John - యోహాను సువార్త 6 | View All

1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

2. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

3. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

5. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

6. యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

7. అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

8. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

9. ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

12. వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

13. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

16. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

17. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

19. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

20. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

21. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

22. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

23. అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

24. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

25. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

26. యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

29. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

31. భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
నిర్గమకాండము 16:4-15, సంఖ్యాకాండము 11:7-9, Neh-h 9 15, కీర్తనల గ్రంథము 78:24, కీర్తనల గ్రంథము 105:40

32. కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

33. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

34. కావున వారు ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

36. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

37. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

39. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

41. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

42. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

43. ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

44. అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;

45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
యెషయా 54:13

46. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

47. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.

48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

52. యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

53. కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

57. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

58. ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను

59. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.

61. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

62. ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
కీర్తనల గ్రంథము 47:5

63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

64. మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

65. మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

66. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

67. కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా

68. సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

70. అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.

71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-71 యేసు చేసిన మెస్సీయ సంబంధ సూచక క్రియలలో మరో సూచక క్రియ (యోహాను 2:11 నోట్సు చూడండి), జనసమూహానికి ఆహారం ఇవ్వడం (మత్తయి 14:13-23; మార్కు 6:30-44; లూకా 9:10-17). ఈ సూచక క్రియలో యేసు మోషే చేసిన విధంగానే చేశాడు (6:30-31). ఎలాగంటే దేవుడు మోషే ద్వారానే ఇశ్రాయేలీయులకు మన్నాను దయచేశాడు. నిర్గమకాండంలో మోషే చేసిన సూచక క్రియల కంటే గొప్ప సూచక క్రియను ప్రదర్శించమని ప్రజలు యేసును కోరుకున్నారు. అందుకు ప్రతిస్పందనగా యేసు తన యందు విశ్వాసముంచిన వారందరికీ ఆధ్యాత్మిక పోషణను అందించే జీవాహారం తానేనని చెప్పాడు (ఆయన శరీరాన్ని తిని, రక్తాన్ని తాగాలి). ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా యేసు పరిచర్య ఒక మలుపు తిరిగిన క్షణాలవి. ఈ సమయంలో ఆయనను వెంబడించేవారు చాలా మంది ఆయనను విడిచి వెళ్లిపోవడం ద్వారా అది నిరూపించబడింది (వ.60-66). కానీ పన్నెండు మంది శిష్యులు వారి ప్రతినిధియైన పేతురు ద్వారా ఆయనలో తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు (వ. 68-69). 6

6:1 మళ్ళీ అటు తరువాత అన్న మాట ఎంతో కొంత కాలం గడచిపోయినట్లు సూచిస్తుంది (5:1). మునుపటి సంఘటన తర్వాత ఓ అర్ధ సంవత్సరం గడిచి ఉండవచ్చు. తిబెరియ (21:1) సముద్రం అనేది గలిలయ సముద్రానికి ప్రత్యామ్నాయ పేరు. హేరోదు అంతిపయ తన పోషకుడూ రోమా చక్రవర్తి అయిన తిబెరు (క్రీ.శ. 14-37) గౌరవార్థం గలిలయ సముద్రం దగ్గర అతి పెద్ద నగరమైన తిబెరియను నిర్మించాడు. మొదటి శతాబ్దాంతానికి ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. 

6:2 సాధారణంగా జన సమూహాలు ఆయన చేస్తున్న అద్భుతాల కారణంగానే ఆయన్ని వెంబడిస్తున్నట్లు, వారు గందరగోళంలోనూ అజ్ఞానంలోనూ కూరుకుపోయి ఉన్నట్లు యోహాను చిత్రీకరిస్తాడు. 

6:3 కొండ అన్న మాట ఏ నిర్దిష్టమైన పర్వతాన్ని సూచించకపోవచ్చు. ఇది సరస్సుకి తూర్పున ఉన్న కొండ ప్రాంతం; ఈ రోజుల్లో దీన్ని గోలాన్ హైట్స్ అని పిలుస్తారు (మత్తయి 14:23; మార్కు 6:46). ఇతర రబ్బీల మాదిరిగానే యేసు కూడా బోధించడానికి కూర్చుండెను (మత్తయి 5:1; మార్కు 4:1; 9:35; లూకా 4:20). ఆయన బోధ దేని గురించి చేశాడో ఇక్కడ ప్రస్తావించలేదు. 

6:4 యోహాను సువార్తలో ప్రస్తావించిన మూడు పస్కా పండుగలలో ఇది రెండవది, ఈ పస్కా దినాలను మాత్రమే యేసు గలిలయలో గడిపారు (2:13 నోట్సు చూడండి). 

6:5-6 బహు జనులు సరస్సుకి ఉత్తరంవైపు చాలా మైళ్ళ దూరం నడిచి యేసునూ శిష్యులనూ తిరిగి కలుసుకున్నారు. అంద్రియ (వ.8), పేతురుల వలె ఫిలిప్పు కూడా సమీపంలోని బేత్సయిదాకు చెందినవాడు (1:44 నోట్సు చూడండి). కాబట్టి సహజంగానే ఏదైనా అడగడానికి యేసు ఫిలిప్పును ఎన్నుకునేవాడు. యేసు ప్రశ్నలో అరణ్యంలో మోషే అడిగిన ప్రశ్న ప్రతిధ్వనిస్తుంది: “ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది?” (సంఖ్యా 11:13). యోహాను గ్రంథానికీ సంఖ్యాకాండానికీ మధ్యనున్న ఇతర సమాంతరాలు ఏమిటంటే ప్రజల సణుగుడు (సంఖ్యా 11:1; యోహాను 6:41,43), మన్నా గురించిన వివరణ (సంఖ్యా 11:7-9; యోహాను 6:31), మాంసం| యేసు శరీరాన్ని తినడం గురించిన ప్రస్తావన (సంఖ్యా 11:13; యోహాను 6:51), అత్యధికంగా అనుగ్రహించబడిన సదుపాయాలు (సంఖ్యా 11:22; యోహాను 6:7-9). 

6:7 ఒక సాధారణ కార్మికునికి ఒక రోజు చెల్లించే కూలి (12:5; మత్తయి 20:2) ఒక దేనారం కాబట్టి రెండు వందల దేనారములంటే సుమారు ఎనిమిది నెలల కూలీ. 

6:8-9 చిన్నవాని అన్నమాట ఒక బాలుడినో యవ్వనస్థుడినో లేదా ఇరవైల ఆరంభంలో ఉన్నవాడిని సూచిస్తూ ఉండవచ్చు. ఇదే పదాన్ని సెప్టువజింట్ (పా.ని. పురాతన గ్రీకు అనువాదం; సంక్షిప్తంగా LXX అంటారు) లో ఆది 37:30 లో చిన్నవాడైన యోసేపునీ, దాని 1 అధ్యా. లో దానియేలూ అతని స్నేహితులను సూచించడానికి ఉపయోగించారు. యవలనేవి పేదలకు సాధారణ ఆహారం (ధనవంతులు గోధుమ రొట్టెలను ఇష్టపడేవారు); చేపలు బహుశా ఎండినవి లేదా నిల్వ ఉంచినవి, నిల్వ ఉండేవిధంగా ఊరబెట్టినవి. ఇటువంటి ఉదంతమే ఎలీషా విషయంలోనూ జరిగింది, ఎలీషా వందమంది పురుషులకు ఇరవై యవల రొట్టెలను వడ్డించాడు (2రాజులు 4:42-44).

6:10 లెక్కకు ఐదు వేలమంది పురుషులున్నారు. స్త్రీలు, పిల్లలతో కలిపి (మత్తయి 14:21) మొత్తం పదిహేను వేల మంది ఉండవచ్చు. చాలా పచ్చికయుండెను అన్న మాట మెస్సీయ యుగాన్ని సూచిస్తూ ఉండవచ్చు (10:9-10; కీర్తన 23:2). మార్కు (మార్కు 6:39-40) కూడా “పచ్చిక” అనే మాట ఉపయోగించాడు. అది వసంతకాలాన్ని సూచిస్తుంది. 6:11 ఒక సాధారణ యూదుడు చేసే కృతజ్ఞతా ప్రార్థన. ఏమిటంటే, “మా దేవుడవైన ఓ యెహోవా, విశ్వరాజా, భూమినుండి రొట్టెలను అనుగ్రహించే నీవు స్తుతింపబడుదువు గాక". 

6:12 యేసు మాటల్లో రూతు 2:14 ప్రతిధ్వనిస్తుంది: “ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను". తండ్రి తనకిచ్చిన వారికి అవసరమయిన వాటిని సమకూర్చడంలో యేసు అటువంటి జాగ్రత్త తీసుకున్నాడు. (యోహాను 10:28-29; 17:11-12,15) 

6:13 ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలను యేసు - సూచనార్థకంగా పునరుద్ధరించడాన్ని గంపలు సంఖ్య సూచిస్తూ ఉండవచ్చు. 

6:14 ఈ లోకమునకు రాబోవు ప్రవక్త అన్న మాటలు ద్వితీ 18:15,18 ని సూచిస్తుంది (యోహాను 1:19-21; 7:40-41 నోట్సు చూడండి). 

6:15 యేసు కొండకు వెళ్లిపోవడాన్ని గురించి వ.3 నోట్సు చూడండి. 6:16-24 యేసు గలిలయ సముద్రంపై నడవడం, యోబు 9:8 (LXX) ని ప్రతిధ్వనించవచ్చు. ఆ వచనంలో దేవుడు సముద్రతరంగముల మీద నడుచుచున్నాడు అని ఉంటుంది. 

6:16-17 శిష్యులు సరస్సుకి తూర్పు వైపున ఉన్నారు. పడమటి వైపున సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు ఆరు లేదా ఏడు మైళ్ళు వెనక్కి ప్రయాణించే సాహసం చేశారు. 

6:19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరం నీటిపై ప్రయాణించారు. తూర్పు తీరంలోనే జనసమూహానికి ఆహారం వడ్డించి ఉంటే, ఆ ప్రాంతం నుండి కపెర్నహూముకు ఐదు నుండి ఆరు మైళ్ళ అతి తక్కువ దూరం ఉండవచ్చు. 

6:20 నేనే అన్న మాటలో దైవిక ప్రత్యక్షత ఉండొచ్చు . (నిర్గమ 3:14; యోహాను 6:35,48 నోటు, చూడండి). ఈ మాటలు కీర్తన 77:16,19 ని సూచిస్తూ ఉండవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటప్పుడు దేవుడు తనని తాను బయలుపరుచుకున్న సంగతులను ఆ కీర్తనలో వివరించారు. 

6:21 వెంటనే ఆ దోనె తీరానికి చేరడమనేది కీర్తన 107:23-32 ని సూచిస్తూ ఉండవచ్చు (ముఖ్యంగా వ.29-30).


6:23-24 తిబెరియ సముద్రానికి పడమటి వైపున చాలా కాలం నుండి ప్రధాన నగరంగా ఉంది. (వ.1 నోట్సు చూడండి). కపెర్నహూము సముద్రానికి వాయువ్యపు అంచున ఉండగా, తిబెరియ దక్షిణాన చాలా మైళ్ళ దూరంలో ఉంది.

6:25 సముద్రపుటద్దరిని అన్న మాట కపెర్నహూము చుట్టు ప్రక్కల ప్రాంతాన్ని సూచిస్తుంది. (వ.23-24 నోట్సు చూడండి; వ.59). 

6:26 వారు తమ కడుపులు నింపుకోవడం గురించి మాత్రమే చూసుకుంటున్నారు గానీ సూచనల (సూచక క్రియల) ప్రాముఖ్యత గురించి పట్టించుకోవడం లేదని యేసు ఆరోపించాడు. 

6:27-29 ప్రజలు యేసు మాటలను తప్పుగా అర్థం చేసుకొని, దేవుడు కోరుకునే క్రియలు గురించి ఆయన్ని అడిగారు. మెస్సీయ నందు విశ్వాసం ఉంచడం మాత్రమే దేవుడు కోరుకునే ఏకైక “క్రియ” అని యేసు చెప్పాడు. ముద్రవేసియున్నాడనే దాని గురించి 3:33 నోట్సు చూడండి. 

6:30 ప్రజలు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసు మాటలకు రుజువుగా ఒక సూచక క్రియను వారడిగారు. (1కొరింథీ 1:22). వాస్తవానికి యేసు తాను అంతకు ముందే జనసమూహానికి ఆహారం దయచేసిన (2:18) సూచక క్రియను సూచిస్తూ మాట్లాడాడు. ఇది ప్రజల హృదయ కాఠిన్యాన్ని వెల్లడించింది. ఆ కఠినత్వమే యేసు శిష్యులలో చాలా మంది ఆయనను విడిచి వెళ్లిపోవడానికి దారితీసింది. (6:60-66). యేసు బహిరంగ పరిచర్యను వివరించే భాగం ముగింపులో కూడా యూదులపై అవిశ్వాసం అనే నేరాన్ని ఆరోపించేలా వారి కఠినత్వమే యోహానుని ప్రేరేపించింది (12:37-40).

6:31 ఈ వచనం ఇశ్రాయేలీయుల నిర్గమము, పస్కాల వంటి ప్రధానాంశాలను మోషే వంటి ప్రవక్తయైన యేసుతోనూ మెస్సీయ యుగంలో మళ్ళీ దేవుడు మన్నాను దయచేయవచ్చునన్న నిరీక్షణతోనూ అనుసంధానిస్తుంది. దీనికి సంబంధించి పా.ని. లో అనేక వచనాలున్నాయి, వాటిలో కీర్తన 78:23-24 చాలా ప్రాముఖ్యమైంది (నిర్గమ 16:4,15; నెహెమ్యా 9:15; కీర్తన 105:40). 

6:32-34 అరణ్యంలో కురిసిన మన్నా, పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారాన్ని సూచిస్తుంది, ఆ ఆహారం యేసే. 

6:35,48 యేసు తనను తాను "నేను" అని ఏడు సార్లు యోహాను సువార్త లో ప్రస్తావించిన వాటిలో నేనే జీవాహారము అనేది మొట్టమొదటిది. అదే రీతిగా "నేను... వెలుగును" (8:12,9:5), "
గొర్రెలు పోవు ద్వారమును నేనే" (10:7,9), “నేను గొర్రెలకు మంచి కాపరిని" (10:11,14), “పునరుత్థాన మును జీవమును నేనే" (11:25), “నేనే మార్గమును, సత్యమును, జీవమును" (14:6), “నేనే నిజమైన ద్రాక్షావల్లిని" (15:1) అని ప్రస్తావించాడు. అంతేకాకుండా "నేను" అని నిర్గమ 3:14 లో దేవుడు తన గుర్తింపును వెల్లడిచేసినట్లుగా యేసుక్రీస్తు తనకు తాను "నేను" అని ప్రస్తావించుకున్న ఇతర సందర్భాలున్నాయి (6:20 నోట్సు చూడండి 8:24,28,58;18:5). 

6:36 యేసు చెప్పినది విన్నవారి భూ సంబంధమైన ఆలోచన వారిని
యేసుని విశ్వసించకుండా అడ్డగించింది. 

6:37,44 పరిశుద్దుల ఎన్నిక గూర్చిన విషయాలపై యోహాను సువార్త రెండు అంశాలుగా తెలియజేసిన వాటిలో ఇది మొదటిది. తండ్రి చిత్తంలోని వారు తండ్రి ఆకర్షిస్తేనే యేసు వద్దకు వస్తారు. ఆయన వారిని కాపాడతాడు. ఈ రెండు అంశాలను గూర్చి గొర్రెల మంచి కాపరి ఉపన్యాసం లోనూ (10:28-29), యేసు చివరి ప్రార్థనలోనూ కొనసాగుతుంది (17:6,9,11-12). 

6:38-39 యేసు తన తండ్రి చిత్రాన్ని నెరవేర్చుట లోని విశ్వాసి నిత్య రక్షణ కనిపిస్తుంది.

6:40 నిత్యజీవమును గూర్చిన యేసు వాగ్దానం గురించి 3:16-18 చూడండి. 

6:41,48 అరణ్యములో మోషే పైన సణిగిన ఇశ్రాయేలీయులు, యేసుపై సణిగిన యూదులు సమానులే అని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి (నిర్గమ 16:2,8-9; సంఖ్యా 11:4-23; యోహాను 6:5-6). మొదటిగా ఆహారాన్ని అందించిన మోషే పై ఇశ్రాయేలు ఏ రీతిగా సణిగారో అదే రీతిగా ఇప్పుడు రెండవసారి ఆహారాన్ని ఇస్తున్న యేసు పై సణుగుకొనుచున్నారు. 

6:42-44 యేసు కన్యాజననంపై ఇశ్రాయేలీయులకు ఎలాంటి అవగాహన లేదు (మత్తయి 1:18-25). తాను పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు మానవుని పోలికలు ఉన్న యేసును చూసి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు (4:44). అంత్య దినములలో “లేపుదును" అనే యేసు పరిచర్య పై 12:32 చూడండి. 

6:45 యేసు యెషయా 54:13 ను ఉటంకిస్తూ, ఒకనాడు ప్రజలందరు దేవునిచేత బోధింపబడుదురనే ప్రవచనాత్మక దర్శనాన్ని తన పరిచర్య నెరవేర్చిందని చెప్పడమేగాక, ఇది కేవలం తండ్రి ద్వారా ఆకర్షితులై యేసును మెస్సీయాగా అంగీకరించిన వారికి వర్తిస్తుందని ధృవీకరించాడు.

6:46 తండ్రి దగ్గర నుండి నేర్చుకోవడం, ఆయనను చూడడం ఒకటి కావు. కేవలం యేసు మాత్రమే తండ్రిని చూశాడు. మోషే కూడా తండ్రిని చూడలేదు కాబట్టి మోషే కంటే యేసు ప్రత్యక్షత మరింత గొప్పది. 

6:47-52 అరణ్యములో మన్నాకు పరలోకము నుండి వచ్చిన ఆహారానికీ వ్యత్యాసాన్ని యేసు వారికి తెలిపాడు. రెండవసారి వచ్చిన ఆహారం (యేసు) మాత్రమే నిత్యజీవమును ఇవ్వగలుగుతుంది. యేసు శరీరము ప్రజల పాపాల నిమిత్తమై సిలువపై ఆయన చేసిన త్యాగాన్ని సూచిస్తుంది. ఈ మాటలకు అనేక ప్రశ్నలు శ్రోతల మదిలో పుట్టాయి. 

6:53-59 యేసు మాటలను అక్షరార్థంగా లేదా మతసంబంధమైన అర్థంతో తీసుకోకూడదు. హెబ్రీ భాషలో శరీరము, రక్తము "మొత్తం ఒక వ్యక్తిని” సూచిస్తుంది. యేసు మాటలు ఇంత దిగ్ర్భాంతికరంగా ఇంకెక్కడా కనిపించవు. నిత్యజీవము కేవలం ఆయన శరీరమును తిని రక్తమును త్రాగినవారికి మాత్రమే ప్రాప్తిస్తుంది. దానికి అర్థం ఆయనను పూర్తిగా విశ్వసించడమే. 

6:60-63 యేసు మాటలు శిష్యులను కూడా మనస్థాపానికి గురి చేశాయి. కానీ తర్వాత వారికి యేసు దానిలోని ఆధ్యాత్మిక భావాన్ని వివరించాడు. ఆత్మ నడుపుదల లేకుండా ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. యూదులు దేవుని క్రియలను సరిగ్గా చేయడం ద్వారానే దేవుని చిత్తాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోగలం అనే తప్పుడు అవగాహనతో ఉండేవారు (6:27-29).

6:64-66 ఈ సువార్తను మలుపుతిప్పే సంఘటనగా యేసు శిష్యులలో అనేకులు ఆయన నుండి వెనుదిరిగారు. ఇది యేసుకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఆయన వారి హృదయ ఆలోచనలను ఎరిగినవాడు. 

6:67-68 ఎవనియొద్దకు వెళ్ళుదుము? బహుశా మరొక బోధకునికి విధేయతను చూపడం గురించి సూచిస్తుంది (1:35-37) 

6:69 యేసే దేవుని పరిశుద్దుడు అని పేతురు చేసిన ఒప్పుకోలు ఆయన తండ్రిచేత ప్రతిష్ఠించబడిన వాడని తరవాతి అధ్యాయాల్లో (10:36; 17:19)కనిపించే వాటికి ముంగుర్తుగా ఉంది. దేవుడు “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు” అని పా.నిలో అనేకమార్లు పిలువబడ్డాడు (కీర్తన 71:22; యెషయా 43:3; 54:5). యేసును గురించిన ఇలాంటి ఒప్పుకోళ్ళ కోసం మత్తయి 16:16; మార్కు 8:29; లూకా 9:20 కూడా చూడండి. 

6:70 యోహాను సువార్తలో యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను గూర్చి మొదటిగా ఈ వచనములోనే ప్రస్తావించాడు (1:43; 15:16). 

6:71 పన్నెండు మంది శిష్యులలో గలిలయవాసి కానివాడు బహుశా సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా ఒక్కడే. 


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |