క్రీస్తుతో 40 శ్రమానుభవములు 4వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. I పేతురు 4:19

క్రైస్తవ విశ్వాసంలో శారీరకంగా కలిగే శ్రమలు ఒక అనుభవం అయితే, ఆత్మీయంగా కలిగే శ్రమలు ప్రత్యేక అనుభవాలుగా ఉంటాయి.

ఈ లోకంలో జీవించినంత కాలం ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దైవ చిత్తానుసారంగా జరిగాయి అనుకోవడం పొరపాటు. వ్యక్తిగత నిర్ణయాలు, పొరపాట్లవల్ల జరిగే పరిణామాలు తప్ప దేవుని నుండి కలిగిన శ్రమలు కాదు అని అర్ధం చేసుకోవాలి.

చేయరానివి చేస్తున్నప్పుడు "తప్పు" అని హృదయం గద్దిస్తూనే ఉంటుంది. పొరపాటు "వద్దు" అని అంటుంది. అది మదిలో నుండి వచ్చే ఆలోచన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచలను గద్దిస్తూ, పొరపాట్లవల్ల కళిగే పరిణామాలను సూచిస్తూ మన ఆలోచనలను సరిచేయడానికి అనుక్షణం ప్రయతిస్తూ ఉంటాడు. ఈ అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలో అనగా క్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారానే పొందగలం.

ప్రత్యేకంగా దేవుని చిత్తప్రకారమైన శ్రమ అనుభవిస్తున్నప్పుడు, అపవాది మనలను ఎన్నో రకాలుగా కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుధ్దాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంటాడు.

మనం ఈ ఆత్మీయ పోరాటంలో విజయం పొందాలి అంటే మంచి ప్రవర్తన కలిగి, ఆత్మీయ జీవితం దేవునికి అప్పగించుకునే అనుభవం కలిగియుండాలి. ఇదే క్రీస్తు శ్రమలలో పొందగలిగే ఆత్మీయ అనుభవం.

తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి.

అనేక ప్రశ్నలమధ్య నలిగిపోయి తప్పించుకోడానికి ప్రత్యామ్నయ మార్గాలు వెతకడం కంటే, శ్రమ కలిగినప్పుడు దాని వెనక ఎదో ప్రయోజనం దాగి ఉంది అని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగుటకు ప్రయత్నిద్దాం.

నమ్మకమైన మన దేవునికి మన హృదయాలను అప్పగించి క్రీస్తు శ్రమానుభవంలో క్రొత్త అనుభూతిని పొందుకుందాం.

ఆనుభవం: శ్రమలు తప్పించుకోవాలనేకొద్ది అధికమవుతాయి. శ్రమలను ఎదుర్కొనే కొద్ది విజయాలు చేరువ అవుతాయి. క్రీస్తు శ్రమానుభవాలతో విజేతలం అవుతాం.