11:1-4 ప్రార్ధన ఎలా ఉండాలో అనే దానికి ఇదొక నమూనా, కొండమీద ప్రసంగంలో ప్రభువు -తన శిష్యులకు నేర్పించిన ప్రార్ధనకూ దీనికీ పోలికలున్నాయి. అయితే ఇది చాలా క్లుప్తమైన ప్రార్ధన. యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను, అతని శిష్యుల ప్రార్థనా మాదిరిని చూసి ప్రార్థించడం ఎలాగో నేర్చుకోవాలని యేసు శిష్యులు కూడా ప్రేరణ పొంది ఉంటారు. దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం యూదుల సాంప్రదాయంలో లేదు. అలా సంబోధించడం మరీ వ్యక్తిగతమైంది, సన్నిహితమైంది. యేసు పరిచర్యలో దేవుని రాజ్య ప్రకటననూ (4:43), దాని సామీప్యతనూ (10:9,11) లూకా నొక్కి చెప్పినప్పటికీ, రాజ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు భవిష్యత్తులోనే నెరవేరతాయి (నీ రాజ్యము వచ్చును గాక). మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము అనే మాట ప్రజలందరూ తమ అనుదిన అవసరాలను తీర్చుకోవడానికి ప్రభువుపై ఆధారపడాలి అని తెలియచేస్తుంది. మాకచ్చి యున్న ప్రతివానిని అనే మాట ఆత్మసంబంధంగా మనకు “రుణపడిన వారిని" (అంటే మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని) సూచిస్తుంది. మమ్మును శోధనలోనికి తేకుము అనే మాట క్రీస్తుకు వర్తించదు. ఎందుకంటే సాతానుచే శోధింపబడే విధంగా క్రీస్తును పరిశుద్దాత్మే నడిపించాడు (4:1-2 నోట్సు చూడండి). మత్తయి 6:13 నోట్సు కూడా చూడండి.
11:5-8 సిగ్గుమాలిన ధైర్యం ప్రతిఫలాన్నిస్తుందనేదే ఈ ఉపమానంలోని ముఖ్యాంశం. అయితే, 18:1-28లో విధవరాలు- న్యాయాధిపతి ఉప మానంలోలాగా ఈ ఉపమానంలో దేవుణ్ణి సహాయం చేయడానికి సంకోచించే ఇంటి యజమానిగా తలంచకూడదు. మనం ధైర్యంగా పట్టుదలగా అడిగినప్పుడు మన విన్నపాన్ని మన్నించని వ్యక్తి మనకు ప్రతిఫలమిస్తే, పట్టుదలతో కూడిన మన ప్రార్ధనలకు తన బిడ్డల యెడల శ్రద్ధను కనపరిచే తండ్రి, ధారాళంగా ప్రతిఫలమివ్వడానికి సంతోషించే దేవుడు మనకు ఇంకెంతగా అనుగ్రహిస్తాడో కదా! 11:9-10 5-8 వచనాల్లోని ఉపమానంలో నొక్కి చెప్పిన పట్టుదలతో కూడిన ప్రార్ధన అనే అంశాన్ని అడుగుడి... వెదకుడి... తట్టుడి అనే ఆజ్ఞలు సూచిస్తున్నాయి. అడుగు ప్రతివానికియ్యబడును అంటే ప్రతీ ప్రార్థనకూ మనం కోరిన రీతిలో జవాబు వస్తుందని కాదు గానీ, మనం ప్రార్థనలో పట్టుదలగా కొనసాగితే, అప్పుడు మన యెడల దేవునికున్న అత్యుత్తమ ప్రణాళికలకు అనుగుణంగా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని దీని భావం.
11:11-12 తన బిడ్డను ప్రేమించే ఏ మానవతండ్రి కూడా చేపకు బదులుగా పామునూ గుడ్డుకు బదులుగా తేలునూ ఇచ్చేటంత అశ్రద్ధను కనబరచడు.
11:13 "తనను అడుగువారికి మంచి యీవులనిచ్చును" అని దీనికి సమాంతర వాక్యభాగమైన మత్తయి 7:11 చెబుతుంది. ఆ మంచి యీవులు పరిశుద్దాత్మకు సంబంధించినవైతే, ఈ మాటలు కృపావరాల గురించి మాట్లాడుతూ ఉండవచ్చు (
రోమా 12; 1కొరింథీ 12). పరిశుద్దాత్మ గురించి లూకా నొక్కి చెబుతున్న సంగతిని ఈ వచనం సూచిస్తుంది. పెంతెకొస్తు దినానికి ముందురోజుల్లో రాబోయే ఆత్మ బాప్తిస్మం కోసం అపొస్తలులు, ఇతర విశ్వాసులు ప్రార్థనలో ఎదురుచూశారు. (అపొ.కా. 1:14), ఆ సందర్భంలో తనను అడిగిన వారికి పరలోకమందున్న తండ్రి పరిశుద్దాత్మను అనుగ్రహించాడు. “మీరు చెడ్డవారైయుండియు" అనే మాట గురించి మత్తయి 7:11 నోట్సు కూడా చూడండి.
11:14-16 మూగదయ్యం పట్టిన వ్యక్తిలోని దయ్యాన్ని వెళ్లగొట్టడం ద్వారా యేసు అతణ్ణి బాగుచేసినందుకు దేవుణ్ణి స్తుతించడానికి బదులు, జనసమూహంలో కొందరు ఆయన సాతాను శక్తితో దయ్యాలను వెళ్లగొడుతున్నాడని నిందించారు. ఎక్రోనులో ఫిలిపీయులు ఆరాధించిన దేవత బయల్డెబూలు. ఈ పేరు సాతానుకు మారుపేరుగా మారింది. అద్భుత సూచకక్రియను చేయమని అడుగుతూ ఇతరులు యేసును ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు.
11:17-20 తనకుతానే విరోధంగా లేచిన రాజ్యముగాని ఇల్లుగాని నాశనం కాక తప్పదు. తనను సమర్థించుకుంటూ యేసు రెండు కీలకాంశాలను చెప్పాడు (1) తన సొంత దయ్యములను వెళ్లగొట్టుకుంటూ సాతాను తన ఇంటిని తానే కూలగొట్టుకుంటాడని ఆలోచించడం అర్థరహితం, (2) యూదు మాంత్రికుల్లో కొందరు దయ్యాలను వెళ్లగొడుతున్నారు. వాళ్లు ఉపయోగించే శక్తి యేసు ఉపయోగించే శక్తి వేరు అయ్యే అవకాశం లేదు. అందువల్ల జరిగిన దానికి ఉత్తమ వివరణ: కేవలం దేవుని వ్రేలితోనే (లోకంలో చురుకుగా పనిచేసే దేవుని శక్తితోనే) యేసు దయ్యములను వెళ్లగొట్టాడు.
11:21-22 బలవంతుడు సాధారణంగా బలహీనుణ్ణి జయించి అతణ్ణి నిరాయుధునిగా చేస్తాడు. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే, సాతాను కంటే బలవంతుడైన యేసు వాన్ని నిరాయుధునిగా చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాడు. అతని ఆస్తిని పంచి పెట్టును అనే మాట ఎఫెసీ 4:8లో క్రీస్తు సాధించిన విజయం తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవుల లాంటిదాన్నే సూచిస్తూ ఉండవచ్చు.
11:23 ఈ మాట 9:50లో యేసు చెప్పిన మాటకు పూర్తి విరుద్ధమైన నియమం. ఈ సందర్భం దురాత్మల చర్యల గురించీ, శక్తి గురించి మాట్లాడుతుంది. కాబట్టి యేసు దయ్యాలను వెళ్లగొడుతున్నది దేవుని శక్తితోనే అని ఎవడైనా నమ్మకపోతే వాడు క్రీస్తుకు విరోధి. నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అనే మాటలు ఒక కాపరి గొర్రెల మందను సమకూర్చడాన్ని లేదా చెదరగొట్టడాన్ని సూచిస్తుంది. ఇక్కడ మంద అంటే ఇశ్రాయేలును లేక సంఘాన్ని సూచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే సంఘారంభం తర్వాతే లూకా తన సువార్త రాశాడు.
11:24-26 దయ్యం ఎవరినుంచైతే వెళ్లగొట్టబడుతుందో ఆ వ్యక్తి క్రీస్తులో విశ్వాసముంచితే ఆయన అతని హృదయంలో నివాసమేర్పరచుకుంటాడు. అది జరగనంతవరకు దయ్యం వెళ్లగొట్టబడే కార్యం అసంపూర్ణమే అని ఈ వచనాలు హెచ్చరిస్తున్నాయి. క్రీస్తు ఆ వ్యక్తి హృదయంలోనికి రాకపోతే ఆ వ్యక్తి హృదయంలోకి ఆ దయ్యము, వేరే యేడు అపవిత్రాత్మలతో మరలా ప్రవేశించకుండా అడ్డగించేది ఏదీ ఉండదు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి కడపటి స్థితి అతని మొదటి స్థితికంటే పెద్దదిగా ఉంటుంది.
11:27-28 తన తల్లియైన మరియ ఎంతో ధన్యజీవి అనే సత్యాన్ని యేసు కాదనలేదు. దానికి భిన్నంగా తనతో కేవలం కుటుంబ బంధం కలిగి ఉన్న వ్యక్తి కంటే కూడా దేవుని వాక్యాన్ని విని విశ్వాసంతో దాన్ని పాటించే వ్యక్తి మరింత ధన్యుడని ఆయన చెప్పాడు (ప్రక 1:3).
11:29-32 యోనాను గూర్చిన సూచకక్రియ అనే మాటలకు రెండు అర్థాలు ఉండే అవకాశం ఉంది: (1) యోనా చేసిన ప్రకటన నీనెవె పట్టణస్థులను మారుమనస్సుకు పురికొల్పింది (యోనా 3). కాబట్టి, ఇశ్రాయేలు అలాంటి ప్రకటనను మాత్రమే యేసు నుంచి పొందే సూచన కావచ్చు లేదా (2) పెద్ద మత్స్యం కడుపులో యోనా మూడు పగళ్లు మూడు రాత్రుళ్లు (యోనా 1:17) ఉండడం యేసు మరణ పునరుత్థానాలకు ముంగుర్తు. ఆ సూచనే ఆ దుష్టతరము వారికి ఇచ్చేది అని కావచ్చు. దక్షిణ దేశపు రాణి (షేబా రాణి) సొలొమోను జ్ఞానానికి స్పందించింది. ఆ జ్ఞానం మనుష్యకుమారుడైన యేసు అనుగ్రహించే జ్ఞానానికి రక్షణకూ ఏమాత్రము సమానం కాదు. యోనా ప్రకటన మూలంగా నీనెవెవారు మారుమనస్సు పొందితే, యేసు చేసిన ప్రసంగాలకు జనసమూహాలు ఇంకెంత ఎక్కువగా మారుమనస్సు పొందాలో కదా!
11:33-36 అందరూ చూడడానికి యేసు సువార్త వెలుగును పట్టుకొని ఉన్నాడు. ఆయననూ ఆయన సందేశాన్ని తృణీకరించిన వారు ఆత్మసంబం ధంగా చెడిన నేత్రాలను కలిగి ఉన్నారు. అది క్రీస్తు వెలుగును చీకటిగా చేసేసింది. అయితే విశ్వాసంతో క్రీస్తును స్వీకరించినవారు వెలుగుతో నింపబడ్డారు.
11:37-38 భోజనానికి ముందు ఆచారసంబంధమైన స్నానము, కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేవి ప్రాచీన యూదుల సాంప్రదాయమే కానీ మోషే ధర్మశాస్త్రంలో అలాటి ఆదేశాలు లేవు (మార్కు 7:3).
11:39-41 మన భౌతిక దేహాన్ని (వెలుపల కాళ్ళు చేతులు మొ||వి) శుభ్రం చేసుకోవడం వలన మన - అంతరంగంలో ఉండే అపవిత్రత తొలగిపోదని యేసు చెబుతున్నాడు. దేవుని దృష్టిలో ప్రతీదానిని శుద్ధి చేసుకొనే ఏకైక మార్గం దేవునికి అంకితం చేసిన హృదయం నుంచి స్వచ్ఛందంగా ఇవ్వడమే...
11:42-44 పరిసయ్యులు తమకు కలిగిన ప్రతీ దానిలోనూ దశమభాగం అర్పించినందుకు కాక, వాళ్లు న్యాయమును... ప్రేమను అభ్యాసం చేయనందుకే యేసు వారికి శ్రమ అన్నాడు. వాళ్లు ప్రభువును కాకుండా ప్రజాభిమానాన్నే ప్రేమించినందుకు రెండవ శ్రమ. మూడవ శ్రమకు సంబంధించిన మాట: ఏ గురుతులూ లేని సమాధులపై యూదులు నడిస్తే, వారు అపవిత్రులవుతారు. పరిసయ్యుల ఉపదేశాలను అనుసరించడం అంటే కనబడని సమాధులపై నడవడం లాంటిది. మీకు తెలియకుండానే మీరు అపవిత్రులవుతారు అని యేసు చెబుతున్నాడు. పరిసయ్యుల బోధనలు స్వచ్ఛమైనవిగా సత్యమైనవిగా కనబడ్డాయి కానీ వాస్తవానికి అవి దుర్నీతిమయమైనవి, తప్పుదోవ పట్టించేవి.
11:45-46 పరిసయ్యులపై యేసు ప్రకటించిన మూడు శాపాలు శాస్త్రులపై కూడా ప్రతికూలతను చూపిస్తున్నాయని అక్కడే ఉన్న శాస్త్రి (ధర్మశాస్త్రములో నిష్ణాతుడు) గ్రహించాడు. అందువల్ల ధర్మశాసోపదేశకులపై మరొక అదనపు శాపాన్ని ప్రకటించి యేసు పరిస్థితిని సమం చేశాడు. వారు సగటు యూదునిపై, తాము కూడా మోయని భారాన్ని పెడతారు. దీనికి రెండు విధాలుగా అర్థం చెప్పవచ్చు. మొదటిది, ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ధర్మశాస్త్రపదేశకులు వేషధారులుగా ప్రవర్తిస్తున్నారు, రెండవది, భారభరితమైన నియమాల కింద జీవించడానికి ప్రయత్నిస్తున్న ప్రజల పట్ల వాళ్లకు ఏమాత్రం కనికరం లేదు.
11:47-48 ఈ వచనాల ద్వారా యేసు చెప్పడలచుకున్న విషయం: ప్రవక్తలకు సమాధులు కట్టి, వారిని ఘనపరచామని శాస్త్రులు పరిసయ్యులు ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రవక్తలు మరణించారు. వాళ్ల నోళ్లు మూయించబడ్డాయి. ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా దేవుని ప్రవక్తలను చంపిన తమ తండ్రుల వంటివాళ్లే.
11:49-51 కొందరు ప్రవక్తలను అపొస్తలులను హింసించి చంపుతుంటే ప్రభువు ఆశ్చర్యపడడు. ప్రవక్తలందరికంటే అపొస్తలుందరికంటే ఎంతో గొప్పవాడైన యేసు ఉన్నందున, ఇశ్రాయేలీయులలో ఆ తరమువారు బాధ్యులుగా ఎంచబడ్డారు (ప్రక 18:20లో మహా బబులోను గురించి ఇలాంటి మాటనే చూడండి). క్రీ.శ. 70 లో యెరూషలేము నాశనం కావడమే ఆ తరములోని యూదులు చేసిన పాపానికి తగిన తీర్పు. లేఖనంలో మొట్టమొదటిగా హత్యకు గురైనవాడు హేబెలు (ఆది. 4:8). 2దిన 24:20-25లో జెకర్యా హత్య గురించిన సమాచారం గ్రంథస్థం చేయబడింది. హెబ్రీ బైబిల్లో 2 దినవృత్తాంతాల గ్రంథమే చివరిది కావడం వలన యేసు కాలానికి బైబిల్ లో చివరి హత్య జెకర్యాదే అవుతుంది.
11:52 మత్తయి 28:13లో పరలోక రాజ్యాన్ని మూసేశారని ధర్మశాస్రోపదే శకులను యేసు నిందించాడు. ఇక్కడ లూకాలో జ్ఞానమను తాళపుచెవి అంటే లేఖనాలు. శాస్త్రులు, పరిసయ్యులు వాటి యెడల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించారు. ఆ విధంగా దేవుని సంగతులు అర్థం చేసుకునే విషయంలో ప్రజలకు ద్వారాలు మూయబడ్డాయి.
11:53-54 అపనిందలతో, ద్వేషపూరిత ప్రశ్నలతో శాస్త్రులును పరిసయ్యు లును స్పందించారు. ఆయనను బంధించడానికి తగిన మాట ఏదైనా మాట్లాడతాడేమోననే ఉద్దేశంతో ఆయనను పట్టుకొనుటకు వాళ్లు ఆయనను మాట్లాడిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు.