క్రీస్తుతో 40 శ్రమానుభవములు 32వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

మీకు తెలుసా! గత 10 సంవత్సరాలలో ప్రపంచంలో క్రీస్తు నిమిత్తం హతసాక్షులైన వారి సంఖ్య 9,00,000 కంటే పైనే. అంటే ప్రతీ 6 నిమిషాలకు ఒక విలయతాండవం. ప్రప్రధమంగా 3 లక్షల క్రైస్తవులను హింసించి, బంధీలుగా, బానిసలుగా చేసి నాడు-నేడు కనికరంలేని కమ్యూనిష్టు సిద్ధాంతాలతో నరలోకంలో నరకాన్ని చూపించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఉత్తర కొరియా. ఆలా 50 దేశాలు క్రైస్తవులను హతమార్చే జాబితాల్లో ఉంటే వాటిలో మన దేశం 10వ స్థానంలో ఉంది.

అమెరికా దేశం, కొలరాడో పట్టణంలో 11 ఏళ్ళు నిండినప్పుడు రేచెల్ జాయ్ స్కాట్ తన జీవితాన్ని క్రీస్తు కొరకు సంపూర్ణంగా అంకితం చేసుకుంది. చిన్ననాటినుండే క్రీస్తు కొరకు ఏదైనా చేయాలనే పట్టుదల, 16వ ఏట పత్రికలను రాసి వాటి ద్వారా అనేకులను క్రీస్తువైపు నడిపించింది. అయితే, దేవునికి బాగా దగ్గరవవుతున్నావు మాకొద్దు నీ స్నేహం అని వదిలేశారు స్నేహితులు. చిన్న వయసులోనే క్రీస్తు నిమిత్తం భరించలేని అవమానం, అపహాస్యం మౌనంగా భరించింది. రోజురోజుకు పెరుగుతున్న తన విశ్వాసాన్ని తట్టుకోలేక తనతో ఉండేవారు సువార్త మనుకోమన్నారు, క్రీస్తును వదిలేయమన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు.

"మంచి మార్గంలో నడుద్దామని నా నడకను సరి చేసుకున్నాను. నేను సరైన మార్గం ఎంచుకున్నాను కదా. అయినా పర్వాలేదు, ఎంత కష్టం వచ్చినా ఏది విశ్వసించానో దానిపై నిలబడతాను" అని ఎవరికీ చెప్పుకోలేక తన కుటుంబ సభ్యునికి లేఖ రాసింది. అనుకోకుండా, ఓ రోజు మధ్యాహ్నం స్కూల్లో తన స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, వ్యతిరేకుల ఆగ్రహం విరుచుకుపడి తనను తనతో ఉన్నవారిని ముట్టడిచేశారు. తూటాల ప్రవాహానికి 11 మంది బలైపోయి ఆ రక్తపు మడుగుల్లో హతసాక్షి అయ్యింది మన రేచెల్. 17 ఏళ్ళు కూడా నిండని రేచెల్ కు జరిగిన ఈ సంఘటన కన్నీటి వలయంలో అటు కుటుంబాన్ని, దేశాన్ని కుదిపేసింది.

ఆశ్చర్యంగా ఉందా?
క్రీస్తు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను అంటే...క్రీస్తుతో సిలువ వేయబడి, లోకంతో నేను మరణించాననే. అందుకే నేనంటాను, స్థిరమైన విశ్వాసంతో అంతంవరకు నిలబడే పట్టుదల కావాలి. అనుదినం సజీవయాగంగా సమర్పించుకునే జీవితాలు కావాలి. ఇదే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం.

అపో పౌలు క్రీస్తుతో తన శ్రమానుభవాన్నివివరిస్తూ..."నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. (గలఁతి 2 : 20) బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము...(ఫిలిప్పీ 1:21)"

అనుభవం : స్థిరమైన విశ్వాసం, అంతం వరకు నిలబడే పట్టుదలే సజీవయాగ సమర్పణ. ఇదే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం.