నెహెమ్యా


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవ సారిగా అనగా చివరి సారిగా తిరిగి వచ్చిన వారికి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకునిగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్టపరిస్థితులలో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ద సాహసాలు చేయునట్లుగా ప్రోత్సాహం ఇచ్చినది. అర్తహషస్త రాజు యొక్క అనుమతి పొంది తనతో బయలుదేరిన కొంత మందితో సైనిక నాయకులతో, గుఱ్ఱపు పరిచారకులతో కలిసి తన్ను వెంబడించువారితో యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేము ప్రాకారమును కట్టునట్లుగా స్వజనులకు పిలుపునిచ్చెను.

     ఆ కాలములో కోట ప్రాకారములేని పట్టణం ఏదైన దోపిడిదారుల ఆక్రమనమునకు “ఎర" గా మారు పరిస్థితియుండెను. అందువలన కాపుదల అవసరమని యూదులు యెరూషలేములో ఉండకండా చుట్టూ ఉన్న గ్రామములలో జీవించినారు. ఇందువలన అన్యజనులతో కలిసిపోవుటవలన భాషా, ఆచారపు అలవాట్లు, పరిశుద్ధ విశ్వాసము కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినది. ప్రాకారము మరమత్తు చేయబడి కట్టబడితే ఒక నిజమైన యూదా నగరమును కట్టినట్లైతే లోపలకి వచ్చువారిని, బయటకు వెళ్ళువారిని అదుపు చేయవచ్చును.

     ఆ దేశ ప్రజల భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని 52 దినములలో ప్రాకారపు పని ముగించినప్పుడు ఈ అసాధ్యమైన కార్యమును చేయుటకు యెహోవాయే సహాయము చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకొనవలసి వచ్చినది. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్ఠమైన నాయకత్వ తలాంతు మరమత్తు చేయబడిన ప్రాకారముతో, అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చు అవకాశము ఏర్పడుటయే ఈ పుస్తకము యొక్క విషయ సూచికగా ఉన్నది.

ఉద్దేశము: పాతనిబంధన చరిత్ర పుస్తకములలో నెహెమ్యా చివరిది. చెరనుండి యెరూషలేముకు 3వ సారి వచ్చిన చరిత్రను చెప్పుచున్నది. దానితో బాటుగా యెరూషలేము యొక్క ప్రాకారము ఏలాగు మరలా కట్టిముగించారు అనేది, విశ్వాస సంస్కరణ ఎలాగు జరిగినది అనేది. ఈ పుస్తకము చెప్పుచున్నది.

గ్రంథకర్త : నెహెమ్యా. (పరిశోదకుడు అన్న స్థితిలో నెహెమ్యాతో పాటు ఎజ్రా కూడా ఈ రచనలో సహాయం చేసి ఉండవచ్చను.)

కాలం : క్రీపూ 445 - 432.

నేపథ్యము : క్రీ.పూ. 537లో జెరుబ్బాబేలు నాయకత్వములో యెరూషలేమునకు మొదటి సారి తిరిగి వచ్చుట జరిగినది. 458లో రెండవ సారి తిరిగి వచ్చుటకు ఎజ్రా నాయకత్వము వహించెను. 445 లో చివరిగా యెరూషలేములో ప్రాకారములను మరమ్మత్తు చేయుటకు చెర నుండి 3వ సారి వచ్చిన వారిలో నెహెమ్యా కూడా చేరినాడు.

ముఖ్యమైన వ్యక్తులు : నెహెమ్యా, ఎజ్రా, సన్బ్ల్లట్టు, టోబియా.

ముఖ్యమైన స్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టబడును. అని జెకర్యా, మరియదానియేలు యొక్క ప్రవచనములు నెరవేర్పులు ఈ పుస్తకము చూపించుచున్నది.

ముఖ్యమైన మాట : యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు

ముఖ్యవచనములు : నెహెమ్యా 6:15-16; నెహెమ్యా 8:8

ముఖ్య అధ్యాయములు : నెహెమ్యా 9.

     పాత నిబంధన బావము. దేవునితో ఉన్న నిబంధన యెరూషలేము ప్రాకారము కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధనచేసిన దానిని వ్రాసి ముద్రించినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడినది.

పుస్తకము యొక్క వివరణ : నెహెమ్యా మరియు ఆయన సమకాలికుడైన ఎజ్రా సేవలు ఇంచుమించుగా ఒకే కాలములో నిర్వహించబడెను. ఒక యాజకుడుగా ఎజ్రా ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాయకత్వము వహించుచున్నాడు. నెహెమ్యా ఒక అధికారిగా లోకసంబంధమైన రాజకీయ సంబంధమైన సంస్కరణలను చేయుచున్నాడు. చెరనివాసమునకు తరువాత తిరిగి వచ్చిన దైవ ప్రజలలో మిగిలిన వారిని దైవ దర్శనములో స్థిరపరచి ఇద్దరూ ఏకీభవించి ఒక సంస్కరణలను చేసినారు. పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడైన మలాకీ కూడా అదే కాలములో ప్రజలకు క్రమశిక్షణలో ఆత్మీయతతో మార్గమును చూపించెను.

     నెహెమ్యా పుస్తకము పాత నిబంధన చరిత్ర చివరి కాలము అనగా క్రీ.పూ. 400 సంవత్సరముల ముందు కాలమునకు మనలను తీసుకొని వెళ్ళుచున్నది. పుస్తకము యొక్క రెండు పెద్ద భాగములు క్రింద ఇవ్వబడెను. (1). ప్రాకారపు మరమ్మత్తు1 - 7 అధ్యాయములు. (2). ప్రజలను సంస్కరించుట 8 - 13 అద్యాయములు.

     కోట ప్రాకారపు పనితో యెరూషలేముకు సురక్షిత స్థితి ఏర్పడెను.

దాని తరువాత ప్రజల పునరుద్దారణ కోసం ఎజ్రా, నెహెమ్యా ఏకీభవించి చేసిన భాగమే పుస్తకము యొక్క శ్రేష్ఠమైన భాగమనవచ్చు.

     క్రీ.పూ. 433లో పారసీకదేశమునకు తిరిగి వెళ్ళిన నెహెమ్యా క్రీ. పూ. 432 ప్రజలను తట్టి లేపి దేవుని దగ్గరకు వచ్చునట్లుగా మరియొక ప్రమాణమును చేసినాడు ఆయన దేవాలయమును పరిశుద్ధ పరచి విశ్రాంతి దినమును ఆచరించుటను స్థిరపరచి అన్య స్త్రీలైన భార్యలను పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయుమని ప్రజలకు ఖచ్చితముగా చెప్పెను.

కొన్నిక్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 16వ పుస్తకము ; అధ్యాయములు 13; వచనములు 406; నెరవేరిన ప్రవచనములు 3; హెచ్చరికలు 3; ఆజ్ఞలు 14; వాగ్దానములు లేవు; దేవుని దగ్గర నుండి ప్రత్యేక సందేశములేవు; ప్రశ్నలు 24.