వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం!

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

వాక్యం జీవితం - ప్రార్ధన మన ఆయుధం!

https://youtu.be/2ei3LZYMSkk

ప్రార్ధన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది? నీకున్న రెండు కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే? ఏమి చెప్ప గలవు?

ప్రార్ధన, వాక్యము రెండూ రెండు కళ్ళ వంటివి. రెండూ అత్యంత ప్రధానమైనవే. దేనినీ అశ్రద్ధ చెయ్యడానికి వీలులేదు. "వాక్యము" ద్వారా దేవుడు మనతో మాట్లాడితే? "ప్రార్ధన" ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. అందుకే, వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్ధించ గలగాలి. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదానిలో ఒకటి మరియు నేటిదినములలో అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్నదానిలో ఒకటి ప్రార్థనే.

ప్రార్థన అంటే? దేవుని సహాయమును అభ్యర్దించడం. ప్రార్థన అంటే? మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడంకాదు. దేవుడు వినేటట్లు , ప్రతిఫలమిచ్చేటట్లు ప్రార్ధించాలి.

నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదంటే? రెండే కారణాలు.
1. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో?
2. దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో వున్నావేమో?

నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు "చూచు" నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6

రహస్య ప్రార్థన లో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. "చూస్తాడట". ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో?అని. కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు.

వ్యక్తిగత జీవితంలో ప్రతీరోజు బిజీగా గజిబిజీగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకము చేసి కృంగదీస్తూ ప్రార్ధనకు, వాక్యమునకు దూరం చేస్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ రహస్య ప్రార్ధన ద్వారా దేవునితో సహవాసంలో అనుభవం రెట్టింపై, విశ్వాసములో మరింత బలము పొందగలము. అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే ప్రార్థన మన జీవితంలో వుండాలి. ఎందుకంటే, మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్ధన. పార్ధించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారులేరు.

దేవుని యొక్క ధనాగారాన్ని, సర్వ సంపదలనిధిని తెరువగలిగే అత్యంత శక్తివంతమైన తాళపుచెవి "ప్రార్ధన". అయితే, ఆ తాళపు చెవిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి మరి!. నూతన సంవత్సరంలోనికి అడుగిడుతున్న తరుణంలో నూతనమైన దేవుని వాగ్దానాలను పొంది, అవి మన జీవితంలో పరిపూర్ణం కావాలంటే, రాబోయే దినములలో విజయాలను చూడాలంటే కేవలం ప్రార్ధనతోనే సాధ్యం.

ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!