చెబుతున్నాడు. 

31:33 దేవుడు వారి మనస్సులలో తన ధర్మవిధి నుంచెదననీ, వారి హృదయములమీద దాని వ్రాసెదను అని తెలియజేస్తున్నాడు. ఈ ధర్మవిధి లేదా ధర్మోపదేశం పాత, కొత్త నిబంధనల కొనసాగింపును సూచిస్తుంది. దీని విశిష్ట లక్షణమేమిటంటే ఇది రాతిపలకల మీద కాక హృదయాల మీద రాయబడడం. పూర్వం ఇశ్రాయేలు స్వభావంగా ఉన్న దుష్టమనసు, చెడు హృదయాలు ఇక ఉండబోవు (13:10; 18:12; 23:17). 

31:34 పలకల మీద రాయబడిన బాహ్యమైన ధర్మవిధి గతానికి చెందినది. అందరును నన్నెరుగుదురు... యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ధర్మోపదేశం సైతం గతానికి చెందినదవుతుంది. అల్పులేమి ఘనులేమి అనే మాటలు సామాజిక స్థాయీభేదం లేకుండా (5:4-5 తో పోల్చండి. “ఎన్నిక లేనివారై.... ఘనులైనవారి యొద్దకు"), వయోభేదం లేకుండా (6:11 తో పోల్చండి - "పసిపిల్లల మీదను... వయస్సు మీరినవారును”) అందరినీ సూచిస్తున్నాయి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను అనే మాటలు పాపాలను క్షమించే దేవుని కృపను, ఆ పాపాలను ఇకను జ్ఞాపకం తెచ్చుకొనని లేక వాటిని బట్టి వారిని దూరం చేసుకోని ఆయన సర్వజ్ఞతను తెలియజేస్తున్నాయి. 

31:35-37 ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలు శాశ్వతకాలం నిలిచి ఉండడం విశ్వం నిలిచి ఉండే సమయంతో పోల్చబడింది: ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవుదురు. ఇశ్రాయేలు కనుమరుగు కావడం, లేదా ఉనికిని కోల్పోవడం అసాధ్యం. 

31:38 మానవచరిత్ర లక్ష్యసిద్ధి పొందే కాలంలో, హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము మళ్లీ కట్టబడుతుంది. హనన్యేలు గోపురం యెరూషలేముకు ఈశాన్యంలో ఉంటుంది (నెహెమ్యా 3:1; 12:39; జెకర్యా 14:10), మూలగుమ్మం బహుశా పట్టణ ప్రాకారానికి వాయవ్య మూలన ఉన్న గుమ్మం అయ్యుండవచ్చు (2రాజులు 14:13; 2దిన 26:9) 

31:39 గారేబుకొండ... గోయా గురించి నేడు మనకు వివరాలు తెలియవు. ప్రస్తావనకు వచ్చిన ఇతర స్థలాలు యెరూషలేముకు ఉత్తరంలో ఉన్నాయి కాబట్టి, వివరాలు లభ్యం కాని ఈ స్థలాలు దక్షిణంలో ఉండి ఉండవచ్చు.

31:40 శవములును బూడిదయు గల లోయ బహుశా బెన్ హిన్నోము లోయ అయ్యుండవచ్చు. (7:31 నోట్సు చూడండి), ఇది ఇశ్రాయేలులో మృతులను పాతిపెట్టే స్థలం. గుఱ్ఱముల గవిని పట్టణ ప్రాకారానికి తూర్పువైపు కిద్రోను లోయకు ఉత్తరకొనలో ఉంది (నెహెమ్యా 3:28).


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |