23:1-3 దేవుని యెదుట మంచిమనస్సాక్షి కలిగి వున్నానని పౌలు అబద్ధం చెప్తున్నాడని ప్రధాన యాజకుడు భావించాడు కాబట్టి పౌలును నోటిమీద కొట్టమని ఆజ్ఞాపించాడు. సున్నము కొట్టినగోడ అని పౌలు ఆక్షేపించడం యాజకుడు బయటికి భక్తి చూపుతున్నాడు గాని ఆంతర్యంలో చెడిపోయాడని చెబుతుంది.
23:4-5 తాను ప్రధాన యాజకుని గుర్తుపట్టలేదని పౌలు అన్నాడు కానీ అతడు కేవలం వ్యంగ్యంగా అని ఉంటాడు. ఈ విధంగా అతడు ప్రధాన యాజకుని అసమంజసమైన ప్రవర్తనను ఎత్తిచూపాడు.
23:6-9 పునరుత్థానము సిద్ధాంతాన్ని బట్టి మహాసభలో ఉన్న తనపై నేరారోపణ చేసేవారిని విడదీసి, పౌలు వారి దృష్టి మళ్ళించాడు. పరిసయ్యులు కూడా పౌలులాగా పునరుత్థానంలో విశ్వసించేవారు, కానీ ప్రధాన యాజకుడైన అననీయతో సహా సద్దూకయ్యులు పునరుత్థానాన్ని విశ్వసించేవారు కాదు. తద్వారా జరిగిన చర్చలో పరిసయ్యులకు సంబంధించిన కొందరు శాస్త్రులకు, పౌలుపై నేరారోపణ చేయడానికి ఆధారం కనబడలేదు (వ.9).
23:10 మరొకసారి రోమీయులు జోక్యం చేసుకోవడంతో పౌలు ప్రాణం నిలిచింది; 21:34-36 నోట్సు చూడండి.
23:11 పౌలు పరిచర్య విషయంలో దేవుని సర్వాధికార నడిపింపును మనం ఇక్కడ మరొకసారి చూడగలం; 22:17-21 నోట్సు చూడండి.
23:12-15 "పౌలు మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడని ఆరోపించేవారే, అతనిని హత్య చేయాలని చూడడం విచిత్రం” (డేవిడ్ జి. పీటర్సన్).
23:16 పౌలు మేనల్లుడు హత్యకుట్రను గురించి తెలియజేశాడు (వ. 12-15). పౌలు కుటుంబ సభ్యులలో ఎంతమంది యెరూషలేములో ఉన్నారో స్పష్టంగా తెలియదు (వ. 17,22 చూడండి). బహుశా పౌలు సోదరి యెరూషలేములో నివసించేది అనడం, తార్సులో పౌలు బాల్యం తర్వాత, అతని కుటుంబం అంతా యెరూషలేముకు తరలివెళ్ళి వుంటారని సూచిస్తుండవచ్చు. ఈ వచనంలోని గ్రీకుభాషను బట్టి పౌలు మేనల్లుడు సుమారు 20 సంవత్సరాలవాడై ఉండవచ్చు. అతనికి ఈ కుట్ర గురించి ఎలా తెలిసిందో మనకు తెలీదుగాని, వాతావరణం అలాంటి కుట్రకు దారితీసేదిగానే ఉంది. .
23:23 పౌలుకు హాని జరగకుండా సహస్రాధిపతి నిర్ణయాత్మకమైన చర్య తీసుకున్నాడు. ఆ ప్రాంతానికి ప్రధాన కేంద్రం కైసరయ. అక్కడ పౌలు అధిపతియైన ఫొలిక్సు సంరక్షణ కింద ఉంటాడు. ఈ 23:24 నిజానికి బానిసయైన ఫొలిక్సు, క్రీ.శ. 52లో యూదయకు అధిపతి అయ్యాడు. కైసరయలోని యూదులు, అన్యజనుల మధ్య వచ్చిన కలహాలలో సరిగ్గా వ్యవహరించనందున, అతన్ని సుమారు క్రీ.శ. 59లో పదవి నుండి తొలగించారు.
23:25-30 అధిపతియైన శైదియ లూసియ పంపిన ఉత్తరం, ఆ కాలంలో ఉత్తరాలు రాసే సాధారణ విధానాన్ని అనుసరించి ఉంది. మొదట శుభము, ఉత్తరపు ముఖ్యాంశం, ముగింపు, పౌలు జ్ఞాపకాల నుండి దీన్ని లూకా పునర్నిర్మించి వుంటాడు. కానీ కైసరయలో ఫొలిక్సు, పౌలుల యెదుట ఆ ఉత్తరం చదవబడినప్పుడు లూకా విని వుండే అవకాశం కూడా ఉంది. ఈ 23:29-30 లూసియ ఈ గొడవను యూదుల ధర్మశాస్త్ర సంబంధమైన వివాదంగా వ్యాఖ్యానించాడు. అంటే పౌలుకు విరోధంగా చేసిన ఆరోపణలు రోమా చట్టం ప్రకారం మరణమునకైనను లేక బంధకములకైనను తగినది కాదు. కానీ అతడు పౌలును ఫొలిక్సు దగ్గరకు పంపడం వేరే విధంగా అనిపిస్తుంది. కానీ ఇలా చేయడం మొదట పౌలును కాపాడడానికి, యూదుల అధికారులు రోమా గవర్నరు యెదుట తమ సంగతి చెప్పుకొనడానికి వీలు కల్పించింది.
23:31-33 యెరూషలేము నుండి అంతిపత్రికి రోమా రహదారిపై, సుమారు 35 మైళ్ళ దూరం ఉంటుంది. అంతిపత్రి నుండి క్రైసరయకు తీరం వెంబడి మార్గం కాబట్టి పౌలు సంరక్షణకై మరీ ఎక్కువ సైనిక భద్రత అవసరం లేదు.
23:34-35 ఫొలిక్సు పౌలును సిరియా గవర్నరు దగ్గరకు పంపి వుండవచ్చు కానీ ఈ సంగతిని తానే విచారించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పౌలుకు విరోధంగా ఉన్న సాక్ష్యాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అతడు గుర్తించాడు కాబట్టి ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విషయాన్ని పరిష్కరించాలని భావించి వుంటాడు. అధిపతి అధికారమందిరములో పౌలును కావలిలో ఉంచాడు. వాస్తవంగా ఈ మందిరాన్ని మహా హేరోదు కట్టించాడు.