స్నేహితుడు...!

  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

స్నేహితుడు...!
Audio: https://youtu.be/WtwkEP9pKQo

యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.

ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్కడ ఒకరు పరలోకం నుండి వచ్చిన రక్షకుడు, మరొకరు ఆయనను వెంబడించుటకు పిలువబడిన మానవుని మధ్య ఏర్పడిన స్నేహం. స్నేహంలో యేక మనస్సు, యేక హృదయం, యేక ఉద్దేశం ఉంటుంది కాబట్టే యేసు ప్రభువు మనతో స్నేహం చేయుటకు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ బంధుత్వాలు వ్యర్థమని చెప్పడంలేదు కాని ఏ బంధుత్వములోనైన స్నేహం ఉంటేనే చివరివరకు నిలుస్తుంది. అందుకనే కొంతమంది సాక్ష్యం పంచుకుంటు మా తల్లి నాకు ఒక తల్లెకాదు మంచి స్నేహితురాలని చెప్తారు. అదే స్నేహంలో ఉన్న గొప్పతనం.

సామెతలు 17:17 "నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును". యోహాను 15:15 "మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను"

దేవునితో స్నేహం చేస్తేనే జీవితంలో పరిపూర్ణ ఆశీర్వాదం మనం పొందుకొనగలము. ఇశ్రాయేలీయులు అష్షూరీయులచేత రక్షణ పొందాలని, వారి గుఱ్ఱములను నమ్ముకున్నారు. మీరే మాకు దేవుడని వారి చేతి పనితో చెప్పి దేవుని విసర్జించుట వలన శ్రమల పాలైనారు. చివరికి అన్ని విడిచి దేవుని ఆశ్రయించినందుకు. హోషేయ 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని ఘణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.

దేవుడు వారితో స్నేహం చేయుట వలన వారికి కలిగిన పరిపూర్ణ ఆశీర్వాదం ఈ వచనములలో చూడగలం.
హోషేయ 14:5 - 7 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును (ఫలం), తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును (ఆత్మీయ అభివృద్ధి), లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు (శోధనలలో కదలకుండ స్థిరముగ ఉండగలం). అతని కొమ్మలు విశాలముగా పెరుగును (వ్యాప్తిచెందుతావు), ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును (నిత్యమైన కృప), లెబానోనుకున్నంత సువాసన అతనికుండును (నీతి). అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు (పరిచర్యలో విస్తరణ).

ఈ పరిపూర్ణ ఆశీర్వాదం కావాలంటే దేవునికి అవిధేయత చూపక విధేయత కలిగి స్నేహం చేయాలి.