విజయం నీ దగ్గరే ఉంది

  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

విజయం నీ దగ్గరే ఉంది.
Audio: https://youtu.be/0mvjKm0Eeyo

సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

ప్రతి ప్రార్థనలో ఎక్కువగా కనిపించేది ఆశీర్వాదం. ఎవరు ప్రార్థించిన ఆశీర్వదించమనే ప్రార్థిస్తారు. కాని ఆశీర్వాదం రావాలా లేదా నిర్ణయించవలసింది వెరెవరో కాదు మనమే. ఫలానా విశ్వాసి లేదా సేవకుడు ప్రార్థిస్తే ఆశీర్వాదం వస్తుందని భ్రమపడవద్దు. ఆశీర్వాదం మన ఇంట్లోనే ఉంటుందని, పాపం మన గుమ్మము దగ్గరే ఉంటుందని గుర్తించాలి. కాని వాటిలో ఏది పొందుకోవాలో అది మన ఆలోచన విధానం, మన క్రీయలు, మన మాటల మీదే ఆధారపడియుంటుంది.

ద్వితీ.కాం 30:19,20 నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, ...జీవమును కోరుకొనుడి.

ఆశీర్వాదం - శాపం, జీవం - మరణం, మేలు - కీడు మన దగ్గరే ఉంటాయి కాని వాటిలో ఏది మనలను స్వతంత్రించుకోవాలో, మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొందరు కష్ట పరిస్థితులలో, సమస్యలలో ఉన్నప్పుడు; ఏంటో ఈ పాడుజీవితం చస్తే బాగుండని, నా కర్మా అని తల బాదుకోవడం, ఏంటో నాకేమి అర్థంకావడం లేదు, ఏమి చేయ్యాలో తెలియడం లేదని ఈ విధంగా మాట్లాడుతుంటారు. విశ్వాసి ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే నీమాటలబట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. మనం మాట్లాడిన ప్రతి వ్యర్ధమైన మాటకు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుందని మర్చిపోవద్దు. మలను మనం తిట్టుకొవడానికి, శపించుకోవడానికి మన మీద మనకే అధికారం లేదు. ఎందుకంటే యేసయ్య తన ప్రాణం పెట్టి మనలను కొనేసుకున్నాడు. మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు.

నాలుక నిప్పులాంటిది. అది జీవిత చక్రానికి నిప్పుపెడుతుంది. మన శత్రువైన సాతాను గెలిచాడని భావించే పదాలను ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు నీవు ఏలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాసరే తప్పక గెలుస్తావని, విజయం నీదేనని, నేను ఆశీర్వాదమునకు పాత్రుడని విశ్వాసంతో చెప్పు. జయ వీరుడైన యేసు ప్రభువు నీకు విజయమిచ్చును గాక! ఆమెన్.