ఎజ్రా గ్రంథం

  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Oct - Nov 2011 Vol 2 - Issue 1

అధ్యాయాలు : 10, వచనములు : 280

రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది.

మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.”

7:6 “ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.”

గ్రంథ కర్త : ధర్మశాస్త్ర ప్రవీణుడును, లేవీ గోత్రికుడైన ఎజ్రా. ఎజ్రా అను పదమునకు యెహోవా సహాయము చేయును అని అర్ధం. రచించిన ఉద్దేశం : యూదుల బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి రావడం మరల యెహోవా మందిరమును పునర్నిర్మాణ సంగతులను ఈ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ పనిని పూర్తి చేయాలి అనేదే ఈ గ్రంథంలోని ముఖ్య సందేశం.

ఉపోద్ఘాతం : మానవుల పట్ల దేవుని ఉద్దేశాల నేరవేర్పు కొన్ని సార్లు ఆలస్యంగా జరుగవచ్చునుకాని అవి ఏ మాత్రం విసర్జించబడవు అనే దానికి నిదర్శనం ఈ గ్రంధం. దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు అనగా ఇశ్రాయేలీయులు బబులోను చేర నుండి తిరిగి వచ్చిన ఉదంతాన్ని ఎజ్రా గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ప్రజలు దేవుని పనిని చెయ్యడానికి ఇష్టపడితే దేవుడు వారి ద్వారా అన్ని కాలాల్లోను తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని పని చేయడానికి ఎలాంటి నాయకులు కావలెనో తెలియజేసే ఈ గ్రంథం, దేవుని నియమాలు, సూత్రాలు మరియు పద్ధతులను కూడా తెలియజేస్తుంది.

ఈ గ్రంథం రెండు భాగాలుగా చేయబడినది 1. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో మందిరం యొక్క రెండవ దశ నిర్మాణం. (ఎజ్రా 1-6 అధ్యాయాలు) 2. ఎజ్రా చేసిన పరిచర్య (ఎజ్రా 7-10 అధ్యాయాలు).

ఇశ్రాయేలును పునర్నిర్మించడానికి 100సం.ల కాలం పట్టినప్పటికీ అందులో జరిగిన సగం కాలమంతా 6 మరియు 7 అధ్యాయాలలో ఎజ్రా గ్రంథం విశదీకరించింది. ఈ గ్రంధము సగ భాగం వరకు కనిపించిన వ్యక్తులు ఎజ్రా కాలం నాటికి మరణించినా ఎజ్రా ఒక ప్రాముఖ్య పాత్రగా ఇశ్రాయేలీయులు ఎక్కడైతే పాపములో ఉన్నారో వారిని లేవనెత్తుటకు కారకుడయ్యాడు.

యూదా చివరి రాజైన సిద్కియా బబులోనుకు తీసుకొనిపోబడ్డాడు. యెరూషలేము పట్టణం నాశనం చేయబడింది. మందిరం కాల్చివేయబడింది. కోరెషు ఆధ్వర్యంలో మాదీయులు మరియు పారసీయులు చేసిన దాడిలో బబులోను కూలిపోయింది. కోరేషు బబులోనుపై దర్యావేషును నియమించాడు. కోరెషు పాలనలో మొదటి సంవత్సరం యూదులు యెరూషలేమునకు తిరిగి వెళ్లి మందిరాన్ని పునర్నిర్మించుకోవచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞతో ఈ గ్రంథం ప్రారంభం అయింది. దేవుని మందిర ఉపకరణాలన్నిటిని భద్రం చేసేందుకు దేవుడు బబులోను ఖజానాను వాడుకున్నారు. ఈ ఆజ్ఞతో యూదా చరిత్రలో, యూదుల జీవితాల్లో క్రొత్త అధ్యాయం ప్రారంభమైంది. మోషే నాయకుడుగా ఉన్నా ఇశ్రాయేలు జనాంగానికి ఎజ్రా న్యాయకత్వం వహించి మందిర పనియంతటిని చేపట్టి ముందుగా బలిపీఠాన్ని నిర్మించారు. కోరెషు మరణానంతరం మందిర నిర్మాణ పని ఆగినప్పటికి హగ్గయి జెకర్యా ప్రవక్తల ప్రోత్సాహం ద్వారా మరలా కట్టనారంభించారు. దేవుడు అధికారులను రాజులను సయితం తన సాధనాలుగా వాడుకొని దర్యావేషు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పూర్తయి ప్రతిష్ఠించబడుతుంది.

ఎజ్రా దేవుని ప్రజల కొరకు దేవుని ప్రణాళికలో తోడ్పడిన నాయకుడు. ఎజ్రా అనే పేరునకు అర్ధం “సహాయము”. అతడు మోషే మరియు సమూయేలు వలె ఇశ్రాయేలు చరిత్రాధారాలను పొందుపరచి వ్రాసి వాటిని కాపాడడమే గాక ఇశ్రాయేలు జాతి ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు దోహదపడినవాడు.

సారాంశం : ఎజ్రా వలన ఇశ్రాయేలుకు అది సాధ్యం అయింది. ఎజ్రాను దేవుడు వదిలి పెట్టలేదు గాని అతని ద్వారానే తన కార్యాన్ని జరిగించుకున్నాడు. ఎజ్రాకు కలిగిన క్లిష్ఠ పరిస్థితుల్లో కూడా తన చేయి విడువకుండా దేవుడతనిని కాపాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా వారికి భద్రతా సంరక్షణ. మనము కూడా ప్రభువు పరిచర్యలో మరి ముఖ్యముగా బయలు పరచబడిన సంగతులను కార్యసిద్ధి కలుగజేయు సంగతులలో ఎంతో విధేయత కలిగిన వారమై చురుకుగా ఆయన సన్నిధిలో ముందుకు సాగవలెనని ప్రభువు పేరట మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. అంతే కాకుండా విశ్వాసి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే చెడిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలంటే మొదట పాప నివారణను గూర్చి శ్రద్ధ వహించాలి. దేవుడు మనిషిని దీవించాలి అంటే ముందుగా ఆతని హృదయం సరిగా ఉండాలి. అట్టి కృప ప్రభువు మనందరికి దయచేయును గాక. ఆమేన్.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.