క్రియల్లో క్రీస్తు ప్రేమ


  • Author: Ashr
  • Category: Articles
  • Reference: Best of Collections

ఓ రోజు ఒక చర్చిలో పెద్ద ప్రేయర్ మీటింగ్ జరుగుతూవుంది. చాలామంది అడుక్కునే వాళ్ళు కూడా వచ్చి బయటే కూర్చున్నారు. కొద్దిసేపటికి చర్చిలో ఇద్దరు సంఘపెద్దల మధ్య చిన్న అభ్యంతరం తలెత్తింది. వాళ్ళు దానికి తెరదించకుండా వాదించుకుంటూనే వుండటం వల్ల గొడవ చాలా పెద్దదై కొట్లాటలోకి దారితీసింది. చర్చిలో వున్న వారంతా ఎంతగా ఆపేందుకు ప్రయత్నించిన ఫలితం కనపడలేదు. ఇంతలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసుస్టేషన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేసాడు.

కాసేపటికి పోలీసు జీప్ వచ్చి చర్చి ముందు ఆగింది. ఒక పోలీసు బయటకు దిగి, అది చర్చి కావటం వల్ల అందులోపలికి వెళ్లలేక బయట నిలబడి, ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితిలో బయట కూర్చున్న ఒక బిచ్చగాడిని పిలిచి నువ్వు ముందు నుంచి ఇక్కడే కూర్చున్నావ్ కదా.. ఏం జరిగిందో కాస్త చెప్పరా బాబు..? అని అడిగాడు.. దానికి ఆ బిచ్చగాడు తన చేతిలోని బొచ్చెను తీసుకుని వెనక్కి తిప్పి డప్పు వాయిస్తూ ఇలా పాడటం మొదలెట్టాడు.. దేవుని ప్రేమ ఇదిగో.. జనులార భావంబునన్ దెలియరే...

ఎంతటి విచారకరం. నేటి దినములలో క్రైస్తవులమైన మనం, ఇలానే జీవిస్తున్నాం. ఇలానే ప్రవర్తిస్తున్నాం. దేవుని మాటల్లోని అసలైన అర్ధాన్ని గ్రహించి ఆయనకు అంగీకారమైన జీవన విధానాన్ని కలిగి యుండుటకు అభ్యాసంచేయవలసిన అవసరం ఎంతైనా వుంది. లేకపోతే ఒకానొక రోజున అదే ప్రేమయై యున్న దేవునిచే సర్పసంతానమా.. అని పిలిపించుకోవాల్సిన పరిస్థితే వస్తుంది.

క్రైస్తవులమై సర్వలోకానికీ సువార్తను, దేవుని ప్రేమను మాటల్లో చాటి చెప్తున్న మనం క్రియల్లో వాటిని అవలంబించి చూపలేకపోతున్నందు వలెనే, అన్యులైనవారు మనల్ని చూసి ఈ కథలోని బిచ్చగాడు అపహసించినట్టుగానే అపహసిస్తున్నారు.