సిలువ ధ్యానాలు - Day 6 - సిలువ తృణీకరింపబడుట
Audio: https://youtu.be/c0KzQ0MZp5o
యెషయా 53:3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
యేసు ప్రభువు మహిమ కొరకు, గౌరవం కొరకు, విలువ కొరకు ఈ భూమి మీదకి రాలేదు; పాపుల కొరకు విలువైన తన ప్రాణం ధారపోయుటకు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అభిషిక్తుడు ఒక శూరుడుగా, రోమా దాస్యము నుండి విడిపించుటకు పెద్ద సైన్యముతో వస్తాడని ఎదురుచూస్తుంటే; యేసు ప్రభువు రోమ్ దాస్యము నుండి కాదు పాపపు దాస్యము నుండి విడిపించి పరలోకరాజ్య వారసులనుగా చేయ్యాలని బీదవానిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు.
యేసు ప్రభువు పరిచర్య అంతా నిందలు, అవమానాలే. మార్కు 3:2లో యేసు ప్రభువు అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు తన ఇంటి వారు ఆ మీటింగ్ మధ్యలో వచ్చి ఆయనకు మతి చలించియున్నదని అన్నారు. జరుగుతున్న అద్భుత కార్యములు చూసి ఈయనకు దయ్యం పట్టిందన్నారు. యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచున్నప్పుడు ఆయన సహోదరులు ఆయనను తృణీకరించారు. మరణానికి భయపడి తనను వెంబడించిన వారు, ఎట్టి పరస్థితిలోను విడిచిపెట్టమని మాటిచ్చిన శిష్యులు యేసు ప్రభువును విసర్జించారు.
ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో యేసు ప్రభువు ఏ రోజు పరిచర్యను ఆపలేదు, సువార్త ప్రకటించడం మానలేదు. తృణీకరించుటవలన యేసు ప్రభువు ఆగలేదు. అవమానం తనను ఆపలేకపోయినది. వ్యాధి తనను అడ్డగించలేకపోయింది. ఏదివున్నా లేకపోయిన, ఎవరువున్నా లేకపోయిన వెనకడుగు వేయకుండ ముందుకే సాగిపోయాడు యేసు ప్రభువు.
సిలువ అనగా తృణీకరింపబడుట. సిలవను మోసేవారిని ఎవరు ప్రేమించరు గాని తృణీకరిస్తారు, విసర్జిస్తారు, ఎన్నికచేయరు. ఇటువంటి పరిస్థితులలో యేసు ప్రభువు సిలువకు భయపడలేదు, నీ నా రక్షణ కొరకు సిలువలో తన ప్రాణము ధారపోయుటకు మరణమునకు ఎదురువెళ్ళాడు. ఈ రోజు సమస్యలు, నిందలు, అవమానములు నీవు దేవుని కొరకు చేయవలసిన పనులను అడ్డగిస్తున్నాయా? బాధల వలన ప్రార్ధన చేయలేకపొతున్నావా? ఒకసారి సమస్యలను అధిగమించిన విజేయుడైన యేసు వైపు చూడు.
కీర్తనలు 69:7 నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. 8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
కీర్తనలు 69:19 నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది.
ఇటువంటి పరిస్థితులలో నీ పని చేస్తుంటే నాకే ఎందుకు ఈ సమస్యలని అనకుండా (9వ) నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది మానవాళి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు.
దేవుని కొరకు నీవు జీవిస్తున్నప్పుడు, ప్రార్ధనలో కనిపెడుతూ ముందుకు వెల్తున్నప్పుడు ఎదురైయ్యే ప్రతి ఓటమి, ఓటమి కాదు అవి నీ విజయానికి మెట్లు.