వివాహ బంధం 1

  • Author: Bharathi Devadanam
  • Category: Family
  • Reference: Sajeeva Vahini Dec - Jan 2010 Vol 1 - Issue 2

దేవుని జీవ వాక్యమైన బైబిలు లో ‘వివాహము’ నకు అత్యధిక ప్రాముఖ్యము ఇవ్వబడింది. మొదటి పుస్తకమైన ఆదికాండము లో వివాహముతో అనగా ఆదాము, హవ్వలు జతపరచబడుటతో ప్రారంభించబడి, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధంలో గొఱ్ఱెపిల్ల వివాహోత్సవముతో ముగించబడుతుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అని హెబ్రీ 13:4 లో వ్రాయబడింది.

వివాహ బంధాన్ని మూడింతల అద్భుతంగా చెప్పవచ్చు. వారిద్దరు ఏక శరీరమగుదురు అని ఆదికాండము 2:24 లో వ్రాయబడింది కాబట్టి అది ఒక భౌతిక బంధము. రెండు పక్షాల కుటుంబాలు ఒకరితో ఒకరు అంటుకట్టబడుతారు కాబట్టి అది ఒక సాంఘిక అద్భుతం. క్రీస్తుకు, సంఘమునకు గల సంబంధాన్ని వివాహం చూపిస్తుంది కాబట్టి అది ఒక ఆత్మయ బంధం అని కూడా చెప్పవచ్చు.

వేరు వేరు కుటుంబాలు, స్థితి గతుల మధ్య పెరిగిన ఒక పురుషుడు, ఒక స్త్రీ దేవుని ఎదుట సంఘం సాక్షిగా ప్రమాణాలు చేసుకొని ఈ వివాహబంధం లో చేరి భార్య, భర్తలుగా మారుతారు. ఇది వారి కుటుంబ జీవితానికి ఒక తొలిమెట్టు. మరి ఈ బంధం ఎలా కొనసాగించాలి? ఎలా కాపాడుకోవాలి? ఎలా దీనిలో ఆనందించాలి అనే విషయాలను ఈ రోజు వాక్యపు వెలుగులో పరిశీలిద్దాము.

మొదటగా స్త్రీ పురుషులకు బైబిలు లో ఇవ్వబడిన సూచనలను గమనిద్దాము.

స్త్రిలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను, అని ఎఫెసి 5:22,24 లో చూస్తాము. ‘లోబడుట’ అనే విషయాన్ని క్రీస్తునకు, సంఘమునకు పోల్చి చెప్పబడింది. ఈ పోలిక అర్ధం చేసుకోవాలంటే మొదట, భార్య రక్షణ, లేక పాపక్షమాపణ పొందినదై యుండాలి. ఏ భేదమును లేదు! అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక-పోవుచున్నారు అని రోమా 3:23 లో వ్రాయబడింది. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు. యేసు నందు నిత్యజీవము అని రోమా 6:23 లో ను వ్రాయబడింది. కాబట్టి ప్రభువా నేను పాపిని నన్ను కనికరించుమని ప్రభువు సన్నిధిలో వేడుకోన్నప్పుడు దేవుడు 1యోహాను 1:9 ప్రకారం మన పాపములను క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు అప్పుడు పరిశుద్దాత్మ దేవుడు ఎలా భర్తకు లోబడవలెనో దిన దినము నేర్పిస్తాడు. అలా జీవించునప్పుడు ఒకవేళ భర్త అవిశ్వాసి అయినా కూడ 1పేతురు 3:1,2 లో వ్రాయబడినట్లు ‘స్త్రీ లారా’, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయు-లైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడి వలన రాబట్ట వచ్చును.

పురుషులారా, మీరునూ మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి.. అని ఎఫెసి 5:25-27 లో వ్రాయబడి ఉంది. కాబట్టి భర్తలు కూడా సంఘము కొరకు తనను తాను అర్పించుకొనిన క్రీస్తును హృదయంలో అంగీకరించి రక్షణ పొందగలిగితే, క్రీస్తు సంఘమైన మనం, అనేక బలహీనతలు కలిగినా, మాటి మాటికి తప్పి పోయినా, ప్రభువు దిన దినం తన రక్తము ద్వారా, వాక్యము ద్వారా కడిగి మనలను నిర్దోషులుగా నిలువబెడుతుంది. అలాగే భర్త కూడా భార్య బలహీనతల్ని, బలాన్ని ఏకరీతిగా అర్ధం చేసుకుంటూ, తనను వలే తన భార్యను తప్పక ప్రేమింప బద్ధుడైయుండాలి.

రెండవదిగా భార్యా భర్తల బంధం విజయవంతంగా వుండాలంటే ఇరువురు కూడా తమ స్వజనం, బంధువులకంటే ఎదుటి వారి స్వజనమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఆది 2:24 లో ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారికి తల్లి, తండ్రి, అత్త, మామలు ఎవరూ లేనప్పుడే దేవుడు చెప్పాడు. దానిని తిరిగి యేసు ప్రభువు మత్తయి 19:5 లో నొక్కి చెప్పారు. తిరిగి అదే మాటతో పౌలు ఎఫేసి 5:31 లో భర్తలను హెచ్చరిస్తున్నాడు. మరి భార్య సంగతి ఏంటి? రూతు నిర్ణయం మనం గమనిస్తే “నీ జనమే నా జనము” అని రూతు 1:16 లో నయోమితో అంటుంది. దాని ద్వారా చాలా ఆశీర్వాదంపొంది, యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కీర్తనలు 45:10 లో కూడా కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి యుంచాడు.

మూడవదిగా ఈ రోజుల్లో విడాకుల సంస్కృతి ఎక్కువవుతున్నది. ప్రతి చిన్న కారణానికి విడిపోతున్నారు. ఇమడలేక పోతున్నారు. అయితే దేవుడు మత్తయి 19:10 లో దేవుడు జత పరచినవారిని మనుష్యుడు వేరు పరచకూడదు. భార్యా భర్తలిద్దరూ రొజూ ఉదయం, సాయంత్రం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకరి నొకరు అర్ధం చేసికోడానికి అది సహాయపడుతుంది.

చివరిగా ఎఫెసి 4:1 లో మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుటయందు శ్రద్ధ కలిగినవారై అని వ్రాయబడినట్లు, భార్యా భర్తలిద్దరు కూడా తమ ఇద్దరి మనస్సులను పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరిచాడని గ్రహించాలి. తెగే దాకా లాగొద్దు అంటారు కదా! కాబట్టి ప్రతీదానికి పట్టుదలకు పోకుండ, ఆ బంధాన్ని కాపాడుకోనడానికి తన వంతు శ్రద్ధ వహించాలి. దేవుడు మనందరి కుటుంబాలను, భార్యా భర్తల సంబంధాలను పటిష్టం చేసి కాపాడును గాక.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.