క్రీస్తుతో 40 శ్రమానుభవములు 9వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. II కొరింథీ 1:5

దమస్కు మార్గంలో పౌలు తన అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. క్రైస్తవ విశ్వాసం కనుమరుగైపోవాలని బయదేరిన ఆయనకు "నీవు హింసించుచున్న యేసును" అనే స్వరం ప్రత్యక్షమై తన జీవితాన్ని తలకిందులు చేసింది. "నేను బ్రతికినంత కాలం క్రీస్తు వలన శ్రమలు"... తగ్గితేకాదు విస్తరిస్తే మేలు అనే అనుభవంలోకి మార్చేసింది. ఈ అనుభవం క్రీస్తుకొరకైన శ్రమలలో పాలుపొందాలనే హృదయ మంట.

ఈ శ్రమలు ఎప్పుడు ముగుస్తాయో?
నా జీవితం ఎప్పుడు సాఫీగా సాగిపోతుందో? అనే ఆలోచన మనందరికీ ఉంటుంది. శ్రమ లేకుండా విజయం ఎక్కడిది? విజయబాట ముళ్ళబాటే కదా!

క్రీస్తు యొక్క శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ప్రతి శ్రమానుభవంలో పొందిన విజయాలే మన జీవితంలో ఆదరణ కలుగజేస్తాయి.

సంధి అనే ఆలోచన లేకుండా "ఎల్లపుడు సమరమే" అనే ధ్యేయం కలిగిన సైనికుడు మొదటి వరుసలోనే యుద్ధం చేస్తాడు. వెనకడుగు వేసిన సైనికుడు మరణించిన వానితో సమానం. కనుచూపుమేరల్లో మరణం పొంచి ఉన్నా గెలుపుకు ఓటమికి మధ్య జరిగే ఈ పోరాటంలో, ఎల్లప్పుడూ గెలుపే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తాడు.

యుద్ధరంగంలో శత్రువు ఆయుధాలకు ఎదురు వెళ్ళి తన ప్రాణాన్ని సహితం లెక్కచేయని వాడినే కదా యుధ్దవీరుడు అంటాము. దేవునికి ఇటువంటి సిలువ సైనికులు కావాలి.

నేనంటాను, క్రీస్తు కొరకైన మంట కలిగియున్నవాడే క్రైస్తవుడు; అలాంటివారే ఆయనకు కావాలి.

శ్రమ నీ ఆయుధం ఐతే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ విస్తరించేకొద్దీ శ్రమకు ఎదురు వెళ్ళి అపవాదిని అణగద్రొక్కి పోరాడే అనుభవం కావాలి. ఈ శక్తి కేవలం ఆధ్యాత్మికతలోనే పొందగలం. అనేకసార్లు దేవుడు మన జీవితాల్లో గొల్యతులాంటి శ్రమలను పెడుతుంటాడు... ఎంతుకంటే, దావీదులాంటి వీరులను మనలో చూచుకోడానికి. అయితే, విశ్వాస జీవితంలో శ్రమలు విస్తరించిన కొలది, క్రీస్తు ద్వారా పొందిన ఆదరణ మనలను విజయవంతులను చేస్తుంది.

ప్రతిపోరాటం క్రీస్తుతో ఒక శ్రమానుభవం.

ఈ పాట మిమ్మును ప్రోత్సాహపరుస్తుంది.
https://youtu.be/Rp2BVJzRzIg

 

అనుభవం:
విజయానికి చెల్లించే వెల శ్రమే.
శ్రమ... ఆదరణగా మార్చే అనుభవమే క్రీస్తుతో కలిసి శ్రమను అనుభవించడం.