దేవునికే సలహాలిచ్చే ప్రార్ధన

  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General


ఇట్లాంటి ప్రార్ధనా ఫలాలు తాత్కాళికమైన మేలులు, శాశ్వతమైన కీడుకు కారణమవుతాయి. ఇటువంటి ప్రార్ధనలు మన జీవితాలకు ఎంత మాత్రమూ క్షేమకరం కాదు.

"నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;"
ఆది 19: 19-21

లోతు:
- నీతిమంతుడు
- నీతిమంతుడైన అబ్రాహాము సహవాసాన్ని విడచిపెట్టడం ద్వారా పెద్ద తప్పుచేసాడు.
- సొదొమ అందాలను చూసి మోసపోయాడు. ఆ ప్రజల అలవాట్లు, జీవన విధానం తెలిసికూడా వారితోనే జీవించడానికి ఇష్టపడ్డాడు.

అబ్రాహాము ప్రార్ధన సొదొమ గొమొర్రా పట్టణాలతోపాటు, లోతు కుటుంబం నాశనం కాకుండా రక్షించ గలిగినప్పటికి, లోతు మరొకతప్పు చేస్తున్నాడు.

- దేవుడు వెళ్ళమనిన ప్రాంతానికి వెళ్ళకుండా దేవునికే సలహాలిస్తున్నాడు.
- దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళనంటున్నాడు.
- తాను నిర్ణయించుకున్న ప్రాంతానికే వెళ్ళడం కోసం ఆతురత పడుతున్నాడు.
- అంతేకాదు, 'ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో?' అంటున్నాడు. అంటే? ఆ కీడు సంభవించకుండా, ఒకవేళ, సంభవించినప్పటికీ ఆ కీడునుండి దేవుడు రక్షించలేడా? తప్పకుండా రక్షించగలడు.

దేవుని మాట లోతు విననప్పటికీ, దేవుడు మాత్రం లోతు ప్రార్ధనను అంగీకరించాడు. నీవు చెప్పినట్లే చెయ్యమన్నాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మనము అడిగినది కాదనకుండా ఇచ్చేస్తాడు. అయితే, దాని ప్రతిఫలం ఏమిటో తర్వాత తెలుస్తుంది. లోతు జీవితమే దానికొక గొప్ప ఉదాహరణ.

లోతుభార్య చెప్పిన మాటకు విధేయత చూపకుండా, వెనుదిరిగి చూచి ఉప్పు స్థంభముగా మారిపోయింది. లోతు, అతని ఇద్దరు కుమార్తెలు మాత్రం అతను కోరుకున్న ప్రాంతానికి వెళ్లి జీవిస్తున్నప్పుడు, అక్కడ జరిగిన సంఘటన బైబిల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనగా మిగిలిపోయింది.

మోయాబీయులు, అమ్మోనీయులు అనే దేవునికి అయోగ్యమైన రెండు జనాంగములు భూమిమీదకు రావడానికి ఈ తండ్రి, కుమార్తెలు కారకులయ్యారు.

కారణం ఏమయ్యుండవచ్చు?
దేవుడు చూపించిన పర్వతానికి వెళ్లి జీవిస్తే? అతని కుమార్తెలకు అటువంటి దుష్టతలంపులు రాకుండా, దేవుడు వారి తలంపులకు కావలి వుండేవాడేమో? వారి పట్ల దేవుని ప్రణాళిక వేరే విధంగా వుండేదేమో?

దేవుని చిత్తాన్ని ప్రక్కనబెట్టి, దేవునికే సలహాలిచ్చి, స్వంత చిత్తం నెరవేర్చుకొని మాయని మచ్చని తెచ్చుకొని, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారు. లోతు నీతిమంతుడుగా పేర్కొనబడినప్పటికీ, అతని నీతి కనీసం తన కుటుంబాన్ని కూడా రక్షించలేకపోయింది. కారణం? అతని ఆలోచన, దేవుని ఆలోచనతో సరితూగ లేదు. లోతు దేవునికే సలహాలిచ్చి, ఆ త్రాసులో తేలిపోయాడు.

వద్దు! ఆయన చెప్పినట్లే చేస్తూ నీచిత్తమే నాజీవితంలో నెరవేర్చమని ప్రార్ధిద్దాం!
ఆయనిచ్చే శ్రేష్ఠమైన మేలులు పొందుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.