క్రీస్తుతో 40 శ్రమానుభవములు 33వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హెబ్రీ 12:2

దక్షిణ ఆఫ్రికా దేశ ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించాలనుకున్నాడు. అహంకార అధికార ప్రభుత్వాలు ఆ దేశ ప్రజలను బానిసలుగాచేసి అంధకారంలోకి నెట్టేసాయని తెలుసుకున్న అన్వేషకుడైన డేవిడ్ లివింగ్ స్టన్ గుండె నీరైపోయింది. చట్టాలను ఆచార వ్యవహారాలను సవరించి బానిసత్వాన్ని అంతమొందిస్తేనే వారి జీవితాలు బాగుపడతాయని అనేక ప్రాంతాలు ప్రయాణించి ప్రయత్నించాడు. అనేక ఆటంకాల మధ్య భార్యను కోల్పోయినా వెనకడుగు వేయకుండా చివరి శ్వాస వరకు ఆఫ్రికా ప్రజలకొరకే ప్రయాసపడ్డాడు. ఇంగ్లాండ్ వారు మృతదేహాన్ని తీసుకెళ్తుంటే, మాకోసం శ్రమపడి కన్నీరు కార్చిన ఆ గుండెను మా కివ్వమన్నారు ఆ ప్రాంత ప్రజలు.. ఆ గుండెను తీసి అక్కడే పాతిపెట్టారు. బానిసత్వ బతుకులు మారాయి. రక్షణానుభవంలో జీవితాలు సంఘాలుగా విస్తరించబడ్డాయి. ఆఫ్రికా ఖండంలో క్రైస్తవ్యత్వం వెలిగించబడింది అంటే క్రీస్తుకొరకై డేవిడ్ లివింగ్ స్టన్ గారి శ్రమలతోకూడిన పరిచర్యేనని జ్ఞాపకము చేసుకోవాలి.

ఆయన మాటలు నన్ను ప్రోత్సాహపరిచాయి "ముందుకే సాగాలనే ఆలోచనలతో, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మార్గాలన్ని సరిగ్గా ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు, అసలు మార్గమే లేదు అనే పరిస్థితుల్లో వచ్చే క్రైస్తవులు కావాలి".

స్నేహితుడా, క్రీస్తు కొరకు ఏదైనా చేయాలని తీర్మానించుకున్నప్పుడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసముతో అడుగులు ముందుకు వేయగలిగితే, మూయబడిన ద్వారాలు తెరువబడి, చేసే ప్రతి పనిని దేవుడు ఆరవదంతలు, నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. అవరోధాలు అధిగమిస్తూ సంపూర్ణ సమర్పణ గలిగి ఓపికతో పరుగెత్తితే విజయపథం వైపే నడిపిస్తాడు.

క్రీస్తు కూడా తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

నేనంటాను, క్రీస్తుకొరకైన ఏ భారమైనా పరిపూర్ణమై సంపూర్ణమవ్వాలంటే త్యాగపూరితమైన సహనం కలిగిన జీవితకాల జీవితం ఓపికతో పరుగెత్తటమే.

అనుభవం : సంపూర్ణ సమర్పణ గలిగి ఓపికతో పరుగెత్తే విజయ మార్గాలే క్రీస్తుతో శ్రమానుభవాలు.