దేవుని కార్యములు చూసే కన్నులు


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

దేవుని కార్యములు చూసే కన్నులు
Audio: https://youtu.be/T19cudHmnqI

రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాని, రేపేమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత అందరికి ఉంటుంది. చింత అనేది రేపటి గురించే, నిన్నటి గురించి ప్రస్తుతము గురించి ఎవరు చింతించరు. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడే భయం కలుగుతుంది.

దేవుడు, తనను నమ్మినవారికి రేపటి గురించి వాగ్ధానం చేస్తాడు. ఆ వాగ్ధానం నమ్మితే అద్భుతములు చూస్తాము. రెండింతల ఆశీర్వాదం కలుగుతుందని యోబుకు తెలిసుంటే ప్రశాంతంగా పడుకొనేవాడు కాని, దేవుడు అన్యాయము చేయడని తెలుసు కాబట్టి సమస్యలలో పడిపోలేదు. రేపటి పరిస్థితులను గ్రహించివుంటే దావీదు ఇంట్లో నుండి భయట అడుగు పెట్టేవాడే కాదు కాని, తరువాత శ్రమలలో నమ్మకముగా ఉన్నాడు. ఏశావు ఉద్దేశం ఏమైయున్నదో తెలిసుంటే యాకోబు ఆ రాత్రి ప్రార్థించేవాడు కాదు కాని, దేవుని చిత్తము కొరకు రాత్రంతా విశ్వాసముతో ప్రార్థించాడు. క్లిష్ట పరిస్థితులలో దేవుని వాగ్ధానం నమ్మి నిరీక్షణతో ఎదురుచూసి వాగ్ధానమును స్వతంత్రించుకున్నారు. సమస్యల ముగింపు ముందే తెలిసుంటే వీరు స్థిరపలేకపోయేవారు కాని, సమస్యలలో దేవుని పైన ఆధారపడ్డారు కాబట్టే హెచ్చించబడ్డారు.

ఈ రోజులలో పెద్ద సమస్య ఓపిక లేకపోవడం. ఈ బలహీనత ఆధారం చేసుకొనే దొంగ బోధకులు బ్రతికేస్తున్నారు. వరం లేకపోయిన ఉందని నటిస్తూ అమాయకులైన విశ్వాసులను మోసం చేస్తున్నారు. నీవు అందుకనే సమస్యలలో ఓపిక కలిగివుంటేనే దేవుని మీద పూర్తిగ ఆధారపడగలవు. సమస్యలలో ఓపిక కలిగివుంటేనే విశ్వాసములో స్థిరపరచబడతావు. సమస్యలలో ఓపిక కలిగివుంటేనే వెనకడుగువేయవు. సమస్యలలో ఓపిక కలిగివుంటేనే ఒటమి నీ దరిచేరదు. సమస్యలలో ఓపిక కలిగివుంటేనే అద్భుతాలను చూస్తావు.

(2 Kings 6:15-17) ఒక రోజు దైవజనుడైన ఎలీషా అతని పనివాడు పెందలకడ లేచి ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు శత్రువు యొక్క గుఱ్ఱములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట చూసారు. ఆ పనివాడు భయపడి అయ్యో నా యేలినవాడా, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటని ఎలీషాతో అనగా, ఎలీషా మొదట చెప్పిన మాట భయపడవద్దు. రెండవ మాట మన పక్షమున నున్నవారు వారికంటె అధికులైయున్నారని చెప్పి - వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని దేవునికి ప్రార్థనచేయగా, ఆ పనివాని కండ్లను దేవుడు తెరచెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూసాడు.

ఇక్కడ దేవుని వైపు చూసిన ఎలీషాకు భయము లేదు. సమస్య వైపు చూసిన పనివాడు భయముతో వణికిపోయాడు. ఈ సమయంలో ఎలీషా పనివాడిని తిట్టి, పెద్ద బోధ చేయలేదు కాని దేవుని కార్యములు చూసే కన్నులు కావాలని ప్రార్థించాడు. ఈ రోజు ఇలాంటి కన్నులు ప్రతి విశ్వాసికి కావాలి.

నీవు సమస్యలలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుకొనుటకు ఎక్కడికో వెళ్ళవలసిన పనిలేదు. నీవున్న స్థలములోనే దేవుడిచ్చిన వాగ్ధానము నమ్మి నిరీక్షణతో ఓపిక కలిగి ప్రార్థన చేయగలిగితే ఆయన కార్యములను చూచే కన్నులను దయచేస్తాడు.