Day 40 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు (మత్తయి 15:23).

ఊహించని విధంగా హృదయవిదారకమైన వేదన వచ్చిపడి, ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి, మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి, క్రుంగిపోయి ఉన్న వారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో. నీ దేవుడు చెప్పేదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కాని నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. - "అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు." బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయవిదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటోందో! ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే. యేసుప్రభువు నిశ్శబ్దం ఆయన మాటలకంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది. ఇది ఒక సూచన కావచ్చు. తిరస్కారానికి కాదుగాని, సమ్మతికే. నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే. "నా ప్రాణమా నీవేల కృంగియున్నావు?" ఇంకను నేనాయన్ని స్తుతిస్తాను. ఆయన మౌనం కోసం. ఒక పాతకాలపు కథ ఉంది. ఒకావిడకి కల వచ్చిందట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరకి వచ్చి కరుణతో, కృపతో, వదనంలో వెల్లివిరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు. ఆమెని వదలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటిమీద ఒక్కక్షణం చెయ్యివేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూసాడు. మూడో ఆమెవైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్లిపోయాడు. ఆ కలలో ఆ కలకంటున్న ఆమె అనుకుందట - "దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు! రెండో ఆవిడని కూడా మెచ్చుకున్నాడు. కాని మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధపెట్టి ఉంటుంది, అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమెవంక చూడనైనా చూడలేదు." ఏం చేసిందో ఆమె. ఆ ముగ్గురి మధ్య అంత తేడాలెందుకు చూపించాడు ప్రభువు? దేవుడలా ఎందుకు చేసాడో, ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు - "నన్నెంత తప్పుగా అంచనా వేసావు! మొదటి స్త్రీ *నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా అపేక్ష ఆమెకి అవసరం. దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెని వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది." "రెండో స్త్రీ ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసముంచుతుందన్న నమ్మకం నాకుంది." "నేను నిర్లక్ష్యం చేసినట్టు, పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతి శ్రేష్ఠమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన, బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను." "ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మనసంతటితో నా మీద విశ్వాసముంచింది. చూపుల్లోగాని, మాటల్లోగాని, చేష్టల్లోగాని నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కుచెదరదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా, నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావసిద్ధంగా ఆమెలోని అణువణువూ ఆమె మనస్సు, జ్ఞానమూ వ్యతిరేకించినా నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు. ఎందుకంటే నేనామెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాననీ, నేను చేస్తున్నది ఇప్పుడామెకి అర్థం కాకపోయినా ఇకముందు అర్థమవుతుందనీ ఆమెకి తెలుసు." "నా ప్రేమలో నేను మౌనంగా ఉంటానెందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది. మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటివల్లకాక ఆత్మ చేత బాధనొందిన మీరు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసముంచాలన్నదే నా ఆకాంక్ష." ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకుని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. తన బహుమానాలను ఇవ్వకుండా దాచి పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి.