Share on Whatsapp Daily Devotion - క్రీస్తుతో 40 శ్రమానుభవములు 36వ అనుభవం

యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన 1:9

"నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును" అనే మాట ఎప్పుడైతే విన్నాడో తన వలను పక్కనబెట్టి, ఉరుమువంటివాడని ఇంటిపేరున్నా, ఉన్నదంతా వదిలేసాడు; క్రీస్తును వెంబడించాడు; యేసు ప్రేమించిన శిష్యుడు - యోహాను.

ఏ తీర్మానమైతే తీసుకున్నాడో దానిపై నమ్మకంగా నిలబడ్డాడు. క్రీస్తుతో అద్భుతాలు చూసాడు. జీవ-మరణాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయని విశ్వసించాడు, ఆయన ప్రేమను రుచిచూసాడు...అనుభవించాడు, ఆయన గుండెచప్పుడు వినాలనే ఆశ కలిగి, అయన రొమ్మున ఆనుకొని ఆయనకు దగ్గరయ్యాడు. క్రీస్తుతో సాన్నిహిత్యం రూపాంతరాన్ని వీక్షించే అనుభవంలోనికి నడిపించింది.

కళ్ళముందే క్రీస్తును హింసిస్తున్నా నిస్సహాయ స్థితిలో వీక్షిస్తూ, ప్రతి గాయాన్ని తానూ అనుభవిస్తూ కలువరి కొండవరకు వెంబడించాడే కాని వెనకడుగు వేయలేదు. "ఇదిగో నీ తల్లి" అంటూ సిలువలో తనతో చివరిగా పలికిన మాట, అంతం వరకు లోబడిన ఉన్నతమైన స్వభావం.

పక్కలో బల్లెపు పోటును కళ్లారా చుసిన హృదయం; ఉజ్జీవ జ్వాలలతో రక్తం మరిగిపోయింది. ఆసమయం, సిలువవైపే కన్నులు, క్రీస్తుతో నడచిన ప్రతి అనుభవ జ్ఞాపకాలు; క్రీస్తు కొరకే జీవించాలి, ఆయనలా ఉండాలి, ఆయన ప్రేమలో మమేకమవ్వాలనే ఆశయం, ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొనగలననే పట్టుదల, చివరకు అది మరణమైనా సిద్దమే అనుకున్నాడు.

యేసు పునరుద్ధానం, యోహానులో ఉజ్జీవం రెండింతలైంది; పరిచర్య అడుగులు ముందుకు వేసాడు. హేరోదు ఆధిపత్యాలు అన్న యాకోబును హతమార్చినా, ఆది అపొస్తలుల సంఘంలో ఉజ్జీవాన్ని రేకెత్తించే స్థంభంగా నిలబడ్డాడు. సమరయుల మధ్య సువార్త ప్రకటించి, ఎఫెసుకు సంఘ కాపరిగా బాధ్యత వహించి, ప్రఖ్యాతిగాంచిన ఏడు సంఘాలలో నాయకత్వం వహించాడు.

ప్రబలమవుతున్న పరిచర్య, ఓర్వలేని ప్రభుత్వం - శిక్ష ఖరారు చేసినా తన ప్రాణాన్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. నాస్తిక వాదనలకు సమాధానమిచ్ఛే యోహాను సువార్త, మనకొరకై సిద్దమవుతున్న పరలోక పట్టణాన్ని ఆత్మీయ నేత్రాలతో వీక్షించి తాను వ్రాసిన ప్రకటన గ్రంథం ఈ రోజు మనం చదువ గలుగుతున్నామంటే, ఎంత ధన్యత.

ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును; దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనని పత్రికల తానూ పొందిన అనుభవాన్ని ద్వారా మనకు నేర్పించాడు.

నేనంటాను, లోతైన విశ్వాస అనుభవం, సమస్తమును సహించు శక్తి, సమస్తమును ఎదుర్కొనే ధైర్యం యోహాను జీవితానికి సాదృశ్యంగా ఉంది. పరిచర్య చేయాలంటే క్రీస్తు గుండెచప్పుడు వినే అనుభవం కావాలి. సంఘ నాయకత్యం కావాలంటే క్రీస్తుతో సమాన అనుభవాలు కలిగిన శ్రమానుభవాల్లో పాలుపొందాలి. పరలోక దర్శనం పొందాలంటే అంతమువరకు నిలబడే యోహాను వంటి జీవితాలు కావాలి.

ఈ అనుభవాన్ని చదువ గలుగుతున్నావంటే క్రీస్తు నీ కొరకు ఎదో ఒక ఉద్దేశం కలిగిఉన్నాడనే; దాని కోసం ప్రయత్నించు, ప్రార్ధించు, పోరాడు. ఆమేన్!

అనుభవం: మరణం వరకు వెనుకాడని విశ్వాసం, మరణించినా క్రీస్తుకొరకే అనే త్యాగం. సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం