ఎవరు బుద్ధిమంతులు?

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

ఎవరు బుద్ధిమంతులు?
Audio: https://youtu.be/NV7dSWehQfE

లూకా 15:21 అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

ఈ భాగంలో ఉన్న చిన్న కుమారుడు తనకు కలిగినదంతయు ఖర్చు చేసాడు కానీ, ఒక్క రూపాయి సంపాదించలేకపోయాడు. తన ఖర్చులన్ని తన శరీర సంతోషం కొరకే కర్చుపెట్టాడు కానీ, లాభం సంపాదించలేకపోయాడు; కనీసం ఒక్క స్నేహితుని కూడా సంపాదించలేకపోయాడు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు పందులను మేపే పని తప్ప ఇంకొక పని దొరకలేదంటే వీడు పనికిమాలిన వాడని అర్ధం చేసుకోవచ్చు. కాని, వీని జీవితంలో గొప్ప విషయం ఏంటంటే - బుధ్ధి వచ్చింది. బుధ్ధి రాగానే తన తప్పును తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు.

ఈ తప్పిపోయిన కుమారుని వలె ఈ రోజులలో అనేకులు సొంత నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు అనుభవిస్తున్నారు. కాని, అటువంటి పరిస్థితిలో కూడా దేవుని ప్రేమను తిరిగి ఎలా పొందుకోగలము? మనం సేవించే దేవుడు ప్రేమగల దేవుడు, క్షమించుటకు సిద్ధమనస్సు కలిగిన దేవుడు. తప్పిపోయిన కుమారునికి బుధ్ధి వచ్చింది. బుద్ది అంటే పశ్చాత్తాపం. బుద్దిలేని కన్యకలు అంటే పశ్చాత్తాపం లేని వారు. బుద్దిగల కన్యకలు అంటే పశ్చాత్తాపం కలిగినవారు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం కలిగియున్నందుకు - ఏ స్థానమును, ఏ స్థితిని కొలిపోయాడో; పశ్చాత్తాప పడినందుకు తిరిగి అదే స్థానమును పొందుకున్నాడు.

ప్రియ స్నేహితుడా! ఈరోజు నీవు నీ సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో ఒకవేళ కష్టాలలో, నష్టాలలో ఉన్నావా? పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు రా. పశ్చాత్తాపం కలిగిన వారే బుద్దిమంతులు, బుద్దిగలవారే పెండ్లికుమారుని స్వరం వినగలరు. పరలోక స్వాస్థ్యమును పొందుకోగలరు. దేవుడు క్షమిస్తాడో లేదో అని అనుమానించకు, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చి, దేవుడిచ్చే క్షమాపణను, ఆశీర్వాదములను పొందుకో!