Day 134 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే..... (ఆది 17: 23).

వెంటనే కనపరిచే విధేయతే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్న మాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలివ్వడం దేవుని వంతు.

విధేయత చూపించే ఓకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రాహాములాగా "ఆ దినమందే" విధేయత చూపించడం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాతెప్పుడో చేస్తుంటాము. అసలు పూర్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలనెప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే తే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది.

ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరచుకుంటూ, దేవుడిని మనతోటి వాళ్ళనికూడా నష్టపరచడం ఎంత దుస్థితి! "ఆ దినమందే" అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి.

మార్టిన్ లూథర్ అంటాడు, "నిజమైన విశ్వాసి - ఎందుకు?" అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకి తావులేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావులేకుండా నేను నమ్మకం ఉంచుతాను."

ఎదురు చెప్పడం మన పని కాదు బదులుగా తర్కించడం తగదు దాటరాదు మన అవధి చావుకైనా తెగించి చెయ్యడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకి పూసిన పూలగుత్తి.