Day 183 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు (సామెతలు 4:12).

విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు. ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది? కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు.

కొన్ని కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటుని సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా, మొండిగా, నిశ్చలంగా నిలబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కాని ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది. కారు నడిపేవాడు సందేహించకుండా గేటువైపుకి దూసుకుపోవాలి. లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకుని ఉంటుంది.

మన బాధ్యతల రోడ్డుపైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది తలుపే కావచ్చు, ఒక నది లేక పర్వతమే కావచ్చు. యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చెయ్యవలసిందేమిటంటే దానిలోకి దూసుకుపోవడమే. అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది. అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా "డీ" కొట్టబోయే సమయంలో తెరచుకుని దారి ఇస్తుంది. అది ఓ పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా దానికెదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడినుండి లేచి సముద్రంలో పడుతుంది.

నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా? దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అది అక్కడ నుండి మాయమౌతుంది.

మనం కూర్చుని ఏడవడం అనవసరం. "లేచి నిత్యమూ సాగిపో"" అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది. ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం. చీకటి రాత్రేనా, అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకినంతట అదే తెరుచుకుంటూ పోతుంది. సందేహించవద్దు. అవసరమైతే అగ్ని స్థంభం, మేఘ స్థంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి. ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు, దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి. మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం, బట్టలు, ఆదరించే స్నేహితులూ దొరుకుతారు. ప్రయాణంలో ఎంత అలసిపోయినా, ఎన్ని కష్టాలపాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తియ్యటి స్వాగతం మనకి ఎదురవుతుంది గదా!

ఎత్తయిన చోటికి ఎక్కిపోతున్నాను
వెలుగుబాటలో సాగిపోతున్నాను
నిశీధిలో నిర్మలమైన నదులు ప్రవహించే
పచ్చిక బయళ్ళలో పరుగుతీస్తున్నాను
నాకోసం మా ఇంటికి వెళ్ళి వెదికే వాళ్ళు
ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు
"ఇతను ఎత్తయిన చోటికి ఎక్కిపోతున్నాడు"