యెషయా


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధించినవి. ఇశ్రాయేలు రాజ్యము ఉత్తర ఇశ్రాయేలు దక్షిణ యూదాగా రెండుగా విడిపోయి దైవభక్తి నుండి దిగజారి అక్రమమైన విగ్రాహారాధనలో పడిపోయినపుడు దేవుడు త ప్రవక్తలను పంపి వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. క్రీ.పూ. 9వ శతాబ్దము నుండి 4వ శతాబ్దము వరకు ఈ ప్రవక్తల కాలమగును క్రీ.పూ 4వ శతాబ్దములో ప్రవచించిన మలాకీ తరువాత బాప్తీష్మమిచ్చు యోహాను కాలము వరకు సుమారు మూడు వందల సంవత్సరములపైగా ఏ ప్రవక్త కూడా ఉద్భవించలేదు. 16 మంది ప్రవక్తలలో నలుగురిని పెద్ద ప్రవక్తలని 12 మందిని చిన్న ప్రవక్తలని వారి యొక్క గ్రంథముల ప్రాముఖ్యతను ఆధారము చేసుకుని, ప్రవచన గ్రంథము యొక్క కొలతను ఆధారము చేసుకుని గుర్తించబడినది. వీరిలో యెషయా, యిర్మీయా హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా అను పదకొండు మంది చెర నివాసమునకు ముందు జీవించారు. దానియేలు, యెహెజ్కేలు అనువారు చెరనివాసకాలములోను, హగ్గయి, జెకర్యా, మలాకీ అనువారు చెర విమోచనము తరువాత జీవించారు.

     ప్రవక్తలు ద్వితీయోపదేశకాండము 18:18-19 వచనములలో కనబడునట్లుగా దేవుని కొరకు ప్రజలతో మాట్లాడుతూ వచ్చిరి. పరిశుద్ధ గ్రంథములో మూడింటిలో ఒక భాగము ప్రవచనా గ్రంథములు నింపబడుటలో ప్రవక్తల యొక్క సేవ ప్రాధాన్యతను బయలుపరచుచున్నది.

ఉద్దేశము : యూదాను దేవునివైపు త్రిప్పుట, మెస్సియా మార్గమైన దేవుని రక్షణను ప్రస్తావించుట.

గ్రంథకర్త : 1 - 39 వరకు గల అధ్యాయములు క్రీపూ 700 సంవత్సరములోను 40 -66 వరకు గల అధ్యాయములు క్రీపూ 681 సంవత్సరములోను వ్రాయబడినవని ఊహించవచ్చును.

సారాంశము : యెరూషలేము

ముఖ్యమనుష్యులు : యెషయా, ఆయన ఇద్దరు కుమారులు

గ్రంథము యొక్క విశేషం : ఈ గ్రంథములో పద్యములును పాటలును ఉన్నవి. మాదిరికరమైన కార్యములు అనేకమైన వున్నవి. జరుగుచున్న కాలములోను, భవిష్యత్తులోను జరుగవలసిన కార్య క్రమములు వచనా రీతిగా చెప్పబడియున్నది. అజర్యా అని పిలువబడు ఉజ్జీయా చనిపోయిన సంవత్సరములో యెషయాకు కలిగిన దర్శనమును గురించి 6వ అధ్యాయములో వ్రాయబడియున్నందున మొదటి 5 వ్రాయబడియున్నందున మొదటి 5వ అద్యాములు ఉజ్జీయా యొక్క పరిపాలన కాలములో వ్రాయబడినవని చెప్పవచ్చును. యోతాము కుమారుడైన ఆహాజు పరిపాలనా కాల కార్యములు 7వ అధ్యాయములో వ్రాయబడి యుండుటను బట్టి (యెషయా 7:1-5) యెషయా యొక్క ప్రవచనములలో అధిక భాగము ఆహాజు మరియహిజ్కియాల పాలన కాలములో ప్రవచించబడినవని అనుకొనవచ్చును. ఆష్హూరు తిగ్లత్పిలేసెరు నాయకత్వములో ఒక గొప్ప శక్తివంతమైన రాజ్యముగా అభివృద్ధి చెందిన కాలమది. మధ్యదరా సముద్ర తీరపాంతములలో ఉన్న చిన్న దేశములను హస్తగతం చేసుకున్న అష్హూరు ఇశ్రాయేలుపై దండెత్తి దానిని స్వాధీనం చేసుకుని అక్కడ జీవించిన వారిలో ఎక్కువ మందిని చెర పట్టుకుపోయినది. ఈ విధముగా క్రీ.పూ 722లో ఇశ్రాయేలు సంపూర్ణముగా నాశనము చేయబడినది. ఇశ్రాయేలు పతనమునకు పిదప యూదాకు కూడా తీర్పు వచ్చును అనియు అది ఆష్హూరు నుండి కాదుగాని బబులోను నుండే కలుగునని ప్రవక్త పలుకుటను చూస్తున్నాము. ఇది బబులోను గొప్ప మహాసామ్రాజ్యముగా అవతరించుటకు ముందే చెప్పబడిన ప్రవచనము అని మనస్సులో గుర్తించుకోవాలి.

ముఖ్యమైన మాట : రక్షణ

ముఖ్య మైన వచనములు : యెషయా 9:6-7; యెషయా 5:3-6

ముఖ్యమైన అధ్యాయము : యెషయా 53. ఈ అధ్యాయములోని ఒక్కొక వచనమును దేవుని సత్యగని వలె ప్రాముఖ్యతను పొందినవి. ఇవి హృదయమున చెక్కబడవలసినవి.

గ్రంథ విభజన : వేదపండితుల ద్వారా ప్రవక్తలలో పెద్దవానిగా భావించబడువారు యెషయా మెస్సియాను గూర్చి మిక్కిలి స్పష్టముగాను ప్రాముఖ్యత కలిగిన ప్రవచనములు గల ఈ గ్రంథమును యెషయా సువార్త అని పిలుచుటలో ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ గ్రంథము క్రింద ఇవ్వబడిన రీతిగా మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

  1. న్యాయ తీర్పును గూర్చిన ప్రవచనములు అధ్యాయము 1 నుండి 35 వరకు.
  2. చరిత్ర సంబంధమైన ఒక అనుబంధము - అధ్యాయము 36 నుండి 39 వరకు.
  3. అష్హూరు రాజు నుండి హిజ్కియాకు లభించిన విడుదల 36: 1 నుండి 37: 38 వరకు.
  4. మరణకరమైన రోగము నుండి హిజ్కియాకు దొరికిన విడుదల యెషయా 38:1-22 వరకు
  5. హిజ్కియా యొక్క బుద్దిహీనత యెషయా 39:1-8.
  6. మహిమతో నిండిన విశ్వాసము యొక్క ప్రవచనములు - అధ్యాయము 40 నుండి 66 వరకు

కొన్ని సంఖ్యా వివరణలు : పరిశుద్ధ గ్రంథము యొక్క 23వ గ్రంథము; - అధ్యాయములు 66, వచనములు 1292; నెరవేరని ప్రవచనములు 634; నెరవేరిన ప్రవచనములు 395; హెచ్చరికలు 1313; నెరవేరిన హెచ్చరికలు 449; నెరవేరని హెచ్చరికలు 864; చరిత్రాత్మక వచనములు 273; ప్రశ్నలు 190; వాగ్దానములు 120; ఆజ్ఞలు 308; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 71.