Day 36 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్ళరు (యెషయా 52:12)

నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపారశక్తిని గురించి మనం లేశ మాత్రమైనా అర్ధం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు.
మనం ఎప్పుడూ హడావుడిగానే ఉంటాము. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన దేవుడెప్పుడైనా "ఊరకుండు", లేక "కదలకుండా కూర్చో" అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చెయ్యబోతున్నాడన్న మాట.

మన క్రైస్తవ జీవితాల్లో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసేందుకు అవకాశమివ్వడానికి బదులు, క్రైస్తవులమని చూపించుకోవడానికి మనమేదో చెయ్యబోతాము.ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు గదా మీరు.

మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది. మనల్ని తన కుమారుని స్వారూప్యంలోకి మార్చాలని. ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చెయ్యకూడదు. హుషారుగా పనిచెయ్యడాన్ని గురించి ఎన్నెన్నో వింటుంటాము. కాని కదలక మెదలక ఉండడాన్ని గురించి కూడా తెలుసుకోవలసింది చాలా ఉంది.

కదలకుండా కూర్చో ప్రియ కుమారీ
ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు
నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు
ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే
అది తన ప్రేమని నిరూపించడానికే

కదలకుండా కూర్చో ప్రియ కుమారీ
నీ ప్రియ ప్రభు చిత్తాన్ని అన్వేషించావు
ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో
విశ్వాసాన్ని కుదుటపరచుకో
ప్రేమామయుడు జ్ఞానవంతుడు
నీకేది మంచిదో అదే జరిపిస్తాడు

కదలకుండా కూర్చో ప్రియ కుమారీ
ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వెయ్యకు అటూ ఇటూ
దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు!
ఎంత తేలిక నీ హృదయం!
ఎదురుచూసిన రోజుల బాధంతా మర్చిపోతావు

కదలకుండా కూర్చో ప్రియ కుమారీ
ఆయన కోసం ఏ పని సాధించనున్నానో
అది కష్టమే, విలువైనదెప్పుడూ అమూల్యమే
నిజమే, కాని ఉంది నీకు ఆయన కృప
కఠినమైనవన్నీ అతి మధురమవుతాయి నీకోసం