క్రీస్తుతో 40 శ్రమానుభవములు 35వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

నా చుట్టుపక్కల ఇంత అన్యాయం జరిగిపోతుంది. ఎందుకు మనకీ కష్టాలు? నిజంగా దేవుడున్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడుటలేదు? అంటూ తనకు తగిన రీతిలో ఈ పని జరగాలి, దేవుడు నాకు ఇక్కడ ఇప్పుడే కనబడాలి! ఇటువంటి ప్రశ్నలు అనేక మంది క్రైస్తవేతరులు మనల్ని అడిగినప్పుడు ఎంతో ప్రయత్నించి సమాధానం ఇస్తే తిరిగి కాలికి మెడకి ముడేస్తారే కానీ అర్ధం చేసుకోలేరు. ఎందుకంటారు?

నన్నడిగితే, క్రీస్తును గూర్చి చెప్పడం కంటే, క్రీస్తును మన జీవితాల ద్వారా చూపించగలిగితేనే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలం. అది అంత సులువైన సమాధానం కాదు, అలా అని కష్టమేమి కాదు. క్రైస్తవ్యత్వం మన నడవడి, ప్రార్ధన మన జీవన శైలి, రక్షణ మన అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే క్రీస్తులో సంపూర్ణంగా రూపాంతరం చెందిన జీవితాలుగా మారుతాయి. వీటిని గమనిస్తున్న మన చుట్టూ ఉన్నవారికి వారి మనసులో మెదిలే ప్రతి ప్రశ్నలకు జవాబిచ్చేవారంగా ఉంటాము. ఆయన మరణ పునరుద్ధాన అనుభవాలు మన జీవితాల ద్వారా బహిరంగంగా మనం చూపించగలిగినప్పుడే "మనలో ఉన్నవాడు, మనలను నడిపించేవాడు సర్వ జగత్తును ఏలే సర్వాధికారియైన యెసయ్యేనని" వారికి అర్ధం అవుతుంది.

అనేక గ్రామాలు సువార్త ప్రకటించి, నా అనుభవంలో నేను ప్రకటించిన సిద్దాంతం ఒక్కట్టే "ట్రై జీసస్" ఏసయ్యను ఒకసారి రుచి చూడు, ఏసయ్యను అర్ధం చేసుకోడానికి ఒకసారి ప్రయత్నించి చూడు. అప్పుడేకదా క్షమాపణ వెనకున్న త్యాగం, మరణం కంటే బలమైన ఆ ప్రేమ లోతు తెలుస్తుంది, మరణించినా ఆయనతో కూడా నిత్యమూ జీవించే నిశ్చయత అర్ధమవుతుంది. ఇది గ్రహించగలిగిన జీవితాల్లో ఎల్లప్పుడూ సంతోషమే.

శ్రమలతో కూడిన ప్రతి సిలువ శ్రమానుభవాలను మనం అనుభవించినప్పుడే మనతో ఉన్నవారికి వివరించగలం, రాబోయే తరానికి నేర్పించగలం. మన నడవడి, ఆలోచనలు, అలవాట్లు వీటిలో క్రీస్తును పోలి నడుచుకోగలిగే జీవితాలే సువార్త పరిమళాలను వెదజల్లి, అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించగలుగుతాయి.

ఈ అనుభవమే సిలువలో క్రీస్తు శ్రమపొందుతున్నప్పుడు అనేక ఆత్మలను రక్షించాలని, తన ప్రాణాన్ని సైతం మనకోసం పణంగా పెడుతూ అయన పలికిన అయిదవ మాట "దప్పిగొనుచున్నాను" (యోహాను 19:28) అను మాటకు అర్ధం.

అనుభవం : క్రీస్తుతో మరణ, పునరుద్ధాన అనుభవాలు కలిగిన మన అనుదిన జీవినశైలే క్రీస్తుతో శ్రమానుభవం