నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. యోహాను 6:55
ఐగుప్తు బానిసత్వం నుండి బలిష్టమైన దేవుని హస్తం ఇశ్రాయేలీయులను విడిపించి, అరణ్య మార్గం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశంవైపు నడిపించింది. కనాను ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దేవుడు పరీక్షిస్తూ ప్రత్యేకంగా వారి ఆహార అలవాట్ల విషయమై జాగ్రత్తపడమన్నాడు. ఐగుప్తు ఆహారానికి అలవాటైన వారి శరీరాలకు అరణ్యంలో పరలోకపు మన్నాను బండనుండి జీవ జలపు ఊటలను ఇచ్చి ఆహార శైలిని మార్చి నేర్పించాడు.
జాగ్రతగా గమనిస్తే, ఇశ్రాయేలీయులను ఆకలితో అలమటించేలా చేసి మన్నాతో తృప్తిపరుస్తూ వచ్చాడు. వారైనను వారి తలిదండ్రులైనను మునుపెన్నడూ ఇటువంటి ఆహారమును తినలేదు గాని... మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే అనుభవాన్ని నేర్పించాడు. దేవుని బిడ్డలైన మనకు ఆహార పద్దతులను అలవాట్లను మార్చుకోమని తెలియజేస్తూ క్రీస్తు శరీరమును భుజించే ఒక గొప్ప అనుభూతిని నేర్పిస్తున్నాడు.
క్రైస్తవులమైన మనం శరీర సంబంధమైన ఆహారమును మాత్రమే కాక, ఆత్మీయ ఆహారమును భుజించే అనుభవంలోకి రావాలి. ఈ అనుభవం అన్ని సందర్భాల్లో దేవుని మాట వలన జీవిస్తూ సమస్తము ఆయన ద్వారా పొందియున్నామని విశ్వసించి, పరలోకమునుండి మన కొరకు జీవాహారమైన ఆ క్రీస్తు శరీరమును తిని నిత్యజీవానికి వారసులమయ్యే కృపను పొందుకోవాలి.
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగినప్పుడు ఆత్మీయ జీవితం బలహీనపడి, శారీరిక జీవనం శిక్షకు గురౌతుంది. బాప్తీస్మ సాక్ష్యము పొంది... వారమంతా లోకానుసారంగా జీవించి, పరిశుద్ధ దినమున ఆయన బల్లలో చేయి వేస్తే వ్యక్తిగత, కుటుంబ, జీవితాలు దేవుని ఆశీర్వాదములు పొందలేకపోగా శాపానికి గురౌతాయి. అనేక సార్లు మన జీవితాల్లో అపజయం పొందుతున్నామంటే కారణం మన అజాగ్రత్తలే. తగినటువంటి నియమాలతో జాగ్రత్తలతో ఈ అనుభవాన్ని అలవాటు చేసుకుందాం.
అపొస్తలుల బోధ, ప్రార్ధన, సహవాసం ఇవన్నీ ఉన్నా, రొట్టె విరిచే అనుభవం కూడా ఎడతెగక ఉండాలని సంఘానికి దేవుడు నేర్పించాడు. ఈ అనుభవం ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిధ్ధపరుస్తూ మనకు కూడా యేసుక్రీస్తు సిలువలో శ్రమానుభవమును జ్ఞాపకము చేసి పాప క్షమాపణ ఇచ్చి నిత్యజీవాన్ని స్వతింత్రిపజేస్తుంది.
అనుభవం : శరీరం - రక్తం సాదృశ్యమైన రొట్టె - ద్రాక్షారసం యేసు క్రీస్తు సిలువలో శ్రమానుభవ జ్ఞాపకమై పాపక్షమాపణ పొంది నిత్యజీవం కొరకై పరలోకరాజ్యం చేరాలి.